Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 26


    అతన్ని చూస్తేనే భయంతో వళ్ళు జలదరిస్తుంది సృజనకి.
    ఉస్మాన్ సృజనవైపు నవ్వు మొహంతో చూసాడు.
    "ఈ అమ్మాయ్ పాట బాగాపాడుతుంది అహల్యక్కా! నిన్న విన్నా నేను!"
    అతనిమాటలు వినగానే ఆశ్చర్యం కలిగింది సృజనకి. తనని మంచిచేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనబడుతున్నాడు ఉస్మాన్.
    ఎందుకు?
    అప్పుడు ఆ క్షణంలో మొదటిసారిగా అర్ధం అయింది సృజనకి---
    ఆ ఇంట్లో మేడం అహల్య.
    ఆమేడం అభిమానాన్ని చూరగొన్న అమ్మాయితను. తనని నెత్తిమీద పెట్టుకుంటోంది అహల్య. ఆ స్టేటస్ ఆ ఇంట్లో తనకి తప్ప మరెవ్వరికీ లేదు.
    పచ్చి రక్తం తాగే ఉస్మాన్ కూడా తనని చూసి బెదురుతున్నాడంటే అదే కారణం!
    అది తలుచుకోగానే మొట్టమొదటిసారిగా తన దుఃఖం కొద్దిగా మరుపుకి వచ్చింది సృజనకి.
    పవర్ లో వుండే థ్రిల్ ఏమిటో ప్రప్రథమంగా రుచి తెలిసింది తనకు. కసి తీర్చుకోవడంలో కొంతమందిలో కొంతమందికి కలిగే సంతోషం ఏమిటో స్వానుభవంలోకి వచ్చింది.
    ఉస్మాన్ మొహంలోకి నిర్నిమేషంగా చూసింది సృజన. కొద్ది క్షణాల తర్వాత అక్కడ ఆమెకి ఉస్మాన్ కి బదులు రాఘవులు కనబడడం మొదలెట్టాడు.
    తన బతుకుని బండలుచేసిన రాఘవులు!
    పట్టలేనంతకసితో ఆమె పెదిమలుబిగుసుకుపోయాయి.
            
                                           6
    
    సృజన ఆ ఇంటికి వచ్చాక మొదటినెలచాలా మెల్లగా గడిచినట్లనిపించింది.
    రెండోనెల మామూలుగానే గడిచిపోయింది.
    రోజురోజుకీ ఆ ఇంటి వాతావరణం మెల్లమెల్లగా అలవాటయి పోతోంది సృజనకు. ఆ ఇంటికివచ్చిన మొదట్లోవింతగా, వికృతంగా అనిపించిణ మాటలూ, చేతలూ, చప్పుళ్ళూ ఇప్పుడంతఇదిగా అనిపించడంలేదు. ఎవరెవరో ఆ ఇంటికి రావడం, వచ్చినవాళ్ళని ఆకర్షించడానికి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిలు వెకిలి చేష్టలు చేస్తూ తాపత్రయపడడం, వాళ్ళు ఎంచి ఎంచి ఒక అమ్మాయితో కలసి గదిలోకి వెళ్ళడం----
    ఇవన్నీ ఇదివరకు కలిగించినంత వికారాన్ని కలిగించడంలేదు ఇప్పుడు. సాధారణమైన దృశ్యాలుగానే కనబడుతున్నాయి.
    మార్కెట్లో మాంసం దుకాణం లాంటిది ఈ కొంప. మాంసం దుకాణానికివచ్చిన కస్టమర్సు కొంతమంది మేకమాంసంకావాలంటారు. కొంతమంది వేటమాంసం (గొర్రెపొటేలు) కావాలంటారు. పలురకాల చేపలు కావాలంటే పక్క అంగడికి వెళతారు. కోళ్ళు, పుంజులుకావాలంటే ఎదుటికొట్టుకి వెళతారు. బేఫ్ (గొడ్డుమాంసం) కొనేవాళ్ళకోసం కొంతదూరంలో మరో దుకాణం వుంది. పోర్క్ (పందిమాంసం) కావలసిన వాళ్ళు అటువైపు ఉన్న కోల్డ్ స్టోరేజికి వెళతారు.
    అక్కడ మాంసంతో వ్యాపారం!
    ఇక్కడామాంసంతోనే వ్యాపారమే.
    ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఒకడికి రాధిక మాంసం రుచి! మరొకడికి మాధవి మాంసం మీద మక్కువ!!
    ఎవరికి ఏది కావలసివస్తే దాని ధర చెల్లించి కొనుక్కుంటారు. అంతేగానీ ఇక్కడికి వచ్చేవాళ్ళెవరూ ఇక్కడున్న వాళ్ళెవళ్ళనీ మనుషులుగా చూడరు. ఆలోచిస్తూ, పరధ్యానంగా మెట్టుదిగి వచ్చింది సృజన. బయటికిటికీ ప్రక్కన రబ్బర్ కన్ డోమ్స్ రెండు కనబడ్డాయి.
    ఇదివరకు వాటిని చూస్తే పుట్టలోంచి బయటికి వచ్చినపిల్లతాచులని చూసినట్లు వళ్ళుకంపరమెత్తేది.
    ఇప్పుడు తనకి అలాంటికంపరం కలగడం లేదు. కానీ చిరాకుతో నొసలుచిట్లించి, టైంచూసుకుంది.
    అయిదున్నర అవుతోంది.
    అడుగుల చప్పుడు వినబడింది. చురుగ్గా అడుగులేస్తూ వస్తున్నాడు సుబ్రహ్మణ్యంగారు.
    ఆయనకూడా మొదట్లోలా ఉదాసీనంగాలేడు. ఇప్పుడు తనకు అనుకోకుండా దొరికిన ఈ శిష్యురాలు వజ్రపు తునక అని ఆయనకు అర్ధం అయింది. ఈ వజ్రపు తునకతన శాయశక్తులా సానబెట్టాలి. ధగధగ మెరిసే కోహినూర్ వజ్రంలా తయారుచేయాలి. చేసి ప్రపంచానికి ప్రదర్శించాలి.
    అందులో ఉంది ఆనందం!
    తనవిద్యను తగినవాళ్ళకి ధారాదత్తం చెయ్యడంలో ఉన్న తృప్తిని అనుభవిస్తున్నాడు ఆయన ఇప్పుడు. సుబ్రహ్మణ్యంగారికి ఇన్నాళ్ళనుంచి వెలితి వుండేది.
    తనకువయసు ఉడిగిపోతోంది.
    తనజీవితకాలంలో గుర్తింపుకురాని తన విద్య తనతోబాటే అంతరించిపోతుందేమోనన్న నిస్పృహ ఆవరిస్తున్న సమయంలో.
    అందిస్తే అల్లుకుపోగల ఈ శిష్యురాలు దొరకడం.
    అసంభవం అనుకున్నది సంభవం అయింది.
    సుబ్రహ్మణ్యంగారు రావడం చూసి తివాచీ పరిచింది సృజన. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
    కండువాతోమొహం తుడుచుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం" ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేమమ్మా? వీళ్ళంతా ఏరీ?"
    "ఏమోనండీ!" అంది సృజన. ఆ మాట అంటుండగానే ఆమెకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో ఎవరూ లేరనీ, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందనికూడా గమనించలేదాతను?"
    అంటే వీళ్ళ కన్ను గప్పి ఏమార్చి పారిపోవాలనే ఆలోచనే అడుగంటిపోయిందా తనకు?
    ఇప్పుడు ఈయన మాటలు అలాంటి ఆలోచనలని మళ్ళీ తట్టిలేపుతున్నాయి.
    "ఏమ్మా పాఠం మొదలెడదామా?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    ఆయనమాటలు పట్టించుకోకుండా తెరిచి ఉన్న వీధితలుపువైపు ఆరాటంగా చూసింది సృజన. తర్వాత సుబ్రహ్మణ్యంగారి మొహంలోకి వెదుకుతున్నట్లు చూసింది. మళ్ళీ చటుక్కున తలుపువైపుకి పోయాయి ఆమె చూపులు. ఏదో చెప్పడానికి నోరుతెరిచి తటపటాయిస్తూ ఆగిపోయింది.
    అది గమనించాడు ఆయన.
    "ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా తల్లీ?" అన్నాడు ప్రోత్సహిస్తూ.
    సంకోచంగా అంది సృజన "మాస్టారూ?"
    "చెప్పమ్మా!"
    బెదురుచూపులు చూస్తూ అంది సృజన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS