Previous Page Next Page 
మమత పేజి 26

"వద్దు పిన్నీ... వద్దు, నేనింత ఆశ్రమాన్ని బాధ్యతగా చూడగలనా, వద్దు!" అంది.
ఎంతో భయంగా వుంది లీలకి- తనకి ఏమొచ్చునని! తన చదువెంత, తన బతుకెంత- ఏదో అనాధలా తన బతుకు గడిచిపోతే చాలదా!
అక్కడున్న వాళ్ళంతా లీల వుండటానికి ఇష్టపడ్డారు. లీల అప్పటికే ఆమె ఆధ్యాత్మిక మార్గంవల్ల అందరి మనసులు గెల్చుకుంది. లీల సేవాధర్మం అందరికీ ఇష్టమే. తులసమ్మ పెద్దదైపోయింది... లీల ఆ స్థానంలో రావడం అందరూ కోరుకుంటున్నదే.
తులసమ్మని లోపాలకి చేయిపట్టి తీసుకెళ్ళింది లీల.
"ఒక్కసారి, ఇంకా ఆశ వుందా పిన్నీ!" అంది విరాగిలా నవ్వి లీల.
 "తీసికెడతావు కదూ!" అంది మళ్ళీ.
"అలాగే, ఇప్పుడు ఎండగా వుందిగా, చల్లబడనీ!" అంటూ లోపలకెళ్ళి అన్నం పళ్ళెంలో పెట్టి తెచ్చింది.
తులసమ్మకి అన్నం తినాలనే అనిపించలేదు. నిద్ర రావటం లేదు....ఏదో ఆవేదన, ఏదో తృప్తి, ఆనందం!
"లీలా... ఇవాళ నిన్ను తప్పకుండా ఆ సుమతిని కలిపిస్తా.... ఆ పిల్లని ఎక్కడ దాచారో, ఎవరైనా అమ్మెసారో కనుక్కుని దాని ముఖాన తిట్లు గుమ్మరించేస్తా- మన పిల్లని మనకివ్వకపోతే- దాన్ని, దాని మొగుడ్నీ కూడా పోలీసులకి పట్టిస్తా- పిల్లల్ని అమ్ముకోవటం వ్యాపారమైపోయిందా- వాడికి బుద్ది లేకపోతె దానికుండొద్దూ- ఆడది కాదూ- తల్లికాదూ-" తులసమ్మ ఆవేస్మతో ఊగిపోతోంది.
లీలకి భయమేస్తోంది తులసమ్మ చూపులు ఎటో అలా చూస్తూ మంచంమీద నుండి కిందపడిపోయింది తులసమ్మ! లీల కొయ్యబారిపోయింది.
తులసమ్మ ప్రాణం అనంతావాయువుల్లో కలిసిపోయింది.
"పిన్నీ, ఇప్పుడు నిజమగానే నేను వంటరిదాన్ని!" అంటూ నేలమీద పడి పొర్లిపొర్లి ఏడ్చింది లీల.  
                                     *    *    *
చెన్నమ్మ పట్టిన పట్టు వదల లేదు.
ఈ రాజీవ్ ఎవరో తను తెలుసుకోవాలి. ఈ పిల్లని ఎందుకిక్కడ వుంచాడో తెలుసుకోవాలి- అనేది ఒకటే ఆరాటం చెన్నమ్మకి.
"అమ్మా... ఆ రాజీవ్ బాబు..."
చెన్నమ్మ ఏమంటోందో తెలుసుకోకుండా "వచ్చాడా..?" అంది జానకి.
"అబ్బే, నేనడుగుతున్నా ఊరికే..! అంత పెద్ద పట్టుపరికిణీ బట్ట తెచ్చి యిచ్చాడంటే ఈ పిల్లకేమీ కాకపోతే ఎందుకు తెస్తాడూ, మీరే చెప్పండి... బహుశా ఆ పిల్ల..."
"చెన్నమ్మా- ఎక్కువ మాట్లాడుతున్నావ్- నోరుమూసుకో!" అరిచింది జానకి.
చెన్నమ్మ ముసిముసిగా నవ్వుకుంది. తన గుండెల్లో వున్న మంట ఎలాగూ చల్లారదు. తను చూస్తూ ఇంత అన్యాయం సహించాలా? -ఎవరైనా న్యాయన్యాయాల గురించి మాట్లాడవచ్చు- ఎవరైనా ధర్మం గురించి ఆలోచించచ్చు- తప్పేంటీ? చెన్నమ్మకి ఆరోజు అయ్యగారిమీద, అమ్మగారిమీదా చాలా కోపమొచ్చింది. తను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు- ఏ ఇంట్లో కష్టపడ్డా పొట్ట గడుస్తుంది- కానీ, చెన్నమ్మ అటు చూస్తుంటే సతీష్, సుబ్బి కనిపించారు.
సతీష్ కుక్కని ఒళ్ళో పెట్టుకుని రహస్యంగా సుబ్బితో మాట్లాడడం, ఈ పిచ్చిపిల్ల ఆ మాటలు శ్రద్దగా వినటం గమనిస్తోంది చెన్నమ్మ.
"చిరిగిన చొక్కా కుట్టుకోవేం?!" అని చిరిగిన గౌను సరిచేసాడు సతీష్.
సుబ్బి సిగ్గుగా నవ్వి- "అబ్బా... వదులు, కుట్టుకుంటాలే!" అంది.
"ఇలారా..!" అంది చెన్నమ్మ వంటింట్లోంచి సుబ్బిని.
సతీష్ కంగారుగా చేతులు తీసేసాడు వెనక్కి.
సుబ్బి లోపలికి రాగానే- చెంపమీద ఒక్కటి కొట్టింది చెన్నమ్మ.
సతీష్ ఏమీ ఎరగనట్టు ముందుగదిలోకెళ్ళి పేపరు తిరగేస్తున్నాడు. సుబ్బి ముఖం కోపంతో కందగడ్డలా అయింది.
"ఆ అబ్బాయితో నువ్వు ఇంకోసారి మాట్లాడితే అయ్యగారితో చెప్తా!" అంది చెన్నమ్మ.
అంతలో ఫోను మోగింది... చెన్నమ్మ గబుక్కున తీసింది. "ఎవరూ..." చెన్నమ్మ గొంతు వినగానే ఆనందంతో ముఖం మెరిసింది.
"అయ్యా, నేను వంట మనిషిని! ఆ... పాప బడికెళ్ళిందయ్యా!" ఎందుకో- అంతలోనే ఫోన్ కట్టయింది. చెన్నమ్మకి చాలా విచారమేసింది. మళ్ళీ ఫోన్ చేస్తే బాగుండును!! నిజం చెప్పేస్తే ఏమయ్యేదీ!!
సందులో సతీష్ సుబ్బి బుగ్గలకి తను తెచ్చిన పౌడరు పూసాడు.
"సాయంత్రం నీకు బిస్కట్ పేకట్ తెస్తా!"
సుబ్బి సిగ్గుతో తలూపింది. సతీష్ అటూఇటూ చూసాడు. సుబ్బి బుగ్గలు  గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
సుబ్బి గుండెలు ఆగిపోయినట్టయింది. శరీరం ఒక్కసారి పులకించింది. మళ్ళీ భయం వేసింది... అలా చూస్తుండగానే సతీష్ స్కూటర్ పై వెళ్ళిపోయాడు.
సుబ్బి తన బుగ్గల్ని తడిమి చూసుకుంది.... ఆ అబ్బాయి మీసాల పెదాలు మళ్ళీ ఆ యవ్వనపు బుగ్గలపైన కదులుతున్నట్టనిపించింది... కళ్ళు మూసుకుని మెట్లమీద కూచుంది సుబ్బి.
'మళ్ళీ ఫోన్ వస్తే బాగుండును- ఆ రాజీవ్ అయ్య ఫోన్ నెంబరు అడిగేదాన్ని కదా..!' అని చాలా విచారంగా కూచుంది చెన్నమ్మ వంటింటి గుమ్మం ముందు.   
                                   *    *    *
తులసమ్మ మరణించటం లీలకి పెద్ద దెబ్బ.
తులసమ్మ వున్నపుడు ప్రేమగా తనని చూసినవాళ్ళంతా ఇప్పుడు తనపై పెత్తనం చేస్తున్నారనిపించింది.
తిరుపతమ్మకి అందరిలోనూ ధనవంతురాలినని గర్వం. ఆవిడే చంద్రయ్యకి దూరపు చుట్టం. భర్త తరుపున వచ్చిన ఆస్తి అమ్ముకుంది. డబ్బు బ్యాంకులో వేసుకుంది. నెల తిరిగేసరికి డబ్బు చేతిలో వుండేసరికి ఓసారి 'షిర్డీ వెడుతున్నా....' అంటూ చంద్రయ్యని వెంటబెట్టుకెళ్ళింది తులసమ్మ వున్నపుడు.
మరోసారి పదిహేనురోజులు తీర్ధయాత్రలకని చంద్రయ్య కుటుంబంతో కలిసి వెళ్ళింది. అక్కడున్న అందరికన్నా తను ప్రత్యేకం అనుకుంటుంది.
ఈ విషయం గ్రహించిన తులసమ్మ తిరుపతమ్మతో ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించేది. ఏమి కల్పించి చంద్రయ్యకి చెప్తుందో...చంద్రయ్య ఆశ్రమాని కొచ్చి ఏమి అల్లరి చేస్తాడోనని ఎప్పుడూ భయమే - ఇప్పుడు తులసమ్మ లేకపోవటం, చంద్రయ్యని వెళ్ళగొట్టడం తిరుపతమ్మ కోపానికి కారణాలు. తెల్లవారేసరికి గుమ్మంలో ప్రత్యక్షమైన చంద్రయ్యని చూసి కంగారుపడి, భయపడిపోయింది లీల.
తిన్నగా తిరుపతమ్మ గదిలోకి వెళ్ళిపోయిన చంద్రయ్య- కాసేపాగి లీల దగ్గరకొచ్చాడు. తులసమ్మ మరణించినందుకు లీలతో ఓదార్పు మాటలు అన్నాడు-
"ఊ, ఏమిటి చెప్పు - ఆ ముసల్ది ఈ బాధ్యతంతా నీ నెత్తిన పెట్టిందటగా!" అన్నాడు.
"బాధ్యత స్వీకరించటం నాకిష్టమే! అయినా....అన్ని అమర్చినట్టున్నాయి- కష్టమంతా పిన్నే పడింది పాపం!" అంది లీల.
"అంత తేలికనుకోకు, నాలుగురోజులు పోయాక నీకే అర్ధమవుతుందిగా!" అన్నాడు.
లీల మాట్లాడలేదు. ఆ సాయంత్రం చంద్రయ్య వెళ్ళిపోయాడు. "హమ్మయ్య..!" అనుకుంది లీల.
ఓరోజు అనుకోని విధంగా లీలకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఆ ఆశ్రమనికి విరాళాలందించి, ఆశ్రమాన్ని నెలకొల్పిన రాజభూషణంగారు ఆశ్రమానికొచ్చారు. ఆశ్రమం వాళ్ళందరినీ పిలిచారు. తులసమ్మ మరణం గురించి విచారిస్తూ- "ఇంత చిన్న వయసులో అంత బాధ్యత వహించడం కష్టం. పైగా... చంద్రయ్యగారు చెప్పారు- ఈమె భర్తనీ, సంసారాన్నీ వదులుకొని సేవ చేయటం ఆదర్సమైన విషయమే. కానీ, ఆమె సంసారం, బాధ్యత వదులుకోటం మా మనసుకి నచ్చలేదు. కనుక ఈ ఆశ్రమానికి మొదటినుంచి వున్న తిరుపతమ్మని ఆ బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాను" అన్నాడు.
అందరూ అంగీకరించారు.
చంద్రయ్య, తిరుపతమ్మ ముఖాలు వెలిగిపోయాయి.
నోట మాటరాక స్థాణువులా నిలిచిపోయింది లీల.
రాజభూషణరావు వెళ్ళిపోయాక, చంద్రయ్య లీల గదిలో కొచ్చాడు-
"నువ్వు ఇక్కడే వుండు. ఆ సుధాకర్ మనసు మార్చుకువచ్చి తీసికెడితే వెళ్ళు లేకపోతే దిక్కులేని ఆడదానిని ఎక్కడికి పోతావ్?" అన్నాడు.
నిజంగానే ఎక్కడికి పోతుందీ..? - సుధాకర్ వస్తాడని నమ్మకం లేదు. లీల నీళ్ళు నిండిన కళ్ళతో చంద్రయ్యను చూస్తూ నమస్కరించింది.
ఆశ్రమంలో వెనకవున్న ఇంట్లో చంద్రయ్య, భార్య వుంటున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS