"నాకు చెప్పరా, థాంక్స్! పద్మావతి అండ్ సురేఖా ఆరాల్సోదేర్" ఒక్క చరుపు చరిచాడు భాస్కరం మిత్రుణ్ణి.
"అబ్బ! నేనేం కీచకున్ని కానురా! శైలజా ప్రియుణ్ణి......"
"నీ మొహం......భృత్యున్ని అనూ"
మిత్రులిద్దరూ నవ్వుతూ గబగబా అమ్మాయిలు వస్తూంటే ఎదురు వెళ్ళారు.
పద్మావతి పరిస్థితి ఫలానీ విధంగా ఉందీ అనడానికీ వీల్లేదు. కోపంగా ఉంది తనకి- ఎవరిమీదో తెలియదు-సంతోషంగానూ ఉంది-బహుశా స్వేచ్చగా ఉంది గనుకనేమో!......
"మీరు ఉప్మాలు తినరూ?" పలకరించాడు భాస్కరం.
"ఎందుకుతోనం తింటాం గాని మాకు మీరు మిగిల్చారా?" సురేఖ అడిగింది.
మూర్తి నవ్వాడు.
"ఎంతమాట! మీకోసరం మేం అది తినను కూడాలేదు......."
"సరే! పదండి ఏ చెట్టు క్రింద వడ్డీస్తున్నారో మార్గం చెయ్యండి......"

పద్మావతి భాస్కరాన్ని కోపంగా చూసినా, మాటలో మాత్రం సరదాతనం ఉన్నది.
"మీరు వెళ్ళిరాండి..... మేం ఇదుగో ఇక్కడే ఈ చెట్టుమీద కూచుని మీ రాకకై వేచి ఉంటాము....."
వాళ్ళు ముగ్గురూ తాత్కాలికంగా వేసిన 'పాకశాం'వేపు నడిచారు.
ఒక చెట్టుకొమ్మ మరీ పల్లకీ 'మామ'లాగ నేలకు దగ్గిరగా సాగడంతో మిత్రులిద్దరూ దానిమీద కూచున్నారు.
"దిల్ తేరా దినాన్నా హైసనమ్...." ఆనక "పందిట్లో పెళ్ళీ....." అనీ గ్రామ ఫోను రికార్డు లందుకున్నాయి!
"అబ్బ! స్వర్గాని కేలినా ఆలిపోరూ అనీ.......ఇదేం గోలరా!" బాస్కరం విసుక్కున్నాడు.
"పైగా ఆ పాట వినూ! పందిట్లో పెళ్ళి అవుతూందనిటా"- మూర్తి కూడా చిరాకు ప్రదర్శించాడు.
కొండలమీద ఎండ- ప్రసరిస్తోంది.
"ఆ కొండలెంతో బాగున్నాయి" మూర్తి అన్నాడు.
"మీ శైలజా నువ్వూ అక్కడికి పారిపోవాల నుంది కదూ!"
"నన్ను నువ్వు మరీ 'ఎక్స్ పోజ్' చేస్తున్నావు బ్రదర్! ఐ ఆబ్జక్ట్!"
"అబద్ధాలు చెప్పకూడదని మా పిన్ని చెప్పిందిలే అంచాత అబ్జక్షన్ ఓవర్ రూల్డ్...."
"ఆవిడకు ఇంతవరకు నువ్వు యెన్ని నిజాలు చెప్పావు?"
భాస్కరం మొహం నల్లగా ఐపోయింది. నవ్వు తెచ్చుకుని "వైవాహికంబులందు ఆత్యం శ్రేష్ఠమన్నారుగదా!" అన్నాడు.
"ఓ.కే.......ప్రేమాయణంలో కూడా కాస్త దాపరికం అవసరం కదా!"
"అరుగో వాళ్ళువొస్తున్నారు- కొంప దీసి పేకాడమనరుగదా?"
"ఎందుకంటారూ? మనం పందెం వేస్తాంగా-' మూర్తి కొమ్మమీంచి క్రిందకు దూకాడు.
"ఏమిటండీ పందెం అంటున్నారు"
"ఆ కొండ చూశారూ....." అన్నాడు భాస్కరం.
"అదేం నలుసా? నల్లపూసా........ నిక్షేపంలా చూశాం"-పద్మావతి అన్నది.
"అది మీలో ఏ ఒక్కరూ ఎక్కలేరూ అని భాస్కరం పందెం." అని మూర్తి చెప్పాడు గట్టిగా.
"అఫ్ కోర్సు..... అదీ, వో చిన్న గుట్ట......నేనూ, కొండపల్లి కొండెక్కి 'భోగం దానిమేడ' దాకా వెళ్ళాను తెలుసా?"- శైలజ అమాయకంగా చెప్పింది.
"అక్కడి కెందుకు?" భాస్కరం మూర్తీ సురేఖ ఇంచుమించు ఒక్కసారే నవ్వేశారు.
"సాహసం ధైర్యం ఒక్క మీ "షేర్పా" జాతికేగాదు మా స్త్రీ జాతికికూడా గలదని నిరూపించుటకు...." పద్మావతి ఎగిరెగిరి పోతున్న తన ఎర్రంచు పచ్చకోక పయిటను పట్టుకుని మరీ చెప్పింది, శైలజ పక్షంగా!
"ఓ.కె....ఆ కొండ ఎక్కుదాం....కాస్సేపు ఈ సినీమా పాటల గోలేనా తప్పుతుంది....." మూర్తి అడుగులు ముందుకి వేశాడు "వచ్చు వారు రండు నే పోవు వాడ" నంటూ.
సురేఖ రెండు జెడల్లో ఒకటి ముందుకి ఇలా వేసుకుని- "ఈ పచ్చని చోట ఇలా కూచోనీండర్రా" అంటూ గరికెనేలను కూచున్నది.
మూర్తికి శైలజతో ఏకాంతం కావాలి......దూరంగా వెళ్ళాలి...... ఎంతో ఎత్తుగా ఏ మేఘాల చాటుకో, ఏ కొండ మాటుకో పారిపోవాలనుంది.
శైలజకి కొండ ఎక్కడం సర్ధా ఉన్నది. పైగా ఛాలెంజీ కూడా చేశాడు మూర్తి.
పద్మావతిని భాస్కరం ఏమీ అనలేదు.
అతనికి సురేఖతో మాట్లాడాలనుంది. పరిస్థితులు చేయిజారి పోకమునుపే చెయ్యాలి.
"మీరు వెళ్తూన్నా, అరగంట తర్వాత కూడా మేం మిమ్మల్ని వచ్చి అందుకుంటాంలెండి" అన్నాడు చెట్టుదిగి ఆ 'మానుకే' చేరగిలబడి, నిలబడి-
"హో...... అయితే మేమంత తీసిపోయామా? ......మాతో సర్దాగా రావడం కాదన్నమాట మీకు ముఖ్యం-పందెమేనా? ముఖ్యం!"
"ఆహా.......ఏభై గుంజీలు పందెం" భాస్కరం నవ్వుతూ పద్మావతిని చిలిపిగా చూశాడు.
"తియ్యండి- ఏభైకాదు వంద అంటాను" పద్మావతి అటు తిరిగి చూసింది.
శైలజా మూర్తీ అటుకేసి వెళ్తున్నారు. ఇటు సురేఖ చతికిల బడ్డది.
భాస్కరం చిలిపిగా, కొంటెగా, సవాలుగా తఃనకేసి చూస్తున్నాడు.... "పోనిద్దూ వాళ్ళతో మనకేమిటీ?"- అనలేదు.
పద్మావతి గిరుక్కున అటు తిరిగి.
"ఓయ్ ! శైలజా! వస్తున్నా మండం డోయ్!" అంటూ విసవిసా వెళ్ళి వాళ్ళను కల్సుకుంది.
"వాళ్ళు రారా!?" శైలజ అడిగింది.
"వాళ్ళు కుందేళ్ళట!....... వెనక అరగంట పోయాక వచ్చినా మనల్ని కలుసుకుంటారట! ఏడవనీ" పద్మావతి అన్నది.
"మరేఁ పాపం! వాడేనా? భాస్కరమా? కుందేలు? వాడికి క్రికెట్ లో ఇరవై "రన్స్" తర్వాత....... నే 'రన్నర్' గా వెళ్ళేవాన్ని, తెలుసా? లేపోతే 'డక్కే'వాడు" మూర్తి నవ్వాడు.
"ఇప్పుడు కూడా రన్నర్ గా పోండి......మేం, నేనూ శైలజా ఆ కొండమీదకు పోయివస్తాం"
శైలజ చెయ్యి పుచ్చుకుంది పద్మావతి.
"నేను మీ పార్టీ వాణ్ణి సార్?" అంటూ మూర్తి శైలజకు చెయ్యి ఇవ్వబోయి లాగేసుకున్నాడు- ముగ్గురు విరగబడి నవ్వుకున్నారు.
* * *
"పదండి, వాళ్ళు నొచ్చుకుంటారు"
అంటూ సురేఖ లేచింది. పైటతీసి నిండుగా కప్పుకుని, చెప్పులు విప్పి సరిగ్గా తొడుక్కుంది.
"మీరు నన్ను చాలానీచుణ్ణి అనుకుంటున్నారు? అవునా?" అన్న భాస్కరం ప్రశ్నకు పరీక్షగా చూసింది సురేఖ-ఇతన్ని ఏమనుకోవాలి అనే పరిశీలన, అన్వేషణ ఉన్నదా చూపులో.....
"ఎందుకనీ?"
భాస్కరం తాపీగా అడుగులు వేస్తో "నేను మీకుక్షమాపణ చెప్పుకుంటున్నాను" అన్నాడు.
"అంతంత పెద్ద మాటలనకండి నేను మీ కంటే చిన్నదాన్ని కాబోలు."
"చిన్నవారైనా చాలా బుద్దిమంతులు......నా ఉద్దేశంలో నేను...... నేను....."
సురేఖ ఆతృతగా అడిగింది.
"మీరు ఏం చెప్ప దల్చుకున్నారో చెప్పేయండి!" అని.....
"మా పిన్నమ్మని మీరు చూశారుగా.....ఆవిడ నాకు దేవుడు లాంటిది. నన్ను మీ అమ్మ కన్నదిట గాని ఈమె పెంచి పెద్దవాణ్ణి చేసింది."
"నిజంగా మీరు ఆమెను ముక్కు గుద్దినట్లుంతారు.....తెలియని వాళ్ళు మిమ్మల్ని తల్లి పోలిక వచ్చింది చాల అదృష్టవంతుడంటారు కూడా.......!" అన్నది సురేఖ. కాని ఆమెకు పద్మావతి తనను అపార్ధం చేసుకుంటుందేమో నన్న శంక, కూడా లోపల పీకుతున్నందున వెంటనే "మనం వాళ్ళను కల్సుకుందాం రండి పద్మావతి ఒక్కర్తీ అయిపోయింది" అన్నది కొండకేసే చూస్తో......
"మా వసంత పెళ్ళికి మీరు వస్తారుగా" - భాస్కరం కొండ ఎక్కాలనిగాని, పద్మావతిని కల్సుకోవాలనిగాని ఉత్సుకత చూపటమే లేదు.
"మా దొడ్డమ్మ రాసింది...... రమ్మని" సురేఖ చెప్పింది.
ఎండ తీక్షణత ఎక్కువైంది. దూరాన శైలజ మూర్తీ పద్మావతీ కొండ పోటీలుగా యెక్కుతున్నారు- ఇటువేపు పిక్ నిక్ బృందం సందడి కూడా దూరమైంది. నిస్సారమైన గుట్టలు బండలు రాళ్ళు- ఓ చెట్టునీడను మెళ్ళో పెద్ద పెద్ద ఎర్రపగడాల హారం - గోచీ పెట్టుకున్న పదేళ్ళ పిల్ల ఒకర్తి, పుల్ల లేరి పేర్చుకుంటున్నది.
"వసంత పెళ్ళి ఐపోతే నాకు చాలా వరకూ 'రిలీఫ్' వస్తుంది." భాసరం అక్కడే ఒక బండమీద కూలబడ్డాడు- "ఇంకా మనం కొండ ఎక్కుతాం అనే ఆశ ఏం పెట్టుకోకూ" అన్నట్టుంది అతని వాలకం.
సురేఖ "ఇక్కడ ఎండ మొహం మాడుతోంది -పైగా".....అని ఏమో.....అంటూండగానే.
"సురేఖగారూ! మీరు నాకు ఉపకారం చెయ్యగలరా?" అన్నాడు ఆశగా ఆతృతగా చూస్తూ భాస్కరం.
"ముకుందరావును నేనెరుగుదును - అతను చాలా మంచివాడే గాని స్వతహా తల్లిదండ్రులన్నా మా దొడ్డమ్మ అన్నా చాలా భయస్తుడు" అంటూ సురేఖ కూడా కాస్త ఎడంగా మరో రాతి బండ మీద కూచున్నది.
పిక్ నిక్ కి వచ్చిన వాళ్ళంతా రకరకాల ఆట పాటలలోను, కాలక్షేపాలలోనూ మునిగిపోయారు -ఈ బృందం విడినట్లే కొందరు జట్లుగా విడిపోయి అగుపించిన కొండగుట్ట కెల్లా 'మౌత్ ఆర్గన్' లు' ట్రాన్సిస్టర్' లు కూడా పట్టుకు కేరుతూ నవ్వుతూ ఎగబ్రాకుతున్నారు! కాని వీళ్ళకా ఆనందం లేదు.
సురేఖ పచ్చని పసిమిఛాయ, ఎండ పొడకు కర్గిపోయింది. ఒకటి రెండు ముంగురులు ఆమె నుదుట చెమటకు అతుక్కున్నాయి.
"మా దొడ్డమ్మకి మా నాన్నగారూ అమ్మ కూడా లక్ష్యం లేదండీ" - అన్నది ఒక ఎండు పుల్ల తీసి విరిచి దానినే తదేకంగా చూస్తూ సురేఖ.
"నిజంగా, నాకు కట్టనున్నా హోదా అన్నా పెద్ద ఆశ ఇవాళ లేదు." భాస్కరం తలధించుకుని మాట్లాడుతున్నాడు. "పిన్నికి మాత్రం చాలా పాత అభిప్రాయాలున్నాయి."....
అతని జుత్తు గాలికి రేగి నుదుట పడుతున్నది. అమాయకంగా అగుపిస్తున్నాడు భాస్కరం.
"మీ పిన్నిగారి ఇష్ట ప్రకారమేగానివ్వండి.....మీ ఆశయ సిద్ధిని మరోరకంగా వాయిదా వెయ్యండి....." అన్నదామె.
సురేఖకు భాస్కరం మీద ఒక క్షణంలో గౌరవం మరో క్షణంలో ఈర్ష్యాకూడా కలుగుతున్నాయి.
"నా ఆశయం ఆదర్శం అని నేను దేన్నీ అనను. మీరు ఈ ఆశయాలు ఆదర్శాలు నమ్ముతారా?"-
"................"
"మా పిన్నిని నేనెంతగా ప్రేమిస్తున్నానో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. తనకు కష్టం కలిగించ గలగడం నాకు సాధ్యపడటంలేదు పైగా దీనిలో వసంత......."
"వసంతను ముకుందరావుకు ఇవ్వడం మీకు గిట్టదా?"
"అబ్బె! నిజంగా నాకు ఎంతో ఇష్టంకూడాను. పైగా ముకుందానికి కట్నం ఇవ్వరాదని కూడా నేను అనను. చెల్లాయి సుఖంకోసరం నేనేమేనా చేస్తాను- పిన్ని బాధపడకపోతే చాలు....."
సురేఖకు చాలా జాలివేసింది. యువకులెందరో తనను ప్రేమబిక్ష వేడుకున్నారు. తన ఆకర్షణకు దాసులమన్నారు గాని- తనకు ఒక ప్రతి పత్తి నిచ్చి, స్నేహబిక్ష ఇమ్మనిగాని, జీవితపు తొలి మలుపు జారుడు సమస్యలలో ఆలోచనల చేయూత నిమ్మనిగాని, ఎవ్వరూ కోరలేదు. తనకు స్నేహం చెయ్యగల పురుషుడు ముకుందరావు ఒక్కడే తటస్థ పడ్డాడు కాని ముకుందరావు దారివేరు. భాస్కరం దారివేరు. సురేఖకు భాస్కరం కోసరం ఏ ఉపకారమేనా చేద్దామనిపించింది.
"నన్ను మీరేం చెయ్యమన్నా చేస్తాను చెప్పండి......" అన్నది.
భాస్కరం తల ఎత్తలేక పోయాడు. సిగ్గు పడ్డాడు- "సురేఖ మనసును బాధ పెడుతున్నానే అనే బాధ పడ్డాడు.
"నేను మీకు తగినవాణ్ణికాను ......మీ దొడ్డమ్మగారికి నేనో జులాయినని, తాగుబోతుననీ...... చెప్పండి....." అతను లేచి అటు తిరిగి కొండమీదకు చూశాడు. ఎవ్వరూ లేరు.
పద్మావతి, శైలజా మూర్తీ అజా లేదు. వల్లుపోయి ముప్పావు గంట దాటింది-గడియారం పది గంటల దగ్గర టిక్ టిక్ మంటోంది.
"ఎందుకని మీరు ఇల్లా నన్ను హింస పెడుతున్నారూ?" అన్నది సురేఖలేచి నిలబడి అతని ప్రక్కగా వచ్చి నిలబడి.
"క్షమించండి! ఇంత స్వార్ధం మీరు మరో మనిషిలో చూడలేరు....." అటే చూస్తూ అన్నాడు భాస్కరం.
"మీ పిన్నిగారికి మీరు మీ ఉద్దేశాలు చెప్పలేరా?" సూటిగా ప్రశ్న, అడగరాని ప్రశ్నే అడిగాననుకుంది సురేఖ.
"తనకు అన్నీ అపార్ధాలే వస్తాయి......అదీ గాక..... అదీగాక......" అట్నుంచి ఇటు తిరిగాడు భాస్కరం ఉద్వేగంగా ఏదో అందామనుకున్నాడు "మీరంటే ఆమెకు ఇష్టం" అందామనుకున్నాడు నాలిక్కర్చుకున్నాడు- మాటలను మింగేసి తడబడ్డాడు.
సురేఖ భాస్కరం ఇంత సున్నితమైన వాడనుకోలేదు. తనుకూడా బాధ పడ్డది....
"మీరు పద్మావతిని పెళ్ళి చేసుకోండి భాస్కరం గారూ....." అని గిరుక్కున తిరిగి నడవబోయింది.
