"ఈ లెక్కలో నువ్వు పాటలు చెప్పి ఈయన రాసుకోవడానికి ఒంటిగంట అయిపోయేలాగుంది. సరోజా! నువ్వీపని చూసుకో నేను వెళ్ళి నా పాట సంగతి చూసుకుంటాను. మధ్యాహ్నం ఇక్కడే ఈయనతో కలసి పాటలు చెక్ చేద్దామ"ని చెప్పి వెళ్ళిపోయారు.
ఇబ్రహీం గారికి భాష తెలీకున్నా, ట్యూన్ కి సరిగ్గా పదాలు పడడం వల్ల 'ఆహా', 'ఓహో', అంటూ తెగ ఆనందించేస్తూ రాసుకుంటున్నారు.
ఒక్కొక్కసారి రాయడం, ఒకసారి హార్మనీ మీద చూడడం.....ఇలా గడుస్తోంది టైం.
ఒంటిగంటన్నర అయిపోయింది. శ్రీశ్రీగారు వచ్చారు. "పాటలన్నీ రాయడం పూర్తయిందా, లేదా?" అని అడిగారు.
"ఇంకా మూడు పాటలు, రెండు పద్యాలు బాకీ వున్నాయండి" - అన్నాను.
"ఎందుకింత సేపయ్యింది".
"ఏం చెయ్యనండి. ఈ మ్యూజిక్ డైరెక్టర్ మీ పాటలన్నీ తెగ మెచ్చేసుకుంటూ, మధ్యలో అర్దాలు అడుగుతూ రాసుకునేసరికి తెల్లారిపోతుందేమోననుకున్నా - ఫరవాలేదు మరొక రెండు గంటల్లో మోక్షం దొరకవచ్చు" అని వాళ్ళకి తెలుగు తెలియదుకదా అన్న ధైర్యంతో అన్నాను.
శ్రీశ్రీగారు చాలా తమాషాగా నవ్వుతూ -
* * *
భానుమతికి శ్రీశ్రీ సమాధానం
"కారు వుంది. ఇంటికి పోదాం రండి" - అన్నారు.
"వద్దండి. మే మీపూటకి ఇక్కడికే భోజనం తెప్పించుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి, భోంచేసి కొంతసేపు రెస్ట్ తీసుకోండి. మూడు గంటలకి కారు పంపమంటాను. మీ రొచ్చేలోగా పాటలు పూర్తిచేసి మేం సిద్దంగా ఉంటాం" - అన్నాను.
"నీ యిష్టం. నేను వెళ్ళొస్తాన"ని వెళ్ళిపోయారు.
ఈ పాటలు పూర్తిచేస్తేకాని భోజనం చెయ్యొద్దని మ్యూజిక్ డైరెక్టర్, నేనూ అనుకున్నాం.
మా పాటలు పూర్తవడానికి రెండున్నర అయ్యింది. క్యారేజ్ తెప్పించుకుని భోజనాలు చేశాం.
ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ రూమ్ లో కూర్చొని నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడేసుకుంటున్నారు.
"పని పూర్తయితే కానీ విడవడం లేదు సార్! చాలా ఓపిగ్గా కూర్చుంటున్నారు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతారు" - అని అనుకుంటున్నారు.
నేను మాత్రం మాకిచ్చిన గదిలోనే కూర్చున్నాను.
ఒక్కర్తినే వుంటే, అవకాశం తీరిక దొరికినప్పుడల్లా 'అరవ మాటలకి తెలుగు పదాలు ఎలా పడ్డాయి? ఏ అరవ మాటకి ఈ తెలుగు మాట ఉపయోగించారు? లిప్ ఎలా పడింది?' - అని స్క్రిప్ట్ పేజీలు తిరగేస్తూ నాలో నేనే, మాటలు లిప్ కి కంపేర్ చేస్తూ కూర్చునేదాన్ని.
ఆ రోజు కూడా ఆ పనే చేస్తున్నాను.
అప్పడియా ఎంగే
తప్పకుండా ఎక్కడ
తప్పదా ఎలా
చెప్పండి దేనికి
- 'ఈ విధంగా సీక్వెన్స్ ని బట్టి మీనింగ్ వెయ్యాలి' అనుకుంటూ, నాలో నేనే మాట్లాడుకుంటూ కూర్చున్నాను.
అమ్మ అలవాటు ప్రకారం మా ఆఫీసు ముందు వీధి వరండాలో కూర్చుంది.
శ్రీశ్రీగారు ఎప్పుడొచ్చారో ఎంతసేపయిందో నాకు తెలీదు. అయన ముఖంలో చాలా అప్రిషియేట్ చేస్తున్న భావం బాగా కనిపించింది.
"ఒక్కర్తివీ కూర్చున్నావేం?".
"ఏం చెయ్యమన్నారు?".
"వాళ్ళంతా అక్కడ కూర్చున్నారుగా?"
"వాళ్ళతో కలిసి నన్ను కూడా హస్కు కొడుతూ కూర్చోమంటారా?"
"తప్పా?"
"ఒక విధంగా తప్పేనండి. మన మీద ఏ మాత్రమైనా గౌరవం అంటూ వుంటే అది మన చేతులారా చెడగొట్టుకున్న వాళ్ళమౌతాం. మగవాళ్ళకి ఫరవాలేదు. ఆడవాళ్ళకింకా అంత స్వాతంత్ర్యం ఈ ప్రపంచం ఇవ్వలేదు.
పని చేస్తున్నంత సేపూ సరదాగానే మాట్లాడుతున్నాను, అదిచాలు ఏదైనా లిమిట్ లో వుంటే అందరికీ మంచిది కదా!" అన్నా.
"మరి నాతో మాత్రం ఎందుకలా పోట్లాడతావు?"
"మీకు, వాళ్ళకి ఒకటే నేమిటి? అదీకాకుండా మీ దగ్గర పనిచేస్తున్నాను. మీ మాటలు, మూడ్స్ వల్లే మీతోనయినా పోట్లాడవలసివస్తోంది. లేకుంటే నాకుమాత్రం సరదా ఏమిటి?... సరేకానీ, భోంచేశారా, లేదా?"
"చేశాను"
"స్నానమో?"
"ఏం చేసినట్టు లేదా?"
"రిప్లయి ఇవ్వడంలో నా గాలి తగిలినట్టుందే" - అని నవ్వాను.
"అయినా ప్రతీ ఒక్క విషయానికి ఇలా పట్టుకున్నావేమిటి?"
"పక్కనే కూర్చోవలసి వస్తూందిగా! కంపు బాధ భరించలేక". కావాలని అన్నమాటే అది. రోజూ అదో పల్లవిలా పాడుతూ వుంటే నా బాధ పడలేకైనా రెగ్యులర్ గా స్నానం చేసి బట్టలు మారుస్తాడేమో అని అవస్థ.
"పాటల సంగతి చూద్దామండీ, ఇప్పుడు కూర్చుంటే రాత్రి తొమ్మిది గంటలైపోతుంది. వాళ్ళు మీనింగులూ, లిప్ లూ బాగా చూస్తున్నారు" అన్నాను.
"సరే"
"నేనే వెళ్ళి "శ్రీశ్రీగారు వచ్చేశారు. రమ్మన"మని మ్యూజిక్ డైరెక్టర్ ని పిలిచాను. ప్రొడ్యూసర్లూ, ఇబ్రహీం గారు, మేమూ కూర్చున్నాం.
మా అమ్మకి సంగీతమన్నా, పాటలన్నా మహా ఇష్టం. వరండాలోనుండి హాల్లోకి వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంది.
పాటలు చెక్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్లు అర్ధం అడిగినచోట, నాకు అరవ భాష బాగా వచ్చినందువల్ల వాళ్ళకి చెపుతున్నాను.
మొత్తం పాటలు, పద్యాలు ఫైనలైజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ కి అప్పగించి, 'ఓ.కె' అనిపించేసుకున్నాం.
రాత్రి తొమ్మిది గంటలైంది. 'ఈ పిక్చర్ ముప్పావువంతు అయిపోయినట్టే' - అనుకుంటూ ఇళ్ళకి చేరుకున్నాం.
* * *
ఆ నెల్లాళ్ళ పరిచయంలో శ్రీశ్రీగారి సంగతులు కొన్ని మాత్రం బాగా అర్ధం చేసుకున్నాను.
ఆయన తలచుకుంటే కొండల్ని పిండి చెయ్యగలరు. మూడ్ వస్తే ముల్లోకాలు మునిగిపోతున్నా తన లోకం, తన పనే తప్ప రెండోది పట్టించుకోరు.
తనని ఎవరైనా కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ఎంత కోపమో చెప్పడానికి లేదు.
ఒళ్ళుమండి, మొండికేస్తే మాత్రం తానుగా మళ్ళీ దారికి రావాలేకానీ ఎవ్వరం ఏమీ చెయ్యలేం. బడాయిలూ, గొప్పలు, గర్వం, అహంభావం, అహంకారం......ఇవన్నీ ఏ కోశానా కనపడవు.
పూర్తి నిరాడంబరంగా వుంటూ, ఎవ్వరేమన్నా పట్టించుకొని తత్వం ఆయనిది. చచ్చినా మనం ఎవ్వరం అలా వుండలేం.
చిరాకు, కోపం అన్నవి సాధారణంగా వుండవు. అది కోపం అనుకుంటే పొరపాటేమో అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి శ్రీశ్రీగారి కోపం ఎలా వుంటుందోనని ఆలోచిస్తే, 'నా నుదుటి మీద గాయం మచ్చుకి ఆనవాలుగా మిగిలిందిలే' అనుకుంటాను.
ఏ విషయమూ పట్టించుకోకపోవడం, మతిమరుపు మనిషిలా కనిపించడము.....ఇవన్నీ చూస్తే, అవి వారి స్వభావంలోని వస్తువులేకానీ మరేమీ కాదు.
ఆయనకు మతిమరుపు లేనేలేదు. అందులోకి, రెండు చుక్కలు పడితే గతమంతా, ఏ టు జెడ్ దాకా, మన దగ్గర వల్లె వేస్తారు. వారిజ్ఞాపక శక్తికి జోహార్లే.
ఏమైనా సరే, - ఎన్ని అవాంతరాలు వచ్చినా, మనల్నీయన ఎంత పరీక్ష చేసినా, నీటికి ఎదురీత అంటారు కానీ, శ్రీశ్రీగారికి ఎదురీత ఈది జీవితంలో నిలబడాలి.
'ఈ పనా, ఆ పని - ఇక్కడా, అక్కడా' అని అన్నిటిలో కాలు పెట్టి, చివరికి ఎందులోనూ నిలకడలేకజీవితం పాడుచేసుకునేకన్నా ఒకే లైనులో ఉండడమే మంచిదనుకున్నా - ఇలా ఆ రాత్రంతా ఆలోచన్లతో గడిపాను.
* * *
మర్నాడు ఆఫీసుకు వెళ్ళేసరికి పిళ్ళైగారు ఎదురొచ్చి, "శ్రీశ్రీగారూ! భానుమతిగారి పాట రికార్డింగ్ రేపేనండి. ఆమె రేపే పాడేస్తానని చెప్పారన్నారు.
"మీరు ఎవరి పాట ఎప్పుడు రికార్డ్ చేసినా నాకేమీ అభ్యంతరం లేదు. మేం రడీ, మాటలు, పాటలు అన్ని పోర్షన్లతో సహా సిద్దంగా ఉన్నాయ"న్నారు.
