Previous Page Next Page 
మమత పేజి 26

 

                                       12
    "నాకు తెలుసు' అంది పావని. జరిగిందంతా చెప్పాక అ మాట మాత్రం అని వూరుకుంది పావని.
    ఇన్నాళ్ళూ కష్టపడి చదివింది, ఉద్యోగం సంపాదించిందీ యిందుకాని. 'ఈ కాంట్రాక్టులు చేయడానికి యింత చదువు కావాలా పావనీ?' అన్నాడు భయంగా.
    'ఎంత చదువు మీరు చరివింది?' అంది నవ్వుతూనే పావని. స్వామికి తెలుసు తన 'ఇస్కూలు ఫైనలు ఎంత పెద్ద చదువో.'
    'ఉద్యోగం - పాడి కుండలాంటి ఉద్యోగం చేతులారా పాడు చేసుకొనడమంటే ....'
    'ఎందుకండీ అంత భయపడతారు? నాన్న చెప్పాడు. నిశానీదారు ఆ బండి వీరయ్య --ఒంటెద్దు బండి రైలు స్టేషనుకు తోలుకుంటూ బ్రతికేవాడు- రెండంతస్తుల మేడ కట్టాడు చూడండి కాంట్రాక్టులు చేసి మన రోజులు మాత్రం ఎందుకు బాగుపడగూడదు?' అంటూ తాంబూలం చుట్టి భర్త నోట్లోకి బలవంతంగా తోసి 'ఈ చీర బావుందా?' అంది.
    అంతవరకూ భార్య కట్టుకున్న చీరను పరీక్షగా చూడగలిగిన స్థిమితం లేక పోయింది స్వామికి. ఇప్పుడు చూశాడు. ధగధగ మెరుస్తున్న నెమలి కంఠం రంగు సిల్కు చీరలో మెరిసి పోతున్నది. గులాబిలా కదిలింది పావని.
    'ఎలా వుంది?' అంది తాంబూలం నములుతూ పమిటను బిగించి వెనక నుంచి ముందుకు లాగుతూ.
    'బాగుంది.'
    'ఏమిటి?'
    'ఊ?'
    మీరు ఏదో ఆలోచిస్తున్నారు' ఎంతో తెలుసా?చెప్పుకోండి.'
    'తెలియదు.'
    'ఊహించి చెప్పండి.'
    'నిజం పావనీ- చీరల సంగతి నాకెలా తెలుస్తుంది? యాభై - వుంటుందా ?'
    రెండొందలు . తెలుసా?; విరగబడి నవ్వింది పావని అతని అజ్ఞానానికి.
    రెండు వందలు! తనకు రెండు నెలల జీతం. తన తల్లికది ఆరునెలల జీతం.
    'మీరు బిజినెస్ చేసే సంపాయిస్తే రోజు కోక చీర కొనిపెడ్తారు యిటువంటివి. కొనిపెట్టరూ?'
    'చెయ్యాలి గదా?'
    'ఏం చెయ్యాలని లేదా?'
    'చెయ్యాలనుకున్నా ప్రతి పనీ చెయ్యగలడా ప్రతి మనిషి.'
    'నేను చేయిస్తా చూడండి. నాకోసం చేయాలి మీరు. అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లు- రెండు చేతులా మీరు సంపాదిస్తే -- స్వర్గాన్ని లాగి కట్టేయ్యనూ మన దగ్గరే--'
    'నాకంత ధైర్యమానిపించడం లేదు పావనీ.'
    'వెర్రి . యుద్దంలో కేళ్తున్నారా-- పెద్ద పులితో పోట్లాడుతున్నారా? అనుభవం కావలసినంత ఉన్న సమర్ధుడు ఆ కోనేటిరావు. దమ్మిడి పెట్టుబడి లేకుండా సగం వాటా అంటే మాటలా?'
    కోనేటిరావు సమర్ధత విషయంలో ఎవరికీ అపనమ్మకం లేదు- చాలా గటివాడని పేరు. 'నువ్వు మంత్రివి కావలసిన వాడివోయ్. ఈసారి ఎమ్మెల్యే గా నుంచోక తప్పదు.' అనేవారు రఘుపతి గారు ఆ శిష్య పరమాణువును.

 

                            
    మీ శిష్యరికం వృధా పోతుందా? ఈ సారి చూద్దాం' అంటూ అంతులేని ఆత్మవిశ్వాసం తో సమాధానం చెప్పేవాడు కోనేటిరావు. అంత బలవంతునితో లావాదేవీలు పెట్టుకు బ్రతకడం - కత్తిమీద సాము కాదు గదా? ఏ క్షణం లోనైనా ఎదురు తిరిగి తన పిలక ఝుడించగల సమర్ధత వున్న మనిషి ఆ కోనేటి రావు.
    'మరీ అంతగా ఆలోచించకండి. నా జాతకం ఎంత మంచిదో తెలుసా? మన జాతకాలు మారి తీరుతాయి చూడండి' మీరూ మారాలి.
    'అంటే?'
    'ఉన్నమాట చెబుతున్నానని కోపగించుకోకండి? నిజానికి మీరు ఇరవయ్యో శతాబ్దంలో పుట్టవలసిన మనుష్యులు కాదు. ఇంత పర్సనాలిటీ వుంది. బక్కపీనుగులా ఉంటాడు ఆ భారతమ్మ మొగుడు. అటువంటి సూటు మీరు తొడుక్కుంటే చూడాలని వుందండి.'
    నవ్వొచింది స్వామికి.
    'నవ్వకండలా -'
    'ఏం చేయమంటావ్?'
    'నిజం చెపుతున్నాను. సరైన పోషణ , డ్రెస్సు , గెటప్పూ వుంటే - మీ పర్సనాలిటీ చూసి మూర్చ పోరుటండీ జనం? నే చెప్పినట్లు వినండి. నాన్నిచ్చిన వండతో మీరు మాంచి సూటు కొనుక్కోవాలి.'
    విన్నాడు స్వామి చివరకు.
    మూడు నెలల్లో స్వామి గుర్తు పట్టలేనంత మారాడు. తల్లి సీతమ్మగారే ఆశ్చర్యపోయింది. మెరుస్తున్న టెర్లిన్ స్లాకుతో , పావని దగ్గరుండి కుట్టించిన పాంటు తో , అంతకు మించి లేని పిలకతో - మొదటిసారి వచ్చిన స్వామిని చూసి . తప్పుచేసిన మనిషిలా సిగ్గుపడ్డాడు . తన బిజినెస్ సంగతి చెప్పాడు. నిజానికి సీతమ్మ గారు ఎక్కువ సంతోషించలేదు. ఆమె దృష్టిలో స్వామి ఒట్టి అమాయకుడు. బ్రతకడం చేతకాని వాడు. వెర్రి బాగుల వాడు. 'ఆ తండ్రి కడుపున ఎలా పుట్టాడు.' అనుకునేది. పులికడుపున మేకపిల్ల పుట్టింది - అనిపించేది. తనను బల్లిలా కరుచుకు పసితనంలో నిద్రపోతున్న స్వామిని చూసి. రాజయ్యగారు నిజంగా పులే.
    సీతమ్మగారిని చూడడానికి రెండవ సారి వెళ్ళినప్పుడు - జీపుకారులో వెళ్ళాడు స్వామి. సంబరపడింది తల్లి హృదయం. కాంట్రాక్టుల గొడవను గురించి ముందు భయపడినంత -- ఇప్పుడు భయపడటం లేదు. గుమస్తాలున్నా తానె స్వయంగా అన్ని పనులూ చూసుకోగలుగుతున్నాడు. నిద్రా హారాలు మాని కూలీలతో పాటు మండు టెండలను  లెక్కచేయకుండా కాలవగట్టునే ఒక తాటాకు పాక దింపి అక్కడే కూర్చొని పని చేయిస్తున్నాడు. - అనేకసార్లు జీపున్నా యింటికి పోవడం పడేది కాదు. నీళ్ళు వదలక ముందే పూడికలు తీయించే పని అంతా అయిపోవాలన్నాడు ఇంజనీరు. సలహా యివ్వడానికి కోనేటిరావు లేకపోయాడు. మంత్రిగారితో మాట్లాడటానికి- ఆ మిడిల్ స్కూలు ను హైస్కూలు గా మార్చే విషయంలో - హైదరాబాద్ వెళ్ళాడు. తానె తెగించి, రెట్టికి రెట్టింపు ఖర్చు పెట్టి ఉత్తరాది నుంచీ రెండు లారీలకు సరిపడా కూలీలను దిగుమతి చేసుకుని, పెట్రోమాక్సు లైట్లు పెట్టి రాత్రి బవళ్ళూ పని చేయించాడు. కోనేటిరావు ఏమంటాడో నని భయపడ్డాడు. కాని అతను పదిహేను రోజులు బృందావనం లో విహరించి వచ్చి, జరిగింది తెలుసుకొని స్వామిని కౌగలించుకుని - 'బ్రతికించావు లే మాష్టారూ. కొంపమునిగేది లేకపోతె' అని ఆకాశాని కేత్తాడు. పదివేల చెక్కోచ్చింది . ఆ ఆనందంలో నూజివీడు వెళ్ళి - జీపులో - ఆ సంగతులన్నీ చెపుతుంటే ఆశ్చర్యంగా వినిసీతమ్మ గారు , భర్త రాజయ్యను గుర్తుకు తెచ్చుకుని, కళ్ళు తుడుచుకుని '- ఎక్కడికి పోతాయి పోలికలూ? అనుకుంటూ సంబరపడింది. 'వెర్రివాడానుకున్నా. తండ్రిని మరిపిస్తున్నాడు -- సుమా!' అని ఆశ్చర్యపోయింది. జీపెక్కి వెళ్తున్న కొడుకుని చూసి. ముఖం ముడుచుకు దిగులుగా కూర్చున్నాడు , స్వామి జీపులో. 'వెర్రి నాయినా కోపమెందుకురా ? ఎప్పటికైనా నీడగ్గరుండవలసినదాన్నేగా వీలు చూసుకు వస్తాగా' అంది సీతమ్మ గారు కొడుకు చుబుకాన్ని తాకి లాలనగా. జీపు వీధి మలుపు తిరిగి వెళ్ళేవరకూ అక్కడే నిలబడి నివ్వెరపోయి చూసింది. కళ్ళల్లో నీరు పొంగి - చూపు మసక బారింది. తుడుచుకు చూసింది. జీపు మలుపు తిరిగిందని వెనక్కు తిరిగింది సీతమ్మ గారు.
    స్వామి జీవితం ఎటువంటి మలుపు తిరిగిందో కొంతవరకే తెలుసు ఆమెకు.
    
                           *    *    *    *

    రాజయ్య గారి కడుపున పుట్టిన కొడుకు స్వామి.
    జీపులో ఎక్కి తిరుగుతున్నంత సేపూ తండ్రి గుర్తుకు వచ్చేవాడు స్వామికి- 'జీపు రాజయ్యగారు' తన తండ్రి . తాను అలా జీపు కారెక్కి - వందలూ వేలూ జేబులో పెట్టుకు తిరగగలనని కలగనలేదు స్వామి. పావని చెప్పింది నిజమని పించింది. నిజంగానే తమకు మంచి రోజులు వచ్చాయేమో ? మరో రెండు కాంట్రాక్టు లిప్పించారు కోనేటిరావు. 'వచ్చే ఎన్నికల్లో నెగ్గి మంత్రి కాని- ఇటువంటి లక్ష కాంట్రాక్టు లిప్పిస్తాడు కోనేటిరావు . అమ్మాయి జాతకంలో అదృష్ట గీత అటువంటి దబ్బాయ్.' అనేవాడు రఘుపతి. పావని అదృష్ట వంతురాలే. నాలుగైదు నెలల తర్వాత కోనేటిరావు -- అనడరితో సంప్రదించిన మీదటనే , తన బావమరిది - భారతమ్మ మొగుడికి కూడా వాటా యిచ్చాడు. అంతకు ముందు నెలకు సగం రోజులు పుట్టింట్లో ఉండటం అలవాటయిన భారతమ్మ -- యిప్పుడు భర్తతో సహా అన్నగారింట్లోనే కాపురం పెట్టింది.'
    భారతి భర్త పేరు భీమారావు. పేరును బట్టి అతని రూపాన్ని ఊహించుకుంటే ఎవరైనా మోసపోతారు. చాలా నీరసం మనిషి. రోజుకు పదహారుసార్లు కాఫీ తాగి, ఆరేడు పాకెట్లు సిగరెట్లు పీలుస్తూ -- 'ఆ బలంతో బ్రతుకుతున్న అర్బకుడు. భార్య నడుస్తున్నా పక్కన- ఇద్దరి మధ్యా కనీసం పదిగజాల దూరముండేటట్లు జాగ్రత్త పడతాడు. ఆ భీమారావు కూ మున్సుబు గారికి ప్రాణమై పోయింది. అ బంధం చిట్లాట కుటుంబ కలహాలు  అడ్డం రాలేదు ఆ స్నేహానికి.
    అటువంటి కాంట్రాక్టులకు పనికొస్తాడని జాయింటు కలుపుకోలేదు కోనేటిరావు, చెల్లెలు మీదున్న మమకారమే కారణం. స్వామి కి కాంట్రాక్టు పనుల్లో అవంత కూడా ఉపయోగపడటం లేదు భీమారావు. క్షణం తీరిక లేకుండా , వేళకు తిండి లేకుండా , ఇంటి పట్టున కమ్మని నిద్ర లేకుండా తిరుగుతున్న భర్తను చూస్తె -- పావని మనస్సు కలవర పడేది.
    'నల్లబడ్డారండి' అనేది నాలుగు రోజుల తర్వాత యింటికి వచ్చిన భర్తకు నీళ్ళు తోడి వీపు రుద్దుతూ.
    'చిక్కి పోయారండీ' అంటూ మరింత పప్పు వడ్డించి, చారెడు నెయ్యి పోసేది అన్నం తింటున్న భర్త చేతుల్లో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS