Previous Page Next Page 
చదువు పేజి 25

                    

                                                                       ౧౦

    మళ్ళీ చలికాలం వచ్చింది. హైస్కూలు పిల్లల్ని___ కావలసిన వాళ్ళని__అణా అణా ఇచ్చి యూనియన్ జాక్ అనే బ్రిటీష్ పతాకాలు కొనుక్కోమన్నారు. అక్కర్లేనివాళ్ళూ, కొనలేనివాళ్ళూ మానవచ్చునని మేష్టరు చెప్పాడు. ఒక్కడు కూడా "నాకు కావాలి" అని తనంతట తానుగా అనలేదు. మేష్టరు పేరు పేరునా అగిగాడు. అప్పటికీ కొందరు తమ తల్లిదండ్రుల నడగాలన్నారు. దగ్గర అణాడబ్బులుండే అదృష్టవంతులు నలుగురైదుగురు జెండాలు కొనేశారు.

    ఈ జెండాలు ఎందుకుకొనాలో మేష్టరు వివరించి చెప్పాడు.

    "ప్రస్తుతం ఇంగ్లాండుకూ జర్మనీకీ మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇంగ్లీషువాళ్ళ సామ్రాజ్యం ప్రపంచమంతటా, అన్ని ఖండాల్లోనూ ఉన్నది. అందుకనే రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యమన్నారు. ఈ ఇంగ్లీషువాళ్ళకింద సామ్రాజ్యం ఉండిపోయిందే అని జర్మనీవాళ్ళకు కుళ్ళుకుట్టి, ఇంగ్లాండుతో యుద్ధం తెచ్చిపెట్టారు. అయితే ధర్మం ఇంగ్లాండు పక్షానఉన్నది. గనుక  ఇంకా అనేక దేశాలు ఇంగ్లండు పక్షానయుద్ధం చేస్తున్నాయి. ఇన్ని దేశాలతోనూ జర్మనీ ఒంటరిగా యుద్ధం చేస్తున్నదంటే జర్మనీకూడా సామాన్యమైంది కాదుమరి! ఎంతో బలం ఉన్నదన్నమాట. అంతమాత్రాన ఇతరులసొత్తు కాజేయ్యటం మంచిది కాదు. నేను బలంగలవాణ్ణిగదా అని మీ జేబుల్లో ఉండే డబ్బులన్నీ లాక్కాకోవచ్చా? తప్పు! ఇంగ్లీషు వాళ్ళ సొత్తయిన సామ్రాజ్యాన్ని జర్మనీ లాక్కోవాలని చూడటం అటువంటిది_"
 
    "యుద్దంలో జర్మనీ గెలిస్తే ఏమవుతుందండీ, సార్?" అన్నాడొకడు.

    "ఏమవుతుందీ? మనల్ని జర్మనీవాళ్ళు పరిపాలిస్తారు. ఇంగ్లీషుమానేసి జర్మనుబాష నేర్చుకోమంటారు."

    సుందరం ఆలోచిస్తున్నాడు__ జర్మను భాష నేర్చుకోవాలంటే మళ్ళా తను వీధిబడిలో చేరాలి. ఆ భాష  చెప్పటానికి మేష్టర్లుండరు. అది తనకు కొంచెమన్నా రాదు. మేష్టర్లు దొరికి తను జర్మను భాషలో స్కూలుఫైనలు పేసయేటప్పటికి ఇరవైయేళ్ళే వస్తాయో, పాతికేళ్ళే వస్తాయో! ఛా, ఛా! జర్మనీవాళ్ళు గెలవరాదు. ఎప్పటికీ ఇంగ్లీషువాళ్ళే గెలవాలి.

    __"... యుద్దంలో దెబ్బలు తగిలినవాళ్ళకు వైద్యం చెయ్యటానికి ఈ జెండాలు అమ్ముతున్నారు. అందుచేత అందరూ జెండాలు కొనండి. పుణ్యం! అణా అంటే పెద్దమొత్తం కాదు. కాని అందరు పిల్లలూ కొంటే మన స్కూలునుంచే 50,60రూపాయలు పోగవుతాయి. ఇటువంటి స్కూళ్ళు ఈ దేశంలోనే ఎన్నో వేలున్నాయి. ఇట్లా అన్ని దేశాల్లోనూ పోగుచేస్తే లక్షల కొద్దీ రూపాయలు వస్తాయి. అదీకాగ మీరు అణాచప్పున ఇచ్చి జెండాలుకొంటే మీకు పంచుతారు" అన్నాడు మేష్టరు.

    జెండాలుకొన్న పిల్లలకు వాటిని ఎట్లా చొక్కాకు పెట్టుకోవాలో మేష్టరు చూపించాడు. జెండాలు ఈపూట తీసుకుంటే డబ్బుమధ్యాహ్నం తెచ్చి ఇవ్వొచ్చునన్నాడాయన. సుందరం ఇతర పిల్లల్ని చూసి తానుకూడా ఒక జెండా తీసుకున్నాడు. పొడుగాటి గుండుసూదికి జెండా తగిలించి ఉంది. జెండామీద ఎరుపు, నీలంరంగులున్నాయి. చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది.

    మధ్యాహ్నం బడివిడిచి ఇంటికి వెళ్ళుతూనే, "అమ్మా, చూడు" అని సుందరం తల్లికి జెండా చూపించాడు. ఇంగ్లీషు వాళ్ళకూ, జర్మనీవాళ్ళకూ జరిగేయుద్ధం విషయంకూడా తల్లికి కొద్దిగా చెప్పాడు. ఆ తరువాత ఈ జెండా కొన్నందుకు అణా ఇవ్వాలని బయట పెట్టాడు.

    "ఎందుకు నాయనా, వృధాగా ఇప్పుడీ అణా ఖర్చూ?" అన్నది తల్లి.

    సుందరం మొహం రంగుమారింది. ఆవిడ తనను బుద్ధి పూర్వకంగా ఇరుకున పెట్టటానికా మాట అంటున్నదనుకున్నాడు. ఎట్లాగూ ఇవ్వవలసిన ఈ అణాకోసం కొంత వాదించవలసి రావటం సుందరానికి ఎంతో బాధకలిగించింది.

    "ఏమిటమ్మా నువ్వూ? అందరూ కొనుక్కుంటుంటే నేను మాననా?" అన్నాడు సుందరం.

    "బాగుందే? ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. ఒకరితో మనం ఎక్కడ పోటీకి పోగలంరా?" అన్నది. తాము ఎంత లేనివాళ్ళయిందీ సుందరం ఎరగడుగాని తల్లి అన్నంత పేదవాళ్ళుకారని అనుకున్నాడు. కేవలం అణా ఎగవెయ్యటానికే ఆవిడ ఉన్నవాళ్ళనీ, పోటీఅనీ అంటున్నదనుకున్నాడు. సీతమ్మగారు అణా ఇచ్చిందిగాని సుందరానికి సుఖంగా ఉండేటట్టుమాత్రం ఇవ్వలేదు. తనకూ తల్లికీ జరిగిన సంబాషణ అవతలవాళ్ళు పూర్తిగా వినిఉండాలి. అవతల కృష్ణమూర్తి  చడీచప్పుడూ లేకుండా అణా సంపాదించాడు. తనతల్లి ఇట్లా చేసేటట్టయితే తను కృష్ణమూర్తికి లోకువైపోవటం తప్పదనుకున్నాడు సుందరం.

    సాయంత్రం పిల్లలకు లడ్డూలూ, అరటిపళ్ళూ పంచారు. జెండాలు కొననివాళ్ళక్కూడా పంచారు. మొత్తం మీద జెండా కింద ఇచ్చిన అణా వృధాపోలేదు.

   
                                                                     *    *    *    *
   
    సీతమ్మ అతి సున్నితమైన చిక్కులో పడ్డది. తన భర్త చావువల్ల ఆవిడలో మానసికపరివర్తన ఎంతైనా ఉన్నది. అందులో ప్రధానమైనది ఆర్దిక బాధ్యత. కుటుంబాదాయం తగ్గిందన్న విచారంతోబాటు తక్కువ ఖర్చుతో కాలయాపన ఎట్లాగా అన్న విచారంకూడా ఆవిణ్ణి పట్టుకున్నది.  తానూ, తనకొడుకూ, కూతురూ ఇప్పుడు బీదవాళ్ళన్నమాట. ఆవిడ అడుగడుగునా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది. ప్రతి ఖర్చులోనూ ఎంత ఆదా చేస్తున్నానా అని చూసుకుంటూ ఉండేది. తన భర్త చావుతో ఎంత సంపాదనపోయిందో అంత ఖర్చూ తగ్గించుకోక తప్పదుగద! అంత తగ్గించటం మాటలా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS