Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 26

    డాక్టర్ సింగినాధానికి  ఇన్ ఫార్మ్ చేసి   ఫోన్  పెట్టేసింది నర్స్. పావుగంటలో  డాక్టర్ సింగినాధం  అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

    ఆయన రాగానే ఇందాక ఫోన్స్  చేసిన నన్స్  పరుగునవెళ్ళి  ఆయన గుండెలమీద  వాలిపోయింది.

    "మరేం పర్లేదు....నేనున్నాగా?" అంటూ  నర్స్ వీపు  నిమరడం మొదలు పెట్టాడు సింగినాధం.

    "అబ్బా! ఆవిడగారి వీపు తీరుబడిగా  రుద్దుదువుగానీ....ముందు ఆళ్ళ సంగతి చూడవయ్యా డాక్టర్!" బాధపడుతూ  అన్నాడు  వార్డులోని  ఓ పేషంట్.

    డాక్టర్ సింగినాధం  నాలుక్కర్చుకున్నాడు. అతని మాటలు పట్టించుకోకండా  నర్స్ డాక్టర్  సింగినాధంతో ఇలా అంది "వీపు నిమరడం ఆపి కాస్సేపు  అక్కడ  కాస్త గోకండి  డాక్టర్....వీపంతా  చాలా దురదగా వుంది."

    నర్స్  మాటలకు డాక్టర్ సింగినాధానికి  చాలా చికాకు పుట్టింది.

    "ఇప్పుడు నీ వీపు  గోకుతూ  కూర్చుంటే  పేషంట్లిద్దరూ  హరీ అంటారు....అప్పుడు  నిన్నూ  నన్నూ  కలిపి జనాలు చావ  బాదుతారు...." అన్నాడు.

    రాంబాబు, చిన్నారావ్ లను  ఆపరేషన్  థియేటర్ లోకి తీస్కెళ్ళారు.


                                            11


    ఆపరేషన్ థియేటర్ లోంచి  డాక్టర్  సింగినాధం, నర్స్  బయటికి వచ్చారు.

    డాక్టర్ సింగినాధం  మొహం చాలా పరేషానీగా  వుంది.

    అక్కడ వెయిట్  చేస్తున్న  అయిదారు మందిలో  ఒక వ్యక్తి  సింగినాధం  మొహంలోని  ఎక్స్ ప్రెషన్ చూసి ఆందోళనగా అడిగాడు  "ఏంటి డాక్టర్....ఆపరేషన్  ఫెయిలయిందా? పేషంట్లు  టపా కట్టేశారా?"

    "కాదు....ఆపరేషన్  సక్సెస్  అయ్యింది" చెప్పాడు  డాక్టర్ సింగినాధం.

    "మరి మీ మొహం ఎందుకలా వుంది?" ప్రశ్నించాడు  ఆ వ్యక్తి.

    "ఎందుకంటే  వాళ్ళిద్దరి బుర్రలమీదా  చాలా చిన్న గాయమయ్యింది. కాసింత తొక్క రేగింది అంతే! అంత చిన్న గాయం  నుండి అంత రక్తం ఎలా కారిందో  నాకస్సలు  అర్ధం కావడం లేదు."

    "అవును....వాళ్ళ ఒళ్ళంతా రక్తంతో  తడిచిపోయింది" అన్నాడు మరో వ్యక్తి.

    డాక్టర్  సింగినాధం  బుర్రకాయ్  గోక్కున్నాడు.

    "పోనీ అంత చిన్న గాయం నుండి  అంతెక్కువ  రక్తంకారిందే  అనుకుందాం....ఒక్క బొట్టు రక్తం కూడా వాళ్ళకి  ఎక్కించాల్సిన  అవసరం కలుగలేదు....అదే వింతగా వుంది" అన్నాడు.


                                 *    *    *    *


    ఆ రాత్రి గడిచింది.

    ఉదయం రాంబాబు, చిన్నారావ్ లు బెడ్ మీద కళ్ళు తెరిచారు. వాళ్ళ ఎదురుగా సరోజ, సునీత....!

    ఇద్దరి మొహాల్లో  ఆందోళన!

    వాళ్ళని చూడగానే రాంబాబు, చిన్నారావ్ లకి  ఆనందంతో  "కెవ్వు" మని కేక  పెట్టాలనిపించింది. కానీ అంత పెద్ద దెబ్బలు  తగిలి, అంత రక్తం కారిన వాళ్ళు అంత  ఆనందంగా కేకలుపెడ్తే   బాగుండదేమోనని  నీరసంగా ఓ నవ్వు నవ్వి వూర్కున్నారు.

    "ఇప్పుడెలా  వుంది?" అడిగింది సరోజ  చిన్నారావ్ ని.

    "మీరు అడగాల్సింది  అక్కడ  కాదు....ఇక్కడ...." అన్నాడు రాంబాబు సరోజతో.

    సరోజ రాంబాబు వంక వింతగా చూసి తర్వాత అడిగింది. ఇప్పుడెలా వుంది?" అని.

    "చాలా నీర్సంగా  వుంది" అన్నాడు లేని నీర్సాన్ని  నటిస్తూ.

    "నొప్పిగా కూడా వుందా?" సునీత  రాంబాబుని  అడిగింది.

    "ఇప్పుడు మీరడగాల్సింది  ఇక్కడ...." అన్నాడు  చిన్నారావ్  సునీతతో.

    "ఎందుకూ?" ఆశ్చర్యంగా  చూస్తూ అడిగింది  సునీత.

    "అదంతే....ఇప్పుడు అడగండి" అన్నాడు చిన్నారావ్.

    "సరే చెప్పండి....నొప్పిగా వుందా?"

    "మామూలు నొప్పా? భయంకరమైన  నొప్పిగా వుంది" అన్నాడు చిన్నారావ్.

    అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్   సింగినాధం   విసుక్కుంటూ  అన్నాడు.

    "బుర్రమీద  కాసింత  తొక్క  రేగింది....దానికి  భయంకరమైన నొప్పా? నమ్మదగ్గ  విషయంలా  లేదు!"

    "అవును....మా నొప్పి  మీకెలా తెలుస్తుంది?" అన్నాడు రాంబాబు మరింత  విస్కుంటూ.

    "మా ఒళ్ళంతా  రక్తంతో తడిచిపోయింది....అది  మీరు చూశారుగా?!" అన్నాడు చిన్నారావ్.

    డాక్టర్ సింగినాధం  వెర్రిమొహం  వేస్కుని  తల వూపాడు  అవునన్నట్టు....కానీ పాపం అతని మనసులో అనేక సందేహాలు....

    "అసలు ఇదెలా జరిగింది?" సరోజ  రాంబాబుని  అడిగింది.

    "మమ్మల్ని  చంపడానికి  గజదొంగ  మంగులు మనుషులు ఎటాక్ చేశారు" గంభీరంగా చెప్పాడు రాంబాబు.

    అదే సమయానికి అక్కడికి వార్డ్ బోయ్  హడావిడిగా  వచ్చాడు.

    "సార్....ఈ వార్డ్ లోనూ, ప్రక్కవార్డ్ లోనూ  పేషంట్స్ కి అమర్చిన బ్లడ్ బాటిల్స్  ఎవరో కొట్టేశారు సార్!" అన్నాడు  డాక్టర్ సింగినాధంతో.

    సింగినాధం  మొహం మరింత అయోమయంగా  మారింది.

    రాంబాబు, చిన్నారావ్ ల మీద ఎటాక్ జరిగినట్టు  పత్రికావిలేఖరులకి  కూడా తెల్సిపోయింది. వాళ్ళు  మధ్యాహ్నం రాంబాబు, చిన్నారావ్ ల దగ్గరికొచ్చి  ఇంటర్వ్యూ  చేసి వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS