Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 25

 

    మరో పెగ్గు తనే గ్లాసులో పోసి వీర్రాజుచేత తాగించి అక్కడికి చీకటికి చెవులుంటాయన్న పద్దతిలో చుట్టూ అలుముకున్న చీకటిలోకి ఓ మారుచూసి, చెప్పడం కొనసాగించాడు రాయుడు....." ఈ రాఘవెవరనుకున్నారు? మీ ఉదయ్ కు యూనివర్సిటీలో స్నేహితుడు. తెలివైనవాడు. ప్రస్తుతం పెద్ద బ్యాంక్ ఆఫీసరు మాత్రమే కాదు. బుద్దిమంతుడైన అబ్బాయి కూడా. ఈ బుద్ది బెంటింక్ ప్రభువుల కాలం నుంచి ఉందా అని మీరు నన్ను అడిగితే అవునూ అంటాను. ఎందుకంటే తమరి ముత్తాతలాగే రాఘవ ముత్తాత కూడా బ్రిటిష్ వాళ్ళతో మాంచి సంబంధ భందావ్యాలు నెరసినవాడు. సతీసహగమనాన్ని నిషేధించడంలో రాజా రామ్మోహనరాయ్ తో కలిసి పోరాడ్డం మాత్రమే కాక, లార్డ్ బెంటింక్ ఆ విషయంలో సహకరించేట్టు బలమైన ఒత్తిడి తెచ్చి ఒప్పించాడు కూడా. ఆ విషయం నిజానికి రాఘవకి తెలిదు! అంతగా చదువుకోని వాళ్ళ బామ్మకే తెలీదు" చాలా ఒడుపుగా విషయాన్ని బుర్రకేక్కిస్తున్న రాయుడుకు తను చెప్పింది నిజమే అని నిరూపించుకునే ఆధారాలు లేవు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. "అలాంటి విషయాలు నికేలా తెలుసు రాయుడు అని మీరు నన్నడిగితే ఖచ్చితంగా భోజరాజు పేరే చెబుతాను. ఎందుకంటే ఈ విషయాలన్ని సేకరించింది ఆయనే కాబట్టి. అందుకే తన రెండో కూతురు రజనిని రాఘవకు కట్టబెట్టాలని ప్రయత్నించాడు కాబట్టి."


    "నిజమా?" అబ్బురంగా చూశాడు వీర్రాజు. "మరలాంటప్పుడు రాఘవకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లెందుకు రాయించాడు?"


    "రాయించింది రాఘవకు వ్యతిరేకంగా కాదు. మీ అమ్మాయికి, మీకు అవమానకరంగా. అలా అయితే తన పేరూ వాడుకున్నందుకు రాఘవకు కోపం రాదా అని మీరడగొచ్చు. కోపం వస్తే వాళ్ళమ్మాయిని చేసుకుంటాడా అని మీరు గట్టిగా ప్రశ్నించొచ్చు, అది.....మీ మోహంలో ఆ ప్రశ్న కనిపిస్తుంది. దీనికి మరి జవాబు చెప్పాలిగా!" క్షణం ఆగి అన్నాడు రాయుడు ఉత్కంఠగా చూస్తున్న వీర్రాజుతో "రాఘవ భోజరాజు ప్రస్తావనను తిరస్కరించాడు, ఎందుకు అని అడగరేం?"

 

    "చెప్పు!"


    "వజ్రాల హారం గుండె మీద వేలాడాలి కాని, కాలికి కడియంగా పెడితే అందంగా ఉండదు కాబట్టి. అవును వీర్రాజుగారూ! అంత ఘనమైన గతం అతడికి ఉండబట్టే యింతకాలం అటు మధ్యప్రదేశ్ మొదలుకొని యిటు బెంగాలుదాకా వచ్చిన సంబంధాల్ని తిప్పికొట్టాడు. తను మనసిచ్చిన కిన్నెర కోసం యింత కాలమూ ఎదురు చూశాడు."


    సాలోచనగా ఉండిపోయాడు వీర్రాజు. మరి యింతకాలము కిన్నెర ఈ విషయాన్ని రహస్యంగానే ఎందుకుంచింది?


    అసలు ఎంత గొప్ప గతం ఉంటే మాత్రం ఇంపోర్టెడ్ కార్లలో తిరగ్గలిగే కిన్నెర, ఈ స్కూటర్ రాఘవతో ఎలా సరిపెట్టుకోగలదని?


