Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 26


    కనకయ్యను రగిలించిన రవ్వ తాటాకుమంటలా అయి ఊరంతా వ్యాపించింది. వీరయ్య వెళ్ళి బలరామయ్యను అడిగాడు. బలరామయ్య నిజమనేసరికి వీరయ్య విరుచుకుపడ్డాడు. ఆ సాంబయ్యతో వియ్యమందితే బలరామయ్య గుమ్మం ఎక్కనని వీరయ్య శపథం చేశాడు. బలరామయ్య కుదురులోవాళ్ళందర్నీ పోగుచేసి వీరయ్య మీటింగులాంటిది పెట్టాడు. ఇంత పరువుతక్కువపని చేయడానికి, ఇవ్వాళ తాము ఒప్పుకొంటే రేపు తమ ఆడపిల్లలు ఏమౌతారని ప్రశ్నించాడు వీరయ్య. మన ఫాయీ కుదురూ, ఇమ్త్య్పెరును బట్టి ఇన్నాళ్ళు తమకుదక్కిన గౌరవం ఇహ మట్టిలో కలిసిపోతుందన్న భయన్నీ, ఆందోళననీ వ్యక్తం చేశారు బలరామయ్య బంధుకోటిలోని ముఖ్యులు. బలరామయ్య పెత్తాత కొడుకైన రామభద్రయ్యను బలరామయ్య దగ్గరకు ఆకహరి ప్రయత్నంగా పంపించడానికి నిశ్చయించారు.
    సాంబయ్యతో వియ్యమందటం ఏ కోశానా మంచిదికాదనీ, అది జరిగాక తాము తలెత్తుకు తిరిగే పనిలేదనీ రాంభద్రయ్య బలరామయ్యకు సలహా ఇచ్చాడు. బలరామయ్య సాంబయ్యతో వియ్యమందబోతున్నాడనేది ఊరంతా తెలిసిపోయాక, నిండామునిగినవాడికి చలేమిటన్న మనస్తత్వంలో పడిపోయాడు బలరామయ్య. పైగా వాళ్ళను వెనకేసుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. సాంబయ్య తనకు కాబోయే వియ్యంకుడు. వెంకటపతి తనకు కాబోయే అల్లుడు. వాళ్ళను కించపరిచే మాటలంటుంటే బలరామయ్య తననే అంటున్నట్టు బాధపడ్డాడు.
    "గురిగింజ తన నలుపు ఎరగదట! మీది మీరు చూసుకోండి! మీ సలహా సహాయం మాకేం వద్దు" అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పాడు బలరామయ్య. లోలోపల కుళ్ళిపోతూనే పైకి బింకంగా వుంటూ, తను కానిపని ఏదీ చెయ్యటం లేదన్నట్లు ప్రవర్తించసాగాడు. ఒకరో ఇద్దరో మాత్రం "పాపం, బలరామయ్య బతికిపోయాడు. అంతకంటే మంచి సంబంధాలు ఎక్కడ తెస్తాల్లే!" అని సానుభూతి చూపించకపోయినా సర్దిచెప్పుకొన్నారు- బలరామయ్యపని ముళ్ళమీద నడుస్తున్నట్లుంది. ఈ పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అనుకొన్నాడు. కనకయ్యకోసం మనిషిమీద మనిషిని పంపాడు. కాని కనకయ్య అంతులేడు. ఊళ్ళో తనకు అనుకూలంగా ఉండే ఒకళ్ళిద్దర్నీ కదిలించి చూడమన్నాడు. బలరామయ్య తనతో వియ్యమందటానికి తహతహలాడుతున్నాడనే సంగతి సాంబయ్యకు సవివరంగానే తెలిసింది. మనిషి ఎక్కడా తొణక్కుండా బెట్టుగా వున్నాడు.
    "ఏం సాంబయ్యా? కొడుకు పెళ్ళి చేస్తున్నావటగా?" అని అడిగిన వాళ్ళకు "అవును! ఈ ఏడు చెయ్యాలనే వుంది" అని సాగదీసి సమాధానాలు ఇస్తున్నాడు సాంబయ్య.
    బలరామయ్య తాలూకు పెద్దమనిషి ఒకరు పొలం వెళ్తూన్న సాంబయ్యకు ఎదురై అన్నాడు:
    "సాంబయ్యా, మేం విన్నమాట నిజమేగా? ఇంకా ఆలస్యం ఎందుకు, మంచిరోజు చూసి లగ్నాలు పెట్టుకోవచ్చుగా?"
    సాంబయ్య ఆ మనిషిని ఎగాదిగా చూచి బలరామయ్య తరఫునుంచే మాట్లాడుతున్నాడనీ అర్ధం చేసుకొన్నాడు.
    "మంచీ చెడ్డా చూడాలిగా? అన్నీ కలిసిరావాలిగా?" అన్నాడు.
    అవతల పెద్దమనిషి ఇరుకునపడిపోయాడు. సాంబయ్య ధోరణి అంటీఅంటనట్టుగా తోచింది. ఇక ముసుగులో గుద్దులాట లాభంలేదని, అభిమానాన్ని చంపుకొని బయటపడ్డాడు:
    "బలరామయ్యగారి అమ్మాయిని మీవాడి కిస్తామంటే కళ్ళకద్దుకొని చేసుకోవచ్చు. ఇంకా ఆలోచన కూడానా?" అన్నాడా పెద్దమనిషి.
    "కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాల్సింది బలరామయ్య. కళ్ళకద్దుకోవాల్సిన  ఖర్మ నాకేం పట్టింది? కో అంటే కోటి సంబంధాలు వస్తాయి మా వెంకటపతికి" అని మీసాలు దువ్వుకుంటూ చివాల్న కదిలి కిర్రుచెప్పుల మోత చేస్తూ వెళ్ళిపోయాడు సాంబయ్య.
    సాంబయ్య ధోరణి చూసిన పెద్దమనిషికి నడ్డిమీద కొట్టినట్టయింది. ఇది అయ్యేదీకాదు పెట్టేదీ కాదు అనుకొన్నాడు. అతని అనుమానం రూఢిఅయిన వార్తగా ఊళ్ళో వ్యాపించింది. ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్లయింది బలరామయ్య పని. తనతో వియ్యమందటానికి కూడా సాంబయ్య సంశయిస్తున్నాడనేది బలరామయ్య భరించలేనిదే అయింది. సాంబయ్యతో వియ్యమందటానికే సగంచచ్చిన బలరామయ్య, ప్రవర్తనతో పూర్తిగా చచ్చినట్టు అయిపోయాడు.
    ఇదంతా ఆ కనకయ్యగాడు ఆడిన నాటకమేనా? ఉన్న పరువు తీశాడు. పరువు చెడ్డా ఫలితమూ దక్కలేదు. కనకయ్యగా డెందుకు ఇలా చేశాడు? వాడికేమొస్తుంది? సంబంధం మాట్లాడిన మరుసటిరోజే ఈ ఊళ్ళోనుంచి మాయమయ్యాడు. వారంరోజు లయింది. ఎందుకు ముఖం తప్పిస్తున్నాడు? ఇది తన పరువు తీయటానికి సాంబయ్య కనకయ్య కలిసి ఆడిన నాటకమా? ఈ పెళ్ళి జరక్కపోతే తన కూతురు బతుకేం కాను? సాంబయ్య కొడుకు వెంకటపతికే చేసుకోనిదాన్ని ఎవరు చేసుకొంటారు? ఇహ ఎలాంటి సంబంధాలు వస్తాయి? నలుగుర్లో చులకనయ్యాడు. వంశం, హోదా బుగ్గిపాలయింది. అయినవాళ్ళలో అలుసయిపోయాడు.
    బలరామయ్య గుండెలు కుతకుతలాడిపోతున్నాయ్. రోజూ కనకయ్యకోసం ఎదురు చూస్తున్నాడు. జీతగాడ్ని కనకయ్య ఇంటిముందే కాపలా పెట్టాడు.
    కనకయ్య ఊళ్ళోకి వచ్చాడని జీతగాడు చెప్పడం ఆలస్యంగా బలరామయ్య కనకయ్య యింటికి బయలుదేరాడు.
    స్నానం చేసి మొలపంచ కట్టుకున్నాక కనకయ్యకు బలరామయ్య పిలుపు వినిపించింది.
    "అయ్యో! తమరే వచ్చారా? మీ ఇంటికే బయలుదేరబోతున్నా!" ఒక్క దూకులో కనకయ్య బలరామయ్య ముందుకొచ్చి అన్నాడు. చింతనిప్పులా మెరుస్తోన్న బలరామయ్య కళ్ళు కనకయ్యను తేరిపార చూశాయి. ఓపక్కన కనకయ్య గుండెల్లో గుబులు చుట్టాలు చుట్టుకొంటున్నా ధైర్యంగానే పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
    "రండి! ఇలా కూర్చోండి" అంటూ బలరామయ్యకు కుర్చీ చూపించి తను నిలబడే మాట్లాడాడు. బలరామయ్య కనకయ్య యింటికి రావడం ఇదే మొదటిసారి. కాకితో కబురు పంపితే వచ్చి వాలిపోయే కనకయ్య ఇంటికే తను రావాల్సివచ్చినందుకు ఖిన్నుడైపోయాడు. అతనిలో అంతవరకూ ఉన్న ఉద్రేకం, కోపం చల్లారినయ్. మనిషి నీళ్ళుకారిపోతున్నాడు. ఏం మాట్లాడటానికి మనస్కరించక అలాగే కనకయ్యకేసి దిగులుగా చూస్తూ కూర్చున్నాడు.
    కనకయ్యకు కవచమైన లౌక్యపు పొరలు విచ్చిపోసాగినయ్. బలరామయ్యను చూస్తుంటే కనకయ్య మనసు నిజంగానే ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లినట్లనిపించింది! ఇంకా కొద్దిసేపువుంటే కంటనీరు పెడతాడేమోననిపించింది. వెంటనే సంభాషణ ప్ర్రారంభించాడు:
    "ఆ సాంబయ్య కట్నం అడుగుతున్నాడు కట్నం!"
    "కట్నమా? కట్నాలూ, కానుకలూ ఇచ్చే పరిస్థితిలో వుంటే వాడికొడుక్కు నా బిడ్డనిస్తానా?" బలరామయ్య ఆక్రోశించాడు.
    "పైగా ఏం అడిగాడో తెలుసా? మీ కాడిగట్టు పొలం పద్దెనిమిదెకరాలు ఇవ్వాలట! చేలో చేను కలిసిపోతుందట!" కనకయ్య బుర్ర చురుకుగా పనిచెయ్యసాగింది. బలరామయ్య గతుక్కుమన్నాడు.
    "అది తాకట్టుకింద వుందనికూడా చెప్పావా?"
    "రామ రామ! ఏమిటలా మాట్లాడుతారు? నే చెప్తానా? అది మనిద్దరిలోనే వుంచా ఈనాటివరకు."
    "అయితే ఏం చెప్పావ్?"
    "ఆ పొలం బలరామయ్యగారి బొందిలో  ప్రాణం వుండగా మరొకరికి ఇవ్వడం జరగదు. వంశ పారంపర్యంగా వస్తున్న భూమిలో ఆయనకు మిగిలిందదే. ఆయన తదనంతరం చిన్నమ్మాయికే ఇస్తారు, అని చెప్పాను."
    కనకయ్య మాటల్ని శ్రద్దగా విన్న బలరామయ్య "నా తదనంతరం పొలం ఇస్తానంటే సాంబయ్య ఒప్పుకొంటాడా?" అని అడిగాడు.
    "ఒప్పుకుంటే ఈ తిప్పలంతా ఎందుకు? అట్టా పొలం ఇవ్వని పక్షంలో ముఫ్ఫైవేలు రొక్కం ఇవ్వమన్నాడు."
    "ముఫ్ఫైవేలా! నే నెక్కడ తెచ్చేదీ?"
    "మీ సంగతి నాకు తెలియందేముందీ? అందుకేమరి నేను వారంరోజులుగా ఇంత హైరానా పడుతూంది? ఇరవైవేలు పుట్టించడానికి నా తాతలు దిగొచ్చారు" అని ఊపిరి పీల్చుకున్నాడు కనకయ్య.
    బలరామయ్య అప్పుడే చీకట్లోనుంచి వెలుగులోకి వచ్చినవాడిలా కళ్ళుచిట్లించి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS