Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 26


    అందరూ చెట్లక్రింద కూర్చున్నారు. భానుమతి, మాలతి మల్లెమొగ్గలు కడుతూ కూర్చున్నారు. మల్లె మొగ్గలకోసమని ఇంటిదగ్గిర నించే దారం తెచ్చారు వాళ్ళు. శారదమ్మ తన కారియర్ తీసి జంతికలు, చేగోడీలు కాయితాలలో పెట్టి అందరికి ఇచ్చింది.
    "శారదమ్మా, ఒక చక్కటి కృతి పాడమ్మా. చిన్న ప్పుడు నువ్వు ఎంతో బాగా పాడేదానివి, మళ్ళీ నీ పాట వినాలని ఉంది" అంది శాంతమ్మ.
    "నా గొంతుక ఇప్పుడు బాగాలేదు, వదినా! బొంగురు పోయింది. పాటకూడా మరిచిపోయాను" అంది శారదమ్మ.
    "ఫరవాలేదు, పాడండి. నాకూ సంగీతం అంటే చాలా ఇష్టం" అన్నారు రామారావుగారు.
    శారదమ్మ కాసేపు ఆలోచించి, యదుకుల కాంభోజి రాగంలో త్యాగరాజు కృతి పాడింది.
    "పాహి రామచంద్ర రాఘవా, హరే రామయ్యా"-
    చారుమతి ఆవిన్నే చూస్తూ కూర్చుంది. ఆవిడ గొంతుకలో శ్రావ్యత తగ్గిపోయి ఉండవచ్చును. కాని పాటలో భావం మేళవించి తన్మయురాలై పాడు తూంది. భగవంతున్ని ఎదట నిలిచి వేడుకుంటున్న ట్టుంది.
    శారదమ్మ సన్నగా ఉంటుంది. పేదరికం, కష్టాలు అనుభవించిన జాడలు ఆవిడలో ముద్రవేసుకున్నాయి. ఆవిడ కళ్ళు దీనంగా, అమాయికంగా ఉంటాయి. మంచితనం మనిషిలో, మాటలో నిండిఉంటుంది. 'గోపాల్ కి తల్లి మంచితనమే వచ్చింది' అనుకుంది చారుమతి.
    "ఎంత బాగా పాడారమ్మా! ఈ పాటకి ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు రికార్డు ఉంది. ఆయనే ఎంతో బాగా పాడారనుకున్నాను. కాని ఆయన పాటను మించి పోయింది మీ పాట" అన్నారు రామారావుగారు.
    "అమ్మ కింత బాగా సంగీతం వచ్చునుకదా! బాబూ, నీకూ వచ్చి ఉండాలి. నువ్వో పాట పాడు" అంది భాను మతి.
    "నాకు సంగీతం రాదు. భావగీతాలు పాడుతాను" అన్నాడు గోపాల్.
    "అవే పాడు" అంది చారుమతి.
    గోపాల్ గొంతు సవరించుకున్నాడు. ఎంకిపాట ఎత్తుకున్నాడు.
    "ఈ రేయి ననొల్ల నేరవా రాజా,
    ఎన్నెలల సాగసంత యేటిపాలే నటర!"
    అతని గొంతుకలోని గంభీరత్వం, బొంగురుతనం పాటకి నిండుతనం కూర్చాయి. ఆడపిల్ల లందరికి అతని పాట ఎంతో నచ్చింది.
    "ఎన్నాళ్ళయింది భావగీతం విని!" అంది భానుమతి.
    "ఎవరు పాడేవారు పూర్వం?" అన్నాడు గోపాల్.
    "ఎవరు పాడటం ఏమిటి? మా అక్క పాడుతుంది" అంది మాలతి, చారుమతిని చూపిస్తూ.
    "వదినా, నువ్వొక పాటపాడవా?" అన్నాడు గోపాల్.
    "నువ్వు పాడతావని ఇన్నాళ్ళూ నాకు తెలియదమ్మా" అన్నారు రామారావుగారు ఆశ్చర్యంగా.
    "మ్రోయింపకోయ్ మురళి
    మ్రోయించుకోయ్ కృష్ణ!
    తీయ తేనియ బరువు.
    మ్రోయలే దీ బ్రతుకు" - అన్న కృష్ణ శాస్త్రిగారి పాట పాడింది చారుమతి. చారుమతి కంఠం చాలా తియ్యగా, మధురంగా ఉంటుంది.
    "నువ్వింత తీయగా పాడితే మా బ్రతుకు మోయలేని బరువై పోతుంది" అన్నాడు గోపాల్ సంతోషంగా.
    "బావగారూ, మీకు భావగీతాలంటే అట్టే ఇష్టం ఉన్నట్టు లేదే!" అంది మాలతి.
    "ఎందు కిష్టం లేదమ్మా! మా చిన్నప్పుడు మేం రాజేశ్వరరావు, బాలసరస్వతి, సూర్యకుమారి పాడిన భావగీతాలు ఎక్కువగా వినేవాళ్ళం. అయితే మాతరం వాళ్ళకి ఇటు భావగీతాలూ, కర్ణాటక సంగీతం, అటు సైగల్, పంకజ్ మల్లిక్ పడిన హిందీ పాటలూ - అన్నీ ఇష్టమే. నాకు ప్రత్యేకంగా సైగల్ పాటలంటే చాలా ఇష్టం" అన్నారు రామారావుగారు.
    "సైగల్ పాటలంటే చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడతారు. అతని పాటలలో ఉన్న గొప్పతన మేమిటో?" అన్నాడు గోపాల్.
    "నువ్వు ఒక్కసారి సైగల్ పాడిన 'సోజా రాజ కుమారీ', 'బాబుల్ మొరా', 'ప్రేమ్ తాహై ఇస్ జగ్ మే' - వంటివి జాగ్రత్తగా వింటే అందులో ఉండే గొప్పతనం నీకే తెలుస్తుంది."
    "ఈమారు శ్రద్దగా వింటాను. మీరు ఎంతో బాగుంటాయి అంటున్నారుగా! ఇప్పటిదాకా నేను అతిగా ఇష్టపడినవి భావగీతాలే" అన్నాడు గోపాల్.
    'నాకో స్నేహితుడు దొరికాడు, భావగీతాలు ఇష్ట పడటానికి' అనుకుంది చారుమతి.
    ఎండ తగ్గుముఖం పట్టి, సాయంకాలం పడుతూ ఉండటం గమనించి అందరు లేచారు.
    "అయ్యో, అప్పుడే లేస్తున్నారేమిటి? ఒక్క సినిమా పాట పాడు, బావా!" అంది భగవతి, గోపాల్ ని చూస్తూ.
    అందరూ నవ్వారు. "నీ సినిమా పాట బాకీ ఉండి పోయిందా?" అంది శాంతమ్మ.
    "నాకు రావు, భగవతీ. నీకోసం నేర్చుకుంటాలే" అన్నాడు గోపాల్.
    జడనిండా మల్లెదండలతో, ఖాళీ అయిన కారియర్ లలో తిరుగుముఖం పట్టారు.
    "పిక్ నిక్ చాలా సరదాగా గడిచింది" అంది భానుమతి.
    "అవును, చాలా బాగుంది" అన్నారు తక్కిన అందరూ.
    "శంకరం కూడా ఉంటే బాగుండును" అంది శాంతమ్మ.
    కొడుకు దగ్గిరలేని కొరత ఆవిడికి ఎప్పుడూ లోటు గానే ఉంటుంది.
    
                                  *    *    *

    జూన్ నెల వచ్చింది. స్కూళ్ళు తెరిచారు. మాలతికి కూడా టైపిస్టు ఉద్యోగం దొరికింది. శంకరం వంద రూపాయలు పంపాడు. చారుమతి మనస్సుకి ఉల్లాసంగా ఉంది. ఇన్నాళ్ళూ మోసిన కుటుంబ భారం దించుకున్నట్టు అయింది.
    స్కూలు తెరిచిన రోజు చారుమతి ఉదయం స్కూలుకి వెళ్ళి, రాత్రి ఆలస్యంగా ఎనిమిది గంటలకి ఇంటికి చేరింది, అందరి భోజనాలు అయిపోయినా, శాంతమ్మ వంటింట్లో కూతురికోసం కాచుకుని ఉంది.
    "నువ్వు భోజనం చేసెయ్యలేకపోయావా, అమ్మా! నాకోసం ఎందుకు కూర్చున్నావు?" అంది చారుమతి వంటింట్లోకి వస్తూ,
    'అంత తొందరగా భోజనం చేసి నేను పడే పాటు ఏముంది?... అవును, ఈ రోజు ఇంత ఆలస్యం అయిందేం?" అడిగింది శాంతమ్మ.
    "పద్మ వచ్చిందమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లాను"
    "ఎప్పుడూ?"
    "నెల్లాళ్ళపైన అయిందిట. మనం సర్పవరం వెళ్ళిన రోజు పద్మావాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చి, ఇల్లు తాళంవేసి ఉండటం చూసి వెళ్ళిపోయారట. మళ్ళీ యీ రోజు స్కూలుకి వచ్చి చెప్పారు."
    "ఎలా ఉంది పద్మ? నెల తప్పిందా?" శాంతమ్మ అడిగింది.
    "పద్మ చాలా పాడైపోయిందమ్మా. సన్నగా డొక్కులా అయిపోయిందీ. మనిషికూడా చాలా మారిపోయింది. ఏమిటో ముభావంగా తయారైంది. ఏం మాట్లాడదు. అడిగినదానికి కూడా "ఉఁ", "ఉహుఁ" అంటూ సమాధానాలు చెబుతుంది. పద్మనాన్నగారు, అమ్మగారు కూడా ఎందుకనో విచారంగా, దిగులుగా ఉన్నారు. నాకు పద్మని చూస్తే చాలా ఏడుపు వచ్చింది."
    పద్మ అలా ఎందుకు ఉందో శాంతమ్మకీ అంతు పట్టలేదు.
    "అత్తగారు మంచిది కాదేమో! కోడంట్రికం పెట్టిందేమో!" అంది చివరికి.
    భోజనాలు అయ్యాయి. ఒక కంచంలో కొంచెం కూర, పచ్చడి, అన్నం, చిన్న గిన్నెతో మజ్జిగ ఎత్తి పెట్టింది శాంతమ్మ.
    "ఎవరికమ్మా భోజనం ఎత్తి పెట్టావు?" అంది చారుమతి.
    "భగవతి సినిమాకి వెళ్ళింది. వచ్చి తింటుందని."
    చారుమతికి ఆ మాట వినగానే కోపం వచ్చింది.
    "ఎన్నిసార్లు చెప్పానమ్మా సీతతో సినిమాలకి పంపవద్దని! మూడు రోజులకి ఒక సినిమా చూడకపోతే ఈవిడ బ్రతకలేదా?" అంది.
    "ఏం చెయ్యనే! ఇంట్లో కూర్చుంటే దానికి తోచదు. సినిమాకి పంపేదాకా నా ప్రాణాలు తోడేస్తుంది" అంది శాంతమ్మ.
    "దీని వరస నాకేం నచ్చలేదు" అంటూ చారుమతి ముందరి గదిలోకి వచ్చింది.
    రోజంతా పనిచేసి వచ్చిన మాలతి అలసటగా పడుకుని ఉంది. భాను ముందరి గదిలో భర్త తో మాట్లాడు తూంది. చల్లగాలి కోసం బయట వరండాలో చాప వేసుకుని మేను వాల్చింది చారుమతి.
    భగవతి ఆలోచనలే తిరుగుతున్నాయి. భగవతికి, సీతకి సినిమాల పిచ్చి ఎక్కువ. వచ్చిన ప్రతి కొత్త సినిమాకీ వెళ్ళవలసిందే. కొత్తవి లేకపోతే, చూసిన పాత సినిమాయే మళ్ళీ చూస్తారు. లేదా ఒక సినిమాను బాగుందనో, పాటలు నేర్చుకోవాలనో మూడు నాలుగు సార్లు చూస్తారు. "ఎందుకే అలా సినిమాలు చూస్తావు?" అని అడిగితే, "మనం డబ్బు పెట్టుకో నవసరం లేదుగా! సీత డబ్బు పెడుతుంది" అంటుంది. ఆ మాట విని చారుమతి ఒకసారి గట్టిగా అంది, "అలా ఇంకోల డబ్బుమీద సినిమాలు చూడటానికి సిగ్గు లేదూ?" అని.
    "నాకేం సిగ్గు లేదు. సినిమాలంటే నా కిష్టం" అంది భగవతి.
    'ఛీ, ఏం మనిషి?' అని చారుమతి లోపలే చీత్కారం చేసింది.
    సినిమాల మీదనించి దృష్టి చదువుమీద మళ్ళించు దామని ఇంట్లో అంతా ప్రయత్నించారు. అవీ వ్యర్ధ మయ్యాయి. "చదువంటే నాకు ఇష్టంలేదు. నేను పెళ్ళి చేసుకుంటాను" అని జవాబు చెప్పింది భగవతి.
    'దీన్ని బాగుచెయ్యడ మెలాగో?' అనుకుంది చారుమతి.
    భగవతిమీదినించి ఆలోచనలు పద్మమీదికి మళ్ళాయి. పద్మ అలా ఎందుకైందో! "మద్రాసు ఎప్పుడు వెళతావు?" అంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు. పరిస్థితి చూస్తే ఇప్పట్లో మద్రాసు వెళ్ళే టట్టు లేదు. ఎందుకు వచ్చేసినట్టు? అక్కడ ఏమైనా గొడవలు జరిగాయా? పద్మ ఎంతో మంచిది; అమాయికు రాలు. ఎదటమనిషిని పల్లెత్తు మాట అనదు. అలాంటి పద్మతో విరోధం ఎవరు వహించగలరు?
    చారుమతి పద్మ దగ్గిరగా కూరుని ఎంత ఆప్యాయంగా అడిగినా పద్మ తన కాపరం గురించి ఒక్క మాటా చెప్పలేదు.
    'శ్రీదేవికి పద్మని గురించి రాస్తాను. శ్రీదేవికికూడా పెళ్ళి అయింది కనక, దాంతో ఏమైనా చెబుతుందేమో!" అనుకుంది చారుమతి.
    మరునాడు ఉదయమే కూర్చుని, పద్మ పరిస్థితి గురించి విపులమైన ఉత్తరం శ్రీదేవికి రాసి, హైదరాబాద్ కి పోస్టు చేసింది చారుమతి.

                              *    *    *

    శ్రావణ మాసం. నల్లటి మబ్బులు ముసురుకుని, ఉండి ఉండి వర్షం పడుతూంది. ఈ వర్షాలకి, బురదకి లెక్కచేయకుండా అలాగే నీళ్ళలో తడుస్తూనే శ్రావణ మంగళవారం వాయినాలకి వెళుతున్నారు ముత్తయి దువులు.
    భానుమతికి పెళ్ళి అయిన మొదటి సంవత్సరం. అయినా అత్తగారు చనిపోయి ఇంకా ఏడాది కాలేదని శాంతమ్మ కూతురిచేత లక్ష్మీపూజ చేయించలేదు. ఆ రోజు ఉదయమే స్నానం చేసి సత్యనారాయణస్వామి గుడికి వెళ్ళి, కొబ్బరికాయ కొట్టి వచ్చింది భానుమతి.
    నోములు నోచుకుంటున్న కొత్త పెళ్ళికూతుళ్ళని చూడగానే చారుమతి మనస్సు ఎక్కడికో తేలిపోతూంది. ఎప్పటికేనా తనుకూడా భర్త సౌఖ్యం కోరుతూ అలా నోము నోచుకుంటుందా? చారుమతి మనసులో పెళ్ళితో ముడిపడే వ్యక్తి డాక్టర్ గిరిధారి. ఆమెకు నచ్చిన యువకుడు, పరిచయమైనవాడు అతను ఒక్కడే. ఆమె భవిష్యత్తును గురించిన కలలన్ని అతని చుట్టూ తిరుగుతాయి. చారుమతి డాక్టర్ గిరిధారిని చూసి మూడేళ్ళు అవుతూంది. అతనితో తన పరిణయం అసాధ్యమని తెలుసును. కాని ప్రతి వ్యక్తి కలలకి ఒక ఆలంబనం కావాలి. గడ్డిపోచ అంత ఆశ ఉన్నా, ఆలంబనం దొరికినా దానిమీద హర్మ్యాలు నిర్మిస్తాడు మనిషి. గట్టి పునాదులు లేని ఆ హర్మ్యాలు ఒక రోజు కూలిపోతాయి. నిర్మించిన వ్యక్తి నిరాశతో కుంగిపోతాడు.
    అదే జరిగింది చారుమతికి.
    ఒక రోజు ఉదయమే ప్లీడరు గారి నౌకరు నూకరాజు పసుపు రాసిన శుభలేఖ తీసుకునివచ్చాడు.
    "చిన్నబ్బాయిగారికి పెళ్ళమ్మా. అయ్యగారు మీ కీ శుభలేక వచ్చి రమ్మన్నారు" అన్నాడు.
    భర్త చనిపోయిన నాలుగేళ్ల తరవాత కూడా ప్లీడరుగారు తమని జ్ఞాపకం పెట్టుకుని, కొడుకు శుభలేఖ పంపినందుకు శాంతమ్మ పొంగిపోయింది.     
    "అలాగా, నూకరాజూ. అమ్మాయిది ఏ ఊరు?" అంది,
    "రాజమండ్రీ, అమ్మా."
    "బాగా కట్నాలు, కానుకలు ఉన్నాయా?"
    "కలిగిన మారాజులు, నేకేమమ్మా! పన్నెండేలకి పైమాటే అని ఇనుకోడం."
    "బాగుంది. ఉన్నవాళ్లు ఇచ్చుకోకపోతే మాలాంటి వాళ్ళం ఇచ్చుకోగలమా? అబ్బాయి డాక్టరు పాసయ్యాడు. బుద్ది మంతుడు. అమ్మాయి సుఖపడుతుంది" అంది శాంతమ్మ.
    "చిన్నబ్బాయి గారు రత్నంలాంటివారమ్మా. ఆరిది మాగొప్ప గుణం" అంటూ పొడిచాడు నూకరాజు. తరవాత శాంతమ్మ దగ్గిర సెలవు తీసుకొని వెళ్ళాడు.
    చారుమతి తల్లి ఇచ్చిన శుభలేఖ అందుకుని చూసింది. అమ్మాయి పేరు రాధ. తండ్రి అడ్వకేటు. 'గిరిధారి-రాధ' బాగుంది. పేర్లు కలిశాయి. వియ్యంకు లిద్దరు ప్లీడర్లే, సమఉజ్జీ. నే నెక్కడ? అత నెక్కడ? ఆకాశం మీద ఉండే చందమామకోసం నేలమీదినించి చేతులు చాచాను' అనుకుంది చారుమతి.
    మనసుకి ఎంత వేదాంతం చెప్పినా, ఒక పట్టాని స్తిమితం కుదరలేదు. స్కూలులో సమంగా పాఠాలు చెప్పలేకపోయింది. శాంతంగా ఒకచోట కూర్చోలేక పోయింది.
    సాయంత్రం ఇంటికి వస్తూనే చెల్లెలిని చూసి, "మాలతీ, సినిమాకి వెళదాం, వస్తావా?" అంది.
    స్కూలు ఉన్న రోజులలో సాధారణంగా సినిమాలకే వెళ్ళడం అలవాటులేదు చారుమతికి. ఈ రోజు అక్క అలా అడిగేసరికి ఆశ్చర్యపోయింది మాలతి.
    "వస్తాను. దేనికి వెళదాం?" అంది మాలతి.
    "ఏదో ఒకటి" అంటూ ముఖం కడుక్కోడానికి స్నానాల గదివైపు వెళ్ళిపోయింది చారుమతి.
    అక్కచెల్లెళ్ళిద్దరూ సినిమాకి వెళతారని తెలిసి గబ గబా ఉప్మా చేసింది శాంతమ్మ. ఉప్మా తిని, కాఫీ తాగుతూ చారుమతి అడిగింది: "భగవతి ఏదమ్మా? అది మళ్ళీ మేం సినిమాకి వెళ్లామని తెలిస్తే అలిగి కూర్చుంటుంది."
    "అది సీతవాళ్ళ ఇంటికి వెళ్ళింది. మీరిద్దరూ వెళ్ళిరండి. భగవతికి ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసినవే" అంది శాంతమ్మ.
    తల్లి మాటమీద భగవతిని వదలి చారుమతి, మాలతి సినిమాకి బయలుదేరారు.
    'అభిమానం' సినిమాకి వెళదామా, సావిత్రి ఉంది?" అంది మాలతి దారిలో.
    సినిమా చూస్తూ చారుమతి తన నిరాశలని కొంచెం మరిచిపోగలిగింది. ఇంటర్వెల్ లో లైట్లు వెలిగాయి. చుట్టుపక్కల చూస్తున్న మాలతి ఒక్కసారి అక్కని మోచేత్తో పొడిచి, "వెనక ఎవరున్నారో చూడు" అంది.
    చారుమతి వెనక్కి తిరిగి చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. పై అంతస్తు మెత్తని పరుపు కుర్చీలలో భగవతి ఒక అపరిచితుడిపక్కన కూర్చుని ఉంది. అతనితో ఏదో చెప్పి, పగలబడి నవ్వుతూంది. అతను చిలిపితనంగా భగవతి భుజం మీద చిన్నగా తట్టి నవ్వుతున్నాడు.
    చారుమతి, మాలతి సిగ్గుతో కుంగిపోయారు. తరవాత సినిమా ఎలా చూశారో వాళ్ళకే తెలియదు.

                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS