పశువూ ! మనిషీ!
రంగయ్యగారి ఎల్లావు తొలిచూలు నిండి కోడెదూడను పెట్టింది.
ఆరోజు ఇల్లంతా పండగలా హడావుడిగా వుంది. రెండురోజులు ఎల్లావు ఇంటిదగ్గిరే వుంది.
మూడోరోజున చినజీతగాడు ఎల్లావును మిగతా గొడ్లతోపాటు బీట్లో మేపుకొని రావటానికి వదిలాడు.
తొలి ఈత బిడ్డమీద మమత తీరని ఎల్లావు దూడను వదిలి వెళ్ళలేక, చావిట్లోకీ దొడ్లోకీ కదం తొక్కుతూ మారాం చేసింది.
కాని జీతగాడు తన్ను వదిలి వెళ్ళాడని తెలుసుకున్నాక అన్ని గొడ్లకంటే ముందుగా బీట్లోకి నడిచింది.
పొద్దు వాటారింది. గొడ్లకాడ బుడ్డోడు బీటుకు అల్లంతదూరాన ఉన్న నల్ల చెర్లోకి పశువుల్ని తొలి, చెరువుగట్టుమీద చింతచెట్టుకింద బాచీపెట్లు వేసుకొని అన్నం మూట విప్పుకున్నాడు. కొరివికారం పచ్చడితో కలిపిన అన్నం ముద్దల్ని గబగబా ఉసిళ్ళు తోలుతూ తినటంలో మునిగిపోయాడు జీతగాడు.
చెర్లోదిగి, నీళ్లు తాగి, చల్లని నీటిలో తుళ్ళుతూ పొర్లుతూ, జలకాలాడుతోన్న ఎల్లావుకు దూడ గుర్తొచ్చింది.
పొదుగు జివజివలాడింది. అంతే! అక్కడలేచిన ఎల్లావు, చెరువుకట్ట దూకి, పుట్టదాటి, కొండ వదిలి మగాటిచేలకు అడ్డం పడింది.
గుండెల్లో బిడ్డమీది మమకారం మసులుతోంటే, జివజివ లాడుతోన్న పొదుగులో పాలు కదులుతోంటే మెడ కింద గంగడోలు అల్లల్లాడుతోంటే, పట్టుకుచ్చుల తోక పైకెత్తి, మోరచాచి, ఉరకలు వేస్తూ, నురగలు కక్కుతూ, చెంగు చెంగున పరుగులు వేస్తూన్న ఎల్లావుకు, ఈనకాచిన పిల్లిపెసర చేను తన గిట్టలకింద నలిగిపోతోందన్న సంగతి తెలియదు- బాణా కర్రతో ఎల్లమంద ఎదురునిల్చి నడిచేలో నిలేసేదాక!
గుండెలు పడిగిలిన పసిబిడ్డ తల్లి రివ్వున వెనక్కు మళ్ళింది. మళ్ళీ పరుగు లంకించుకొనే లోపున ఎల్లమంద చేతుల్లో వున్న పలుపు ఎల్లావు మెడకు చుట్టుకుపోయింది.
పల్లపుసాగు సన్నరైతు ఎల్లమందకు ఎగువసాగు మోతుబరి రైతు రంగయ్య అంటే మహాకసి. చేనుతడిచే నీళ్ళు అందినా, కిందటేడు ఆసామి రంగయ్య చప్పున నీళ్లు వదల్లేదని అగ్గిబుగ్గయిపోయాడు. రంగయ్యమీద కసి తీర్చుకొనే అదును దొరక్క మరీ మండిపోతున్నాడు లోలోపలే.
తన పంటచేనుకు అడ్డంపడి అల్లిబిల్లి తిరుగుతున్న రంగయ్యగారి ఎల్లావును చూసేసరికి యల్లమందకు అరికాలు మంట నెత్తికెక్కినట్లయింది. యల్లమంద ఎల్లావును దొరకపుచ్చుకున్నాడు.
ఇంత కాలానికి చిక్కాడు రంగయ్య తనచేతిలో! దొరికిన అదును పోగొట్టుకోకూడదు! ఆవును బందెలదొడ్లో పెట్టేస్తే సరి!
ఉన్నఊళ్ళో పాడి ఆవును బందెలదొడ్లో పెట్టిస్తే నలుగురూ చివాట్లు వేస్తారని భయపడ్డాడు యల్లమంద. అలోచించి కోసెడు దూరాన వున్న గోపాలపురం తోలుకెళ్ళి, ఎల్లావును బందెల దొడ్లో పెట్టించి హాయిగా గాలి పీల్చుకున్నాడు. ఏదో ఘనకార్యం చేసినవాడిలా ఛాతీ విరుచుకుంటూ, భుజాలు ఎగరేసుకుంటూ మీసాలు దువ్వుకుంటూ తిరిగి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెం దూరం అయినా చుట్టూ తిరిగి రంగయ్య ఇంటిముందునుంచి వెళ్ళాడు. రంగయ్య దొడ్లో నుంచి వస్తున్న "అంభా!" అనే లేగదూడ అరుపులు ఆనందాన్ని కలిగించాయ్.
ఎల్లమంద ఇంటికి చేరేసరికి ఊరు మాటుమణిగింది.
తడికతోసి, గడప దాటుతోన్న ఎల్లమందను చూడగానే, మూడునెల్ల పసిగుడ్డును వళ్ళో పెట్టుకొని కునుకు తీస్తోన్న ముసల్ది బావురుమంది.
బిడ్డ మధ్యాహ్నంనుంచి మూసిన కన్ను తెరవలేదు. వళ్ళు తెలియని జ్వరంలో మధ్య మధ్య ఉలిక్కిపడుతున్నాడు.
ఎల్లమంద భార్య ప్రసవించిన మూడోరోజున పసికండును ఎల్లమంద చేతుల్లో పెట్టి కళ్లు మూసింది.
అప్పటినుంచీ నాయనమ్మ చేతుల్లో, ఎల్లమంద కనురెప్పలకింద ఆప్యాయంగా సాకబడుతోన్న బిడ్డకు అమాంతంగా జ్వరం ముంచుకొచ్చింది.
భుజాన కండువా అన్నా వేసుకోకుండా ఎల్లమంద అనంతా చార్యులవారి దగ్గరకు పరుగెత్తాడు.
అనంతమైన వ్యాధులకూ, ఆ పొట్లాలమందే ఇచ్చే అనంతా చార్యుల వారు బిడ్డనాడి పరీక్షించారు. నాడి చూస్తూ గంభీరంగా తల ఆడించారు. ఆత్రంగా ఎల్లమంద ఆచార్యులవారి ఆడుతున్న తలను చూస్తూ నిలబడ్డాడు.
గుడ్డసంచి విప్పి తెల్లపొడిని మూడు చిన్న పొట్లాలు కట్టి ఎల్లమందకు అందించాడు.
"బిడ్డ పరిస్థితి గడ్డుగానే వుంది!"
ఆచారి మాటలకు ఎల్లమంద నిలువెల్లా వణికిపోయాడు.
"భయపడకు. ప్రతి మూడు గంటలకూ అరఔన్సు ఆవుపాలలో రంగరించిపోయండి. రాత్రికి గడిస్తే ప్రాణభయంలేదు. పొద్దున్నే వచ్చి ఎలా వుందో చెప్పు!" అంటూ ఆచార్యులవారు వేగంగా నడిచి వెళ్ళిపోయారు.
ఎల్లమంద రెండు క్షణాలు కొయ్యబారిపోయి నిల్చుండిపోయాడు. తన బిడ్డకు ఈరాత్రి గడవాలా? గడవకపోతే? నిలువునా నీరయిపోయాడు ఎల్లమంద.
