Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 27

 

    
    కాలం గడుస్తోంది. పానకాలు ఆ ఇల్లు ఖాళీ చేసేసి, పెట్టె బేడా పుచ్చుకుని జగన్నాధరావు గారింట్లో, ఔటు హౌస్ లో మకాం పెట్టాడు. రాత్రింబవళ్ళు తన ఎమ్.ఎల్.ఏ ఎలక్షన్లకి పని చేశాడన్న భావంతో జగన్నాధరావుగారు అతనికా ఇల్లు అద్దె లేకుండానే ఇచ్చారు. అంతేకాదు భార్యని పోగొట్టుకున్నాడని జాలి, తనని నమ్ముకుని పడున్నాడన్నా అభిమానమూ రెండు కలిసి అతని మీద ఒక రకమైన వాత్సల్యాన్ని పెంచుకున్నాడాయన. అదీకాక జగన్నాధరావుగారి ఇద్దరు కొడుకులు చదువూ, ఉద్యోగాల వల్ల ఇండియాలో లేకపోవడం, ప్రతి చిన్న పనికి ఎవరి మీదో అధారపడవలసిన పరిస్థితి వల్ల కూడా అతను పానకాలుని ఉపయోగించుకోవడం జరుగుతూ వొచ్చింది. ఉత్తరాలు పోస్టు చెయ్యాలన్న , బ్యాంకు నుంచి డబ్బు తీసుకురావలన్నా , ఇంట్లో ఆడవాళ్ళకి ఏవైనా వస్తువులు కావాలన్నా పానకాలే పలుకుతున్నాడు. దాంతో ఆ ఇంట్లో అతడు కుటుంబ సభ్యులలో ఒకరిలా అయిపోయాడు. బజారుపన్లూ, చెప్పిన పన్లన్నీ చేసి తీరికున్నప్పుడు పిలిచి ఇంట్లో వాళ్ళేవారైనా భోజనం పెడితే తింటాడు. లేకపోతే బజార్లో మళ్ళీ మిరపకాయ బజ్జీల బండీ దగ్గరకి తయారు!
    జగన్నాధరావుగారు పార్టీ పన్లలోనూ, అప్పుడప్పుడు స్వంత పన్లూ , పొలం పన్లలోనూ ఊరేళ్ళడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏం కావలసినా చూసుకోమని జగన్నాధరావుగారు పానకాలుతో చెప్పి వెళ్ళడం వల్ల, పానకాలు విధిగా ఏవో చెప్పిన పన్లు చేస్తుంటాడు. పైగా ఉద్యోగం చెయ్యడానికి బద్ధకం.  చదువుకోవడానికీ బద్దకమే! ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇల్లుండదు తిండుండదు. అదీకాక వీళ్ళింట్లో వుండడం వల్ల, టెలిఫోన్ సౌకర్యం వుంది. తోచనప్పుడల్లా ఇష్టం వొచ్చినంత సేపు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. అంతేకాదు వాళ్ళ మీద వీళ్ళకీ, వీళ్ళ మీద వాళ్ళకీ చాడీలు చెప్పడానికి , వాళ్ళూ వీళ్ళు తగాదా పడుతూ వుంటే ఆనందించడానికి చాలా అనువుగా వుంది. ఏమ్.ఎల్.ఏ గారికి చాలా సన్నిహితంగా వున్నాడు కాబట్టి ఎందుకైనా పని కోస్తాడని చెప్పి, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చే చిన్న చిన్న కనుకలూ విందులూ, ఇతనికి తెగ కాలక్షేపంగా వుందక్కడ!
    కౌసల్య పోయాక ఒకసారి వెళ్ళాడు పానకాలు సుధాకర్ యింటికి. కౌసల్య నగలూ, ఆమె ఆస్తీ విషయాలు ఏవో మాట్లాడబోయాడు. వాటికి తనే హక్కుదారునని చెప్పబోయాడు. కానీ సుధాకర్ అతణ్ణి నోరేత్తనివ్వలేదు. కనీసం కౌశిక్ ని అతడికి సరిగ్గా చూపించడానికి కూడా నిరాకరించాడు. నోటి దురుసుతనంతో దెబ్బలాడి ఏదో సాధిడ్డామనుకున్నాడు కానీ 'కుక్కకాటుకి చెప్పుదెబ్బ' తిన్నట్టు అతనికి తగ్గట్టుగానే సుధాకర్ కూడా సమాధానాలు చెప్పడంతో నోరుమూసుకున్నాడు పానకాలు. అంతేకాదు మరోసారి ఇలా వొచ్చినట్టయితే కౌసల్య రాసిన ఉత్తరాన్ని పోలీసులకి చూపించి , బాబు నేత్తుకుపోవడానికి ఇలా వొస్తున్నావని చెప్పి కేసు పెడతానని బెదిరించాడు సుధాకర్. దాంతో కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు పానకాలు.

                                                      *    *    *    *
    శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి గ్రామంలో ప్రాధమిక పాఠశాల హెడ్ ,మాస్టరుగా పని చేస్తున్నారు కోటేశ్వరరావుగారు. ఆరుగురు ఆడపిల్లలు పుట్టినా, పుత్రుడు లేనిదే పున్నామనరకం తప్పదనుకున్నారో లేక తలకొరికి పెట్టడానికి పుత్రుడు వుండి తీరాలనుకున్నాడో గానీ అయన ఏడవ సంతానానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. పుత్రుడు పుట్టిన సంతోషం ఒక్క పక్క కలిగినా, ఆరుగురు ఆడపిల్లల బాధ్యత వారు పెరుగుతున్న కొద్దీ ఆయనను కుంగదీసింది. అతి కష్టం మీద తన సంపాదనతో, ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసి రిటైరైపోయాడాయన. మూడూ నాలుగూ అమ్మాయిలు పెళ్ళి మీద ఆశ వోదులుకుని ఎలాగో బి.ఏ. వరకూ చదువుకుని ఉద్యోగాల్లో చేరారు. వారి సంపదనే ఇల్లు గడపడానికి కారణమయింది.
    పెద్దల్లుడి గారి ట్రాన్స్ ఫర్ ఏదో కాన్సిల్ చేయించుకోవడానికి వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకుని చివరికి జగన్నాధరావు గారి దగ్గరికి వచ్చారు కోటేశ్వరరావుగారు. ఆ సందర్భంగా కోటేశ్వరరావుగారికి, పానకాలుకు పరిచయమేర్పడింది. మాటల సందర్భంలో అతను ఒంటరివాడని తెలుసుకున్నాడు కోటేశ్వరరావుగారు. దాంతో అతని సంగతంతా కనుకున్నాడు. రెండో పెళ్లయితేనేం? చిన్నవాడేగా? అయినా తనకి అంతకంటే మంచి సంబంధాలు తెచ్చే అవకాశం ఎక్కడుంది? అందుకని మెల్లగా అతనితో విషయాన్ని కదిపి చూశారు. ఆడపిల్ల బాధ్యత వోదిలించుకోవడమే అతని లక్ష్యం, అందచందాలూ, ఆస్తి పాస్తులూ అతడు చూళ్ళేదు. పైగా ఎమ్.ఎల్. ఏ గారి వద్ద ఇంత పలుకుబడి గల వ్యక్తీ అల్లుడిగా దొరకడం తన అదృష్టం అనుకున్నారు. అందుకే తన మూడవ కూతురు ఝాన్సీ లక్ష్మి నిచ్చి పెళ్ళి చేద్దామనుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS