Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 26

 

    ఎలాగైతేనం సినిమా చూసేం అనిపించేడు . 'జాతీయగీతం' తరువాత లైట్లు వెలగగానే అందరూ తమవంకే చూస్తూ నడవటం గమనించిన కళ్యాణి కి వళ్ళు మండిపోయింది. 'ఏమిటలా చూస్తారు? వాళ్లకు పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలను సినిమాకి తీసుకు వస్తే వాళ్ళు మాత్రం అల్లరి చెయ్యరా?' అనుకుంది.
    చివరకు రూముకి వెళ్ళగానే తన కోపాన్నంతటినీ భర్త మీద కక్కేసింది. 'అసలు దీని కంతటి కీ కారకులు మీరు. తప్పంతా మీది. నేను బీచ్ కి పోదామంటే సినిమాకు వెళ్దామని , తీసుకెళ్ళి, నలుగురి లోనూ నవ్వులు పాలు చేయించింది మీరు' అంటూ.
    చిరాగ్గా భోజనాలు చేసి పిల్లలకు పాలు త్రాగించి పడుకున్నారు. సినిమాలో జరిగిన సంఘటన వల్ల మనసంతా చికాగ్గా ఉన్నా, ఆ సినిమాలో సెక్స్ అప్పీలు మరీ మోతాదును మించి ఉండటం వల్ల పక్కమీద వాలగానే ఆ యువ దంపతులకు ఉద్రేకంతో ఊపిరి సలపనే లేదు.

                             *    *    *    *
    మర్నాడు ఉదయం టిఫిను తీసుకోవటం అయినాక చక్కగా అలంకరించుకుని అజంతా స్టైల్లో కొప్పు పెట్టుకుని వయ్యారంగా నడిచి వస్తున్న భార్యను చూస్తూనే కన్ను గీటి 'ఏమిటి కధ?' అంటూ అడిగేడు కాంతారావు.
    'ఇదో యిటు చూడండీ! రాత్రి సినిమాకు వచ్చిన ఆడవాళ్ళందరినీ చూస్తుంటే నా అవతారం నాకే సిగ్గనిపించింది. ఇన్నాళ్ళూ మనం తీర్ధ యాత్రలో ఉన్నాం. కనుక ఎలా అలంకరించుకున్నా సరిపోయింది. ఇప్పుడు మనం మద్రాసు మహానగరం లో ఉన్నాం. మన ప్రేమ యాత్ర అసలు ప్రారంభమయ్యేది యిక్కడ నుండే! సో....మనం కాస్త స్టైలిష్ గా ఉండటం ప్రారంభిస్తాం యిక నుండి' అంటూ హ్యాండ్ బాగ్ లో నుండి గాగుల్సు తీసి కళ్ళకు తగిలించుకుంది.
    'రైటో పద ఇక మన కెమెరా కి చూడు కావలసినంత పని' అన్నాడు హుషారుగా కాంతారావు.
    కళ్యాణి నవ్వుతూ కాంతారావు ముక్కు పట్టుకుని లాగి ఆ చేతిని తన పెదవుల కానించుకుని ముద్దు పెట్టుకుంది. చక్రాల్లాంటి కళ్ళను మరింత పెద్దవి చేసి అమ్మా నాన్నలనుమార్చి మార్చి అనుమానంగా చూస్తున్న ఆ బుడతల ముందు అంతకంటే శృతి మించి ప్రవర్తించే ధైర్యం లేకపోయింది వాళ్ళకు. ఆ పిల్లలు పేరుకు పిల్లలే కాని అమ్మా నాన్న దగ్గరగా వస్తే చాలు, ఆరిందాల్లా వాళ్ళు ఏదో చెయ్యరాని పని చేస్తున్నట్లు అతీంద్రియ జ్ఞానంతో తాము గ్రహించినట్టు, వాళ్ళ వంకే అదోరకంగా చూస్తారు. అందువల్ల కళ్యాణి , కాంతారావు పిల్లలున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. టాక్సీ లో సరాసరి 'బర్మా బజారు ' కు పోయేరు కనీసం ఏభై రూపాయల దాకా అన్నా తన వంతుకు యివ్వాలని భర్తకు ముందే చెప్పి ఉంచింది కళ్యాణి . అక్కడ చైనా బజారు లో దొరకని వస్తువంటూ లేదు. వాళ్ళు అమ్మే వస్తువులకు స్థిరమైన వేల అంటూ ఉన్నట్టు కనపడదు. ఇరవై మూడు రూపాయల చెప్పిన వస్తువును పందొమ్మిది కి ఒక్క పైసా తక్కువైనా యివ్వనని ఖచ్చితంగా చెప్పి, తరువాత పది హేను రూపాయలకే దుకాణాదారులు యిచ్చేస్తుంటే 'అసలు ఆ వస్తువు ఖరీదు ఏ ఐదు రూపాయలో మించదు' అనిపించక మానదు కొనేవాళ్ళకు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళను వాళ్ళు బాగా మోసం చేస్తారు. ఎలాగైతే నేం చైనా బజారును చూస్తేనే కళ్యాణికి, కాంతారావు కి చాలా కాలంగా తాము కొనదలుచుకున్న వస్తువులన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చినాయ్. కళ్యాణి "ఏమండోయ్ , సుబ్బలక్ష్మీ అని పియూసీ లో మా క్లాస్ మేట్ లేదూ, ఆవిడ హస్ బెండ్ మొన్నీ మధ్య అమెరికా వెళ్ళి వచ్చేడని కూడా చెప్పెను- తను చెప్పింది-- బర్మా బజారులో యార్డ్లీ పౌడరు తొమ్మిది రూపాయలకే దొరుకుతుందిట కొనండి కాస్త. హైదరాబాద్ లో పదహారు రూపాయలు పెట్టినా ఆ పౌడరు దొరకటం గగనమై పోతోంది.' అంటూ గారాబంగా అడిగింది భర్తను.
    యార్డ్లీ పౌడరు మొదట యిరవై రూపాయలు చెప్పి చివరకు పదిన్నర కు యిచ్చెడు దుకాణం అతను. తరువాత కళ్యాణి లిప్ స్టిక్కు నాలుగు రంగులలో తీసుకుంటుంటే కాంతారావు ఆమె వంక వింతగా చూసేడు. కళ్యాణి అతని ముఖం లోని ఆశ్చర్యాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. కళ్ళను, కనుబోమలను దిద్దుకుంటానని ఒక పెన్సిలు , తలలోకి ఒక అందమైన ప్లాస్టిక్ పువ్వు, ఖరీదైన ఫేస్ లోషన్ అన్నీ కొన్నది.
    ఇంతలో కాంతారావు కి తనకు కావాల్సిన సిల్వర్ గిల్లెట్ బ్లేడ్లు గుర్తుకు వచ్చి హైదరాబాద్ లో వాటి కోసం తాను పడుతున్న నానా అవస్థలు కూడా గుర్తు కొచ్చి రెండు డజన్ల బ్లేళ్ళు కొన్నాడు. కళ్యాణి అతనిని బలవంత పెట్టి కరెంట్ తో రేజరు ను. జపాన్ పైలట్ పెన్నును, ఒక చైనా పెన్నును కూడా అతని చేత కొనిపించింది. పిల్లలిద్దరికీ బెంగుళూరు, ఊటీ కు వెళ్ళినప్పుడు చలిగా ఉంటుందని వాళ్ళకి ఉలెన్ డ్రెస్సు  తానొక షాలువ కొన్నది. చివరకు షాపింగు ముగించు కుని బయటకు వచ్చేసరికి ఏభై రూపాయలకు బదులు తాము నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టినట్లు తేలింది. కాంతారావు ఆముదం తాగిన ముఖం పెట్టేసరికి కళ్యాణి అతనిని వోదార్చింది. 'ఎందుకండీ అలా బాధపడతారు? మనం యిలా బయటకు వచ్చింది సర్దాగా ఖర్చు పెట్టుకుని తిరుగుదామనే కదా!' అంది ముద్దుగా.
    'ఔను, మరే మనం వచ్చింది ఖర్చు పెట్టటానికేగా' అన్నాడు కాంతారావు కూడా పళ్ళు బయట పెట్టి. అప్పటికి టైము కూడా పన్నెండు కావస్తోంది. అందువల్ల దగ్గర్లో ఉన్న హోటలు కు వెళ్ళి భోజనం చేసి వెంటనే తమ రూముకు వెళ్ళి కాసేపు విశ్రమించేరు. ఆ సాయంత్రం అనుకున్నట్లు గానే 'బీచ్' కి వెళ్ళేరు.
            
                                    11
    బీచ్ కి వెళ్ళేటప్పుడు కల్యాణి తెల్లని నైలెక్స్ చీర కట్టుకుని వాలు జడలో మల్లెలు , మెడలో ముత్యాల హారం వేసుకుంది. పెదవులకు లేత గులాబి రంగు లిప్ స్టిక్ వేసుకుంది.
    ఆమెనలా చూస్తూనే ఎవరో అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్టు వింతగా చూస్తూ నిలబడ్డాడు కాంతారావు.
    కళ్యాణి కనుకొలకుల నుండి అతని వంక కొంటెగా చూస్తూ నవ్వింది.
    కాంతారావు తేరుకుని ' త్వరగా బయల్దేరు. కొంచెం ఎండ ఉండగానే బీచ్ కి చేరుకుంటే అక్కడ కొన్ని స్నాప్స్ కూడా తీసుకోవచ్చు' అన్నాడు.
    బీచ్ వడ్డున నిల్చుని, కూర్చుని వివిధ భంగిమలలో భర్త తనని ఫోటోలు తీస్తుంటే గర్వంగా, తృప్తిగా నవ్వుకుంది కళ్యాణి.
    ఎండ తగ్గి , చల్లబడగానే బఠానీలు తింటూ యిసుకలో కూర్చున్నారిద్దరూ ఒకరినొకరు అనుకుంటూ. పిల్లలు ఎన్నడూ సముద్రాన్ని చూడక పోవటం వల్ల పట్టరాని ఆనందంతో సముద్రపు కెరటాలను, వాటి మీద తేల్తున్న తెల్లని నురగను చూసి సంతోషం పట్టలేక యిసుక లో పొర్లుతూ అడుకోసాగేరు.
    కళ్యాణి కి కాంతారావు కీ ఆ వాతావరణంలో ఎంతో హాయిగా ఉంది. చుట్టూ ఎంతమంది మనుషులున్నా ఎవరికి వారు తమ ప్రపంచంలో మునిగిపోయి ప్రక్క వారిని గమనించటమే లేదు. అందుకే ప్రణయోద్వేగంతో కొన్ని జంటలు ఒకరినొకరు ఒరుచుకుంటూ ఒకరి ఒడిలో ఒకరు తల పెట్టి పడుకుని సమ్మోహితులై పోతుంటే, జీవితం మీద విరక్తి పుట్టి, అనుభవాల మీద అసహ్యం పుట్టిన మరికొందరు నిర్లిప్తం, కెరటాల పై ముసురుకున్న చీకటిని చూస్తూ తమ అంతరంగ ఘోషను ప్రతి ధ్వనిస్తున్న సముద్రపు హోరును వింటూ కూర్చున్నారు. ఏమీ ఎరుగని పసిపాపలు  ఆనందంతో కేరింతలు కొడుతుంటే అనుభవాల కోసం అర్రులు చాచే ప్రధమ యౌవనం లోని పడుచులు బ్రహ్మచారులు ఏదో తెలియని బాధతో వెలితితో ఆ ప్రశాంత వాతావరణం లో అసహనంగా తిరుగుతున్నారు. చీకట్లు క్రమంగా చిక్క బడినాయ్! లైట్ల వెలుగుకు దూరంగా కూర్చున్నారు కాంతారావు , కళ్యాణి . కాంతారావు అంతసేపూ కళ్యాణి చెప్తున్న మాటలను పరధ్యానంగా వింటూ "ఊ" కొడుతున్న వాడల్లా బాగా చీకటి పడ్డాక, తమ చుట్టూ పక్కల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెను ఒకసారి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదవులకు లిప్ స్టిక్ జిగురు అంటుకుంది. వెంటనే 'ఛీ' అంటూ రుమాలుతో తన పెదవులను తుడుచుకున్నాడు.
    కళ్యాణి పకపక నవ్వింది.
    'ఎందుకలా నవ్వుతావు, సిగ్గు లేక?' అన్నాడు కోపంగా కాంతారావు.
    'సిగ్గా! ఎందుకు?' అంటూ ఇంకా విరగబడి నవ్వసాగింది కళ్యాణి.
    'ఛీ పాడు రంగులూ నువ్వూను. 'నాచురల్ బ్యూటీ' మనిషి లో ఎప్పుడు ఉండదో మనసులోని తియ్యదనం కూడా అప్పుడే పోతుంది.' అన్నాడు.
    అతను సీరియస్ గా ఆ మాటలనే సరికి కళ్యాణి షాక్ తిన్నట్లయి ఒక్కసారిగా నవ్వునాపెసింది.
    'ఏమిటి మీరనేది?' అన్నది కొంచెం కటువుగా.
    'లేకపోతె పెదవులకా రంగులేమిటి? చూడు నిన్ను ముద్దు పెట్టుకుంటే నీ పెదవుల తియ్యదనం కాదు నాకు లభించింది నీ రంగుల జిగురు' అన్నాడు యింకా కోపం తోనే.
    కళ్యాణి నిటారుగా లేచి నిలబడింది. 'ఐయాం వెరీ సారీ కాంతం! ఐతే ఒక్క మాట. ముద్దులు పెట్టుకునేందుకు యిది సమయం, స్థలం కాదు. ఆ విషయం గ్రహించక తొందర పడ్డందుకు తప్పు నీది. బయటకు వచ్చినప్పుడు అందం కోసం, పెదవులకు, కావాలంటే యింకా బుగ్గలకీ కూడా నేను రంగు వేసుకుంటాను. వాటిని ఊరికే మీరు కళ్ళతో చూసి ఆనందించాలే తప్ప సమయా సమయాలు చూడకుండా రుచుల కోసం ఎగబడటం నాకేమీ నచ్చలేదు. కావాలంటే యింట్లో ఉన్నప్పుడు నువ్వు ఉండమన్నట్లే సహజంగానే ఉంటాను. కాని యిలా బయటకు వచ్చినప్పుడు కొంత ఆడంబరం, షోకులు ఆడదానికి తప్పనిసరి అని నా కనిపిస్తోంది. అందుకే నేను అలా అలంకరించుకుంటున్నాను. ఐకాంట్ హేల్పిట్! యుహావ్ టు సింప్లీ ఎక్స్స్యుజ్ మీ ఫరిట్.' అంది.
    'చాల్లే పద ఇక యింటికి నడు' అన్నాడు కాంతారావు కూడా లేచి.
    'మన యిల్లు యిక్కడ లేదు. హైదరాబాద్ లో ఉంది' అన్నది పెంకె గా.
    'హైదరాబాద్ లో ఉన్నది కూడా అసలు యిల్లు కాదుగా అద్దె కొంపే. కాబట్టి ప్రస్తుతం మనం ఉన్న హోటలు నే యిల్లుగా భావించటం లో తప్పేం లేదని నా ఉద్దేశ్యం.' అన్నాడు కాంతారావు సీరియస్ గానే.
    కళ్యాణి కిలకిలా నవ్వింది. నవ్వకూడదు అనుకుంటూనే కాంతారావు కూడా అప్రయత్నంగా నవ్వేసేడు.
    ఇద్దరూ పిల్లలను తీసుకుని హోటలుకు బయల్దేరారు.
    ఆ రాత్రి భోజనాలయినాక కళ్యాణి పిల్లలను పడుకో బెట్టి తాను కూడా అక్కడే పడుకుంది.
    ఎంతసేపటికి తన దగ్గరికి రాకపోయే సరికి కాంతారావు ఆమెను మెల్లగా పిలిచేడు.
    కల్యాణి నిద్ర నటిస్తూ అతని మాటలు వినిపించుకొనే లేదు.

                                        
    కాంతారావు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని లేపబోయాడు. కళ్యాణి విసురుగా చెయ్యి లాగేసుకుంది. 'నేను నీ దగ్గరకు రాను పొండి.' అంది.
    'అర్ధరాత్రి ఏమిటా అరుపులు? మాట్లాడక రా' అన్నాడు కాంతారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS