Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 25


    సురేఖ కీ 'స్టడీ' ఎలా వచ్చిందాని ఆశ్చర్య పోతూన్నది శైలజ.
    హాస్టలు బస్సు అమ్మాయిల నందరినీ ఎక్కించుకుని పూలరధంలా వెళ్ళిపోయింది యూనివర్శిటీకి. ఉదయం మహారాణీపేట నుంచి తీసికెళ్ళడం - సాయంకాలం దిగబెట్టడం ఆ బస్సువంతు-
    శైలజకి సురేఖమీద చాలా గౌరవం వచ్చింది. మొదట్లో సురేఖ అందాన్ని చూసి ఉడుక్కున్న శైలజ ఇప్పుడామెను గౌరవిస్తున్నది. 'ఆ భాస్కరం గారు ఈ 'సురేఖను' ప్రేమించినా ఆశ్చర్య పోనక్కర్లేదు.'
    "సురేఖ అన్నట్లు పద్మావతి మీద భాస్కరానికి ఉన్నది కేవలం సానుభూతియో ఆకర్షణో అయితే దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో సాధన అవసరమే అవుతే సురేఖ భాస్కరాన్ని గెల్చుకోవడం కష్టంగాదు."
    "స్నేహమనేది ఒకటి లేకపోతే అది పట్టి పగ్గమే వేయకపోతే సమాజమూ అనేది ఒకటి రూపొందక పోనేమో...." - భయపద్డది శైలజ. సురేఖకు ఇతరులపై గల అధికారం లాంటిది తఃనకు లేదు. మూర్తిని చూస్తూనే తాను జావజావ ఐపోతుంది. కరిగి పోతుంది. 'ఉహుఁ' అనుకుంది ఆలోచనలు విదిలించకున్నట్లు.
    "క్లాసుకు వెళ్తూ పగటికలలు కనకూ, టాటా!" -సురేఖ కేకవేసి చెయ్యి వూపుతూ వెళ్ళిపోయింది.

                              *    *    *

    "సురేఖకు నాలుగు సంగతులూ విడమర్చి చెప్పాలి. ఆ అమ్మాయి తప్ప తనను ఇప్పుడు రక్షించగల వాడు లేడు."
    "ఒక్క మాట సురేఖ పెదాలు విప్పి ఒక్క మాటతో తన జీవితాన్ని సానుకూల పరుస్తుంది. అదే ఒక్క మాట మరో విధంగా ఆ పిల్ల అన్నదో తన చెల్లెలి కాపురం కష్టాలకు నష్టాలకు గురి అవుతుంది." అనుకున్నాడు భాస్కరం.
    "పద్మావతిని పెళ్ళి చేసుకోలేక పోతే ఇక జీవితంలో పెళ్ళే చేసుకోను" అందామనుకున్నాడు సురేఖ దగ్గరకు వెళ్ళి- అలా చెబితే "ఎవరొద్దన్నారూ?" అంటుందేమో.......
    "పోనీ! నాకు మీరంటే ఇష్టం లేక పోడానికి కారణం. నేను అప్పుడే ఒకరి ప్రేమకు దాసుణ్ణి - ఒక హృదయాన్ని దోచుకున్న నేరస్థున్ని" అందాం అనుకున్నాడు. ఇవన్నీ మనసులో ఆలోచించే మాటలు, పుస్తకాల్లో రాసుకునే మాటలూను.....
    నోరు పెగిలిరావు.
    పైగా సురేఖ తనను అపార్ధం చేసుకొనే వీలులేదు. "పద్మావతి చేసుకున్నా చేసుకోవాలితప్ప తనను సురేఖ అపార్ధం చేసుకోదు." అనిపించింది.
    "పదవతి చదువు మానేస్తుందేమో.......పోనీ వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను......కాని జయమ్మగారు చాలా గట్టి మనిషి. జీవితాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న వ్యక్తి. నేరుగా పిన్నమ్మదగ్గరికి పోయి "ఇదుగోనమ్మా మీ అబ్బాయి ఇలా చేశాడు- ఇదుగో మా అమ్మాయి" అని వెంటనే నిలదీస్తే......
    భయం వేసింది. పిన్ని నెలా ఒప్పించాలో ఇప్పుడప్పుడే ఆలోచించగల ధైర్యం లేదు భాస్కరానికి.
    "వసంత పెళ్ళి అవ్వాలి."    
    ఆ మాటే పదిసార్లు పద్మావతికి వినిపించేలా అన్నాడు. "ఇంకేం సురేఖా మీరూ బంధువు లయ్యారు- నేనేగా పరాయిదాన్ని"అన్నదిఅక్కసుగా.
    "అవును, ప్రస్తుతానికి అంతే...... నువ్వు భాజా భజంత్రీలతో రావల్సిన బంధువురాలివి కదా?" అన్నాడు.
    "అబద్ధాలు!" అన్నది పద్మావతి.
    "కాదు." అని తను అనకముందే విసవిసా వెళ్ళిపోయింది కూడా.
    
                                *    *    *

    పద్మావతి దృష్టిలో భాస్కరం పెళ్ళి చూపులకువెళ్ళడంకన్నా అవిశ్వాసం మరొకటి ఉండదు.
    "ఒక ప్రేమించిన పురుషుడు తానై ఆ వూసు చెప్పుకోలేకపోతే ఎలా?"
    పద్మావతి ఆలోచనల తీరుగా ఉన్నాయి. బహుశా ఇక్కడే కాబోలు సమాజమనేది వస్తుంది. అంతస్థు అనేది ఉంటుంది. ఇది మనషులు తమ బలహీనతకు 'డాలు' (రక్షణ)గా 'అండ'గా వాడు కునేదై ఉంటుంది.
    పద్మావతికి మనసు ఎంతో చిన్న పోయింది-! తాను పంతులమ్మ ఉద్యోగం కోసరం వచ్చింది. కాని సురేఖ గొప్పకోసరం చదువుకుందికి వచ్చింది!!
    అబ్బ! ఎంత తేడా........?
    అట్నుంచి క్లాసుకి వెళ్తూన్న భాస్క్రరాన్ని గమనించి వెంటనే రెండడుగులు వెనక్కివేసి, అతను గేటులోనించి లోపలికి వెళ్ళిపోయాకా వెళ్ళింది పద్మావతి.

