Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 25

    "అణ్ణి -ఆ ఈరన్న నంజకొడుకుని" గంగి పక్కున నవ్వింది. ఇంతలోకే తీవ్రంగా మొహం పెట్టి.
 
    "నా దగ్గర పెద్ద కత్తి ఉంది. మాంచి కత్తి! దాంతో సంపెయ్యడానికి బావుంటుంది" అంది.

    "నిజం?"

    "ఆఁ"

    "అయితే ఇంటికి పోదాం పద గంగీ" అన్నాడు బాబు.

    ఆ మసక చీకట్లో ఈ విధంగా వీరన్నని చంపెయ్యడానికి తీర్మానించుకొని యిద్దరూ ఇంటికి బయల్దేరారు. బాబు గుండెల్లో పెద్ద కోపం, ఏడుపూ, ఉక్రోషం నిండుకుని ఉన్నాయి. కాని గంగి సహాయంతో వీరన్నని సులువుగా చంపెయ్య వచ్చునని తెలుసుకున్నాక అతని మనస్సు తేలిక పడింది.

                                        4

    ఈ రెండు మూడు రోజుల నుంచీ బాబుని తన అజమాయిషిలో ఉంచుకున్నాడు గౌరీనాధం. బాబు సగం సగం పనిలో పారిపోవడం, మేకులు తప్పుగా కొట్టడం, దురుసుగా మాట్లాడటం గౌరీనాధానికి చాలా కోపం కలిగించాయి. "బండికి కట్టిన గిత్త మొదట్లో మారాము చేస్తుంది. నాలుగు దెబ్బలు తగిలితే గాని దారిలో పడదు" అన్నాడు వీరన్నతో. నిజం కూడా అంతే. స్వతంత్రంలోంచి దాస్యంలోకి పోయేముందు ప్రతి జాతీ, ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువు కూడా ఓపికలేని తిరుగుబాటుని చేస్తాయి.
 
    రేగిన జుట్టుతో, కాలిన మొహంతో బాబు దూలపు చెక్కలు మోస్తున్నాడు. వీరన్నని చంపలేకపోయే బాధ అతనికి యెక్కువగా ఉంది. "సంపితే పోలీసులు జైల్లో పెడతారు ,కదూ....." అంది గంగి. బాబుకి భయం వేసింది కాని గంగి అంది "నువ్వు పోలీసు అవకూడదూ"

    "ఎల్లాగ?" అన్నాడు బాబు.

    "పట్నం ఎల్లితే సెపుతారు"

    "ఉహూఁ" అన్నాడు బాబు. పోలీసు అయాక వీరన్నని చంపటానికి తీర్మానించుకున్నాడు.

    ఇంటికి వచ్చాక ఆ రోజున సాయంత్రం బాబు గంగితో అన్నాడు "నీ బాబు దొంగ నంజకొడుకు"

    గంగికి కోపం వచ్చింది "ఏం?" అంది.

    "ఈ యెల బరువైన సెక్కలన్నీమోయించాడు. నాకు ఒళ్ళు నొప్పులెత్తింది" బాబు గద్గదికంగా అన్నాడు. గంగి జాలిగా "మా బాబు దొంగనంజకొడుకే -పాపం" అంది. బాబు కళ్ళమ్మట నీళ్ళు బొట బొట ప్రవహించాయి.

    "కల్లు తాగితే వొళ్ళు నొప్పులు పోతాయి" అంది గంగి.

    "ఎవరు సెప్పారూ?"

    "మా బాబు రోజూ చందాల తాగి వత్తాడు"

    "మరి కల్లు ఎవరు పోత్తారు?" అని అడిగాడు బాబు కళ్ళు తుడుచుకుంటూ.  "ఓస్ తెలియదూ.... దూరంగా అక్కడ పోలేరమ్మ గుడికాడ సందులో....."

    "ఊరికే పోత్తారా?"

    ఉహుఁ -ఓ రూపాయి యిత్తే పోత్తారు."

    "నువ్వు కూడా తాగుతావా?" అన్నాడు బాబు.

    "నా కొల్లు నొప్పులెత్తందే ఎందుకు" అంది గంగి.

    అర్ధరాత్రివేళ బాబుకి మెలుకువ వచ్చింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. గౌరీనాధం గుర్రు కుక్క మొరిగినట్టుగా వినబడుతోంది. బాబుకి వొళ్ళు సలుపుతోంది. అంతా భుజంమీద దూలపు చెక్కలు బరువుగా ఉన్నట్టే అనిపించింది.'కల్లు తాగితే-' అనుకున్నాడు బాబు. 'ఓ రూపాయి అవుద్ది' అనుకున్నాడు ఒత్తిగిల్లుతూ.

    బాబు మెల్లగా లేచాడు. దీపం శెమ్మా ఒకమూల వెలుగుతోంది. గౌరీనాధం, పెళ్ళమూ ఒకళ్ళొకళ్ళు దగ్గరగా పడుకున్నారు. గంగి వేరే పడుకుంది. బాబు కళ్ళు రహస్యంగా భయంగా యిటూ అటూ చూశాయి. గోడకి పక్కగా ఉన్న కర్రపెట్టె మూత తిప్పబోయాడు. రాలేదు. తాళం గట్టిగా లాగాడు. చప్పుడయింది. అప్రయత్నంగా. "యెదవపెట్టె ఎంత లాగినా మూతరాదు" అంటూ గట్టిగా లాగాడు. గౌరీనాధం గబుక్కుని లేచి మంచం మీదనుంచి ఉరికాడు. దీపపు గుడ్డి వెల్తురులో కంగారు పడుతూ ఉన్న బాబు ముఖం కనబడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS