"మైడియర్ యంగ్ కపుల్...ఎవరైనా ఒకే గిఫ్ట్ యిస్తారు ఏ జంటకైనా నేను రెండు గిఫ్టులు విడివిడిగా యిస్తున్నాను. ఎందుకే తెలుసుకోవాలంటే...ముందుగా గిఫ్ట్ ప్యాక్లు మీరు విప్పాలి..." అన్నాడు.
ఇద్దరూ గిఫ్ట్ ప్యాక్లు విప్పి ఆశ్చర్యపోయారు. తాజ్ మహల్ సగభాగం ప్రనూష చేతిలో, సగభాగం శ్రీచరణ్ చేతిలో వున్నాయి.
ఈ గిఫ్ట్ ప్యాక్ ల స్పెషాలిటీ యిదే. ఈ రెండింటినీ జాయింట్ చెయ్యాలి. ఈ రెండింటినీ ఒక దగ్గరికి చేర్చి....సరిగ్గా ఒకదానిలో ఒకటి ఇన్ సెట్ చేస్తే తాజ్ మహల్ తయారవుతుంది. భార్య భర్తలు కలిసివుంటే తాజ్ మహల్లా అందంగా వుంటారు, విడిపోయి వుంటే, ముక్కలైన తాజ్ మహల్లా అందవికారంగా కనిపిస్తారు. సగం తాజ్ మహల్ ని మీరూహించగలరా? అందుకే మీకీ గిఫ్ట్ ఇచ్చాను.
మీరిద్దరూ కలిసిమెలిసి తాజ్ మహల్ లా వుండాలి. తాజ్ మహల్ కి ఎంత పేరుందో, మీ జంటకి కూడా అంతటి పేరు రావాలి. అందరూ మెచ్చుకోవాలి.
ఇలాంటి తాజ్ మహల్ ఢిల్లీలో ఏరికోరి తెచ్చాను శ్రీచరణ్ కోసం. మీ పెళ్ళికి నేను రాలేకపోయినా, ఈ గిఫ్ట్ అందించగలుగుతున్నాను. రెండు పీసుల తాజ్ మహల్ ని, మా శ్రీచరణ్ ని జాగ్రత్తగా చూసుకోమ్మా" అన్నాడు ప్రనూషతో.
"శ్రీ...మీ ఇంటికి వెళ్ళి....ప్రేమగా ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ, ఈ తాజ్ మహల్ ని ఒకటి చేయండి. హాలులో షోకేసులో కాకుండా, బెడ్రూంలో "లైఫ్ టైమ్" పీస్లా వుంచండి.
యిట్స్ మై హంబుల్ రిక్వెస్ట్..." అన్నాడు యం.డి.
ప్రనూష మనసు చెమర్చింది ఒక్కసారి.
శ్రీచరణ్ కూడా అదే అనుభూతికి లోనయ్యాడు.
సడన్ బ్రేక్ తో స్కూటర్ ఆపాడు.
తూలి పడబోయి "ఏయ్..నీ స్కూటరు నడపడం కూడా రాదా!? అంది కోపంగా ప్రనూష.
'స్కూటరు నడపడం వస్తుంది కానీ, ఎదురుగా చూసుకుని నడపకపోతే.... తెలుస్తుంది..." కోపంగా అన్నాడు శ్రీచరణ్.
ఓ గేదె స్వేచ్చగా నడిరోడ్డుపైకి వచ్చి నిలబడింది. సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది.
అనవసరంగా అంటున్నానేమో!" అనుకొంది ఓ క్షణం ప్రనూష.
ఇంటికి రాగానే బద్దకంగా వొళ్ళు విరుచుకుంది ప్రనూష రెండు చేతులూ పైకి ఎత్తి.
ఒక్కఉదుటున వెళ్ళి చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు శ్రీచరణ్.
కానీ మొహమాటంగా ఆగిపోయాడు.
నైటీ అలమారులో నుండి తీసి బాత్ రూమ్ లోకి వెళ్ళింది మార్చుకుందామని పొద్దున్న సీను గుర్తొచ్చి.
నైటీ తీసుకుని బయటకొచ్చిన ప్రనూషని ఓరగా చూసి "ఫర్లేదు. కనీసం మోడ్రన్ గా నైటీ వేసుకోవడమైనా తెలిసింది." మనసులో అనుకున్నాడు.
ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.
ఏం మాట్లాడాలో..ఎలా ప్రొసీడవ్వాలో తెలియట్లేదు.
శ్రీచరణ్ ఇంటి ముందు తలుపేసి బోల్టు పెట్టి వచ్చాడు.
ఓర కంటితో శ్రీచరణ్ నే గమనిస్తోంది ప్రనూష.
"ఇక పడుకుందామా?" అడిగాడు శ్రీచరణ్.
ప్రనూష గుండెల్లో రాయిపడింది.
ఏంటీ...?" అడిగింది అయోమయంగా.
పడుకుందామా?" అని అడిగాను. తెలుగులోనే కదా అడిగింది. దీని కింత ఓవర్ ఎక్స్ ప్రెషన్ అవసరమా?"
"ఎక్కడ పడుకుందాం?" కన్ ఫ్యూజన్ గా అడిగింది.
