16
ఆనందు వెళ్ళిపోయాక మళ్ళీ మామూలు ప్రపంచంలో మామూలు రొటీన్ లో పడిన కొన్ని రోజులకుగాని సుజాత అదోలా వుండడం కనిపెట్టలేకపోయింది కల్యాణి. తనతో ఎప్పటిలా చనువుగా మాట్లాడకపోవడం, ముభావంగా పని చేసుకోడం గమనించింది. చప్పున ఆ రోజు సంఘటన గుర్తుకు వచ్చింది. సుజాత దృష్టిలో తను దిగజారి వుంటుందన్న విషయం తట్టింది. సుజాత ఎంత కీతం ఇచ్చి వుంచుకుంన్ మనిషయినా, తను ఆమెకేం సంజాయిషీలు ఇయ్యాల్సిన అవసరం లేక పోయినా ఇంట్లో వుంటూ తనకన్నీ అంత అభిమానంగా చేసే సుజాతని అలా పనిమనిషన్న భావంతో దూరంగా వుంచలేదు తను. కనీసం ఏ ఒక్కరి సానుభూతి అన్నా తను సంపాదించుకో గలిగితే తనకే తృప్తిగా వుంటుంది. అందుకని సుజాత దగ్గిర యీ విషయం ప్రస్తావించింది.
"సుజాతా, ఈమధ్య ఎందుకు అదోలా వుంటున్నావు, ఏం వంట్లో బాగుండడం లేదా? పని బాగా ఎక్కువయినట్టుంది. వంట అది కూడా నెత్తిన వేసుకున్నావు."
"అబ్బే అదేం లేదు, పనికేముంది, నాకేం కష్టంగాలేదు" అంది సుజాత.
"మరయితే ఎందుకలా వుంటున్నావు...." కల్యాణి తెలియనట్టే అడిగింది.
సుజాత జవాబు చెప్పకుండా తల దించుకు వూరుకుంది.
"చూడు సుజాతా, నీవు సంతోషంగా, సరదాగా మాట్లాడకాపోతే నా కదోలా వుంటుంది. ఈ యింట్లో సంతోషంగా వుండి నాతో సరదాగా మాట్లాడే మనిషిని నీవే.నీవు కూడా యిలా మూగనోము పట్టి మాట్లాడకపోతే నా కదోలా వుంటుంది. ప్లీజ్, మామూలుగా వుండు...." అంది కళ్యాణి.
కళ్యాణి అలా మాట్లాడుతూ వుంటే సుజాత బిడియపడింది. ఆవిడ తన యజమానురాలు తనని ఆవిడ బ్రతిమిలాడడం ఏమిటి? తను ఆవిడమీద కోపగించడం ఏమిటి? "నాకేం కోపం, మీ మీద నాకు కోపం ఏమిటి?" బిడియంగా అంది సుజాత.
"కోపంకాకపోతే అసహ్యం. సుజాత నిజం చెప్పు.....ఆ రోజు.....అలా నన్ను చూసిం దగ్గరనించి నీకేం అన్పిస్తూంది? నన్నుగురించి ఏమనుకుంటున్నావు నీవు?"
"నేను.....నేనేం అనుకుంటాను..అది మీ వ్యక్తిగత విషయం. మీ యిష్టం...."
"అవుననుకో కాని నా మీద పెంచుకున్న సదభిప్రాయం పోయి వుంటుంది నీకు. ఇదివరకటి అభిమానం, గౌరవం పోయినట్టు నీ మొఖమే చెప్తూంది.....సుజాతా, నీకు తెలియదు. ఆ విషాదం మధ్య ఓదార్పు బావ ఒక్కడే. బావకి, నాకు మధ్య వున్న అనుబంధం నీ కర్ధం కాదు. పెళ్ళయి, పిల్లల తల్లి అయిన నేను అలా పరపురుషుడితో ప్రవర్తించడం చూస్తే నీలాగే ఎవరన్నా అనుకుంటారు. కానీ.....కానీ నన్ను.....నా జీవితాన్ని ఎవరూ అర్ధం చేసికోలేరు." బాధగా అంది కల్యాణి.
సుజాతకి ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి వుంది. కాని ఆ ఆసక్తి మొహంలో కనపరచలేదు. సుజాతకి తన కధ తెలియచెప్పడంలో తన దుర్వ్యధకి కాస్తఅయినా ఉపశమనం ఉంటుందనుకుంది కళ్యాణి. కాని.....ఆ కధ చెప్పడానికి ఇంత తక్కువ వ్యవధా! ఆ కధ చెప్పడం అంటే......జీవితాన్ని తెరిచి చూపడమే-
"సుజాతా, ఓ రోజు సమయం వచ్చినపుడు సావకాశంగా నేను నీకు అంతా చెప్తాను. నా కధంతా విన్నాక అప్పుడు నా గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుందువుగాని, అంతవరకు దయచేసి నన్ను గురించి నీచంగా ఊహించకు. హు.....నా జీవితాన్ని ఎవరన్నా కధగా రాస్తే బాగుండుననుకుంటాను అప్పుడప్పుడు. బావతో కూడా అదే అంటుంటాను. మన జీవితంకంటే నవలకి మంచి యితివృత్తం ఎక్కడ దొరుకుతుంది నవలరాయి అని! అన్నట్టు మా బావ మంచి కవి, రచయిత తెలుసా.....కవేకాదు, మంచి ఆర్టిస్టు! క్రింద డ్రాయింగురూములో యీ రూములో వున్న పెయింటింగ్స్ అన్నీ బావ వేసినవే."
"అరే నాకు తెలియదే. ఈ పెయింటింగ్స్ ఆయనవా? ఎంత బాగున్నాయ్. ఆయన కవి అని తెలియదే. నవలలు, కధలు కూడా రాశారా? ఏమన్నా అచ్చయ్యాయా?" ఉత్సాహంగా అడిగింది సుజాత.
"ఇప్పుడేం రాయడంలేదు బావ. ఆ ఎయిర్ ఫోర్సు ఉద్యోగంలో చేరాక బావలో కవి, ఆర్టిస్టు చచ్చిపోయాడు. ఇదివరకు రాసినవి అచ్చయ్యాయి. సౌందర్యాన్వేషి' అనే కలం పేరుతో రాశాడు. నీకు కావలిస్తే అదిగో ఆ అలమరలో ఉన్నాయి. తీసి చదువుకో ఇంతకీ నేనేం చెబుతున్నాను? నా కధగురించికదూ! నిజంగా ఎవరన్నా రాస్తే నా జీవితం ఓ నవలకు సరిపోయే కధవుంది సుజాతా. ఎటొచ్చీ యీ కధకు ముగింపు ఏమిటో తెలియడం లేదు. సరే మరోసారి సావకాశంగా ఎప్పుడన్నా చెబుతాలే" విషాదంగా నవ్వుతూ అంది కళ్యాణి.
సుజాతకి కాస్త నిరుత్సాహం అనిపించింది. కళ్యాణి మొహంలో గూడు కట్టుకున్న బాధ, ఆవేదన చూస్తే ఆమెమీద సానుభూతి కలిగింది. ఆమెలో ఏదో బాధ వుంది. ఏదో కాకపోతే ఆమె జీవితం ఇలా వక్రంగా ఎందుకుంటుంది? ఎంత పెద్ద కారణం లేకపోతే భర్త, పిల్లలు, పరువు, మర్యాద అన్నీ వున్న స్త్రీ.....ఇలా అందరికీ తెలిసినా ఫరవాలేదన్న నిర్లక్ష్యంతో మరో పురుషుడిని ఎందుకు కోరుకుంటుంది! భర్త అనురాగం, ఆప్యాయత అందితే మరొకరికోసం వెతుక్కోవలసిన అవసరం ఏముంది! కడుపునిండా మృష్టాన్న భోజనం వున్నమనిషి దొంగ తిండికి ఎందుకు ప్రాకులాడుతాడు! .... ఆలోచిస్తుంటే .... ఇన్నాళ్ళూ కళ్యాణి మీద ఏర్పడిన దురభిప్రాయం స్థానే జాలి, సానుభూతి చోటు చేసుకున్నాయి.
