"ఓహో అదటే అమ్మాయ్! మా నాయనమ్మ చెప్పినట్లు చెప్పమంటావా?" కళ్లు పెద్దవి చేసింది అమ్మమ్మ. కావు, నాకలా అనిపించింది.
"అని నేనడగలేదే?" అన్నాను ఆశ్చర్యపోతూ.
"అప్పుడే అడిగావుగదే, మళ్ళీ ఓట్రిస్తావూ?" అమ్మమ్మ దబాయించింది.
"అంటే?" అన్నాను దిమ్మెరపోయి.
"అదే నిలువునా చంపేశావు అనలా." అమ్మమ్మ రెట్టించింది.
"అన్నాను-అంటే?" వెర్రిమొహం వేసి అడిగాను.
"మా నాయనమ్మ కథ చెప్తే విన్నవాళ్ళు అలా నిలువునా చచ్చేంత పర్యంతం అయ్యేదే అమ్మాయ్! మళ్ళీ ఆరునెలలదాకా కథ చెప్పమని అడిగితే ఒట్టు!" అంది అమ్మమ్మ.
"అలా చెప్పి అమ్మమ్మా అంత ఘోరం చేయొద్దు! మీ నాయనమ్మ చెప్పినట్లుగా కాకుండా కొద్దిగానైనా మార్పుచేసి చెప్పు." అని అడిగాను వస్తున్న నవ్వుని ఆపుకుంటూ.
"అది నావల్లకాదే పిల్లా!" అంది అమ్మమ్మ.
"అదేమిటి అమ్మమ్మా!" అన్నాను.
"నాయనమ్మ చెప్పినట్టే చెబుతాను. మార్చి చెప్పి ఆ కథను నా సొంతం చేసుకోవడం నావల్లకాదే పిల్లా!" అంది అమ్మమ్మ అదోలా నవ్వుతూ.
వెనకనుండి అకస్మాత్తుగా ఎవరో కాళ్లు పట్టుకులాగితే బొక్కబోర్లా ముక్కుకు దుమ్మంటేలా కిందపడ్డంత పనయింది నాకు.
"అమ్మమ్మా ఒక సందేహం అడగనా?" అన్నాను ముక్కుకు అంటిన దుమ్మును దులుపుకుంటూ.
"నువ్వు సవాలక్ష ప్రశ్నలు అడుగు. నా సమాధానం ఒహటేనే పిల్లా!" అంది అమ్మమ్మ.
"అయితే సవాలక్ష సందేహాలనూ కుదించి ఒకే ప్రశ్న అడుగుతాలే" అన్నాను.
"ఓ భేషుగ్గా" అంది అమ్మమ్మ.
"చూడు అమ్మమ్మా! మీ నాయనమ్మ చెప్పిన కథ బాగుంటుందా, మీ అమ్మమ్మ చెప్పిన కథ బాగుంటుందా?" అన్నాను.
"ఓసి నీ పిచ్చి దొంగల్దోల! వాళ్లిద్దరు చెప్పిందీ ఒకటే కథ అని నీకు వందసార్లు చెప్పానుగదే?" అమ్మమ్మ ఖాండ్రించబోయి ఊరుకుంది.
వందసార్లు కాకపోయినా వందలో సున్నాలు తీసేసినన్నిసార్లు అమ్మమ్మ చెప్పిన విషయం వాస్తవమే గనుక బాగా తగ్గిపోయి అన్నాను.
"ఐ యామ్ సారీ అమ్మమ్మా! నేను నిన్ను అడిగేదేమిటంటే?" పెద్దగా అన్నాను.
"నాకు చెముడు లేదుగాని అడుగు?" అంది అమ్మమ్మ.
"మరే! అమ్మమ్మా! మీ అమ్మమ్మ కథ చెబితే బాగుండేదా? మీ నాయనమ్మ కథ చెబితే బాగుండేదా?
ఈసారి అమ్మమ్మ నా ప్రశ్నకు వెంటనే జవాబివ్వలేదు. కొంచెం ఆలోచించి అంది "ఆ సంగతి మహా మహా వాళ్ళకే తేలక...." అంటూ ఆగిపోయింది అమ్మమ్మ.
"ఊఁ తేలక" అన్నాను ఆదుర్దాగా.
"తేలక ఆ పరగణాలోని ముఖ్యులంతా కలిసి రాజుగారిదగ్గరకు వెళ్ళారు తేల్చి చెప్పమని" అంటూ ఆగిపోయింది అమ్మమ్మ.
"రాజుగారు ఏమని తేల్చారు?" ఆత్రుతతో అడిగాను.
"రాజుగారికీ తేలక ఆయన తన ఆస్థాన పండితులనందర్నీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఈ విషయాన్ని తేల్చి చెప్పటం కొరకు ఒక రహస్య కమిటీని వేశారు." అంటూ అమ్మమ్మ మళ్ళీ ఆలోచనలో పడింది.
"ఆ కమిటీలో ఎవరెవరున్నారు" అడిగాను.
"ఆ కమిటీలో ఎవరు ఉన్నారో? ఎవరికీ తెలియదు. అది రహస్య కమిటీ అని చెప్పానుగా? అయితే ఆ కమిటీలో వున్నవాళ్ళ పేర్లు మా అమ్మమ్మకూ, నాయనమ్మకూ మాత్రం తెలిసిపోయాయట?"
"అదేమిటీ, అసలు వాళ్ళకే పేర్లు తెలిసిపోతే అది రహస్య కమిటీ ఎలా అవుతుంది?" అన్నాను ఆశ్చర్యంగా.
"ఇదిగో అమ్మాయ్! అడ్డప్రశ్నలు వేయకుండా విను!" కసురుకుంది అమ్మమ్మ. ఈ ముసలిది నన్ను సస్పెన్స్ లో పడేసి బిగుసుకుపోతుందేమోననే భయంతో నోరు మూసుకున్నాను.
"అమ్మమ్మా!" అతి మృదువుగా పిలిచాను.
"ఊఁ" అంది అమ్మమ్మ మహా బెట్టుగా.
"మీ అమ్మమ్మనూ, నాయనమ్మనూ పిలిపించి కథ చెప్పించుకొని విన్నారా కమిటీవాళ్ళు" అడిగాను.
"అలాచేస్తే అమ్మమ్మగానీ, నాయనమ్మగానీ తమమీద ఒత్తిడి తెస్తారేమోనని కమిటీవారి భయం" అంది అమ్మమ్మ సాలోచనగా.
"మరి నిర్ణయం ఎలా చేశారు?"
"కమిటీవారికి హితులయినవారి సలహాలను సేకరించడానికి నిర్ణయించారు. వారు అమ్మమ్మ కథ చెప్పగా విన్నానన్నవారినుంచీ, నాయనమ్మ కథ చెప్పగా విన్నానన్నవారినుంచీ అభిప్రాయాలను సేకరించి కమిటీకి నివేదించుకున్నారు."
"ఏడ్చినట్లుంది?" అనాలనిపించింది. కాని అమ్మమ్మకు కోపం వస్తుందని ఊరుకున్నాను.
"ఊఁ తరవాత?" అడిగాను అమ్మమ్మను.
"కమిటీవారు, తమ హితుల ద్వారా అందిన నివేదికమీద అహోరాత్రులూ చర్చించీ, మధించీ, కుదించీ చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చీ, రాజుగారి దగ్గరికెళ్ళి తమ నిర్ణయాన్ని వినిపించి ఆయన సలహాను అడిగారు."
"అదేమిటి మళ్ళీ రాజుగారిని సలహా అడగటం ఏమిటి?" ఆశ్చర్యపోతూ అడిగాను.
"మరి రాజుగార్ని అలహా అడక్క నిన్నూ నన్నూ అడుగుతారా? ఆ కమిటీ రాజుగారు వేసిందేగా?" విసుక్కుంది అమ్మమ్మ.
"చివరకు మీ అమ్మమ్మ గెలిచిందా? నాయనమ్మ గెలిచిందా?" ఆదుర్దాగా ఊపిరి బిగపట్టి అడిగాను.
"నువ్వే చెప్పు చూద్దాం?" అమ్మమ్మ ఆవులించింది. కళ్ళుమూసుకుంది.
అమ్మమ్మను చిటికెనవేలుమీద గిరగిరా గిరగిరా తిప్పి గాల్లోకి విసరాలనిపించింది.
"నేను చెప్పటం ఏమిటి నా తలకాయ? సస్పెన్సుతో చంపక చెప్పు?" అన్నాను.
"సస్పెన్సులేని కథేమిటే? నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా రేపు ఏదో సభలకు వెళ్ళాలంటున్నావుగా వెళ్ళి పడుకో!" అంటూ అమ్మమ్మ నులకమంచానికి అడ్డంపడి ముసుగు తన్నిపెట్టింది.
"అమ్మమ్మోయ్ నా కథ. నా కథ?" అన్నాను ఆదుర్దాగా.
"నీ కథ అయితే నువ్వే చెప్పుకోవే? మద్య నేనెందుకు" గురక పెట్టింది అమ్మమ్మ.
* * * *
