మెల్లగా ఈ విషయం పానకాలుతో అన్నారు. తన ఆకారాన్ని చూసీ మళ్ళీ ఈ జన్మలో తనకి ఎవరూ పిల్లనిస్తారని అనుకోలేదు పానకాలు. అందం, చదువూ, ఆస్తి పాస్తులూ, అన్నీ వున్నవాళ్ళకే ఈ రోజుల్లో ఒక్కొక్కసారి పిల్లలు దొరకడం లేదు. అటువంటిది తనకి ఏ ప్రయత్నమూ, ప్రయాసా లేకుండానే ఒక పెళ్ళే కాదు, రెండో పెళ్ళికి పిల్ల దొరకడం తన అదృష్టం అనుకున్నాడు పానకాలు. కాస్త బెట్టు చేసినా కదనకుండా ఝానీ రాణి మెడలో తాళి కట్టాడు.
భారతదేశంలో పుట్టిన ఎందరు ఆడపిల్లలో సంప్రదాయపు చట్రంలో నలిగిపోతుండడం వల్ల కానీ, ఆర్ధిక చిక్కులతో సతమతమయిపోతూ కట్నాలూ, యిచ్చుకోలేని స్థితిలో వున్న తల్లిదండ్రులు కన్నీళ్ళు చూడలేక రాజీపడి గానీ, వివాహ విషయంలో తమ మనోభావాలని స్వేచ్చగా చెప్పుకోలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లని గుండెల మీద కుంపటిలాగ భావించి, ఎంతసేపూ అబ్బాయికి ప్రాముఖ్యాన్నిచ్చి , అతడికి పిల్ల నచ్చిందో లేదో అనో, ఇచ్చిన కట్న కానుకలు సరిపోయాయో లేదో అనో బాధ పడిపోవడం , బతిమాలడం జరుగుతోందే తప్ప ఆడపిల్ల మనిషే ననీ, ఆమెకీ ఒక వ్యక్తిత్వం వుంటుందనీ ఆలోచించడం లేదు. సరికదా, ఆమెకి ఆ స్వేచ్చని ఇవ్వడం లేదు. అందుకే ఎందరో ఆడపిల్లలు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని, కన్నీళ్ళతో కాపురం చెయ్యడం చూస్తూంటాం పాపం! ఝాన్సీ లక్ష్మికి కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. ఆమె ప్రమేయం లేకుండానే, ఈ దేశంలో ఎందరో అమ్మయిలలాగానే ఆమె పెళ్ళి పానకాలుతో జరిగిపోయింది. అతి సాధారణంగా కానీ కట్నం లేకుండా పలుకుబడి గల అల్లుడిని సంపాదించినందుకు ఉబ్బితబ్బిబ్బయ్యారు కోటేశ్వరరావుగారు.
శోభనం రోజు రాత్రే తెలుసుకుంది భర్త నిజ స్వరూపాన్ని ఝాన్సీ లక్ష్మి. బాధ కలిగించినా మొదటిరాత్రిని మౌనంగా భరించింది. అయితే, కేవలం అది ఆనాటి ఆవేశమేమోనని సరిపెట్టుకుంది . కానీ దాదాపు ప్రతీ సారి అదే ధోరణి చూసేసరికి కొంచెం కంగారుపడింది. అయితే నాలుగు రోజులు పోయేసరికి అతని నిజ స్వరూపం బైటపడింది.
తల్లీ, తండ్రి అందర్నీ వొదిలి, పానకాలుతో కాపురానికొచ్చిన ఝాన్సీ లక్ష్మి , తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలీక, భర్త ప్రవర్తనని మరి భరించలేక, ఒకనాడు అతనితో మొర పెట్టుకుంది. పానకాలు పకపకా నవ్వాడు ఆమె మాటలకి. ఆ నవ్వు ఎంతో అసహ్యంగా జుగుప్సా కలిగించింది ఝాన్సీ లక్ష్మికి. ఆ రాత్రి అతణ్ణి చూసి ఆమె దూరంగా జరిగింది భయంతో. అతి క్రూరంగా, బుగ్గ కొరుకుతూ మీద మీదకొస్తున్న అతణ్ణి ఒక్క తోపు తోసింది. కోపంతో రెచ్చిపోయిన అతడు ఒక్క ఉదుటున లేచి , సిగరెట్టు వెలిగించాడు. గట్టిగా దమ్మ్జులాగి ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళలోని ఎరుపుదనం, మొహంలోని రాక్షసత్వం ఆమెని భయకంపితురాలిని చేశాయి. మంచం మీద నుంచి లేవబోయింది. అంతలోనే అతడు పులిలా మీదబడి, సిగరెట్టు పీకతో తోడమీదా , కాళ్ళ మీదా చురకలు పెట్టాడు. "అమ్మా! అయ్యో! అంటూ ఆమె పెట్టిన కేకలు ఆ నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనించాయి. తప్పితే బయటికి పోలేదు. బాధతో ఇంచుమించు స్పృహ కోల్పోయింది ఝాన్సీ. ఆ అపస్మారక స్థితిలోనే, పశువులా తన తృష్ట తీర్చుకున్నాడు పానకాలు.
తెల్లవారి ఒళ్ళు హూనమై లేవలేకపోయింది ఝాన్సీ.
ఏదో పనుందని చెప్పి ఉదయమే వెళ్ళిపోయాడు పానకాలు.
బాగా పొద్దెక్కాక మెల్లగా లేచి ఒళ్ళంతా తడిమి చూసుకుంది ఝాన్సీ. సిగరెట్టు చురకలకి కాలిన మచ్చలు ఎఱ్ఱగా బొబ్బకట్టి ఉన్నాయి. బుగ్గల మీద కొరికిన గుర్తులు నల్లగా కమిలిపోయి తనని చూసి నవ్వుతున్నాయి. అతని ప్రవర్తనా, మాటలు కడుపులో దేవుతూన్నట్టనిపించింది. వెంటనే అతని తిరిగి ఇంటికొచ్చే లోపల ఇల్లు విడిచి వెళ్ళిపోవాలకుంది కానీ ఎక్కడికి పోతుంది? ఇంకా పెళ్ళి కావలసిన రెండు కుంపట్లు తండ్రి మీద ఉన్నాయి. కనీసం ఒక కుంపటి దించుకున్నాడు గుండెల మీంచి అన్న సంతోషం ఇంకా ఆయనలో పూర్తిగా కలుగకముందే, తను పెట్టె బేడా పుచ్చుకుని తిరిగి వెళితే, అయన భరించలేరు సరిగదా బతకలేరు కూడా. అంతలోనే తల్లి ఉపదేశాలు జ్ఞాపకమోచ్చాయి. "అమ్మా! ఆడదానికి భర్తే దైవం, అతను క్రూరుడైనా, దుష్టుడైనా, కుష్టుడైనా, అతడి పాదాల కిందేనమ్మా ఆడదాని జీవితం. భర్త నోదిలేసిన ఆడదాన్ని సమాజం బతకనివ్వదు. కాకుల్లా పొడిచి చంపుతుంది. ఆ మాటల తూటాలతో చంపబడే బదులు, కట్టుకున్న వాడి పాదాల దగ్గరే పడుండడం పేరు ప్రతిష్టలనైనా తెచ్చిపెడుతుంది. ఆడపిల్ల జీవితం అంతేనమ్మా!" ఈ మాటలే ఆమె తన అక్కయ్యలకీ, తనకీ కూడా చెప్పి పంపించింది. కనుక పుట్టింటికి వెళ్ళడం పొరబాటనుకుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ఏమీ పాలుపోలేదు. మొదటిసారిగా , ఆడపిల్లగా పుట్టినందుకు తనని తాను నిందించుకుంది.
ఇంత విశాల ప్రపంచంలో పశు పక్ష్యదులూ అనేక క్రిమి కీటకాదూలూ ఒంటరిగా, స్వేచ్చగా బతగ్గాలేనిది , ఒక ఆడది ఒంటరిగా బతకలేకపోవడం హాస్యాస్పదంగా తోచింది. ఏది ఏమైనా ఆరోజంతా గజిబిజి ఆలోచనలతోనే గడిచిపోయింది. అతి కష్టం మీద లేచి ఏదో వంట చేశాననిపించుకుంది. బయట చీకటి పెరుగుతున్న కొద్దీ గుండెల్లో గుబులు పుట్టుకొస్తోంది ఝాన్సీ లక్ష్మికి.
