సత్తార్ వైన్ తాగుతూ కొనసాగించాడు.
"....మధ్యప్రదేశ్, రాజస్తాన్ లాటి రాష్ట్రాలు ప్రకృతి పరంగా బీదవి. పంజాబ్, అస్సాం, కాశ్మీర్ లాటి సరిహద్దు రాష్ట్రాలు సహజ సిద్దమైన వనరుల్లో ధనవంతమైనవి. ఇక్కడి ధనాన్ని కేంద్రం అక్కడికి ప్రవహింపచేయడం ద్వారా దేశాన్ని సమతులయం చేస్తుంది. అది నాణేనికి ఒకవైపు. అనవసరంగా మన ఐశ్వర్యాన్ని బీద రాష్ట్రానికి పంచి యిచ్చే హక్కు ఎవరికుంది? అన్న భావాన్ని ఈ రాష్ట్రప్రజల్లో కలిగిస్తే అది నిప్పు రాజుకుంటున్నట్టు మండుతుంది. ఇదొక పద్దతి. మత పూర్వకంగా రెచ్చగొట్టటం మరింత సులభపద్దతి. రోజు రోజుకీ దిగజారిపోతున్న రక్షణ వ్యవస్థలో, మైనారిటీ మతస్తుల్లో, ఈ విధమైన అభద్రతా భావాన్ని పెంపొందించడం చాలా సులభం. ఉన్న పులిని చూపించటం కన్నా లేని పులిని 'చూపించి' భయపెట్టడం, సులభం ఇలాటి మరో రాష్ట్రం ఏమిటా అని మేము ఆలోచిస్తే -మాకు వెంటనే తోచింది మీ రాష్ట్రం-"
అరవింద్ చౌరసియా తలూపాడు. సత్తార్ చెప్పబోతున్నది అతడికి తెలుస్తూనే వుంది. అతడు తన ఆనందాన్ని దాచుకుని వింటున్నాడు.
"రాష్ట్రంలో జరగబోయే పరణామాలు మీకు తెలుసుకదా మా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంటు చాలా సూక్ష్మంగా పరిశీలించి మా ప్రభుత్వానికి పంపిన రిపోర్ట్ తాలూకు కాపీ ఇది" బ్రీఫ్ కేసులోంచి కాగితాల కట్ట తీసి చూపిస్తూ అన్నాడు. దాదాపు యాభై పేజీల రిపోర్టు అది.
"ప్రస్తుతపు హోం మినిష్టర్ తన పార్టీకి రాజీనామా చేసి, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలో చేతులు కలుపుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీని బర్తరఫ్ చేసి, ఏదో ఒక కారణం చూపించి, మళ్ళీ ఎన్నికలు జరిగేలా చేస్తుంది కేంద్రం. అప్పుడు హోం మంత్రి చీఫ్ మినిష్టర్ అవుతాడు. ఢిల్లీలో మొన్న జరిగిన ఒక రహస్య సమావేశంలో ఈ ప్రణాళికకి శంకుస్థాపన జరిగింది. ఎం.పి. పులిరాజుని దీనికి సాయపడవలసిందిగా హైకమాండ్ ఆదేశించింది. అమెరికా రాయబారి పదవి ఆశ చూపింది."
అరవింద్ చౌరసియా ఆశ్చర్యాన్ని అణుచుకున్నాడు. ఎంతో రహస్యంగా జైర్గిన ఈ సమవేశాన్ని కెమేరాలో ఫిల్మ్ తీసినట్టు చెపుతున్నాడు ఈ విదేశీ ఏజెంటు. ఐకమత్యమే మహా భాగ్యము అని చిన్నప్పుడు చెప్పారు. అనైకమత్యం ఇంత వినాశనం అని కళ్ళారా చూస్తున్నాడు. "పాలిటిక్స్ -బ్లడీ పాలిటిక్స్" అనుకోలేదు. ఆ నీచ రాజకీయాలే తనకి కోట్లు సంపాదించి పెట్టబోతున్నాయని అతడికి తెలుసు.
సత్తార్ అన్నాడు, "త్వరలోనే హోం మినిష్టర్ పార్టీ మారి చీఫ్ మినిష్టర్ అవబోతున్నాడు. అది జరిగి తీరుతుంది. ప్రస్తుతం స్టూవర్ట్ పురం జైల్లోవున్న వీరదాసు అనే వ్యక్తి బయటికొస్తే - ఆ పార్టీ తొంభై శాతం సీట్లు ఎన్నికల్లో సంపాదిస్తుంది. అతడు బయటకు రాకుండా "రాణా" అనే ఇన్ స్పెక్టర్ అవుతున్నాడు. ఇప్పుడు రెండు పార్టీలూ కలిసినవి కాబట్టి రాణా ఏమీ చెయ్యలేడు. వీరదాసు బయటికి రాక తప్పదు. ప్రభుత్వం మారకా తప్పదు. దానికి మీ ఆశీస్సులు వున్నాయని మాకు తెలుసు."
చౌరసియా తలూపాడు.
"బయటనుంచి మేము ప్రయత్నించటం వేరు. లోపలివారు మాకు సాయపడడం వేరు. రెండోది జరిగిన పక్షంలో మా పని మరింత సులువు అవుతుంది. ఈ విషయం మీతో ముందే ప్రస్తావించటం, మీరు దానికి వప్పుకోవటం జరిగింది. మిస్టర్ చౌరసియా! ఇప్పుడా సమయం ఆసన్నమైనదని మా దేశం భావిస్తున్నది."
"ఏ విధంగా?"
"రాబోయే ప్రయత్నంలో కాబోయే ముఖ్యమంత్రిని మన వైపుకు తిప్పుకోవటం ద్వారా!! మీ దగ్గర సుశిక్షితులైన యువకులు రెండు వందలమంది దాకా వున్నారు. వారిని టెర్రరిస్టులుగా, ఏరియా కమాండర్ లుగా, కమాండర్ ఇన్- చీఫ్ లుగా మార్చి, రాష్ట్రంలో మత కల్లోలాలు పెంచి, రాష్ట్రాన్ని దేశం నుంచి విడగొట్టే ప్రయత్నం ప్రారంభించాలి. సరిహద్దు రాష్ట్రం కాకపోయినా, తీరప్రాంతం నుంచి మీకు మేము సహాయ సహకారాలు అందజేయగలం. అందుకే రాష్ట్ర ప్రభుత్వపు సహాయ సహకారాలు కావాలని నేను నొక్కి చెపుతున్నది. కేవలం ఆర్నెల్ల పాటు మీ ముఖ్యమంత్రి దీన్ని చూసీ చూడనట్టు వూరుకుంటే ఈ నిప్పు కార్చిచ్చు అవుతుంది. అప్పటికి కేంద్రం మేల్కొని ఒకవేళ పంజాబ్ లోలా ప్రభుత్వాన్ని రద్దు చేసినా, ఆ తరువాత ఆ కాష్టం తగలబడుతూనే వుంటుంది. దీనికి మీరు టి.కె. రెడ్డిని వప్పించాలి."
"కష్టం" అన్నాడు చౌరసియా. "రాష్ట్ర వినాశనం కోసం, within the country దేశాన్ని అలకల్లోలం చేయటం కోసం రాజకీయ నాయకులు ఎన్ని వెధవ్వేషాలు వేసినా మా ప్రజలు క్షమిస్తారు. అది వారి దినచర్యలో భాగంగా భావిస్తారు. కాని టెర్రరిస్టులతో చేతులు కలపడం, శత్రు దేశంతో సంబంధం పెట్టుకోవటంలాంటివి క్షమించరు. ఇంకా అంత ఓర్పు అలవర్చుకోలేదు. దానికింకో అయిదు పదేళ్ళు పడుతుంది. ఏదో పార్టీలు మార్చి ప్రభుత్వాలని పడగొట్టడం లాంటివి చేయగలడేమో గానీ, ఇంత పెద్ద ఎత్తున పరాయి దేశంతో చేతులు కలిపి టెర్రరిస్టు కార్యకలాపాల్ని చేయించగలిగేటంత సమర్ధుడు అతడని నేను అనుకోను".
"చెట్టు లోపలుండి కాండాన్ని తినేసే పురుగు, బైటవుండి కూలదోసే గొడ్డలి రెండూ ఒకటేగా మిస్టర్ చౌరషియా?"
"మూర్ఖులైన మా ప్రజలకి ఆ విషయం తెలియకపోవటం మా రాజకీయ నాయకులు చేసుకున్న అదృష్టం దేశంలో ఒక పార్టీ బంద్ నిర్వహించి రైళ్ళు తగలబెట్టి రెండుకోట్లు నష్టపరిచినా క్షమిస్తారు. కాస్త పొరుగుదేశం వాడి విమానం చొచ్చుకు వస్తే గోల పెడ్తారు!"
సత్తార్ కొద్దిసేపు మౌనంగా వుండిపోయాడు. 'టప్' మని చప్పుడైంది సత్తార్ అన్నాడు-
"సరి అయిన సమయం ఆసన్నమైందని మా దేశం భావిస్తుంది. మన వర్కర్లని రంగంలోకి దింపాలి. రేపు వినాయక చవితి నుంచి ఈ కొట్లాటలు ప్రారంభం కావాలి. మంత్రి మద్దతు మీరు సంపాదించాలి."
"నా మనుష్యుల్ని దింపటం వరకూ నేను చేయగలను. ఇక హోం మినిష్టర్ సంగతంటారా-ప్రయత్నించాలి. దేశ ద్రోహానికి మా దేశంలో ఉరిశిక్ష అమలు జరుపుతారు. మరి అతడు ఎంత ఆశపెట్టినా దీనికి లొంగుతాడో లేదో - అసలే భయస్తుడు."
"అతడి మీద రిపోర్టు కూడా మా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంటు సంపాదించింది మిస్టర్ చౌరసియా...." అంటూ ఫైలు తీశాడు సత్తార్.
"నిజానికి అతడిని కాదు మీరు వప్పించాల్సింది. మీ ప్రియురాలు ఉరఫ్ అతడి భార్య కామినిని...."
పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు చౌరసియా.
మీ....ప్రి....యు....రా....లు
కా....మి....ని.
ఫ్యాను రెక్కలు తిరిగినట్టు ఆ రెండు పదాలు గిర్రున అతడిని వూపేశాయి. అయితే ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి వెంటనే సర్దుకున్నాడు.
"కామిని దానికి వప్పుకోకపోవచ్చు."
"ఆమె వెనుక వుండి తన భర్తని ఆడిస్తుంది మిస్టర్ చౌరసియా నిజానికి ఆమె ఇదంతా చెయ్యవలసింది. ఆమె మీది రిపోర్టు కూడా మా వద్ద వుంది. ఆమె పాము లాటిది. ఆశకు అంతులేదు. ఆమె తప్పక వప్పుకుంటుందని మా అభిప్రాయం."
"పదవి- డబ్బు - హోదా - ఆశ - కసి - అన్నీ ఆమె అభిరుచులు. కానీ దేశద్రోహం.... మ్చ్.... వప్పుకోకపోవచ్చు."
సత్తార్ నవ్వేడు. "ఏ దేశ చరిత్రలోనైనా వర్తమానంలో దేశ ద్రోహం. భవిష్యత్తులో ఫలితం సాధించాక స్వాతంత్ర్యం పోరాటం అవుతుంది అరవింద్ జీ! పదాల మార్పే ఇది. ఎన్నో రాత్రులు ఆమెతో గడిపి వుంటారు. మా ఈ రిపోర్టులు చెప్పిన దాని కన్నా ఆమె మనస్తత్వం మీకే ఎక్కువ తెలుస్తుంది."
అరవింద్ చికాకు అణుచుకుని "తెలుసు కాబట్టే చెపుతున్నాను" అన్నాడు.
సత్తార్ బ్యాగ్ లోంచి మరో కవరు తీశాడు. "ఆమెకు కోహినూర్ వజ్రాన్ని బహూకరిస్తామని చెప్పండి. ఆమె భర్తని కొత్త దేశపు ప్రెసిడెంట్ ని చేస్తామని ఆశ పెట్టండి. వాగ్దానాలేగా ఎన్నైనా చెయ్యొచ్చు."
"అలాంటి సామ దానాలకు ఆమె పడదు."
"అయితే చివరి ఉపాయమే ప్రయోగించంది" అంటూ కవరు విప్పి ముందు పెట్టాడు. వివిధ భంగిమల్లో ఫోటోలు, చౌరసియా- కామిని....
అతడి మొహంలో రక్తం ఇంకిపోయింది.
"ఏమిటిది?" అని అరిచాడు.
"క్షమించండి మా ఇంటెలిజెన్సీ డిపార్ట్ మెంట్ వారు ఎంతో కష్టపడి సంపాదించిన ఫోటోలు-"
చౌరసియా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సత్తార్ కొనసాగించాడు.
"ఏ స్త్రీ అయినా తన జీవిత రహస్యాలను గుప్తంగా వుంచాలనుకుంటుంది. కామినిలాంటి స్త్రీ మరీ....ఈ ఫోటోల ఆధారంగా మీరు అనుకున్నది సాధించగలరు. మీరామెని బ్లాక్ మెయిల్ చేయనవసరం లేదు. రెండువందల కోట్ల విలువైన బంగారం బేరం పెట్టడంద్వారా ఆమెనీ, ఆమె భర్తనీ మనవైపు తిప్పుకుంటున్నామంతే. ఈ విషయాన్ని మేము నిజానికి మీతో మాట్లాడే అవసరం లేదు. ఇంత ఖరీదుకి వాళ్ళతోనే డైరెక్టుగా బేరం పెట్టవచ్చు. కానీ కామిని దగ్గరికి ఆమె భర్తద్వారా వెళ్ళటంకన్నా మీ ద్వారా వెళితేనే మంచిదని మా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ అభిప్రాయపడింది. ఆ ఫోటోలు మీరు వాడుకుంటే వాడుకోండి. లేకపోతే లేదు. అది మీ ఇష్టం."
అరవింద్ చౌరసియాకి - తను సరిగ్గా ఎక్కడ ఇరుక్కుపోయాడో అర్ధమైంది.
చేస్తే-
పని చాలా సులభం.
రెండు వందల కోట్లు లాభం.
చెయ్యకపోతే-
ఫలితం.
పరువు సమూల నష్టం.
అతడు లేచి, సత్తార్ కు షేక్ హాండిస్తూ "ఫోటోలు అవసరం లేదు. మీ డిపార్ట్ మెంట్ దగ్గరే వుంచండి. కామినిని మనవైపు మార్చటానికి నేను ప్రయత్నిస్తాను." అన్నాడు.
"థాంక్స్ చాలా సంతోషం వీలైనంత తొందరగా కావాలి ఇది."
"తొందరేముంది? రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి కదా."
"అవును మారాలి. మారాలంటే వీరదాసు విడుదల కావాలి."
"అదంత సులభం అని అనుకోకు. ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్ గా వుంది. కనీసం రాణాని ట్రాన్స్ ఫర్ చేసే పరిస్థితుల్లో కూడా లేదు ప్రభుత్వం."
వెళ్ళబోతున్న సత్తార్ ఆగి నవ్వేడు. "వాళ్ళు చెయ్యలేకపోతే మేమే చేస్తాం చౌరసియా సాబ్. ఈ లోకంనుంచి పైలోకానికి- ట్రా....న్స్....ఫ.....ర్."
గెస్ట్ హౌస్ నుంచి ఇద్దరూ చెరోవైపుకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమావేశం ముగిసింది.
ఆ విధంగా-
ఒక చిన్న పోలీస్ స్టేషన్ లో, ఒక చిన్న ఇన్ స్పెక్టర్, ఒక రౌడీని అరెస్ట్ చేయడం అనేది రాష్ట్రం దాటి, దేశపు పార్టీలను కుదిపి- అంతర్జాతీయ ప్రాముఖ్యతని సంతరించుకుంది.
అయితే ఈ విషయమంతా అరవింద్ చౌరసియా చెప్పకుండానే కామినికి తెలిసింది. చౌరసియా, సత్తార్ లు మాట్లాడుకుంటూ వుండగా వచ్చిన 'టప్' మన్న శబ్దం - ఆమె అమర్చిన ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ టేప్ రికార్డర్ ద్వారా వచ్చిందే.
