"నూనె అయిపోయినట్టుంది. ఛ, ఈ చీకటిలో నూనెలా తేమ?" అనుకుంటూ నూనెకోసం వెతకసాగింది,
"వెంకమ్మగారూ, కిరోసిన్ ఎక్కడుంది?"
"పశువుల పాకలో గూటిలో ఉంది."
చీకటిలో ఆ పాకలోకి వెళ్ళటానికి భయపడింది, మీర. వెంటనే టార్చ్ లైట్ గుర్తుకొచ్చింది. టార్చ్ తీసుకుంటూండగానే శాము ఇంటి కొచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉండటం చూసి,
"మీరా, లాంతరు వెలిగించు" అన్నాడు.
"కెరిసిన్ లేదు లాంతర్లో పాకలో ఉందట. తేవాలి. ఈ టార్చి కాస్త పట్టుకోండి....."
ఆమె మాటలు ఇంకా పూర్తి కాకమునుపే, శాము నూనె కోసం వెళ్ళిపోయాడు. లాంతరులో నూనె పోసి వెలిగించి,
"మీరా, నువ్వు భోంచేసి పడుకో నాకోసం కాచుకోకు. ఇప్పుడే వస్తాను" అన్నాడు.
మీర దీపపు వెల్తుర్లో భర్త మొహంవేపు చూసింది. ఎప్పుడూ నవ్వుతూ వుండే అతని కళ్ళల్లోని విషాదాన్ని, మొహంలోని గాంభీర్యాన్ని చూసి, కంగారుగా,
"అలా ఉన్నారేం" అంటూ, నుదుటిమీద చెయ్యి వేసి చూసింది.
"నాకేం లేదు. బాగానే ఉన్నాను. బోరడి చిన్న పిల్లాడికి ఉదయంనుండి మూర్చలు వస్తున్నాయి. బతికేట్టు లేడు. ఈ పల్లెలో వైద్యుడూ లేడు."
"పండితులవారున్నారుగా?"
"ఆయనా వూళ్ళో లేరు."
మీర చెయ్యి అతని నుదుటిమీది నుండి క్రిందకి జారింది."
డాక్టరు లేడు! పండితులవారూ లేరుట! కాని తను మాత్రం అక్కడే ఉండి-హృదయంనిండా డాక్టరవాలన్న కోర్కె నింపుకుని, ఎందుకూ? తనలోని తెలివీ, బుద్ధీ అన్నీ వ్యర్ధం. ఒక బిడ్డ మూర్చతో బాధపడుతూంటే, తను చేయగలిగిందేమీ లేదు. తానే డాక్టరి చదివి ఉంటే? మనిషి కష్టాన్ని పోగొట్టే ప్రయత్నం చేయగల అవకాశం ఉండేది. రోగ రుజినాలతో బాధపడే హృదయాలను, సాంత్వనపరచగలిగేది.
నిస్సహాయతవల్ల మీర కళ్ళల్లో నీరు తిరిగాయ్. తనమీద తనకే పిచ్చి కోపం వచ్చింది. శాము ఆమె మొహం చూసి,
"ఏడుస్తున్నావా మీరా? ఈ ప్రపంచంలో చనిపోయేవాళ్ళందరికోసం ఏడవగలమా? వెళ్ళి భోంచేసి పడుకో. నేను రావటం ఆలస్యం అవుతుంది."
మీర దైన్యంతో, "నేనూ మీతో వస్తాను" అంది.
శాము ఆశ్చర్యంతో "ఎక్కడికి? నే నిప్పుడు బోరడి ఇంటికి వెడుతున్నాను, నువ్వు అక్కడికి వస్తావా?"
"ఊఁ."
"వద్దు మీరా. నువ్వు భరించలేవు. ఆ బిడ్డ గిలగిలా తన్నుకోవడం చూసి, తట్టుకోలేవు నీవు. అయినా నువ్వెందుకు ఆ భీకర దృశ్యాన్ని చూడటం?...."
మీర మాట్లాడకుండా చెప్పులు తొడుక్కొని, టార్చ్ చేతికి తీసుకుంది.
"పదండి" అంటూ తలుపు తీసింది.
"మీరా ...."
"వెంకమ్మగారూ ...... తలుపు వేసుకోండి" అని అట్టిగా కేకేసి చెప్పి భర్త చేయి పట్టుకుని "పదండి" అంటూ, బయటికి దారితీసింది మీర. శాము ఏమీ తోచనివాడిలా ఆమెతో బయలుదేరాడు.
అమావాస్య రాత్రి కావటంవల్ల, బయట దట్టంగా అంధకారం అలుముకుంది. మబ్బువల్ల నక్షత్రాలు కూడ కనిపించటంలేదు. బయటికి అడుగుపెట్టగానే, చిల్లున చలిగాలి వీచింది. మీర చలికి వణుకుతూ, "అబ్బా!" అంది. ఆమె చేతి లోని టార్చి వెల్గు కొంత దూరానికి మాత్రమే పడుతోంది.
"చలి వేస్తోందా?"
"ఊఁ."
"ణ ఆమాట విని ఇంటికి వెళ్ళి. నేను వెళ్ళి వస్తాను."
"ఉహూఁ."
కాలికి రాయి తగిలి తూల పడబోయింది, మీర.
శాము ఆమె చేతిని పట్టుకుని, "సరే! పద" అన్నాడు.
ఇద్దరూ మౌనంగా నడక సాగించారు.
దూరంలో కుక్క మొరిగిన శబ్దం వినిపిస్తోంది. చెట్లమీద నుండి వినిపిస్తూన్న గుడ్లగూబ అరుపులు నిశ్శబ్ద నిశీధిలో వికృతంగా వినిపిస్తున్నాయ్. సన్నగా వాన జల్లు పడసాగింది.
"ఇంకా ఎంతదూరం?"
"అదిగో వచ్చేశాం."
బోరడి గుడిసెలో కిరిసిన్ బుడ్డి మందంగా వెలుగుతోంది. గుడిసె చాలా చిన్నది. నలుగురు సమంగా కూర్చొనేందుకు సరిపడే ఆ గుడిసెలో బోరడు, అతని పెళ్ళాం, ఎనమండుగురు పిల్లలు నివసిస్తున్నారు.
శాము బయటినుండే "బోరా" అని పిలిచాడు.
"రండయ్యగోరూ" లోపలినుండి పిలిచాడు బోరడు.
మీర, శాము లోపలికి వెళ్లారు. కురచగా ఉన్న ద్వారబంధం మీర నుదుటికి కొట్టుకుంది. మీర అరచేతితో నుదురు రుద్దుకుంది.
"తల వంచుకొని రావాల్సింది" శాము గొణిగాడు.
మీర లోపలికి రాగానే, ఏడుస్తోన్న రాచమ్మ లేచి, చిరుగులచాప తెచ్చి క్రింద పరచింది. మీర చాపమీద కూర్చుంది.
ఆ గుడిసె పైకప్పు కాస్త పొడుగ్గా ఉన్నవారి తలకు తగిలేలా ఉంది. అంతమంది నివసిస్తున్న ఆ గుడిసెకు ఓ కిటికీ కూడా లేకపోవటం చూసి తలుపు మూసేసి వీళ్ళు ఎలా నిద్రపోతారా అని ఆశ్చర్యపోయింది మీర.
బోరడి పెద్ద కొడుకు వయస్సు, పదునాలుగు సంవత్సరాలు. తరువాత రెండేళ్ళకో కాన్పు చొప్పున పిల్లలు కలిగారు. ఒక్క చిన్న గూటిలో నివసించే చీమల్లా జీవిస్తున్నారు వాళ్ళు.
అతని పిల్లల్లో నలుగురు మలేరియాతో బాధపడుతున్నారు. పెద్ద కుర్రైడ్కి పధ్నాలు గేళ్ళు వచ్చినా, ఎనిమిదేళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. చర్మపు పొరలో నుండి కనిపిస్తున్న ఎముకలు, చీపురుపుల్లల్లాంటి చేతులు, కాళ్ళు, తైల సంస్కార మెరుగని గుబురుగా పెరిగిన జుత్తు, బానలాంటి కడుపు అతఃడిని రోగిష్టి అని నిరూపిస్తున్నాయి. పిల్లలు నడుముకు చుట్టుకున్న బట్ట తప్పించి, వంటిమీద వేరే గుద్దన్న మాటే లేదు.
ఇంట్లో నాలుగు మట్టి కుండలు తప్ప, వేరే పాత్రలేమీ లేవు.
