"ఎవరయినా ప్రయత్నిస్తున్నారేమో ఒక్కసారి నన్ను చూడనివ్వండి. వాళ్ళు ఎంతో పెద్ద దొంగలై వుంటారు. లేకపోతే అలా ముందే ఫోన్ చేసి చెప్పరు."
"ఎవడో ఆకతాయి వెధవ ఫోన్ చేసి చెప్పగానే నువ్వు ఇలా హడావుడిగా రావటం చూస్తుంటే అసలు మీ డిపార్టు మెంట్ లో వాళ్ళ తెలివితేటల మీదే నాకు అపనమ్మకం ఏర్పడుతుంది. మీ టైమ్ అంతా వృధా చేసుకుంటూ ఇలా తిరుగుతూనే వుంటారా?"
"అసలు మీ ఇంట్లో ఎంత డబ్బుంది సార్? బాగా ఎక్కువవుంటే ఈ రాత్రికి ఒకరిద్దరు కానిస్టేబుల్స్ ని ఏర్పాటు చేస్తాను."
"అధిక ప్రసంగం అసలు నా దగ్గర ఎంత వుందో తెలుసుకోవటం కోసమే ఇలా అర్దరాత్రి ఇంత చౌకబారు ప్లాన్ మీద వచ్చావా? ఇక నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు."
"సరే వెళ్తున్నాను. ఏదైనా పోతే మాత్రం ఫోన్ చెయ్యండి. స్టేషన్ లోనే వుంటాను. అర్ధరాత్రి నిద్ర లేపటం దేనికి అనుకోకండి" అని రాణా వెనుదిరిగాడు.
అయితే అతడు స్టేషన్ కు వెళ్ళలేదు. పది నిముషాలుండి మళ్ళీ వెళ్ళి నాయుడి ఇంటి బెల్ కొట్టాడు. రెండు నిముషాల తరువాత కళ్ళు నులుముకుంటూ వచ్చి తలుపు తీశాడు నాయుడు. ఎదురుగా రాణాని చూడగానే పెట్రేగిన కోపంతో "మళ్ళీ ఎందుకొచ్చావ్? ఈ రాత్రి నన్ను వదలవా ఏమిటి?" అన్నాడు.
"అదేమిటి? మీరేగా ఇప్పుడు ఫోన్ చేసి - 'వెంటనే రా ఇంట్లో దొంగతనం జరిగింది' అన్నారు ఫోన్ పెట్టేసి ఆఘమేఘాల మీద వచ్చాను" అన్నాడు.
"నేన్నీకు ఫోన్ చేశానా? కలగని వుంటావ్."
"లేద్సార్ మీ గొంతే! బాగా గుర్తుపట్టాను. 'యాభై లక్షల విలువ గల బంగారం, ఇరవై లక్షల నగదూ పోయిం'దన్నారు. 'అంత బంగారం ఎందుకు ఇంట్లో పెట్టుకున్నా'రని అడిగాను. 'ఆ ప్రశ్నలన్నీ ఆపి వెంటనే రా దొంగలింకా ఎంతోదూరం వెళ్ళివుండరు' అని కంగారు పెట్టారు."
"నీకు నిజంగా పిచ్చెక్కింది రాణా! ఎవడో ఆకాశరాముడు ఫోన్ చేస్తే దొంగేమో అనుకుని ఒకసారి వచ్చావ్. మళ్ళీ వాడే గొంతు మార్చి నాలా ఫోన్ చేస్తే అదికూడా నమ్మేసి రెండోసారి వచ్చావ్. అసలు నీలాంటి అన్నప్పిండి మెదడువాడు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాడా అని ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నాను. ఒక ఎమ్మెల్యే గొంతుకీ ఒక ఆకాశరామన్న గొంతుకీ తేడా పట్టుకోలేవా?"
"కొంచెం తేడా అనిపించిందండీ! అదికూడా ఫోన్ లో అడిగాను. ఇప్పుడేగా మీ ఇంటినుంచి వెళ్ళాను గొంతులో తేడా ఏమిటని- దానికి సమాధానంగా 'డెబ్బైలక్షల ఆస్థి పోయిందని కంప్లెయింట్ ఇస్తే గొంతులో తేడాల గురించి అడుగుతున్నావా' అని కసురుతున్నారు."
నాయుడు బిగ్గరగా నవ్వాడు. "ఆ ఆకాశరాముడు ఎవడో నీకు భలే టోపీ వేశాడు. వాడికి సన్మానం చేయాలని వుంది. మీ పోలీసులు ఎంత మూర్ఖులంటే, రేపు వాడే నాలా వేషం వేసుకుని వచ్చినా నేనే అని నమ్మేస్తారు కూడా మీరింత మూర్ఖుల్లా వుండబట్టే ఆ దొంగల ఆటలు అలా సాగుతున్నాయి. వాడిని ఎలాగయినా పట్టుకొని జైల్లో పెట్టు నేనొచ్చి వాడి అంతు తేలుస్తాను. మళ్ళీ ఫోన్ కాల్ వచ్చిందని నా దగ్గరికి వస్తే నీ మీద న్యూసెన్స్ కేసు పెడతాను. అసలు గుళ్ళో జరిగిన అంత పెద్ద దొంగతనం వదిలేసి ఇలా చిన్న కేసులు పట్టుకుని తిరుగుతున్నావేమిటి?"
"ఇంకా గుళ్ళో దొంగతనం ఏమిటి సార్? ఆ నగలు రాత్రే దొరికాయి గదా?"
"అవి గిల్ట్ వని విన్నాను."
"అవీ దొరికాయి ఒరిజినల్, అంటే రెండేళ్ళ క్రితం పోయినవి- అవికూడా దొరికాయి."
నాయుడి మొహంలో నవ్వు మాయమైంది. "ఒరిజినల్ నగలు దొరికాయా?" అన్నాడు.
"ఒరిజినల్ కన్నా బావున్నాయండి. ఫ్రెష్ గా ఇప్పుడే బంగారం కరగబెట్టి చేసినట్టు తాజాగా వున్నాయి."
"ఎలా దొరికాయి? ఎవరి దగ్గర దొరికాయి?" ఎంత అణుచుకుందామన్నా నాయుడు కంఠంలో ఆతృత కనపడుతోంది.
"గంటక్రితమే దొరికాయి."
"ఎక్కడ?"
"చెట్టుమీదనుంచి పడ్డాయి. నేను భగవంతుడిని ప్రార్ధించాను. 'మూర్ఖ జనంతో నిండివున్న మా డిపార్ట్ మెంట్ ని నువ్వే రక్షించాలి తండ్రీ సాయం చెయ్యి అని వేడుకున్నాను. ఆనాడు సుగ్రీవుడు రాముడికి హెల్ప్ చేసినట్టు ఒక కోతి నగలమూటని చెట్టుమీదనుంచి పడేసింది. నేనూ మొదట్లో నమ్మలేదు. పోలీస్ స్టేషన్ కి కంసాలిని పిలిపించి పరీక్ష చేయించాను. అన్నీ శ్రేష్టమైన బంగారానివే అని ధృవీకరించాడు. మొత్తం యాభై లక్షల విలువచేసే నగలు...."
నాయుడు నమ్మనట్టు చూశాడు. నమ్మలేనట్టు గొణుక్కున్నాడు. రాణా అన్నాడు. "పాపం ఇంతకాలం ఆ స్టూవర్ట్ పురం దొంగల్ని పట్టుకొని కొట్టాం. ఈ నగలు ఏ కోతో తీసి వుంటుందన్న అనుమానం మాకు అప్పుడు రాలేదు. గంటక్రితమే వాళ్ళని వదిలేశాం."
నాయుడు సమాధానం చెప్పలేదు. ఇంకా దిగ్భ్రమనుంచి అతడు కోలుకోలేదు.
"వెళ్లొస్తాను సార్. అనవసరంగా అర్ధరాత్రి రెండుసార్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఆ ఆకాశరాముడు ఈసారి ఫోన్ చేసినా, కంప్లెయింట్ ఇవ్వటానికి వచ్చినా వాడిని కటకటాల వెనుక కూర్చోపెట్టకపోతే నా పేరు రాణాయే కాదు. మీరిక నిశ్చింతగా పడుకోండి" అని అక్కడనుంచి కదిలాడు.
నాయుడు తలుపు వేసుకొని లోపలికి వెళ్ళాడు. "ఎందుకొచ్చాడా ఇన్ స్పెక్టర్?" అని అడిగింది భర్తని.
"నా గొంతుతో ఎవడో ఫోన్ చేశాడట- 'దొంగతనం జరిగింది వెంటనే రమ్మని'. ఆ మాత్రం గొంతులు కూడా గుర్తుపట్టలేరు- వీళ్ళు ఇన్ స్పెక్టర్ లు ఎలా అయ్యారో? దానికేం గానీ, గుళ్ళో నగలు దొరికాయట."
"ఏవీ? ఆ గిల్టువా?"
"పిచ్చి మొహవా? గిల్టువి కాదు. ఒరిజినల్లే."
"అదేమిటండీ? వాటిని అప్పుడెప్పుడో - మీరూ మీరూ పంచేసుకున్నారుగా."
ష్! గట్టిగా అనకు! అదే నాకూ అర్ధం కాకుండా వుంది. ఈ పోలీసులు కేసు మాఫీ చేయటానికి రకరకాల వేషాలు వేస్తూ వుంటారు. అచ్చం ఆ నగల్లాంటి నగలు చేయించి, ఎక్కన్నుంచో కాస్త బంగారం సంపాదించి వాటికి కోటింగ్ ఇచ్చి వుంటారు. ప్రమోషన్ కొట్టెయ్యటం కోసం ఇలాంటి పనులు చాలా చేస్తార్లే".
"అవున్లెండి లేకపోతే ఆ పోలీసులు మాత్రం యాభై, అరవై లక్షలు ఎక్కడ నుంచి తేగలరు? అన్నట్టు ఎన్నిసార్లు చెప్పానండీ మీకు- ఆ బాత్ రూమ్ కి వెళ్ళొచ్చి నప్పుడల్లా తలుపువేసి రమ్మని-"
"నేను వెళ్ళందే నువ్వు చూస్తూనే వున్నావ్ గా- నే వెళ్ళి ఇన్ స్పెక్టర్ తో మాట్లాడి ఇలాగే పక్కమీద కొచ్చాను."
"మరి నేను తీశానంటారా?" అంటూ ఆవిడ వెళ్ళి బాత్ రూమ్ తలుపు వేయబోయి, కెవ్వున కేక వేసింది. ఒక నిపుణుడయిన తాపీవాడు చేసినట్టు ఇటుకలు పెల్లగింపబడి, ఒక పెద్ద పెట్టెని వెలికి తీసినట్టుంది. ఆ స్థానం అంతా కొల్లగొట్టబడినట్టుంది.
"ఏవండీ! మన బంగారం..."
నాయుడు ఒక్కదూకులో పక్కమీదనుంచి బాత్ రూమ్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడి పరిస్థితి చూడగానే క్షణాల్లో జరిగిందేమిటో అర్ధమైంది. పక్క రూమ్ లోకి పరుగెత్తాడు.
ఇన ప్పెట్టె తెరిచి వుంది.
బాత్ రూమ్ దగ్గర కూలబడి భార్య రాగాలు తీస్తోంది. మొత్తం నగలు, బంగారం, క్యాషు- అంతా పోయింది. ఎక్కడో దాచుకున్నదంతా దోచేశారు.
ముందు హాల్లోకి వచ్చి ఫోన్ చేశాడు పోలీసులకి.
"హల్లో..... రాణా హియర్" అని అట్నుంచి వినబడింది.
"నువ్వు అన్నంతా అయింది రాణా వెంటనే రావాలి" అన్నాడు కంగారుగా.
"చూడు ఆకాశరాముడూ నువ్వెంత అనుకరించి మాట్లాడినా ఎమ్మెల్యే నాయుడిగారి కంఠానికీ తేడా తెలుసుకోలేనంత మూర్ఖులు కాదు పోలీసులు."
"ఆకాశరాముడు కాదు. ఇక్కడంతా వినాశనం జరిగిపోయింది. డెబ్బై లక్షల ఆస్థి పోయిందని కంప్లైంట్ ఇస్తూంటే గొంతులో తేడాల గురించి అడుగుతున్నావా?"
"సరీగ్గా క్రితం సారి కూడా ఈ మాటే అన్నావ్ వెళ్ళి అక్కడే చెప్తే ఆ నాయుడిగారేమో నాది అన్నప్పిండి మెదడు అన్నారు."
"అయ్యో! నీకెలా చెప్పను? నేను నాయుడి నయ్యా! వెంటనే బయల్దేరి రా-"
"ఇంకోసారి వెళ్ళి ఆయన్ని నిద్ర లేపితే ఈసారి చెప్పుతో కొడతారు. ఆ నాయుడుగారు మంచాయన కాబట్టి రెండుసార్లు వూరుకున్నారు. నీ గురించి చెప్తే 'ఆ ఆకాశరాముడికి సన్మానం చెయ్యాలని వుందయ్యా!' అన్నారు. ఇలా అర్దరాత్రి నామీద ప్రాక్టికల్ జోకులు వెయ్యకపోతే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు? మా పోలీసుల్ని ఇలా ఫూల్స్ చేస్తున్న సందర్భంలో నీకు సన్మానం చేస్తారు."
"రాణా" అట్నుంచి కోపంగా అరిచాడు నాయుడు "నువ్వు వస్తావా- నన్ను రమ్మంటావా?"
"నువ్వే రా-"
చప్పున అట్నుంచి ఫోన్ పెట్టేసిన చప్పుడు.
అయిదు నిముషాల్లో నాయుడు పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. తెల్లవారు ఝామున నాలుగవుతోంది. నాయుడి మొహమంతా ఎర్రగా కందిపోయి వుంది.
లోపలికి వస్తూనే- కోపంతో "పిల్లికి చెలగాటంలా వుంది. రాణా నీ బిహేవియర్. డెబ్బై లక్షలు పోయాయని ఫోన్ చేస్తే వెంటనే వేలిముద్రల వాళ్ళనీ, పోలీసు కుక్కల్నీ రంగంలోకి దింపకుండా జోకులు వేస్తావా" అని అరిచాడు.
రాణా నవ్వి "నాయుడుగారు గొప్ప దూరదృష్టితో ఈ విషయం కూడా ముందే చెప్పారు. 'మీ పోలీసులు మూర్ఖులు వాడు నాలా వేషం వేసుకుని వచ్చినా మీరు నమ్మేస్తారు. జాగ్రత్తగా వుండు' అన్నారు. ఆకాశరాముడూ! కేవలం నిన్ను మా పోలీస్ స్టేషన్ కి రప్పించడానికే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వు అన్నాను. సెల్ లోకి పద. మా నాయుడుగారు వచ్చి నిన్నేం చేయాలో నిర్ణయించేవరకూ లాకప్ లో వుండు" అన్నాడు.
ఇద్దరు పోలీసులు వచ్చి నాయుడిని చెరోవైపూ పట్టుకున్నారు.
"నేనే నాయుడిని!" అని అతడు అరుస్తూ వుండగా తీసుకెళ్ళి లాకప్ లో తోశారు.
వీరదాసు అంతా చూస్తూనే వున్నాడు. నాయుడొచ్చి అతని పక్కన పడ్డాడు.
13
స్టూవర్ట్ పురంలో ఈ విధమైన కథ నాటకీయంగా జరుగుతున్న సమయానికి మరోచోట అరవింద్ చౌరసియా, అబ్దుల్ సత్తార్ ల మధ్య చారిత్రాత్మకమైన సమావేశం ప్రారంభమైంది.
సత్తార్ అన్నాడు. "దేశమంటే పలు సాంస్క్రుతిక, సంప్రదాయాల మేళవింపు. వివిధ జాతుల, మతాల కలయిక. ముఖ్యంగా భారతదేశం లాంటి విస్తీర్ణత, సెక్యులరిజం ఎక్కువగా వున్న దేశంలో ఇది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒక పెద్ద దేశం పక్కనే వున్న చిన్న దేశం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటుంది. మీ కిదంతా తెలియదని నేను చెప్పటం లేదు చౌరసియా సాబ్! మీకు శత్రువైన మా దేశం పవిత్రమైన ఆశయాల కోసం, ఒక సదుద్దేశమైన లక్ష్యం కోసం పాటుపడుతుందని కూడా చెప్పటం లేదు. కేవలం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అయితే ఈ ఎగ్జిస్టెన్స్ అనేది కేవలం బ్రతకడంకోసం కాదు. అంతర్జాతీయంగా మేము బలం చేకూర్చుకోవటానికీ, మా దేశంలో పజల్ని ఆకట్టుకోవటానికీ మా వాళ్ళు చేసే ప్రయత్నం అది. పక్కనున్న దేశం ఎంత చిన్న చిన్న భాగాలుగా చీలిపోతే అంత అభద్రతా భావం మాలో తొలగిపోతుంది."
