"నీమీద నీకేంత నమ్మకం!"
"నా నమ్మకం నా మీద కాదు ధన్వి! జీవితాన్ని క్షణంలో శాసించగల కాలం మీద" చిత్రంగా నవ్విన సామ్రాజ్యం "బై....బహుశా నువ్విక డిల్లీ నుంచి తిరిగి వచ్చాక కలుద్దాం" అంది.
ధన్వి కదిలాడు సాలోచనగా.
* * * *
మే రెండో తేదీ....
దేశ రాజధాని డిల్లి నగరంలోని 'ఇంజనీర్స్ ఇండియా' ఆఫీసులో అడుగుపెట్టాడు ధన్వి. ఉదయం పది గంటల సమయం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు అయిదు వందల మంది ఓ పెద్ద కాన్ఫరెన్స్ హల్లో వ్రాత పరిక్షకి హాజరయ్యారు.
పరిచితులంటూ ఎవరూ లేని కొత్త వాతావరణం. పరిక్ష నిర్వహించబడే సమయం రెండు గంటలు. వెంటనే కంప్యూటర్ ద్వారా పరిశీలించి అనౌన్స్ చేయబడుతుంది.
వ్రాత పరీక్షలో ఎన్నికయ్యేది ఏభై మంది. అయితే ఆ తర్వాత ఇంటర్వ్యూలో సెలక్ట్ చేసుకునేది కేవలం పది మందిని మాత్రమే. సుమారు నెలకి పదిహేనువేల జీతం. పోస్టింగ్ దేశంలో ఎక్కడయినా వుండొచ్చు.
టెన్షన్ గా వుంది....అయినా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు ధన్వి.
అందరితో పాటు ఉత్కంటగా ప్రశ్నపత్రాన్ని అందుకున్న ధన్వికి ముందు గుర్తుకొచ్చింది తండ్రి.
డిల్లి వెళుతున్నట్టు ఆయనకి చెప్పలేదు.....చెప్పేవాడే కానీ తల్లి అంగికరించలేదు....అందుకే నాన్నకి ఏం చేప్పాలి అన్న భాధ్యతని అమ్మకి వదిలేసి డిల్లి వచ్చాడు....
ఇప్పటికి సుమారు అరడజను ఉద్యోగాలలో ఇంటర్వ్యూల్ని ఫేస్ చేసిన ధన్వి వ్రాత పరీక్షల్లో ఎక్కడా విఫలం కాలేదు.
ఫెయిలయింది పర్సనల్ ఇంటర్వ్యూస్ లోనే.....
అర్హత ప్రాతిపదికగా వ్యక్తుల్ని ఎన్నుకుంటరన్న నమ్మకంతో కష్టపడి రాశాడు. ఇది గవర్నమెంట్ ఉద్యోగమే అని తెలిసినా ధన్వి అంచనా తప్పు కాలేదు.....
సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకి 'రిటన్ ఎగ్జామ్' లో సెలెక్ట్ అయిన కేండిడేట్స్ పేర్లని నోటిస్ బోర్డులో డిస్ ప్లే చేస్తే మార్కుల రిత్యా ధన్వి నాలుగోవాడుగా వచ్చాడు.....
మనసు ఉద్విగ్నమైంది......
ముందు నాన్నకి చెప్పాలనిపించింది. కాని ఉత్సుకతని చాలా కష్టంగా ఆపుకున్నాడు.....
మరో గంటలో ఇంటర్వ్యూస్ మొదలవుతాయి....
తను ప్రతిసారి విఫలమైంది ఇంటర్వ్యలోనే కాబట్టి, అ ఫలితం తెలిశాక ఏకంగా ఒకేసారి చెప్పొచ్చు....అది ఉద్యోగాన్ని సాధించగలిగితేనే.....
నోటిస్ బోర్డులో పేర్లని చూడాలని అభ్యర్దులంతా ఒకరినొకరు నెట్టుకుంటుంటే ఓ మూల సోఫాలో కూచున్న ధన్వి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాళ్ళని, నిరాశతో వెనుతిరుగుతున్న వాళ్ళని, ఏకాగ్రతగా గమనిస్తున్నాడు. చిత్రమైన సందడి....అందరూ ఇంచుమించు తన ఈడు వాళ్ళే....
"ఎక్స్ క్యుజ్మి....."
ఎవరో పిలిచినట్లయి తల తిప్పి చూసాడు ధన్వి....
"మీరు తెలుగువారా?" ధన్వి సమీపంలో కూచుంటు అడిగాడు. ఓ యువకుడు...పాతికేళ్ళ వయసు....అందంగా, హుందాగా వున్నాడు. అది కాదు అమితంగా ఆకట్టుకున్నది.....ఆ వ్యక్తీ పెదవులు మాత్రమే కాదు- పసిమి చాయలో మెరిసే చెంపలు, కళ్ళు, కనుబొమ్మలు ఫాలభాగం అంతా అంతా ప్రసన్నంగా నవ్వుతున్నట్లు అనిపిస్తున్నాయి. "బై ది బై.....నా పేరు రాకేష్, మాదీ వైజాగ్.....మీరు డెఫినెట్ గా తెలుగు వ్యక్తే అనిపించాటానికి కారణం మీ చేతిలోని ఫోల్డర్ మీద నాక్కనిపించిన ఎడ్రసు....హైదరాబాదు నుంచి వచ్చిన ప్రతి వ్యక్తీ ఖచ్చితంగా తెలుగు వాడయ్యుంటాడని కాదు, కానీ ధన్వి అన్న మీ పేరు చూసి, అదే పేరు నోటిస్ బోర్డులో వుండటం గమనించి.....మీరు తెలుగువాళ్ళనుకున్నాను."
రాకేష్ మాటలు చాలా ప్రశంతతని అందిస్తుంటే "ధన్వి అనే పేరు చూసి తెలుగువాడినని అనుకునే అవకాశం లేదే" అన్నాడు ధన్వి.
"అదొక్కటే కాదు" వెంటనే అందుకున్నాడు రాకేష్ ."ఇక్కడ ఫోల్డర్ మీద నా పేరు ఇప్పుడే చూశారే అక్కడ, 'డిస్ ప్లే' చేసిన లిస్టులో వున్నట్టు ఎలా తెలుసుకోగలిగారు అన్నది మీ రెండో సందేహం....అవునా?!"
"యూ ఆర్ రైట్" అన్నాడు ధన్వి తాను ఉత్సాహంగా మాట్లాడుతూ....
'అసలు మీ పేరు ముందు చూసింది నోటిస్ బోర్డులో....అక్కడే ఆ పేరు చిత్రంగా అనిపించి రెండుసార్లు మననం చేసుకుని ఈ తెలుగు వ్యక్తీ ఎక్కడా అంటూ గాలించడం మొదలుపెట్టాను.....ఇకపోతే నాపేరే చిత్రంగా అనిపించిన మీకు నేను తెలుగువాడ్నని ఎలా గుర్తుపట్టారో చెప్పండి మాస్టారు అన్నది మీరు అడగబోయే మూడో ప్రశ్నయితే నా జవాబెంటో తెలుసా ధన్విగారూ?"
కొందరు పరిచయం అవుతూనే పరిసరాలని ఆనందపు వెల్లువగా వెదజల్లుతూ వెలిగిస్తూ అతి స్వల్పకాలంలోనే చాలా అత్మియలు అవుతారన్న సత్యానికి నిద్రశానంగా కనిపిస్తున్న రాకేష్ అడక్కుండానే చెప్పాడు. అసలు మీ మాతృ భాష తెలుగే అనుకోవటానికి కారణం 'డిస్ ప్లే' చేసిన నోటిస్ బోర్డులో మీ పేరుతొ బాటు సన్నాఫ్ నీలకంఠం అంటూ మీ తండ్రి గారి పేరు కనిపించడమే మాస్టారు. సో...." క్షణం ఆగి అన్నాడు. "నా మేధస్సుని మీరు అభినందిస్తున్నారు. వెంటనే సెలక్ట్ అయిన మీరు నేను అందించే అభినందనల్ని అందుకోబోతున్నారు."
"థాంక్యూ" అంటూ కరచాలనం చేసిన ధన్వి "అలాగే నీకూ నా అభినందనలు" అన్నాడు రాకేష్ తో.
