Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 27

               
                                                   యవ్వనం

    ఆ రోజున విశాలలో ఎప్పుడూలేని ఉత్సాహం సముద్రపు కెరటాల్లా పొంగింది. ఆమె కళ్ళలో కాంతి, చెక్కిళ్ళలో ఎర్రదనం, ఆమెకి మరింత అందం తెచ్చాయి. వసంత కాలపు పూలతోనూ, పాటలతోనూ ఆమె హృదయం నిండిపోయింది.

    ఆమె నడకలోని వయ్యారమూ, పెదవుల్లో పరవశించే మెరుపూ, పెద్ద వాల్జడలో కిలకిల నవ్వే పువ్వులూ, ఇవన్నీ రోజూ చూస్తూండే భర్త శాస్త్రి హృదయంలోనే గిలిగింతలు పెట్టినై. ఆ రోజుకు ఆఫీసుకు సెలవుపెట్టితే బాగుంటుందనుకున్నాడు. కాని, బాధ్యత అతన్ని వెనక్కి లాగింది.

    ఆ అందాన్ని జేబులో దాచుకొని, తర్వాత రోజు వరకు జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ఎంతో బావుండుననిపించింది. అద్దం ఎదురుగా కురుల్ని దిద్దుకుంటూన్న విశాలని చూచి గర్వపడ్డాడు, తన మిత్రుల భార్యలతో పోల్చికొని. జీవితానికి సంపూర్ణతా సంతృప్తి యిచ్చింది విశాల. కాని రైలుకి వేళ దాటిపోతుంది. చిన్న సూట్ కేస్ చేత్తో పట్టుకుని, వెనకాలకే వెళ్ళి, "ఈవేళ ఎంతో బావుందండీ! సెలవు పెట్టండీ" అంది విశాల అతని వొళ్ళోకి జరుగుతూ.

    ఆలోచించాడు శాస్త్రి. నూరు వసంతాలు శోభించే ఆమె సన్నిధికి దూరమైపోవటం తెలివితక్కువ అనుకున్నాడు. "సరే, కలం కాగితం తీసుకురా!" అన్నాడు. విశాల తీసుకువచ్చింది. శాస్త్రి ఆమె కళ్ళల్లోకి చూశాడు. విశాల సౌందర్యాన్ని నవ్వింది.

    శాస్త్రి ఉత్తరం పూర్తిచేసి కవరులో పెట్టాడు. ఇంతలోకీ, అతని మొహంలో భయం గోచరించింది. పెద్ద ఇంజనీరు ఇన్ స్పెక్షన్ కి వస్తే? తన ఉద్యోగం ఊడుతుంది. తిండిలేక విశాల, తనూ ముష్టెత్తుకోవాలి! ఏదో తెలీని బాధ అతన్ని ఆవరించింది.

    వెన్నెల, వెన్న చేతులతో 'రా, రా' అని పిలుస్తుంటే, చీకటి మొండిదేహాన్ని కౌగిలించుకుంటున్నట్టుగా అనిపించింది. విశాల గడ్డం పట్టుకుని, 'ఈవేళ యినస్పెక్షను జరుగుతుంది. వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు విశా! రేపు మధ్యాహ్నానికి తప్పక వచ్చేస్తా' అంటూ ఆమె ముద్దిడికొని వెనక్కి తిరిగి చూడకుండా, యుద్దానికి వెళ్ళబోయే సైనికుడిలా, తడబడుతూ గుమ్మం దాటాడు.

    విశాలకి కోపం వచ్చింది -ఉద్యోగం మీద యవ్వనులకి ఉద్యోగ మేఁవిటీ! అందుకే అడవుల్లో వుంటే బావుంటుంది. చెట్లూ, కొండలూ, సరస్సులూ, నెమళ్ళూ, స్వేచ్ఛ! కాని అకకడ సింహాలూ , పెద్దపులులూ వుండవూ! బాబోయ్! నవ్వుకొంది. తన పిచ్చి ఆలోచనలకి.

    ఏమీ తోచలేదు. ఇల్లంతా ఒకమారు తిరిగింది. బీరువాలోంచి పుస్తకాలు తీసింది - తిరిగి బీరువాలోకి విసిరింది. పెరటిలోకి వెళ్ళి మల్లెలూ, మందారాలూ, గులాబీలూ కోసి, నిర్లక్ష్యంగా కొన్ని తల్లో పెట్టుకుని, కొన్ని మంచంమీద విసిరింది. ఉయ్యాలలో ఊగుతూ, ఊగుతూ ఆకాశాన్ని ముట్టుకోవాలనిపించింది. భర్త డ్రాయరు తెరచింది. పాడైపోయిన పౌంటెన్ పెన్నూ, కాగితపు ముక్కలూ, స్నేహితుల ఫోటో ఒకటీ ఉన్నాయి.

    అదిగాక ఏదో కవురు వుంది. ఏమై ఉంటుంది ఆ కవరు? 'క్యూరియాసిటీ' తో పైకి తీసి యెడ్రసు చదివింది. 'శ్రీమతి రత్తమ్మకు' అని వుంది. ఆమె చెయ్యి వణికింది. కళ్ళెర్రబడ్డాయి. ఈ రత్తమ్మ ఎవరు? ఎంత చపలత్వం, ఎంత దొంగబుద్ది ఈ మగవాళ్ళది? అసూయతో, భయంతో కవరు చించి ఉత్తరం ఇలా చదివింది.

    "శ్రీ మహాలక్ష్మీ సమానురాలైన రత్తమ్మ అత్తయ్యకు....

    ఫక్కున నవ్వింది విశాల. ఎంత అసూయానపడింది. తనైతే -ఎప్పుడేనా భర్తకి ద్రోహం చేస్తుందా! ఇంకా ఏం రాశారో ఈ ఉత్తరంలో!

    "....నా భార్యా, నేనూ సుఖంగా ఉంటున్నాము. ఇదంతా నీ ఆశీర్వాద ఫలితం. నిజంగా అటువంటి పెర్ ఫెక్టు -అంటే ఆదర్శపూర్వకమైన....ఎవరికీ లేదు నా పూర్వజన్మ సుకృతం....."

    పాపం! ఆయనెంత మంచివారు తన్నెంత ప్రేమిస్తున్నారు. ఈ పాటికి కాకినాడ వెళ్ళేవుంటారు. అక్కడ రోడ్డు కంకరా, గింకరా వేయిస్తారట. ఇదేం ఇనస్పెక్షనూ -బొగ్గుల ఇనస్పెక్షనూ!

    "నేనే రాణినయితే -ఈ ఉద్యోగాలు తీయించేస్తాను. యవ్వనులకీ తోటలూ, సరస్సులూ ఉన్నచోట నివాసం ఏర్పరుస్తాను........ అబ్బ, గడియారం ఒకటి కొట్టింది....."అంటూ ఆలోచించుకుంటూ విశాల నిద్రలో మునిగిపోయింది.

    నిద్ర లేచేటప్పటికి ఐదుగంటలైంది. ఆమె కళ్ళలో లేత ఎరుపు చాయలు లోన అణగివున్న కోర్కెల తీవ్రతని ప్రకటిస్తున్నాయి. ఆమెకి తెలియకుండానే ఆమె పెదవులమీద చిర్నగవూ, కన్నులలో బరువైన నీలినీడలూ నాట్యమాడుతున్నై తిన్నగా వెళ్ళి టాయిలెట్ చేసుకొని లేత గులాబి జార్జెట్ చీర కట్టింది. తల్లో మందారాలూ, మల్లెమొగ్గలూ తురుముకుంది. గోడమీద రాధాకృష్ణుల బొమ్మను తదేక ధ్యానంగా చూస్తూ నిలబడిపోయింది. ప్రపంచాన్నంతా ఒక్కసారిగా హత్తుకోవాలని ఆమెకి కోరిక కలిగింది. తిరిగి ఆ కోరికకు భయపడి నిందించుకొని, ఫిడేలు తీసి తంత్రి మ్రోగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS