Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 25

    దానికి  కారణం....? సరోజ....సునీత!

    "సరోజ నాకు ఇంజక్షన్  చేస్తుంటే  నా  చెయ్యంతా  లాగేస్తుందిరా  చిన్నా!" పరవశంగా  అన్నాడు  రాంబాబు.

    "అవునుమరి....ఇంజక్షన్ చేస్తే నొప్పితో  చెయ్యట్టాగే  లాగేస్తుంది" అన్నాడు  చిన్నారావ్  బత్తాయ్ పండు వొలుస్తూ.

    రాంబాబు చికాకుగా  చిన్నారావ్ ని  చూశాడు. "చెయ్యి  జివ్వున లాగేది  సరోజ టచ్ తో....ఇంజక్షన్ నొప్పితోకాదు."

    చిన్నారావ్  నాలుక కర్చుకున్నాడు. "బత్తాయ్ పండు   వొలవడంలో పడి  నీ  భావం గ్రహించలేదు....హిహిహి...." ఇబ్బందిగా  నవ్వాడు.

    "నీకెప్పుడూ  తిండిగోలే....నేను  చెప్పే  తియ్యటి కబుర్లు నీకెందుకులే....ఆ  బత్తాయ్ పండు  మింగుతూ  కూర్చో...." విసుగ్గా అన్నాడు రాంబాబు.

    "విసుక్కోకురాబాబు....నీకంటే  ఎక్కువ ఫీలింగ్స్   వున్నాయ్  నాకు....సరోజ  ఇంజక్షన్ చేస్తే  నీకు చెయ్యి మాత్రమే  జివ్వుమంటుంది. సునీత ఇంజక్షన్ చేస్తే  నాకు  ఒళ్ళంతా  జివ్వుమంటుంది" అన్నాడు చిన్నారావ్  పరవశంగా.

    "బహుశా నీకు తిమ్మిర్ల  రోగం  అయి  వుంటుంది....అందుకే ఒళ్ళంతా జివ్వున లాగుతోంది" కోరగా చూస్తూ అన్నాడు  రాంబాబు.


    "కుళ్ళు....కుళ్ళు....! నీకు  చెయ్యొక్కటే  జివ్వంటుందనీ  నాకు  ఒళ్ళంతా జివ్వుమంటుందనీ  నీకు జెలసీ...." పళ్ళు  కొరుకుతూ  అన్నాడు  చిన్నారావ్.

    "చూడూ....నిన్ను చూసి  జెలసీ  పడాల్సిన  అవసరం నాకులేదు....నాకు సరోజ వుంది...." అన్నాడు  రాంబాబు.

    "నాకూ నిన్ను చూసి  జెలసీ  పడాల్సిన  అవసరం  నాకులేదు....నాకు సునీత  వుంది" గర్వంగా  అన్నాడు చిన్నారావ్.

    రాంబాబు  ఆలోచనలోపడ్డాడు.

    "ఒరేయ్ చిన్నా....నాకు  సరోజ  వుంది....నీకు  సునీత  వుందని అనేస్కుంటున్నాంగానీ  మనం  వాళ్ళకి వున్నాం  అని వాళ్ళు  అనుకోవాలి కదా?" అన్నాడు  మెల్లగా.
 
    "అదీ నిజమే....!" బుర్ర  గోక్కున్నాడు  చిన్నారావ్.

    "ఒక వేళ  వాళ్ళు  మనలా   అనుకున్నా  కూడా  అందులో  మరో  ప్రమాదం  పొంచి  వుంది."

    "ఏంటది?" కుతూహలంగా  అడిగాడు  చిన్నారావ్.

    "ఏం లేదు  న్యాయంగా  నాకు రాంబాబు వున్నాడు  అని సరోజ అనుకోవాలి....అలాకాకుండా నాకు చిన్నారావ్ వున్నాడని  అనుకుందనుకో...."

    "హి హి హి...." సంబరంగా  నవ్వాడు  చిన్నారావ్.

    "ఇలా ఇకిలించొద్దు....నేను  చెప్పాల్సింది  ఇంకా పూర్తికాలేదు....సునీత  కుడా చిన్నారావ్ వున్నాడు  అని కాకుండా నాకు రాంబాబు  ఉన్నాడు  అనుకుందనుకో....!" కొంటెగా  చూస్తూ  అన్నాడు  రాంబాబు.

    "వామ్మో...." గుండెలమీద  చెయ్యేస్కుంటూ   అరిచాడు  చిన్నారావ్.

    "కాబట్టి  మనం  ఓ  పని  చెయ్యాలి."

    "ఏంటది?"

    "వీలైనంత  త్వరగా  మన  మనసులోని  మాట  వాళ్ళకి  తెలియజెయ్యాలి."

    "కానీ మనల్ని  రేపు  డిస్చార్జ్  చేసేస్తాం  అని  డాక్టర్ యిందాక చెప్పాడు కదా?" గుర్తుచేశాడు  చిన్నారావ్.

    రాంబాబు  క్షణంపాటు   ఆలోచించి  "ఆ....ఐడియా." అన్నాడు  సంతోషంగా.

    "ఏంటది?"

    "ప్రక్క  వార్డులో   ఎవరికైనా  బ్లడ్  ఎక్కిస్తుంటారు   కదా....ఇప్పుడు  అందరూ  నిద్రపోతూ వుంటారు....  మనం  ఎవరికీ  తెలియకుండా  రెండు  బ్లడ్ బాటిల్స్  కొట్టెయ్యాలి."

    "ఎందుకూ?"

    "వాటితో  మనం మన బుర్రమీద  గట్టిగా  కొట్టుకోవాలి....ఆ బ్లడ్ బాటిల్స్  పగిలేలా" చెప్పాడు  రాంబాబు.



                                  *    *    *    *


    డిప్పల్లో  నర్సింగ్ హోంలో   ఆ  అర్ధరాత్రి  పరుగులు  మొదలయ్యాయ్....నర్సులూ, హెడ్ నర్సులూ, డ్యూటీ డాక్టర్లూ  అందరూ ఆ వార్డు వైపు  పరుగులు  తీస్తున్నాడు.

    రక్తంతో  తడిచిన  రాంబాబు, చిన్నారావ్ లని  చూసి వార్డులోని  జనాలు  కెవ్వు  కెవ్వుమని  అరుస్తున్నారు.

    రాంబాబు  కొద్దిగా కళ్ళు తెరిచి చిన్నారావ్  వైపు చూసి  "బాటిల్ తో నెత్తిమీద కొట్టుకోడం కాదుగానీ....నా బుర్రకాయ్  దిమ్మెక్కిపోయింది" అన్నాడు.

    "నా బుర్రకాయ్ కి చిన్న బొక్క  పడిందేమోనని నా అనుమానం" అన్నాడు చిన్నారావ్ కళ్ళు మూస్కునే.

    "నా క్కూడా  అదే అనుమానం...." అన్నాడు రాంబాబు.

    "మనం ఇప్పుడు  మాట్లాడ్తే  బాగుండదనుకుంటా...."

    "అవును....న్యాయంగా అయితే మనం మూర్చపోవాలి."

    "అయితే మూర్చపోదాం...." ఇద్దరూ కళ్ళు  గట్టిగా మూస్కుని తలలు ప్రక్కకి  వాల్చేశారు.

    కారిడార్లోని  పరుగుల  చప్పుడు  వీళ్ళిద్దరి  దగ్గరికి  వచ్చి  ఆగిపోయాయి.

    ఓ కిరస్తానీ నర్స్  ఇద్దర్నీ  చూసి  గుండెలమీద చెయ్యేస్కుని  "ఓ మై గాడ్" అంది. హిందూ నర్స్  "అయ్యో నా దేవుడా " అని నెత్తిన చేతులు పెట్టుకుంది.

    ఇంకో నర్స్ గబగబా పరిగెత్తుకుని  ఫోన్  దగ్గరికెళ్ళి  ఓ నెంబర్ చేసింది.

    "హలో....డాక్టర్  సింగినాధం  గారూ....డిప్పల్లో  నర్సింగ్ హోం  నుండి మాట్లాడ్తున్నాను  సార్....రాంబాబు, చిన్నారావ్ ల  తలలు బద్దలయ్యాయ్ సార్....వాళ్ళు  చచ్చారో, బ్రతికారో కూడా మాకు తెలీడం లేదు సార్....మీరు అర్జంట్ గా రావాలి  సార్."
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS