"అన్నానండి అయ్ గారూ!" కొండ చేతులు కట్టుకుని చెప్పాడు.
లోకేశ్వరరావుని కొండ ఇప్పుడు బాస్ అనకుండా అయ్ గారూ అనడం శీతల్ గ్రహించింది.
"నేను వూళ్ళో లేను కదా! నీవు ఒంటరిగా బయటికి వెళితే నీకేదన్నా ఆపదవస్తే వెంటనే ఏం చేయాలో వీళ్ళ కెలా తెలుస్తుంది! నేనేచెప్పాను వీళ్ళతో శీతల్ ని ఒంటరిగా బయటికి వెళ్ళనీయకండి అని..." లోకేశ్వరరావు ఉన్నమాటని కాస్త మార్చిచెప్పాడు.
"నేనేమి పిచ్చిదాన్ని కాను అంకుల్! మనిషిని తోడు తీసుకుని బయటికి వెళదామనుకున్నాను. సరేలెండి మీరు వచ్చారు. ఇంక భయపడాల్సింది ఏమీ లేదు. మీతో బోలెడు విషయాలు మాట్లాడాలి" అంది శీతల్ తనగదిలోకి దారితీస్తూ.
"కొండా! నీవు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి" అంటూ కొండ కర్ధమయేలా కనుసౌంజ్ఞచేసి ఆమెతోపాటు గదిలోకి నడిచాడు లోకేశ్వరరావు.
"మమ్మీని చూసి వారం అయింది. చాలాదిగులుగా ఉంది అంకుల్. ఓసారి మమ్మీని మీరు యిక్కడికి తీసుకురా కూడదా!" ఆమె సోఫాలో కూర్చుంటూ అడిగింది.
ఎప్పుడో అప్పుడు ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని లోకేశ్వరరావుకి బాగా తెలుసు. ప్రశ్నలు, జవాబులు సిద్దంగానే పెట్టుకున్నాడు. "నిన్ను ఇక్కడికి తీసుకురావడమే పెద్ద రిస్క్ తో కూడిన పని. మీ మమ్మీనికూడా తీసుకువస్తే పెద్ద గోలయిపోతుంది. పోనీ ఒక పని చెయ్యి" అన్నాడు లోకేశ్వరరావు.
"ఏమిటది?"
"నేను క్షేమంగా అంకుల్ దగ్గర ఉన్నాను. నాకోసం వర్రీ కావద్దు. మీరు నాకు బలవంతానా పెళ్ళిచేయాలని చూశారు. నేను నా ఫ్రెండ్స్ తో నాటకం ఆడి మీ నుంచి పారిపోయి వచ్చాను అంటూ యేదో ఒకటి తోచింది రాయి. ఆ లెటర్ ని నేను మీ ఇంటి అడ్రస్ కి మమ్మీ పేరున పంపిస్తాను."
"గుడ్ ఐడియా అంకుల్! మమ్మీమీద దిగులు పెట్టుకుని ఏదేదో ఆలోచించానుగాని ఇంత మంచి ఐడియా మిస్ అయాననే ఆలోచనే లేకపోయె. ఈరోజే నేను లెటర్ తయారుచేస్తాను" శీతల్ చిన్నపిల్లలా సంతోషపడినట్లు అంది.
"అలాగే" అన్నాడు లోకేశ్వరరావు.
శీతల్ కి తెలుసు, లోకేశ్వరరావు లెటర్ ని పోస్టు వెయ్యడు అని. తను ఆడేది నాటకమే కాబట్టి ఆమె కంగారు పడలేదు. వాడి వేలుని వాడి కంట్లోనే పొడుచుకునేట్లు చేయాలని వుంది. తనని ఎందుకు ఎత్తుకు వచ్చాడు. చూచాయగా కూడా ఇంకా అర్ధంకాలేదు. అర్ధం వుంటే ఎత్తుకి పై ఎత్తు వేయవచ్చు అనుకుంది ఆమె. మొత్తానికి చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నది.
"అంకుల్"
"ఊ"
"నాదో చిన్న కోరిక తీరుస్తారా?"
"అడిగి చూడు"
"తీరుస్తానంటేనే అడుగుతాను."
"అది కోరరాని కోరిక అయితే!" కాస్త ఆలోచించి ముందుచూపుతో అడిగాడు లోకేశ్వరరావు.
"చాలా తేలికైనది"
"తేలికైనది అయితే తీరుస్తాను."
"పెళ్ళి పందిట్లోంచి తప్పించి నన్ను తీసుకువచ్చారు కదా! ఆ తర్వాత అక్కడేం జరిగింది. ఆ...తర్వాత... ఇప్పటిదాకా మా ఇంట్లో ఏం జరిగింది. తెలుసుకోవాలని వుంది. వివరం నాకు కావాలి అంకుల్! యీ కోరిక తీరుస్తారా?"
"ఓస్! ఇంత చిన్న కోరికా! తప్పక తీరుస్తాను. ఇంకేదో అని భయపడ్డాను. రేపే విచారించి వివరం నీ కదిస్తాను" తేలికపడ్డ మనసుతో అన్నాడు లోకేశ్వరరావు.
"థాంక్స్" అందామె.
ఆ తర్వాత ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
"అంకుల్! నాకిక్కడ అన్ని సౌకర్యాలు వున్నాయి. కాని, భలే బోర్ కొడుతున్నది. నీతో నన్ను తీసుకెళ్ళి తిప్పకూదదా?"
"తిప్పొచ్చు కాని, ఇప్పుడే బయట తిరిగితే మీ వాళ్ళు చూస్తే..."
"వాళ్ళు చూసేటట్టు మనం తిరుగుతామా ఏమిటి?
"నిజమేలే, మరి నీకు మారువేషాలు వేయడంవచ్చా?"
ఆమె ఆ మాట వింటూనే కిల కిల నవ్వింది.
"ఇదేమన్నా డిటెక్టివ్ నవలా లేక క్రైమ్ పిక్చరా మా యింట్లో నేను రకరకాల వేషాలు అంటే డ్రస్ లు వేసుకున్నానుగాని మారువేషాలు వేసుకోలేదు."
"మారువేషం వేసుకోకుండా బయటికెలా వెళ్ళడం అలా కుదరదే" లోకేశ్వరరావు ఆలోచిస్తూ అన్నాడు.
"మారువేషం అంటే గడ్డాలు, మీసాలు అంటించు కోవాలి. ఏ అరబ్ షేక్ వేషమో వేయాలి. పోనీ నేను అంటే ఎలాగో అలా వేసుకోవచ్చు. స్వరం మార్చి మాట్లాడడం నాకు రాదే?" రవంత విచారంగా అంది శీతల్.
'ఈ పిల్ల గారాబంగా పెరిగింది. తెలివికలదే కానీ ప్రపంచజ్ఞానం బొత్తిగా లేనిది. ఇదీ ఒకందుకు మంచిది అనుకున్నాడు లోకేశ్వరరావు.
"ఒక్క పదిరోజులు ఓపికపట్టు శీతల్! దీనికేదయినా ఉపాయం చూస్తాను" అన్నాడు లోకేశ్వరరావు.
"పదిరోజులు దేనికి అంకుల్?" ఏమీ తెలియనట్టు అడిగింది.
"ఈ పదిరోజులూ చాలా బిజీగా ఉంటాను. ఈ లోపల మీ మమ్మీకి లెటర్స్ రాస్తుండు. అక్కడ విషయాలు విచారించి ఆ వివరాలు నీకు అందిస్తుంటారు సరేనా?"
