నేరమూ - శిక్షా?
రనచ: ఎమ్. డి. సౌజన్య
ఏ వృత్తి వాళ్లు తమకి తాము తమ వృత్తికి, బుద్దిపొర పాటై వచ్చినట్టు బాధపడి పోతుంటారు.
రామ్మూర్తి - తాము - 'బ్రతకలేక బడిపంతుల్నయ్యాను!' అని కుమిలి పోతుంటాడు.
ఈ విషయంగా రోజుకోసారన్నా బాధ పడేవాడు. ఇప్పుడు క్షణానికి లక్షసార్లు బాధపడు తున్నాడు.
పచ్చిపుండు మీద గొడ్డుకారం చల్లినట్లు - పరీక్ష పేపర్లు దిద్దటానికి మొట్ట మొదటిసారి 'స్పాట్ వ్యాల్యుయేషను' కు వచ్చినప్పటినుంచి - యీ బాధ రామ్మూర్తిలో క్షణక్షణ వర్దమాన మవసాగింది!
కాకపోతే ఏమిటి? రామ్మూర్తి ఆ పేపర్లు దిద్దే గదిని చూడగానే 'ఇది' పరీక్ష పేపర్లు దిద్దేగది అనేకంటే బెజవాడ ప్లాట్ ఫారమ్' అనటం మేలు అనుకున్నాడు. అక్కడి వాతావరణానికి! రామ్మూర్తీ తోటి ఎక్జామినర్సు - స్త్రీ - బాల - కురు - వృద్దులు - అనే భేదభావం లేకుండా - తమ చేతుల్లోని ఎఱ్ఱబాల్ పాయింట్ పెన్నుల్ని పేజీనుంచి పేజీకి పచ్చటి పచ్చిక బయలులో చెంగు చెంగున దుమికే లేడి పిల్లల్లా దుమికివస్తున్నారు.
వాళ్ల చేతుల్లో పేజీలు తిరుగుతున్న వేగం - బృందావన్ కోరమాండల్, గోల్కొండ, సదరన్ తమిళనాడు, తుఫాన్ ఎక్స్ ప్రెస్సుల్నే తల దన్నేట్టుంది.
మరి రామ్మూర్తి చేతిలో ఎర్రబాల్ పాయింట్ పెన్ను - ఆన్సరు షీటుల్లోని - మొదటి పేజీలోని మొదటి పేరాలోనే, వూబిలో దిగబడిపోయిన దున్నలా వులుకూ, పలుకూ లేకుండా వుండిపోయింది.
ఈ రామ్మూర్తి పనితనం మొదటి పేపరుతోనే పసిగట్టిన ఛీఫ్ ఎగ్జామినరు"ఇలా అయితే ఎలా మాష్టారు! ఈ పనికి కొత్తవారనుకుంటా! కాస్త్ స్పీడుగా లాగించండి! ఎఱ్ఱబాల్ బాయింట్ పెన్ను కాస్త ఆడించండి! ఏకాలేజీమంది?" అన్నాడు పైకి క్యాజువల్ గా!
కాని రామ్మూర్తికి 'ఛీఫ్ ఎగ్జామినర్' మాటల్లో - హితవుకంటే - హేళన, సలహాకంటే -విమర్శా, ఆత్మీయత కంటే వ్యంగ్యం - నువ్వెక్కడ నా ప్రాణానికి దాపురించానయ్య పాడు పీడ!' - అన్నట్లనిపించింది.
ఇంతలో 'ఇదిగో మిస్టర్ రామ్మూర్తి ఒక సారిలా రండి!' - ఛీఫ్ ఎగ్జామినర్ పిలిచాడు.
రామ్మూర్తి దగ్గరకు రాగానే 'చూడండి మాష్టారు ఇది స్పాట్ వ్యాల్యుయేషన్ సెంటరు! మీ పదిమంది ఎగ్జామినర్సు మూడు గంటల్లో దిద్దే మూడు వందల పేపర్లు యిస్తేనేకాని నేను నా కోటా యిరవై పేపర్లు రివాల్యుయేషన్ చేయటం సాధ్యంకాదు! నేను మీకోసం ఆగినా- మధ్యాహ్నం పన్నెండు నుంచి వచ్చి పేపర్లు దిద్ద వలసిన రెండో షిఫ్టు ఎగ్జామినర్సు ఆగరు!
పైగా నేను మడు బస్సులు మారి, యిక్కడ నాం పల్లినుంచి పదిమైళ్ళ దూరంలోవున్న 'నామాల గుండు' ప్రాంతానికి వెళ్లి మధ్యాహ్నం బోజనం చేయాలి
అయినా ప్రతి పేజీ - ప్రతి - పేరా ప్రతి లైను - చదవమని ఎవరు చెప్పారు? ప్రతి పేజీకి కిందో రైటు - పైనో రైటు మధ్యో యింటూ పెట్టండి! టోటలు తేడా రాకుండా లోపలి మార్కులు టైటిలు షీటు మీదవున్నాయో లేవో జాగర్త పడండి! తెలుసుగా - ప్రతి తప్పుకు అయిదు రూపాయలు 'కట్' చేస్తారు! ఇంకా వివరాలు కావాలంటే మీ ప్రక్కనే 'గంగాబాయి' గారున్నారు! ఆవిడ దిద్దిన రెండు ఆన్సరు పేపర్లు తిరగేయండి' 'టరన్ ది పేజెస్ అండ్ లెరన్ ది వర్క్ -' అంతే!' అన్నాడు.
రామ్మూర్తికి మొదట ఆ మాటలు వింటుంటే భయం వేసినా - తరువాత ఏదో కొంచెం విషయం అర్దమైనట్లనిపించింది.
రెండేళ్లు కష్టపడి చదివి - కొండంత ఆశతో - రంగురంగుల భవిష్యత్తుకోసం కలలుగనే భావిభారత పౌరుల భవిష్యత్తు రెండు నిమిషాల్లో - ఎక్స్ పర్ట్ డాక్టర్ నాడిచూసి క్షణంలో రోగమేమిటో చెప్పినట్టు, ప్రఖ్యాత జ్యోతిష్యుడు హస్త రేఖలుచూసి భవిషత్ చెప్పినట్టు, వేదకాలంలో తపస్సంపున్నువలైన రుషులు, - కేవలం ముఖం చూసి తమ దివ్య శక్తులతో భూతభవిష్యత్ వర్తమానాలు లెక్క చెప్పినంత తేలిగ్గా మా పరీక్షాధి కారులంతా - విద్యార్దుల ఫలితాలు తేల్చేస్తున్నారు.
ఇలా అంతులేని ఆలోచనలతో సతమత మవుతూ బాధపడిపోతున్న రామ్మూర్తి పేపర్లు - సబ్బుబిళ్ళ కాకెత్తుకు పోయినట్టు ఎత్తుకెళ్లి, తలామూడు పంచాడు, 'ఛీఫ్ ఎగ్జామినరు'
"వీళ్లు పూటకి ముప్పయి పేపర్లే ఎలా దిద్దుతారబ్బా!" అంటూ - అంతరార్దమేమిటో అర్దంకాక తల బద్దలు కొట్టుకుంటున్న రామ్మూర్తి, తన వంతు తలా మరో మూడు పేపర్లు అదనంగా వచ్చినా, "విందులో ఏదో స్పెషల్ అయిటమ్ ఎక్ట్రాగా వడ్డించినట్టు' కులాసాగా వున్న తన తోటి కోయగ్జామినర్సుని చూస్తే - రామ్మూర్తికి నిజంగానే భయంవేసింది.
రామ్మూర్తి తల ఎత్తి ఒకసారి తనచుట్టూ వున్న యగ్జామినర్సును చూశాడు!
కొత్త దంపతుల్లా - ఇద్దరు ఆడామగా - అదేపనిగా ఏదో 'స్వీట్ నధింగ్స్' చెప్పుకుంటూ 'జోక్స్' విసురు కుంటూ జాలీగా పేపర్ల మీద ఎఱ్ఱబాల్ పాయింట్ పెన్నులు ఆడిస్తున్నారు. 'రాత్రి' మహారాజాలో కేబరే డ్యాన్స్ కు వెళ్లితే - అబ్బో ఏంస్ట్రిప్పింగ్ - ఏం ఛెస్ట్,ఏం కర్వ్ స్ ఏం ధైస్, ఏం మువ్ మెంట్స్, ఏం జెర్కులు - ఏం కవ్వింపు ఆటలు! అంటున్నాడు' గతరాత్రి తన స్వానుభవాలు బడాయిగా చెబుతూ ఒక యగ్జామినరు!
"చెప్పి అలా వూరించకపోతే - మమ్మల్నీ కాస్త పిలిచి కెళితే మేం రామన్నామా?"అంటోంది మరోపూబోడి కవ్వింపుగా నవ్వుతూ.
"ఇలా పిచ్చాపాటి వాగుతూ దిద్దితే, పేపర్లెలా దిద్దటం సాధ్యం! నేను చస్తే అలా దిద్దలేను!" అనుకున్నాడు రామ్మూర్తి బాధగా! కాని కొందరు ఎగ్జామినర్సు వాళ్లు పరీక్షరాస్తున్నంత సీరియస్ గా పేపర్లు దిద్దుతున్నారు.
ఇంతలో రామ్మూర్తి వంతు మూడు పేపర్లు మూడు సెకనుల్లో ముగించి యిచ్చివేస్తూ మీ మూడు పేపర్లుదిద్దాను? మీరు నాకు మూడు రూపాయలు బాకి! మధ్యాహ్నం బాక్ కం రెష్టారెంటులో బాకీ తీర్చాలి!"అంది గంగాబాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ!
రామ్మూర్తి మొదట ఆమె చేతిలోది 'బాల్ పాయింట్ పెన్నా, లేక మంత్రదండమా!' అన్నట్టు చూసి, తరువాత, ఆమే దిద్దిన పేపర్లలో మార్కులు చూసి, నెత్తిన పిడుగు పడ్డట్టు అదిరిపడి - "ఇదేమిటండీ! అందరికీ యూనిఫారంగా - నలభైనాలుగు వేశారు?!??" అంటూ - అడుగుదామను కుంటుండగా
"అందరూ దిద్దేదీ అలాగేసార్! నాలుగు ఎస్సేలకి (వ్యాసాలు) నాలు గయిదులియిరవై! నాలుగు పేరా గ్రాఫు ప్రశ్నలకి! - నాలుగు మూళ్ళు పన్నెండు! నాలుగు సందర్భ సహిత వ్యాఖ్యలకి - నాలుగు మూళ్ళు పన్నెండు - వెరసి నలుభై నాలుగు! అయినా ఇంగ్లీషులో అంతకంటే వేయకూడదుసార్! నేను 'ఎమ్మే' రెండేళ్ళు రాత్రిం బవళ్లు కష్టపడి చదివితే నాకొచ్చింది నలభై మార్కుల ధర్డుక్లాసు!మనం కూడా ఇంగ్లీషులో అంతకంటే వేస్తే మన ఇంగ్లీషంటేపిల్లకు భయముంటుందా!మనం ఒకసారి దిద్ది మార్కులు వేశాక లోపలి మార్కులు టైటిల్ షీటుమీద సరిగా వున్నాయో లేదో - టోటలు సరిగా వుందోలేదో - అదిముఖ్యం!పిల్లలుకొరుకునేది - పాసుకావటం వరకే! మన ఛీఫ్ సంగతి తెలుసుగా - ఆయన 'నామాలగుండు' చేరుకోడానికి టైంలేదు కాకుండా చూసుకుంటాడు తప్ప, మరోధ్యాస వుండదు! 'అంది గంగాబాయి' ఒక చిన్న పాఠం క్లుప్తంగా చెప్పినట్టు! రామ్మూర్తికి చెమటలు పట్టాయి!
"అందరికీ సమాన మార్కులు వేస్తే - ఏ మెరిట్ స్కాలర్ షిప్పో - ఏడాక్టరు ఇంజనీరింగ్ సీటో సంపాదించాలని రాత్రింబవళ్ళు రక్త మాంసాలు ధారపోసి చదివే మెరిట్ స్టూడెంట్స్ సంగతేమిటి?" దాదాపు అరచినట్టు అడిగాడు రామ్మూర్తి.