"పక్కింట్లో....సుబ్బారావు భార్య పక్కన నేను. ఎదురింటి పాపాయమ్మ మొగుడి పక్కన నువ్వు.... సరేనా....ఏంటా పిచ్చి ప్రశ్న....మనింట్లో మనం మన మంచాల మీద పడుకుంటాం..." అన్నాడు.
"నేనా....ఇక్కడ చస్తే పడుకోను" అంది మొండిగా ప్రనూష.
"ఓస్....అంతేనా....అయితే వెళ్ళి హాలులో పడుకో....హమ్మయ్య. నేను నీ దగ్గరే పడుకుంటానని ఎక్కడ బ్రతిమిలాడుతావోనని హడలిచచ్చా...."
'అబ్బో.....నువ్వో జగదేకవీరుడివి....నేనో అతిలోక సుందరిని....నీ పక్కనే పడుకుంటానని దేబరించాల్సిన అవసరం నాకేం లేదు...అయినా మనం రేపో, మాపో విడిపోవాల్సిన వాళ్ళం..." అంది ప్రనూష.
"అవును కదూ....రేపో, మాపో ఎందుకు? ఇప్పుడే విడిపోదాం..." అన్నాడు శ్రీచరణ్.
"ఇప్పుడా? అదెలా?" అడిగింది ప్రనూష. 'ఈ రోజు నుంచి ఛ...ఛ...నిన్నట్నుంచే మనం భార్యాభర్తలం కాదు. జస్ట్ ఫ్రండ్స్ గా వుందాం...."
"అంటే..."
"సంవత్సరం వరకూ విడాకులు దొరికే ప్రసక్తి లేదు. చట్టపరంగా మనం విడిపోవాలన్న ఒక్క సంవత్సరమైనా ఆగాలి...అదీగాక, ఇప్పుడే విడిపోతే, ఇటు మా ముసల్దీ, అటు మీ ఛాదస్తపు అమ్మానాన్నలు లబోదిబో మంటారు. ఈ సంవత్సరం పాటు చచ్చినట్టు మొగుడూ, పెళ్ళాలుగా నటిద్దాం..."
"ఇదేదో బాగానే వున్నట్టుందే." అంది ప్రనూష.
"హమ్మయ్య....ఎక్కడ నన్ను వదిలేయొద్దని నా కాళ్ళా వేళ్ళా పడతావేమోననుకున్నా..." అన్నాడు తేలిగ్గా శ్రీచరణ్.
"నాకంత ఖర్మేం పట్టలేదు. నువ్వు కాకపోతే ఏ రాజకుమారుడో...
"అవునవును గుర్రంశాల దగ్గరికి వెళ్ళి, ఎవడో పిచ్చాడు కత్తి కొనుక్కొని, గుర్రం ఎక్కి, నిన్ను తీసుకెళ్తాడు' వళ్ళు మండిఅన్నాడు శ్రీచరణ్.
"ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్" అంది పళ్ళు బిగువున కోపం అణచుకుంటూ.
"ఓ....కె....నీ బిజినెస్సు నీది. నాకేం పోయింది కంకర పా..." అన్నాడు శ్రీచరణ్.
"ఏంటీ..."అడిగింది అతను చివర అన్న 'కంకర పా' పదం అర్ధం గాక.
"ఏదో ఒకటి తిప్పల పా. నీకెందుగానీ... మనం ఈ క్షణం నుంచి ఓ అగ్రిమెంటుకు వద్దాం..." అన్నాడు.
"అలాగే..." అంది ప్రనూష.
"రెండు సింగిల్ కాటు....రెండు గదుల్లో వేద్దాం.... నీ పడక నీ గదిలో, నా పడక నా గదిలో...రాత్రిపూట మన పడకలు వేరే...నువ్వు ఎటూ ఖాళీనే కనుకవండిపెట్టు....అఫ్ కోర్స్.... నేను తినిపెడతా..."
"ఏంటీ.....నేన్నీకు వండిపెట్టాలా? నేనేం నీ వంట మనిషిని కాదు. ఓ పన్జేయ్... నెలకు వెయ్యి రూపాయలివ్వు. వండిపెడతా" అంది.
"దానికి పది రూపాయలు తక్కువ చేసి తొమ్మిది వందల తొంభై యివ్వు.... నేనే వండిపెడతా.... నా తల్లే.... నీ కంత సీన్ లేదు...అయినా నువ్వేం వండిపెట్టక్కర్లేదు... "టీ"లో కాకరరసం, 'కర్రీ లో చక్కెర వేసే టైప్ వి నువ్వు....నువ్వు వేరే వండుకో." అన్నాడు శ్రీచరణ్.
థాంక్స్ రేపే ప్రయివేట్ గ్యాస్ తెచ్చుకుంటా...అన్నట్టు మా అమ్మవాళ్ళిచ్చిన వంట సామాన్లలో సగం నేను తీసుకుంటాను. కావాలంటే కొన్ని నువ్వు తీసుకో..."
"ఆ....బోడి బొచ్చెలు నాకెందుకు? "అన్నీ నువ్వు ఉంచుకో, నేను కొనుక్కుంటాన్లే..." వళ్ళుమండి అన్నాడు శ్రీచరణ్.
