Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 26


    అయితే యీ ఆరోగ్యం యిలాగే ఎన్నేళ్ళు ఉంటుంది.
    తనకేదయినా జరిగి హఠాత్తుగా పోతే స్వప్న ఏమవుతుంది. దూరంగా వెళ్ళిన వారంతా దగ్గరికి రావాలని చూస్తారు. అవకాశం దొరికితే వచ్చేస్తారు.
    అమ్మో!
    ఇంకేమైనా వుందా? ఈ ఆస్తి, యీ ఐశ్వర్యం, ఈ భవనం అంతా రాక్షసుల పాలవుతుంది. స్వప్న ఏకాకి అయిపోతుంది.
    అలా జరిగేందుకేనా తనింత చేసింది.
    తల్లిని తండ్రిని కాదని తనే తల్లీ-తండ్రీ అయిపోయి ఆమెకేనాడూ తల్లీ-తండ్రీ అనే ఊహే రాకుండా చేసి పెంచింది, ఒక్క విషయంలోనైనా అసంతృప్తి కలగకుండా పెంచింది.
    అలాటి స్వప్నని, యింతటి సంపదని ఓ యోగ్యుడి చేతిలో పెట్టి తను కళ్ళుమూసినా తన జీవిత లక్ష్యం నెరవేరి నట్టే! లేదంటే అందరికీ దూరమై అందర్నీ దూరం చేసుకుని యిలా విధుర జీవితం గడిపినందుకు ఫలమేముంది.
    రవి గురించి విశ్వేశ్వరం యిచ్చిన అంచనా సరైందే! తప్పుకాదు. తనూ గమనిస్తూనే ఉంది.
    ఫరవాలేదు. కుర్రవాడు బుద్దిమంతుడు. బాగా చదువుకున్న వాడు, యోగ్యుడు, చాకచక్యం ఉంది.
    అతని చేతిలో ఈ ఆస్తి పెరుగుతుందే తప్ప తరగదు, బాగా మేనేజ్ చేయగలడు. మెల్లిమెల్లిగా వెంకట్రామయ్యకి స్వస్తిచెప్పి అతని స్థానంలో రవిని ఉంచెయ్యాలి."
    ఓ నిర్ణయానికి రాగానే ఆమెమనస్సు నెమ్మదించింది.
    శాంతంగా సుఖంగా మంచంపై వాలిపోయింది.

                                        18

    పెళ్ళివారి గుంపులా, కన్నెపడుచు కోకిలా రావంలా బిలబిలా దిగేరు అంతా కార్లలోంచి. డ్రైవరు మణి తనకి తోడుగా మరో డ్రైవరును తెచ్చుకున్నాడు. అందరూ తోటముందు దిగేరు.
    అది చాలా పెద్దతోట. చుట్టూరా కాంపౌండ్ పైన తీగకంచె. గోడకి మధ్యగా పెద్దగేటు, గేటుపై ఆర్చీ-ఆర్చీ జాజిమల్లెల తీగె, మధ్యన ఎలక్ట్రిక్ బల్బులు అలంకరించిన అందమైన నగిషీ అక్షరాలు "ఎలమావి తోట!"
    ఊటీలోలా చల్లబరిచే ఎత్తయిన మామిడిచెట్లు, కొబ్బరిచెట్లు యింకా అందాన్నిచ్చే అశోకాలు ....రకరకాల చెట్లు కంచెచుట్టూతా అన్నీ కొబ్బరిచెట్లే.
    గేటుదాటి అంతా అడుగుపెట్టేరు. తోటంతా శుభ్రంగా ఉంది, ఎప్పటికప్పుడు చెత్తా చెదారం ఎత్తేసి శ్రద్దఉన్న మనిషి తోటమాలి.
    అందరూ తోటకి ఓ చివరిఉన్న బంగళా దగ్గర వెళ్ళేరు. అది చాలా రోజులనాడు కట్టించినా చాలా అధునాతనంగా ఉంది. దానికి దగ్గర్లోనే బావి, పంపుసెట్లు ఉన్నాయి. అలాటి బావులు తోటలో నాలుగున్నాయి.
    "భలే! సినిమా సెట్టింగులా ఉంది. బాపూ లాంటి డైరెక్టరు చూస్తే యిందులో సినిమా తీసేస్తారు!" అంది కిరణ్.
    "నిన్ను హీరోయిన్ చేసి!" వెంటనే అందుకుంది గీత.
    "ఆగీత మాకు లేదులే!" వెంటనే బాణం వదిలింది సౌందర్య.
    "మరెవరికుందంటావ్?" అడిగింది వినయ.
    "నీలాగా వినయం వందనం ఉన్న అమ్మాయికే ఛాన్సు!"
    "ఊహుఁ కిరణ్. బాపూగారి దృష్టి నీలాటి పెద్ద పెద్ద కళ్ళున్న అమ్మాయిల మీదే పడుతుంది."
    "ఏంటర్రా గోల!" విసుక్కుంది స్వప్న.
    "ఈ మహారాణి తనని వదిలేశారేమోనని దిగులుగా ఉంది.' ఫక్కుమన్నారంతా గీత మాటలకి.
    అయితే స్వప్న ఉడుక్కోలేదు. తోటమాలిని కేకేసింది. అయితే అప్పటికే అమ్మాయిగారి రాక తెలుసుకున్న మాలి శివయ్య పరుగు పరుగున వచ్చాడు.
    "ఇదిగో శివయ్యా! మేం యీ రోజంతా యిక్కడే ఉంటాం. అనవసరమయితే రాత్రి ఉండి ఉదయం వెళతాం! బంగళా శుభ్రం చేయించి, ఆ డైనింగ్ రూంలో మేం తెచ్చుకున్న సామాను సర్ధించు."
    వినయంగా చేతులు కట్టుకుని "పొద్దుగాలే నా బిడ్డ బంగళా అంతా సుబ్బరం సేసిందమ్మా! పెద్దమ్మగారు మీర్రాక ముందే రాత్తిరి ఫోనుకోట్టారు గదా! మాలచ్చిని దగ్గరుండి అంతా సరిచేయించింది. ఇదిగో! ఛనంలో మీ సామానంతా సర్దేస్తాను" అన్నాడు శివయ్య. అన్నవెంటనే సామాను ఒక్కొక్కటి లోపలికి చేరవేయసాగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS