Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 26

   
    బాబు మెడపట్టుకొని దవడమీద బలంకొద్దీ ఒకటి చరిచాడు గౌరీనాధం. "నా ఇంట్లోనే దొంగతనవంట్రా యెదవకొడక! వేలెడున్నావో లేదో...."

    బాబు బావురమన్నాడు. గౌరీనాధం భార్యా, గంగీ లేచి ఏమీ అర్ధమవక చూస్తున్నారు. గౌరీనాధం అడిగాడు. "ఏం చేస్తున్నావు యిక్కడ?"

    "ఓ రూపాయి అవసరమొచ్చింది....." అమాయకంగా ఆందోళనగా అన్నాడు బాబు.

    "ఏం?"

    బాబు మాట్లాడలేదు. అతని కాళ్ళూ, పెదిమలూ , చేతులూ అతి తీవ్రంగా వణుకుతున్నాయి. జవాబు చెప్పని పెంకెతనానికి గౌరీనాధం తిరిగి లాగి కొట్టాడు.

    బాబు సహనశక్తి యింక తాళలేకపోయింది. అతని కళ్ళల్లో పెద్దభయం నిస్పృహా నీచంగా వెలిగాయి. ఏదో చెప్పరాని తిరుగుబాటు అతనిలో కలిగింది ప్రక్కనున్న కర్రపేడు తీసి గౌరీనాధంమీద విసిరాడు. "నీ అమ్మ..... నీ.... దొంగనంజకొడక" అని తిట్లు అతను అప్పచెప్పేస్తున్నాడు. గౌరీనాధం పక్కకి తప్పుకున్నాడు. ఈ తిరుగుబాటికి గౌరీనాధం ఒక్క నిముషం ఆశ్చర్యంతో అలా నుంచునిపోయాడు.

    "దొంగనంజకొడక, గుడిసేటికొడక.... నీ అమ్మా..." ఇలా తిట్టుకుంటూ బాబు తన మూటని చేత్తో పట్టుకొని ఆ అర్ధరాత్రి వీధిలోకి గంతేశాడు. గంగి గుమ్మం దగ్గరకు పరుగెత్తి "నా సంగీతపెట్టి యిచ్చెయ్" అని కేకలేసింది. వినిపించుకోకుండా దట్టమైన ఆ చీకట్లో గూడెం రోడ్డుని పరుగెత్తుకుపోయాడు బాబు.

    కొంతసేపటికి తిరిగి అందరూ పడుకున్నారు. గౌరీనాధం గుర్రు కుక్క మొరిగినట్టుగా వినపడుతోంది. గుడి సెలవెనుక తుమ్మలబీడు చీకట్లో చీకటిలా వుంది.

    బాబు ఎక్కడికి ఆ చీకట్లో వెళ్ళిపోయాడో అమయిపోయాడో తెలియదు. కాని తిరిగి ఆ కార్ఖానాకి మాత్రం రాలేదు.

                                                  (విశాలాంధ్ర, 1948)

                                   **********


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS