Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 26


    "కథంటే ఏమిటో మహా మహా వాళ్ళకే తెలియదు. నీకేం తెలుసే అమ్మమ్మా?" అన్నాను అమ్మమ్మమీద కసితీర్చుకుంటున్నట్లు.
    "కథ అంటే ఏమిటో తెలియకుండా కథ ఎలా చెప్పగలనే నాకు తెలియకడుగుతాను?" అంది అమ్మమ్మ నొసలు చిట్లించి. ఇప్పుడు చిట్లించటం ఏమిటి అవి ఎప్పుడూ చిట్లించే వుంటాయి.
    "అదేమో నాకూ తెలియదు. నీకు చెప్పినా అంతకంటే అర్థంకాదు"
    "తెలియనిదాన్ని గురించి నువ్వెందుకే మాట్లాడుతావు?" అమ్మమ్మ బుసకొట్టింది. అంటే నోట్లోంచి నాసికా రంధ్రాలనుంచీ గాలి వదిలింది.
    "సరే! మాట్లాడనుగాని, నా ప్రాణాలు తోడక కథ చెప్పుమరి!" అన్నాను అమ్మమ్మను బతిమాలుకుంటూ.
    "అట్లా రావే దారికి!" అంది అమ్మమ్మ విజయగర్వంతో. మరచెంబుడు మంచినీళ్లు గటగట తాగాలనిపించింది. మరచెంబుకోసం మంచంకిందకు చూసింది అమ్మమ్మ. అక్కడ మరచెంబు లేదు. ఉన్నా అందులో నీళ్లుండవు. నీళ్లు వున్నా అమ్మమ్మ అసలు అంత గటగట తాగలేదు.
    అమ్మమ్మ దారిలోపడి అమ్మమ్మను ప్రాధేయపడ్డాను. విసిగించక త్వరగా కథ చెప్పమని, అమ్మమ్మ ముసిముసి- అదే. ముసలి....ముసలి నవ్వులు నవ్వుకొని అడిగింది.
    "మా నాయనమ్మ చెప్పినట్టు చెప్పమన్నావా? మా అమ్మమ్మ చెప్పినట్టు చెప్పమన్నావా?" అంది అమ్మ.
    "నీ నస పాడుగాను మళ్ళీ మొదటికొచ్చావ్?" అనుకుంటూ "ఎట్టాగో అట్టా చెప్పి చావవే తల్లీ!" అన్నాను విసుగ్గా.
    "అయితే మా అమ్మమ్మ చెప్పినట్టే చెప్పమంటావన్నమాట. ముందే అట్లా అడగ్గూడదే పిల్లా! ఈ సోదంతా లేకుండా పోను!" సంతోషంగా అంది అమ్మమ్మ. సూదిలోకి దారం ఎక్కించగలిగినప్పుడు అమ్మమ్మకు కలిగే ఆనందమే ఇప్పుడూ కలిగింది అమ్మమ్మకు.
    నాకు అంతులేని ఆశ్చర్యం కలిగింది.
    "మీ అమ్మమ్మ చెప్పిన కథ....అదే మీ అమ్మమ్మ చెప్పినట్టు చెప్పమని నేనెప్పుడడిగానే అమ్మమ్మా!" అన్నాను పూర్తిగా ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే.
    "ఇప్పుడు అడిగావుగాదే తల్లీ! అంతలోకే మతిమరుపా?" అంది అమ్మమ్మ.
    "మతిమరుపూ లేదూ మాట మార్పూ లేదూ. అసలు నేను అలా అడగందే?" అమ్మమ్మ దబాయింపుకు జవాబు అంతకంటే గట్టిగా చెప్పలేకపోయాను.
    "నువ్వు చెప్పిచావమన్లేదా!" అమ్మమ్మ ఉక్రోషంగా అడిగింది.
    "అవునూ చెప్పి చావమన్నాను."
    "అదేమరి! అది మా అమ్మమ్మ చెప్పినట్లు" అంది అమ్మమ్మ ధీమాగా.
    "అంటే?" బుర్ర తిరిగిపోయి అడిగాను.
    "మా అమ్మమ్మ కథ చెబితే తాను చచ్చినంత పని అయ్యేది. కథ చెప్పి మంచానికి అడ్డంపడి ఆరునెలలు తీసుకునేది."
    "ఎందుకూ?" అయోమయంగా ప్రశ్నించాను.
    "మళ్ళీ కథ దొరికేదాకా మంచంమీదనుంచి లేచేదికాదు." అంది అమ్మమ్మ.
    "కథ దొరకటం ఏమిటమ్మమ్మా?" అన్నాను వెర్రిమొహంవేసి.
    "అదేనే పిల్లా? మా అమ్మమ్మకు మరి చదువురాదుగా? అందుకే మళ్ళీ కథ దొరకటానికి ఆరునెలలన్నా పట్టేది.
    "చదువు వస్తే?" ప్రశ్న మార్కు ముఖం పెట్టాను.
    "చదువస్తే కథలకు కరువేంటే అమ్మాయ్. సవాలక్ష కథలు బోలెడన్ని పుస్తకాల్లో, బోలెడన్ని భాషల్లో దొరుకుతాయ్!" అంది అమ్మమ్మ బోసిబోసిగా నవ్వుకుంటూ.
    అమ్మమ్మ గడుసుదనానికి ఆశ్చర్యం వేసింది. నవ్వూ వచ్చింది. అమ్మమ్మ అంటించిన చురక తాలూకు వేడిలో నాకు భాగం వుందేమోనని నాలో నేనే ఉలిక్కిపడ్డాను.
    "అయితే అమ్మమ్మా! మీ అమ్మమ్మ చెప్పినట్లు నువ్వూ కథ చెప్తే నువ్వూ ఆరునెలలు మంచం పడతావా?" భయపడుతున్నట్లు అడిగాను అమ్మమ్మను మాటమారుస్తూ.
    "ఒసే అమ్మాయ్! కోడి ఏం తింటుందే?" అంది అమ్మమ్మ రెట్టించినట్లు.
    "పెసలూ, సజ్జలూ" అన్నాను కోపంగా. అమ్మమ్మా వాళ్ళ అమ్మమ్మ చెప్పే కథలో కోడి పాత్ర ఏమిటో నాకు అర్థంకాక ఒళ్ళు మండిపోయింది.
    "ఇంకా ఏం తింటుంది?" ముసిముసిగా అదే ముసలి ముసలిగా నవ్వుతూ నా ముఖంలోకి చూసింది అమ్మమ్మ.
    "నావల్లకాదు" అన్నాను ఉబికివస్తున్న కోపాన్ని పళ్ళబిగువుతో ఆపుకుంటూ.
    "కాదే అమ్మాయ్! రాళ్ళు." అంది అమ్మమ్మ.
    కోపాన్ని అణచుకునే ప్రయత్నంలో కింది పెదవిని పై పళ్ళతో నొక్కిపట్టాను. మాట్లాడలేదు.
    "కోడి రాళ్ళను తింటుంది. కాని అది వాటిని జీర్ణించుకోలేదు." అంది అమ్మమ్మ.
    "వెధవ సొదా నువ్వూ. నాకర్థం కావటంలేదు. సరిగా చెప్పిచావు" అన్నాను ఉక్రోషంతో.
    "నువ్వు అడిగావు కాదుటే. మా అమ్మమ్మ కథ చెప్పినట్లు నేనూ చెబితే నేనుకూడా మంచం పడతానా అని?" అంది అమ్మమ్మ విసుక్కుంటున్నట్లు.
    అమ్మమ్మ చమత్కారి అని నాకు తెలియదు. అమ్మమ్మకు ఇన్ని విషయాలు తెలుసుననికూడా నాకు తెలియదు.
    "కథ చెప్పమంటే నిలువునా చంపేశావు అమ్మమ్మా?" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS