అతనూ కోపంగా "పొగత్రాగరాదు....చేతులు బైట పెట్టరాదు....అని వ్రాసి వుంది కానీ మీకిష్టమైన పుస్తకాలు చదవకండీ, చూడకండీ అని ఎక్కడా వ్రాసిలేదే! ఎందుకు చూడకూడదూ" అన్నాడు.
"అయినా చూడకూడదు. పక్కన ఒక స్త్రీ కూర్చుని వుండగా మీరు ఆ ఫోటోలు ఎలా చూస్తారు?" అన్నాను ఆవేశంగా.
"అంటే ఆ స్త్రీని చూస్తూ కూర్చోవాలా?" అడిగాడు. అతని మొహంలోని వెక్కిరింతకి నాకు కాలింది. "పక్కనున్న స్త్రీని చూస్తూ కూర్చోవడానికి అదేం మీరు టికెట్ కొనుక్కున్న సినిమా కాదు....అన్నాను.
అప్పటికే ఒకరిద్దరు వినోదంగా దగ్గరగా ఒంగి మరీ ఈ గొడవ వింటున్నారు.
"అసలు నేనీ బొమ్మలు చూస్తే మీకొచ్చిన నష్టం ఏమిటి?" పాయింట్ కొచ్చినట్లు ఖచ్చితంగా అడిగాడు.
"అది....అది...నాకు ఇబ్బందిగా వుంది" అనేశాను.
"మీ మానసిక సమస్యకి నేను బాధ్యున్నికాను" అన్నాడు.
ఒకరిద్దరు ఫక్కున నవ్వారు.
"షటప్" గట్టిగా అరిచాను.
కండక్టర్ ఈ గొడవకి దగ్గరగా వచ్చి "ఏమైందిసార్?" అని అడిగాడు.
"ఏం లేదు" అని తల తిప్పుకున్నాను.
"నువ్వే చెప్పు భాయ్.....ఈ బొమ్మలున్నాయని ఈ మేగజైన్ చదవద్దంటుంది. ఆమె ఇష్టం ఏంటి? మీ బస్సులో అటువంటి రూల్స్ ఏమీ లేవుకదా" నగ్నంగా వున్న స్త్రీ పురుషుల ఫోటోని తీసి కండక్టర్ కి చూపిస్తూ అన్నాడు.
కండక్టర్ మొహంలోకి నవ్వొచ్చింది.
"ఇటియ్యిసార్" అని చెయ్యి చాపాడు.
"తప్పా ముందు చెప్పు" అన్నాడతను.
"కాదుగాని....లేడీస్ కి చూడనీకి సిగ్గయితదిలే..." అతను జ్ఞానిలా చెప్పాడు.
"నేను ఆమెని చూడమనలేదు. ఒట్టు" తలమీద చెయ్యి పెట్టుకుని అన్నాడు.
"నువ్వు చూడమనకున్నా....కనిపిస్తదికదా!" అన్నాడు కండక్టర్.
"నేను నా ఒడిలో భగవద్గీత పెట్టుకుని చదివితే ఒంగి చదివేదా.....కనిపించేదా?" అడిగాడు కవ్విస్తున్నట్లు.
ఈసారి ఆడవాళ్ళు కూడా పగలబడి నవ్వారు.
"ఇట్స్ టూ మచ్! మీరింక ఈ గొడవ యిక్కడ ఆపకపోతే చాలాదూరం వెళుతుంది, మీమీద విమెన్ ప్రొటెక్షన్ సెల్ లో కంప్లయింట్ లాడ్జ్ చేస్తాను" అన్నాను.
"ఒక అమాయకుడు బస్ లో పత్రిక చదివితే పోలీస్ కంప్లయింట్ యిస్తారా? విన్నారా మీరంతా?" అన్నాడు.
"ఇదెక్కడ విపరీతం తల్లీ? అతని దోవన అతను చదువుకుంటాడు. నీ దోవన నువ్వు నిద్రపో. లేదా ఇంకేదైనా చెయ్యి అంతేకానీ ఇంత గొడవా?" అన్నాడు వెనక సీట్లోని ముసలాయన.
"అసలేం జరిగిందంటే..." నేను చెప్పబోయాను.
"నువ్వు మాట్లాడిన మొదటి అక్షరం నుంచీ నేను విన్నాను" చెవిలో మిషన్ చూపిస్తూ అన్నాడాయన.
పక్కనతను మొహంలో నవ్వుని బలవంతంగా అదిమిపెడుతున్నాడు.
"అలాంటి పత్రికలు చూస్తే మీరు మనసులో ఏవైనా ఇన్ డీ సెంట్ గా ఆలోచిస్తారేమోనని ఆవిడ భయం అయ్యుంటుందిలే" అన్నాడు ఓ కుర్రాడు వుత్సాహంగా.
"అలాంటి పత్రికలు చూడకపోతే నీ మనసులో అలాంటి ఆలోచనలు రావా? అందులోనూ పక్కన ఓ అందమైన ఆడపిల్ల కూర్చున్నప్పుడు....అదీ రాత్రిపూట....సిన్సియర్ గా నీ ఇష్టదైవం మీద ఒట్టు పెట్టి చెప్పవయ్యా" అన్నాడతను.
ఆ కుర్రాడు సిగ్గుపడి తల వంచుకున్నాడు.
"చూశావా....రావు అని చెప్పలేకపోకపోయావు. ఎవరూ ఆపలేరు ఆలోచనల్ని మగవాళ్ళేకాదు.... ఆడవాళ్ళుకూడా" అని పక్కకి తిరిగి ఓ నడివయస్సు స్త్రీ చేతిలోంచి ఓ పత్రిక అడిగి -
"ఏమ్మా...ఈ పత్రికలో సెంటర్ పేజీలో వున్న సెక్స్ సమాధానాలు మీరు బస్ లో చదవారా? నిజం చెప్పండి? పత్రిక కొని మొదట ఈ పేజే చదివేవాళ్ళని నేను చాలామంధిని చూశాను. వున్నమాట చెప్పడానికి సిగ్గెందుకూ?" అన్నాడు.
ఆవిడ నవ్వి వూరుకుంది.
"ఫర్లేదు. ఇది ఓ ఆడిట్ అనుకోండి. అదే ఏ టీవీ ఛానెల్ వాళ్ళో ఇంటికో...కూరగాయల మార్కెట్లోనో వచ్చి అడిగితే చక్కగా సిగ్గుపడకుండా మనసువిప్పి చెప్పరూ! ఎవరూ చూస్తున్నా పట్టించుకోకుండా టీవీ కెమెరా మీదే దృష్టి పెట్టి నడివీధిలో డాన్స్ కూడా చేస్తారు. ఔనా! మరిప్పుడు టైంపాస్ కి మాట్లాడడానికేం?" అన్నాడు.
అది బాగా పనిచేసింది. ఒక అమ్మాయి లేచి ముందుకి వచ్చి - "పత్రిక ఇంత ఖరీదు పెట్టి కొన్నప్పుడు ప్రతిపేజీ చదవాలి కదండీ" అంది.
అతను గట్టిగా క్లాప్స్ కొట్టాడు.
ఒక అబ్బాయి చేతిలోని పేపర్ ని గుండ్రంగా చుట్టి "మైక్ లో చెప్పండి" అని అందించాడు.
అందరూ ఉత్సాహభరితంగా డిబేట్ లో పాల్గొన్నారు.
ఒక పెద్దాయన అటువంటి డాక్టర్ సలహాల వల్ల, సెక్స్ ఎడ్యుకేషన్ వల్లా నివారించబడే ప్రమాదాల గురించి అనర్గళంగా చెప్తే...ఇంకొక అబ్బాయి 'ఎప్పుడూ మనస్సూ శరీరం ఆరోగ్యంగా వుండడానికి ఖాళీ సమయాల్లో సెక్స్ ఆలోచనలు చెయ్యడం ఒకటే మార్గం' అని అభిప్రాయపడ్డాడు.
ఇంకొక ఆవిడ "శృంగారం అనేది జీవితంలో ముఖ్యమైన రసం అనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోయినా ఫరవాలేదు. కానీ సెక్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే జీవితాలు నిస్సారం అనీ" చెప్పి పాయింట్లు కొట్టేసింది.
ఈ సందట్లో వెనకసీటు ముసలాయన డెబోనెర్ అందుకుని చకచకా పేజీలు తిప్పి చూసేస్తున్నాడు.
ఒకటే కేకలు! చప్పట్లు...హడావిడి!
నేను అతన్నే గమనిస్తున్నాను.
ఒక నిపుణుడైన సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఆ చర్చలో పాల్గొన్నవాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతటి వివాదానికీ, అల్లరికీ సూత్రధారియై కూడా చాలా పెద్ద మనిషి అన్న భావం కలిగేట్లు వ్యవహరిస్తున్నాడు. ఆడవాళ్ళు అతని ముందు సిగ్గుకూడా ఫీలవకుండా తమ భావాలు చెప్పేటట్లు చేస్తున్నాడు. మాట్లాడడమే కాదు చక్కగా ఎదుటి వాళ్ళచేత మాట్లాడింపజేయడం కూడా ఒక కళ! అలాంటి వాళ్ళే ఉత్తమ వీ.జేలుగా పేరు తెచ్చుకుంటారు.
అతను సడెన్ గా నావైపు తిరిగి "వింటున్నారా? మద్యపాన నిషేధం గురించో....విద్యావిధానం గురించో అయితే ఒకరిద్దరు మాత్రమే ఉత్సాహం వుండి మిగతావాళ్ళకి నాలెడ్జి లేక మాట్లాడలేకపోయేవాళ్ళేమో. కానీ ఈ విషయంమీద ప్రతివాళ్ళకీ అవగాహన, అపారమైన ఆసక్తి వున్నాయి. ఇంత ముఖ్యమైన శృంగారం అనే సబ్జెక్ట్ ని అనవసరం....అనాగరీకం...అనుకోవడం ఆరోగ్యకరం కాదు! మీరూ ఏదైనా మాట్లాడండి" అన్నాడు.