    "నాకు తెలుసు వీర్రాజుగారూ! ఈ విషయం కిన్నెర యింతకాలం గోప్యంగా ఎందుకుంచింది అని మీరు ఆలోచిస్తున్నారు. మీరు తర్కంలోకి దిగి లోతుగా వెళితే షాక్ తింటారు."


    ఇప్పటికే చాలా షాక్ లు తిన్న వీర్రాజు అర్ధం కానట్టు చూశాడు.


    "మీ అమ్మాయి కిన్నెర స్వతంత్ర భావాలు గల అమ్మాయే తప్ప స్వతంత్రురాలు కాదు. తండ్రి చాటు బిడ్డ మీ అంతట మీరు అడిగితే తప్ప ఏ విషయమూ మనసు విప్పి చెప్పలేని పసిపిల్ల."


    అవుననాలనిపించింది వీర్రాజుకు.


    రాయుడు అంతగా నచ్చచెప్పక, ఒప్పుకోక తప్పేదేముందీ అనుకున్నాడో, వీర్రాజు అప్పటికి జ్ఞప్తికి వచ్చినట్టు మీసాల్ని మెలేశాడు.


    "అందుచేత మిమ్మల్ని హంతకుడిగా ఉరికంబం ఎక్కించాలనుకున్న భోజరాజుకు  ఓ బలమైన షాకివ్వాలి అంటే, వాళ్ళిద్దర్నీ మీరు ఆశీర్వదించాలి. అలా చూడకండి వీర్రాజుగారూ! మీరు ఈ రోజు రాఘవ ప్రాణాలు తీస్తే మీరు ఉరికంబం యెక్కేదాకా ఉరుకోనని రాత్రి అయన నాతో ఛాలంజ్ చేశాడు. సమయానికి మీ అమ్మాయి వచ్చి మిమ్మల్ని కాపాడింది."


    ఆలోచిస్తే ప్రతి వాక్యమూ నమ్మదగ్గదే అనిపించడంతో తల పంకించిన వీర్రాజు, అలాంటి మరో ఎత్తుని భోజరాజుపై ప్రయోగించటానికి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అన్నాడు రాయుడు.


    "ఈ పెళ్ళితో మీ అమ్మాయి ఇష్టాన్ని అంగికరించడం మాత్రమే కాదు వీర్రాజుగారూ, భోజరాజుపైన మరో బలమైన దెబ్బ తీసిన వ్యక్తిగా కుడా ప్రజల్లో మీరు కీర్తిని సంపాయించుకోగలుగుతారు!"


    ఎలాగో అర్ధం కాలేదు వీర్రాజుకు.


    "ఈ రోజు మీరు ప్రాణాలు తీయబోయింది ఓ మధ్య తరగతికి చెందిన రాఘవ అనే అబ్బాయిది. ఇప్పుడు మీరు రాఘవను అల్లుడుగా చేసుకుంటే రేపు మీరు ఎలక్షనులో భోజరాజుకు వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చినా, మొత్తం మాస్ ఓట్లు కొల్లగొట్టి రాఘవ రూపంలో మీ అమ్మాయికి వరుడినే కాక, మీరూ విజయాన్ని వరించిన వారవుతారు."


    మత్తు కాదు, రాయుడు మాటలు పూర్తిగా తలకెక్కిన వీర్రాజు చాలా సమస్యలు ఈ పెళ్ళితో పరిష్కారం కాబోతున్నాయన్న ఉత్సాహంతో వెంటనే సరేనన్నాడు.


    ఆ రాత్రి రాయుడి రాయభారంతో ఒక పెళ్ళి కుదరటం మాత్రమే కాదు, వారం రోజుల్లో జరగబోతున్న ఆ పెళ్ళి గురించి తెలిసిన భోజరాజు గుండెల్లో రాయి పడింది.

    "నిజమే! ఇంతకాలం అహంతో సామాన్యులను దరి చేరనియకుండా బ్రతికిన వీర్రాజు ఈ సంఘటనతో ప్రజల మనిషైపోతాడు.


    రాజకీయాల్లో వున్న ఏ వ్యక్తయినా అందోళన చెందే విషయమది!"

 

                                                                     *    *    *    *


    "ఈ పెళ్ళి జరగకూడదు రాయుడు! జరగకుండా చూడాలి.


    ఒక సంచలన వార్తలా చుట్టుపక్క గ్రామాలన్నీ కిన్నెర, రాఘవ పెళ్ళి విషయం చర్చించుకోవటాన్ని తన మనుషుల ద్వారా తెలుసుకున్న బోజరాజు మధ్యాహ్నం రాయుడిని పిలిపించాడు పని గట్టుకుని.


    రాయుడు జవాబు చెప్పలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS