Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 26

   

    ముగ్గురి అభిప్రాయాల్ని చదివిన ధన్వి సాలోచనగా మధూళీని చూశాడు.

 

    "మీరు చెప్పండి సామ్రాజ్యంగారూ!" సామ్రాజ్యం అబ్బురంగా చూస్తుంది.

 

    మరో అభిప్రాయాన్ని రాసింది తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞానపీఠ బహుమతి సాధించిన కవిది.

 

    "సంఘానికి శాస్త్రజ్ఞానుల అవసరమే కానీ శాస్త్ర పరిజ్ఞానం కన్నా తరాన్ని రేపటి తరంలోకి నడిపించే మనవతా దృక్పధం గల సంస్కర్తలు ఈ ప్రపంచానికి అవసరం. అందుకే శాస్త్రజ్ఞుడికన్నా అనాధగా ప్రపంచం అండకోసం ప్రాకులాడుతున్న అయిదేళ్ళ బాలుడికన్నా సాంఘిక సమస్యల పద్మ వ్యుహల్ని చేధించగల బిడ్డని మోసే గర్భవతి అయిన స్త్రీని బ్రతికించడం అవసరం."

 

    చిత్రమైన కాంట్రాడిక్షన్ లా అనిపించింది.

 

    చివరది డిఫెన్స్ రిసెర్చికి చెందిన ఓ శాస్త్రజ్ఞుడి అబిప్రాయం.

 

    "చరిత్ర పరిణామ దశ గురించి మనం లోతుగా ఆలోచిస్తే మనిషి మనుగడని శాసించింది శాస్త్రపరిజ్ఞానం. ఒక విషయాన్నీ శోధించి సాధించాలి అంటే ఏ వ్యక్తయినా అపారమైన సాధన ఒక్కటే కాదు తనకి చెందిన చాలా సుఖాల్ని త్యాగం చేయగల ఔన్యత్యము కావాలి. అందుకే అహోరాత్రులు శ్రమించి మనిషికి మరణం లేకుండా ఆపగల ఫార్ములాని కనిపెట్టిన శాస్త్రజ్ఞుడ్ని మనం బ్రతికించుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచంలో  ఏ మనిషి అణ్వస్త్రాల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఆకలి చావులు వుండవు. అంతేకాదు- అంత శక్తివంతుడైన ఆ శాస్త్రజ్ఞుడు రేపు మనుషుల మనసుల్ని మార్చి ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దగల మరో మార్గాన్ని కనిపెట్టగలడేమోగా?"

 

    ముగ్గురి అభిప్రాయాల్ని చదివిన ధన్వి సాలోచనగా మధూళీని చూశాడు.

 


    "మీరు చెప్పండి సామ్రాజ్యంగారు!" మధూళీ అడిగింది. "ధన్వితో కలిపి మీరు నలుగురి జవాబుల్ని విన్నారుగా. మీకేది కరెక్టుగా అనిపించింది."

 

    "ఏది కరెక్టో నాకు తెలీదు. కానీ నలుగురు చెప్పింది కన్విస్సింగ్ గానే వుంది. " అంది సామ్రాజ్యం అర్ధం కానట్టుగా మధూళీని , ధన్విని ఇద్దర్ని చూస్తూ.

 

    "మీరు మాట్లాడాలి ధన్వి!"

 

    మధూళీ ప్రోత్సహించింది.

 

    తప్పకుండా కాంట్రాడిక్ట్ చేస్తాడనుకుంది.

 

    దీనికోసం అవసరమైతే వాగ్యుద్దానికి దిగుతాడని భావించింది.

 

    ఒకవేళ ధన్వి అదే పనికి పూనుకుని వుంటే మధూళీ ఆలోచనలు ఎలా మారివుండేదో అమెకి తెలీదు.

 

    కానీ ధన్వి మృదువుగా అన్నాడు. "ముగ్గురు రాసిన అభిప్రాయాలు క్లుప్తంగా వున్నా లోతుగా వెళితే అర్ధమౌతున్నది ఒక్కటే మిస్ మధూళీ జాన్ మిల్టన్ అన్నట్టు మన ముందున్నది స్వర్గమో, నరకమో నిర్ణయించేది మనం కాదు. మన ఆలోచనా విధానం అన్న పాయింటు గుర్తుకొస్తోంది.

 

    మధూళీ వెంటనే అంది. "మంచి కానీ చెడు కానీ వాటి అస్తిత్వం నిర్ణయించబడేది మన వ్యక్తిత్వం బట్టి అన్నాడు షేక్ స్పియర్ కూడా."

 

    ధన్వి మౌనం మధూళీకి ఎంతటి ఉత్సాహాన్ని అందించింది అంటే - ధన్వి మూర్ఖుడు కాదు. కానీ అతడి మాటల్లోని వాడి, భావాల్లో వేడి అతడ్ని దోషిగా నిలబెడుతుంది.

 

    "అందరిలోనూ ఆశావాదమే ధ్వనించినప్పుడు ఎవర్ని తప్పు పట్టగలం?' అన్నాడు ధన్వి ముగిస్తున్నట్టుగా.

 

    నైతిక విలువల గురించి ఆలోచించడం, ఆచరించడం దోషమని భావించే మేటిరియలిస్టుల దృష్టిలో అతడు కానీ వాడు కావచ్చు. ఆలోచన అంగవైకల్యంలో బ్రతుకుతూ నిజాయితీపరుల్ని చూసి నవ్వుకోవడం అలవాటయిన సమజంలో ఓ పక్క గ్రహాంతరాల్ని కొలిచేస్తున్నావని సంబరపడే వ్యక్తులకి, తమలోకి తాము చూసుకోవడం చేతకాని సగటు జీవులున్న ఈ సంఘానికి ధన్వి ఓ అహంకారి కావచ్చు.

 

    "మిస్ మధూళీ" ధన్వి ప్రశాంతంగా అడిగాడు - మరి ప్రశ్న అడిగిన రచయిత్రిగా మీ జడ్జిమెంట్ తెలుసుకోవాలనుంది.

 

    మధూళీ ఉద్విగ్నంగా చూసింది. వెన్నెల పువ్వులా, వికసిత వదనంతో మనసు కవాటాలని తెరచి అనుమతి లేకుండా 'ఎద' ను 'ఎర' లా కొరికేసే అల్లరి పిల్లాడిలా చొచ్చుకుపోతున్నాడా-లేక యవ్వన తొలి వేకువలో ఎదురయిన తొలి బాటసారిలా వద్దని చెబుతున్నా పలకరించిపోయే తొలి ప్రత్యూష వదనంలా నిట్టుర్పుకి అవకాశం ఇవ్వని విశ్వాసపు నిర్వచనంలా తన మనసుని అక్రమిస్తున్నాడా?

 

    "నేను మీ నుంచి జవాబుని ఆశిస్తున్నాను" అన్నాడు ధన్వి నిశ్చలంగా చూస్తూ....

 

    "ఏ జవాబుని చెప్పను మిస్టర్ ధన్వి....'మనసుని బట్టి మనిషి ' అనే మీకు తెలిసిన సూత్రాన్నే మళ్ళీ మీకు చెప్పి నా మూర్ఖత్వాన్ని మీ ముందు ప్రదర్శించుకోనా? జీవితం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటూ అవివేకిలా మీ ముందు తలవంచనా......" మధూళీకి తెలీదు. తను అంత పటిష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలనని" పైగా మిరన్నట్టే అందరి జవాబుల్లో కనిపిస్తున్నది ఆశావాదమేగా?"

 

    ఆదిపర్వం దగ్గరే ఆగిపోవాల్సిన బ్రతుకు భారతాన్ని ఆగని పురాణంగా మార్చాడు , నిన్న మొన్న రణరంగంలా అనిపించిన ధన్వి.

 

    అర నిముషం నిశ్శబ్దం......

 

    "అసలు నేను మీకు ఆ పజిల్ ని ఇచ్చింది ఆలోచించే కాదు ధన్వి. అనాలోచితంగా-----నిజం! మీ మాటల్లో నాకు అహం కనిపించింది. మీరు మిమ్మల్ని మించి అంచనా వేసుకునే మనిషిగా అనిపించారు. అందుకే ఈరోజు మీకో గుణపాఠం చెప్పాలని ప్రయత్నించి ఓడిపోయాను. మీ ఆలోచనల్లో మీకు తెలీనివిలెదూ నేను మీకు చెప్పి ఒప్పించలేని ఓ జవాబు కోసం మరో ముగ్గురి అభిప్రాయాల్ని అడిగి రాయించుకొచ్చాను. అంతా మేధావులే."

 

    'మేధావి' అనే పదాన్ని ఆమె వాడింది ధన్విని ఆనందపరచాలని కాదు....ఇప్పటికే ఆ సత్యాన్ని ఆమె మనసు సైతం అంగికరించింది కూడా.

 

    "ఈ నా ప్రయత్నం అంతా ఒక నిజాన్ని మీకు తెలియ చెప్పటానికే మిస్టర్ ధన్వి."

 

    నిద్ర నుండి తను మేల్కొందో అతడ్ని మేల్కొల్పాలనుకుందో మార్దవంగా అంది.

 

    "ఒకే జవాబు వచ్చేది మేధమేటిక్స్ లో. కానీ జీవితంలో ప్రతి సమస్యకి పదిరకాల జవాబులుంటాయి. ఇది మీకు తెలీదని కాదు. మీరు తెలిసిన పట్టించుకోని ఆ నిజాన్ని మీకు తెలియ చెప్పాలని."

 

    ఏ ప్రశ్నకో జవాబు తెలిసినట్టు పైకి లేచిన మధూళీ "ఓ.కె., ఇక వస్తాను" అంటూ వెళ్ళింది ఎవరో తరుముతున్నట్టుగా.

 

    సామ్రాజ్యం మాత్రమే కాదు, మధూళీ ప్రవర్తనకి ధన్వి కూడా విస్తుపోయాడు.

 

    రెండు నిముషాల నిశ్శబ్దం తర్వాత అంది సామ్రాజ్యం__" కొన్ని పరిచయాలు కొందరు వ్యక్తులపై అసాధారణమయిన ప్రభావం చూపిస్తుంటాయి ధన్వి. బహుశా అందమయిన , ప్లస్ తెలివైన మధూళీని నీ పరిచయం బహుశా అంతగా కదిలించినట్టుంది."

 

    "ఉన్నట్టుండి నువ్విలాంటి స్టేట్ మెంట్ ఎందుకిచ్చావ్?"

 

    ధన్వి గొంతులో వ్యంగ్యం ధ్వనించడంలో చిరుకోపంగా అంది సామ్రాజ్యం. "చాలా తెలుసుకునే నీకు ఆడపిల్ల మనసుని అర్ధం చేసుకునే తెలివి లేదనిపించబట్టి."

 

    "అలా ఎందుకనుకుంటున్నావ్?"

 

    "మధూళీ మాటలు నీకు భోధపడి వుంటే ఆమె మనసుని నవ్వు గ్రహించేవాడివి కాబట్టి."

 

    సామ్రాజ్యం ఎందుకిలా మాట్లాడుతుందో అర్ధం కాని ధన్వి వెంటనే ఓ జోక్ చెప్పాడు. "ఇద్దరు పెళ్ళయిన మగాళ్ళు పెళ్ళికి ముందు సెక్స్ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటి వ్యక్తీ "నేను పెళ్ళికి ముందు మా ఆవిడతో అస్సలు సెక్స్ వ్యవహారం నడపలేదు. మరి నువ్వో?" అంటూ అడిగాడు. దానికి రెండోవాడు నడిపింది లేనిది మీ ఆవిడ్ని చూస్తే గానీ చెప్పలేనన్నాడట."

 

    ఫకాల్న నవ్వినా సామ్రాజ్యం "నువ్విలాంటి పచ్చి జోక్ ఎందుకు చెప్పావో తెలుసుకోవచ్చా?" అంది అల్లరిగా చూస్తూ.

 

    "ఒకటి- ఆలోచన వున్నా అనాలోచితంగా మాట్లాడటానికి ఆ రెండో వ్యక్తీలాంటి అవివేకిని కానూ అని చెప్పటానికి. రెండు- నాకూ సేన్సాస్ హ్యుమరుందని నీకు అర్ధం కావటానికి."

 

    ధన్విలో తొలిసారి మరో కొత్త కోణాన్ని చూడగలిగిన సామ్రాజ్యం "నాట్ బాడ్....శృంగారం విషయంలో నేను అనుకున్నంత అమాయకుడివి కావు" అంది. ఇదంతా మధూళీ మూలంగా వచ్చిన మార్పే! అయితే అది ఆహ్వానించదగ్గదే అనుకుంటా" అప్పుడప్పుడూ ఇలా మాట్లాడొచ్చుగా?

 

    "మాట్లాడాలి అంటే అకేషన్ రావాలి"

 

    "అంటే నువ్వు నీ పందెంలో ఓడిపోవడంలాంటిదా?" రెచ్చగొడుతున్నట్టుగా అంది సామ్రాజ్యం.

 

    "త్వరలోనే సగం పందెం గెలవబోతున్నాను సామ్రాజ్యం" అన్నాడు ధన్వి.

 

    "డిల్లి వెళుతున్నాను.....ఆశావాదంతో ఈసారి సెలెక్ట్ కాబోతున్నాను."

 

    యధాలాపంగా చూసింది...."మన పందెంలో నువ్వు జాబ్ లో సెటిల్ కావడం అన్నది ఒక భాగమేమో కాని అదే మన పందెం కాదు ధన్వి, జులై ఇరవై మూడు దాకా నువ్వు నువ్వుగా వుండాలి. నటించకూడదు. రాజీపడకుండా."

 

    "అసలు ఎందుకు.....ఎందుకని?" వాస్తవాన్ని జిర్ణించుకోలేకపోతున్నట్టుగా అన్నాడు. "మూడు నెలల గడువుతో నేను నువ్వనుకున్నట్టుగా మారతానని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్ధం కావడం లేదు."

 

    "మన పరిచయం అయిన ఇంత కాలము నిన్ను చూశాను. చదివాను తప్ప- ఏకాగ్రతగా పరిశిలించలేదు ధన్వి! ఇంత కాలానికి నీతో పందెంలో అడుగుపెట్టిన నేను కాలం విలువ తెలిసిన దానిలా ఈ మూడు నెలల పరిశిలన్ని పది కాలాల బ్రతుకుగా మలుచుకోవాలనుకుంటున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS