Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 26

   
    
    "రేపు సాయంకాలం ఆరుదాటక నీవు అలా వీధిలో నడిచెళ్ళు. మేం ఆ సమయానికి వీధి వరండాలో కూర్చుని వుంటాం. దూరంనుంచైనా నిన్ను అమెకు పరిచయం చేస్తాను. మొదట నువ్వెవరో తెలియాలి కదా! అని మొత్తం ప్లాన్ అంతా వివరించింది.


    అయినా అప్పటికి అతను రాలేదు.


    " పిల్లల్లేకపోవడమన్నది బాధాకరమైన విషయం. పిల్లల్లేకపోవడం అన్నది తాంబూలం వేసుకున్నా నోరు పండకపోతే ఎలా వుంటుందో అలా వుంటుంది.


    భార్య భర్తలు ఒకర్కొకరు ఎంతసేపు చూసుకుంటారు. ఎంతసేపు మాట్లాడుకుంటారు. సంసారమంటేనే బోర్ కొట్టదూ- పిల్ల లుంటే ఆ ఆనందమే వేరు" చింతామణి అమె అ అసంతృప్తిని మరింత రాజేసింది.


    అమె కావాలనే ఆ విషయంమీద చాలాసేపు మాట్లాడింది. ఒక మనిషిని తను నడుస్తున్న మార్గంనుంచి తప్పించడానికి ఆ మార్గంలో ఎదురైన అసంతృప్తిని - అది చిన్నదైనా సరే భూతద్దంలో చూపించాలి. ఇప్పుడు అదే పని చేసిందామె. అయితే ఎదుటివ్యక్తి హర్ట్ కాకుండా  చాలా జాగ్రత్తగా మాట్లాడింది.


    ఆ తరువాత దానికి ముక్తాయింపుగా ఏం చేయాలో కూడా అప్పటికప్పుడే అలోచించింది. "డాక్టర్ కి చూపించారా?" చివరగా అడిగింది.


    " డాక్టర్ కి చూపించలేదు. మనలో ఎవరో ఒకరికి లోపం ఉందనుకో- అది తెలిసిపోతే  ఈ మన బాధకు ఎదుటివ్యక్తే కారణమని అనుకుంటూ ఉంటాం. అందువల్ల అలాంటిది తెసుకోవద్దు. ఐనా మాకేం వయసైందని- పెళ్ళయి ఆరేళ్ళేగదా- చూద్దాం అన్నారు మా వారు. అందుకే ఇద్దరం డాక్టర్లకి చూపించుకోలేదు." అని వివరించినప్పుడు చింతామణి వెంటనే అందుకుంది.


    "ఇలాంటి విషయాల్లో మగాళ్ళలోనే లోపం వుంటుంది. నాకు తెలుసు. ఎన్నో కేసులు చూశాను. అందుకే  డాక్టర్ల దగ్గిరికి వెళ్ళడానికి జంకుతారు. కాని నరేంద్ర అలాంటి రకం కాదనుకో- తనలో లోపముంటే ఒప్పుకునేంత సద్గుణుడు."


    " అలా నరేంద్రకు ఏమీ అన్నట్టే అతనిలోనే లోపం వుంటుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. మొదటిసారి శశిరేఖకి భర్తమీద చిన్న అనుమానం లాంటిది కలగసాగింది.


    ఆ మాటలు ముగించిందో లేదో పడమరవైపు నుంచి వస్తున్న సురేష్ వర్మ కన్పించాడు.


    హమ్మయ్య అనుకుంటూ అంతవరకు గాలినికూడా పీల్చనట్టు రిలాక్స్ అయింది చింతామణి.


    "ఈవీధి చాలా విశాలంగా వుంది కదూ" అంది చింతామణి ఆ మాటకి సన్నజాజుల్ని గుచ్చుతున్న శశిరేఖ తలతిప్పి చూసింది.


    తెల్లటి పైజమా, తెల్లటి లాల్చీ- అదే రూపం, మెరుపు వెలుగులో తనముందు నిలబడ్డ రూపం- కలలో కనిపించిన పరలోకవాసి తనముందు సాక్షత్కరించినట్టు అన్పించింది అతన్ని చూస్తుంటే.


    అంతకంటే ఎక్కువ అలోచించడం ఇష్టంలేక తల తిప్పుకుంది శశిరేఖ.


    చింతామణి అప్పుడే తను చూసినట్టు "అరే-సురేష్ వర్మా" తనను తనే అనుకుంటున్నట్టు గట్టిగా అంది.


    "నాకు పనుందే అతనితో. అయినా ఇప్పుడొద్దులే. - ఏం లేదు సరోజ లేదూ- అదే లేబర్ కాలనీపిల్ల. గుండెజబ్బు-- వైద్యానికయ్యే ఖర్చు భరించమంటే సరేనన్నాను. మంచి మనిషి. ఓ నీకు తెలీదు గదూ అతనెవరో?" అంది తెలియదన్నట్టు తల వూపింది.


    "పదిమంది ఆడపిల్లల్ని పిలిచి నీకు ఎలాంటివాడు భర్తగా కావాలని కోరుకుంటారో చెప్పండి  అంటే వాళ్ళు చెప్పే సుగుణాలన్నీ కలిపి ఒక మగవాడ్ని తయారుచేస్తే ఎలాంటివాడు తయారౌతాడో అలాంటివాడు" అంది.


    శశి ఏమీ మాట్లాడలేదు.


    అలాంటివాడు నిన్ను ఈ మధ్య దేవాలయం దగ్గర చూశాడట. అతను నిన్ను గురించి ఏమన్నాడో తెలుసా?" అని అడిగింది.


    ఏమన్నాడని అమె అడగలేదు. కాని అతృతంతా కళ్ళల్లో కనిపిస్తోంది.


    "అదిగో- గంగారత్నం వస్తోంది.రేపు ఎప్పుడైనా ఇటొచ్చినప్పుడు చెబుతాను" అంటూ చింతామణి అక్కడ్నుంచి లేచి వీధిలోకి వచ్చిపడింది.


    " ఆ వస్తున్న అమె గంగారత్నం కాదు" అనిపించి చెప్పాలనిపించింది శశిరేఖకి. కానీ అప్పటికే అమె మాయమైపోయింది. పక్కనున్న సందులోకి తిరిగి.


    ఆ వచ్చేది గంగారత్నం కాదన్న విషయం చింతామణికి కూడా తెలుసు. అయితే తన గురించి ఏమనుకున్నాడో, అన్నదాన్ని సస్పెన్స్ లో వుంచితే దాన్ని గురించి  అమె ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి అది చాలు.


    అంతవరకు జరిగిన దానికి చింతామణి సంతృప్తిపడుతూ ఇంటివైపు నడిచింది.


    సాయంకాలం కావడంతో చెక్ పోస్ట్ బిజిగా వుంది. అంతవరకు ఎక్కడుంటారో ఏమోగానీ ఎండ చల్లబడగానే జనం గుమిగూడిపోతారు. ముఖ్యంగా మోటారుఫీల్డ్ వాళ్ళు. పగలంతా బాడుగులకు వెళ్ళి లారీలు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు నిమిత్తం అక్కడికి చేరుతాయి.


    లారీల ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులు, రైల్వే గోడౌన్ కాంట్రాక్టర్లు, వాహనాల రిపేర్ల అంగళ్ళు అక్కడ ఎక్కువగా వున్నాయి. వీటితోపాటు వాహనాల తనిఖీకేంద్రం గవర్నమెంటుదుంది.


    అక్కడ పనిచేసే అధికారులు. అటెండర్లకు, గవర్నమెంటుకు పన్నులరూపంగా వచ్చేదానికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని లారీ డ్రైవర్లు, ట్రాక్టర్లు ఓనర్లు బాహాటంగానే అంటుంటారు.


    "జేబులోకి పైసలొస్తాయనుకుంటే మనుషుల్నే పందులని చెప్పి పక్క రాష్ట్రానికి కబేళాకి తరలించేయచ్చు" అని కామెంట్లు కూడా చేస్తుంటారు. చెక్ పోస్ట్ పనితీరుతెన్నులు గురించి వ్యాఖ్యానిస్తూ.


    ఇక  అక్కడ జనం బాగానే పోగవుతారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేందుకు చాలా కొట్లున్నాయి. వాటిల్లో పాన్ పరాగ్ నుంచి కోడిపలావ్ రైస్ వరకు ఏమనా దొరుకుతాయి. ఇక వీటికంటే కూడా ఎక్కువగా బిజినెస్ జరిగే సెంటర్ ఒకటుంది అది వైన్ షాప్.


    చెక్ పోస్ట్ లో రెండు వైన్ షాపులున్నాయి. అవి జనంతో కిటకిటలాడుతుంటాయి. ప్రజలు అన్నంతిని కాదు, సారా తాగి బతుకుతున్నారనిపిస్తుంది. అక్కడి సీన్లు చూస్తుంటే, అక్కడ శుభ్రత. మచ్చుకైనా కనిపించదు. దీన్ని నమ్ముకుని బతుకుతున్న బిజినెస్ లున్నాయి.


    సినిమా హాల్ పక్కునున్న మెకానిక్ షెడ్ ముందు గోపాల్రావు కుర్చీలో కూర్చునున్నాడు. మెకానిక్ తో పాటు డ్రైవర్ దాసు కూడా ట్రాక్టర్ తో కుస్తీ పడుతున్నాడు. లోపం ఎక్కుడుందో తెలియడంలేదు.


    నగరినుంచి కాశిరాయి చిప్స్ వేసుకుని వస్తుంటే లోడ్ లాగలేక పోయింది. దాంతో ట్రయిలర్ ను అక్కడే వదిలేసి ట్రాక్టర్ ను తోలుకుంటూ వచ్చాడు దాసు.


    ఈ విషయం అప్పుడే తెలిసినా పనులన్నీ ముగించుకుని ,సాయం కాలానికి వచ్చాడు గోపాల్రావు.


    మెకానిక్ షెడ్ కి రాగానే స్ట్రాంగ్ కాపీ తెప్పించుకున్నాడు అతను. అదయ్యాక ఇక సిగరెట్లతో కాలక్షేపం చేయడం ప్రారంభించాడు. ఎంత సేపైనా ట్రాక్టర్ బాగవ్వాలి. టౌన్ లో ఓ ఇల్లు మోల్డింగ్ పని రేపు ప్రారంభమవుతుంది. దానికోసం అర్జెంటుగా చిప్స్ తోలాలి. అందుకే పొద్దుపోతున్నా ఇంటికి వెళ్ళాలనిపించలేదతనికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS