"పోనీ సీమంతానికయినా రా" అంది రాధ.
"చెప్పడం మరిచా. సీమంతం వాళ్ళింట్లో అచ్చిరాదట. నీతో చెప్పలేక నాకు చెప్పారు" అంది కౌసల్య. ఈసారి కూడా రాధ మరి కాదనలేకపోయింది. "సరే తరచు వొస్తూ ఉండు, మేము వచ్చి చూస్తుంటాం" అని చెప్పి రాధ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె తరువాతా కడుపులోని పేగులు చిట్లిపోతాయోమోనన్నంతగా ఏడ్చింది.
* * * *
క్యాలెండర్లో నెలలు తిరిగిపోయాయి. ఈ మూడు నెలల నుంచి తనూ శారీరకంగా, మానసికంగా పానకాలు పెట్టె ప్రతి హింసనీ మూగగా భరించింది కౌసల్య. ఎన్ని పస్తులుందో, ఎన్ని కన్నీళ్ళు రాల్చిందో ఆమెకు తప్ప ఎవ్వరికీ తెలీదు.
ఆరోజు కూడా మాములుగానే పానకాలు టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు జగన్నాధరావు గారింటికి. అప్పటికే కౌసల్యకి కొంచెం నలతగా వుంది. కౌసల్యకి నొప్పులు ప్రారంభమయ్యాయి. పక్కింటి పనిమనిషిని పిలిచి వదినకి కబురు పెట్టింది. గబగబా కాగితం, కలం తీసుకుని ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.
"ప్రియమైన అన్నయ్యకి, ఒదినకి , నమస్కారాలు. మీరు నన్ను కనకున్నా ఎక్కువగా చూసుకున్నారు. కానీ నా దురదృష్టం మీ ప్రేమను నోచుకోకుండా చేసింది. నా పెళ్ళి నా కీవితం అంతా నా ఇష్టం లేకుండా అదొక ఘటనా జరిగిపోయింది. పానకాలు మీరనుకున్నట్టు మారలేదు. నేను పడ్డ చిత్రహింస ఏ ఆడపిల్లా పడకూడదని కోరుకుంటున్నాను. అతడు చాలా తెలివైనవాడు. మాయ మాటలు చెప్పి, ఎలా పెళ్ళి చేసుకున్నాడో, అలానే మాయమాటలు చెప్పి తను మారినట్టు నటిస్తున్నాడు. నన్ను పుట్టింటికి పోకుండా బెదిరిస్తూ మీతో చక్కగా వుంటూ మానసికంగా నన్ను హింసించడమే కాదు- అతని మాటలూ, చేష్టలూ, తిట్టినా తిట్లూ, కొట్టిన దెబ్బలూ అన్నీ నా గుండెని తూట్లు పొడిచేశాయి. జీవితం మీదే విరక్తి పుట్టింది నాకు. బతకాలని ఏ కోశానా లేదు. కాకపోతే ఒక చిన్న మనవి. ఆడవాళ్ళకి ప్రసవం ఒక గండం అంటారు. ఈ గండం నాకు గడవకపోతే ఎట్టి పరిస్థితిలోనూ నా బిడ్డని నా భర్త దగ్గర ఐ. యామ్. సారీ, అలా అనడానికి నోరు రావడం లేదు ఆ శాడిస్టు దగ్గర మాత్రం దయచేసి వొదిలిపెట్టకండి. నా బిడ్డని మీరు పెంచి విద్యాబుద్దులు చెప్పించండి. సారీ, మీకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నందుకు నన్ను క్షమించండి. మరో జన్మ అంటూ వుంటే మీకు బిడ్డగా పుట్టాలని కోరుకుంటాను.
ఇల్టు,
మీ కౌసల్య"
ఉత్తరం పూర్తీ చేసి కవరు అంటించి పెట్టింది. నొప్పులు బాగా ఎక్కువైపోయాయి. ఊపిరి రావడం లేదు. పక్కింటి వాళ్ళు పరుగెత్తుకొచ్చారు. ఆటోని పిలిచి ఆసుపత్రికి తీసికెళ్లారు.
రాధ, సుధాకర్ ఆసుపత్రికి వెళ్ళారు. భరించలేని బాధతో చుట్టుకుపోతున్న కౌసల్య ఒదినని చూసి ఆ ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టి, తను కనేవరకూ చదవొద్దని ఒట్టు పెట్టించుకుంది.
ఆ రాత్రి వరకు కనలేదు కౌసల్య. బిడ్డ కడుపులో అడ్డం తిరిగిపోవడం వల్ల ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్లు. కౌసల్య చాలా వీక్ గా వుంది. కానీ ఆపరేషన్ చెయ్యక తప్పింది కాదు. అర్ధరాత్రి దాటే సమయానికి మగపిల్లాడిని కని కళ్ళు మూసింది కౌసల్య. రక్తం లేకపోవడం, బలహీనం ఆమెని మృత్యుముఖంలోకి తోశాయి.
రాధ కవరు తీసి చదివింది. సుధాకర్ కూడా చదివాడు. ఇద్దరూ కొయ్యబారిపోయారు. "అయ్యో! ఏమయింది కౌసల్యకి? నా బాబెక్కడ? బావగారూ?" అని శోకాలు తీస్తూ వొస్తున్న పానకాలు చెంపమీద చెళ్ళున కొట్టి "యూ బ్రూట్! నా చెల్లిలిని హత్య చేశావు నువ్వు! ఆమె బిడ్డని ముట్టుకున్నవా పోలీసు రిపోర్టిచ్చి లాకప్ లో పెట్టిస్తాను జాగ్రత్త!" అంటూ బాబుని రాధ చేతిలో పెట్టి , మిగతా తతంగం చూసుకోసాగాడు సుధాకర్. గుండె తరుక్కుపోతుంటే పొంగుతున్న దుఃఖాన్ని దాచుకోలేక చేతుల్లో ముఖాన్ని దాచుకుంటూ , కన్నీళ్ళు దిగమింగుకుంటూ అతనితో తను తప్పు చేశానన్న భావం అతణ్ణి దహించేస్తోంది. విడాకులిప్పించేసి ఉంటే కౌసల్య బతికుండేది. తనే సంప్రదాయం ముసుగు తొలగించుకోలేక కాదన్నాడు. ఒక విధంగా నేను హంతకుణ్ణి అనుకుంటూ కుమిలిపోయాడు.
* * * *
కౌసల్య వస్తువుల్ని, నగల్ని అన్నీ వేసుకుపోయాడు సుధాకర్. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ముద్దుల చెల్లెలి కాపురం మున్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోవడం, ఆమె చిహ్నంగా మిగిలిన పసివాడి భారం తమ మీదే పడడంతో కృంగిపోయారు రాదా, సుధాకర్ లు. పానకాలు ప్రమేయం లేకుండా తామే బాబుకి కౌసల్య పేరుని గుర్తు చేసే విధంగా కౌశిక్ అని పేరు పెట్టరు.