                              *    *    *

    సైన్సు కళాశాల మీద కాలమూర్తిలా నాలుగు ముఖాలతో, కాలాన్ని కొలుస్తూ గడియారం తిరుగుతున్నది. క్లాసులకు వెళ్తున్నారు. వస్తున్నారు. కలకలలాడుతున్నారు. కిలకిల మంటున్నారు. మాష్టర్లు సుద్ధముక్కలు అరగదీస్తున్నారు. విద్యార్ధులు, 'చిత్తు' పుస్తకాలు నింపుతున్నారు. చాలా మందికి ఈ చిత్తు పుస్తకాలనుంచి ఫెయిర్ నోట్సులు రాయకుండానే కాలం తరిగిపోయి పరీక్షలొస్తాయి. ఒక్కోసారి 'క్లాసు'లూ వస్తాయి. ఆనక చెలామణీ అవుతాయి. పద్మావతీ రాసింది నోట్సు. సురేఖా రాసుకుంది. వెనకనున్న ఒక అబ్బాయి సురేఖ బొమ్మను గీద్దా మనుకుని మొత్తానికి రెండు జెడలున్న అమ్మాయి రూపాన్ని గీశాడు. అప్పటికి పోయినేడాది యూనివర్శిటీ ఫస్టు వచ్చిన 'దామోదరన్' ఈ ఏడాది 'మాష్టారై' పోయి వచ్చినవాడు -ఏడు సుద్ద ముక్కలు రాయడం దాతగాక విరిచేశాడు.
    మొదటి వరుసలోనే అమ్మాయిలు!-అందంగా అలంకారం చసుకుని, చూస్తో కూచోడం దామోదరానికి ఈ మధ్య నచ్చడంలేదు- ఇదివరకు ఇదే రూములో, ఇదే వరసలో వేరే రాజం, సుందరం, సకల అనే అమ్మాయి లుండేవారు......తాను రెండో వరుసలో ఉండేవాడు. అప్పుడు ముసలి లెక్చరర్ గారొకరు దడదడలాడించేవాడు క్లాసు తీసుకుని-కాని తాను? అతని గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి దడదడా..... సురేఖ కొంటెగా చూస్తుంది కోలాగా నవ్వుతూ నోట్సు తీసుకుంటుంది.
    ఆ అమ్మాయి ఏం రాస్తుందో తెలియనంత జోరుగా రాస్తోంది.
    దామోదర్ కి వాళ్ళుమండిపోయింది. కాని ఆడపిల్లల నెందుకులే అడగడం అనుకుని కుర్చీలో కూచుని బల్లలంచు పట్టుకుని-
    "మే ఐనో వాట్ యూ ఆర్ డూయింగ్?" అన్నాడు వెనక బల్లమీది 'రాజును' - సురేఖ జెడలకు మురిసిపోయిన చిత్రలేఖనం అభ్యసిస్తున్న రాజునే అడిగాడు.
    "నేను మిమ్మల్ని వింటున్నాను" టక్కున చెప్పేశాడు రాజు.
    "నేను మీరేదో డ్రాయింగ్ వేస్తున్నా రనుకుంటున్నాను?" అన్నాడు దామోదరన్.
    "సారీ సర్, నాకు బొమ్మలు అసలు చూడటమే రాదుసార్!" నిజంగా చెప్పాడు రాజు.
    "థాంక్యూ?......ఎండ్ నౌ కమింగ్ టుదీ......" దామోదరన్ కి పాఠం చెప్పక తప్పదుగా.
    పద్మ్వాతికి నోట్సురాస్తున్నా ఆవేదన......సురేఖకు, అసలు పాఠాలంటేనే ఉదాసీనత......"గంట కొట్టాలి" అనిపించింది అందరికీ.
    కొట్టేశాడు కూడా!!
    "సో! ఐ విల్ బి టేకింగ్ యువర్ క్లాస్?...." దామోదరన్ వాచీ చూసుకున్నాడు, హాయిగా.
    "......టుమారో మాన్ సార్!" రాజు వాక్యం అర్ధోక్తిలో అందుకు పూర్తిచేశాడు.
    "థాంక్యూ"-
    దామోదరన్-అతని ననుసరించి విద్యార్ధినులూ, ఆనక అబ్బాయిలు బయటపడ్డారు.
    "పద్మా? నీకు నా గెస్టుగా కశింకోట పిక్ నిక్ రిజర్వ్ చేశానే.....రావాలిసుమా......"    
    సురేఖ చెప్పింది.
    "ఎందుకే నాకూ?"
    "నాకెందుకూ? నీకూ అందుకే!"
    "నేను నువ్వు నీ నోట్సు ఇస్తే రాసుకుంటాను." పద్మావతి గంభీరంగా అడిగింది.
    "నా మొహం ఇందులో ఏముంది? కావాలీ అంటే శ్రీ దామోదరన్ గారి అసలు నోట్సు పట్టుకొస్తాను రాసుకుందాం...... అదిసరే....... శైలజా, మూర్తీ, మహా సరదాగా ఉన్నారు...... నువ్వూ రావాలి. ఈ మధ్య వెర్రివేదాంతం బాగా నీతల కెక్కుతోంది." అన్నది కోపంగా సురేఖ.
    "ఏమో తల్లీ! అంతా నీ ఇష్టం. నాకు ఉద్యోగం కోసరం పోట్టపోషణ కోసరం కనుక ఈ చదువు ఈ తాపత్రయమంతా" నన్నది దీర్ఘంగా విశ్వసించి పద్మావతి.
    "అబద్ధం.......! రా! కాఫీ త్రాగుదామ్! మళ్ళీ నెక్స్ట్ అవర్ దాకా క్లాసు లేదుగా!" సురేఖ లాక్కుపోయింది!

                                     35

    పిక్ నిక్ కి వెళ్దామనీ ఉంది పద్మావతికి వెళ్ళాలనీ లేదు. అనేకానేక సుఖాలు, సంతోషాలు జీవితంలో పంచుకో వచ్చును గాని ఒక్క సుఖం మాత్రం బహు స్వార్ధమైనది. దీనిని పంచుకోడం అసాధ్యం. పిక్ నిక్కే గానీ షైరే ఐనా, తనూ భాస్కరం ఉన్నప్పుడు మరొక్కరితో ఆ ఆనందాన్ని పంచుకోలేదు పద్మావతి ఈ బలహీనత నామె పదేపదే గ్రహించినా, నివారణోపాయం అసలు తెలియరావటం లేదు- తను భాస్కరాన్ని మెచ్చుకొంటూ ఉంటే సురేఖ వినాలి; కాని సురేఖను భాస్కరం గానీ, లేదా భాస్కతాన్ని సురేఖగాని మెచ్చుకుంటే సంకటంగా ఉండేదీ పద్మావతికి.
    భాస్కరం తను వెళ్ళకపోతే చిన్నబో వచ్చును నొచ్చుకోవచ్చును లేదా మనసులోని భయం దాచుకోకూడదూ బయటకు చెప్పాలీ అంటే, "అతను సురేఖతో సర్దాగా కాలం గడపవచ్చును."
    అందుకే జయమ్మగారితో 'క్లాసు వాళ్ళంతా వెళ్ళాలమ్మా' అని చెప్పి మరీ వెళ్ళింది పద్మావతి.
    జయమ్మగారు కూతురు మాష్టరీ చెయ్యాలి తాను 'నాకేమని' హాయిగా కన్ను ముయ్యాలి! అనుకునేది ఇది వరకు. ఇప్పుడిప్పుడు ఆమెకు యవ్వనంలో ఉన్న కూతురు వందలకొలదీ పడుచు వాళ్ళ మధ్య నిత్యమూ తిరుగుతున్నదీ- దీనికి ఒక "సంబంధం చూద్దువా?" అనిపిస్తోంది కూడా- కాస్త బెంగగా ఉన్నది.
    కాని, తనవాళ్ళు అనే వారెవరున్నారు? సవతి కొడుకులున్నారు. వాళ్ళకి ఒక అప్పచెల్లెలున్నది. దాని సంగతే చూస్తారా? ఈ అమ్మాయి గురించే తంటాలు పడతారా? భర్త వంక సంబంధాలు-తనకు రావాలీ అంటే అతని తొలి భార్య సంతాన మేగతి కాని వాళ్ళమీద ఆమెకు నమ్మకం లేదు.
    ఇక 'నా అన్న వారెవరున్నారు తనకి?' - తల్లి తనను 'ఈ జన్మకు చూడనన్నది'- అలాగే కన్నుమూసింది తండ్రి కన్నీటితో కుమిలి కృశించిన ఇల్లాలు జయమ్మ తల్లిని తిడుతూనే అంతకు ముందే కనుమూశాడు. 'ఇక ఏం చెయ్యాలి?'
    జయమ్మకు కూతురి భవిష్యత్తును దాని చేతిలో పెట్టి - తదుపరి ఒక సమ్మంధం వెతకాలని ఉన్నది అందుకు ఎలా ప్రయత్నం చెయ్యాలీ అన్న విషయంలో ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. "ప్రేమిస్తు"న్నా మనే కధలు- "ప్రేమించుకుంటున్న" సినీమాలు ఆమె చూస్తూనే ఉన్నది. కూతురు అటువంటి ప్రలోభనకు లోనవుతుందేమోనన్న భయం ఆమెకు వాల్తేరు వచ్చిన తర్వాత ఎక్కువగానే కలుగుతున్నది.
    "అమ్మో! ఏ కాలుజారినా, తల్లి చాలు; పిల్ల దంటారు." అందుకే ఆమె గజగజాలాడి పోతుంది.-    
    'జాగర్త! సాయంకాలంవేళకి ఇల్లు చేరుకో" మని నాలుగుమార్లేనా అన్నది ఆమె. "అలాగే నమ్మా" అన్నది. పద్మావతి సహజమైన విసుగుతో.
    
                                *    *    *

    అమ్మాయిల బస్సు కశింకోట వనభోజనాల తావుకు చేరేసరికి, బారెడు పొద్దెక్కింది-అప్పటి కప్పుడే ఐదారు బస్సులు, విద్యార్ధుల నందర్ని దిగవిడిచి, తిరుగు ముఖం పడుతున్నాయి.
    ఇన్ని వందల మందికి వనభోజనం తయారు చెయ్యాలంటే మాటలా? లారీలమీద వంట వాళ్ళని, బుట్టలుతోనూ గంపలతోనూ సంభారా లను ముందురాత్రే తరలించాల్సి వచ్చింది.
    అమ్మాయిలు దిగేసరికి తోటకి పూలు పూసి నట్లైంది! సంబరం ఇనుమడించింది! రక రకాల వేషాలు ఆటలు పాటలు సందడిగా ఉంది. చిన్నచిన్న జట్లుగా విడిపోయి కొందరు పేకాటలు పరిచారు.
    "ఈ సమయం కోసం వాళ్ళు ..... వారం రోజులైంది కాచుకుని ఉన్నారు. కొందరు బాడ్ మింటన్ లాంటి ఆటలకు ఆయిత్త మయ్యారు-
    అక్కడి తోటలూ చెట్లూ చేమలూ, కొండలూ గుట్టలూ అన్నీ వీళ్ళ సొంత ఆవిష్కరణమే ఐనట్లుంది ఆనందం.
    ఉప్మాలు కాఫీలు వడ్డించడమైంది. తిన్నది తిన్నారు త్రాగింది త్రాగారు- పారేశారు.
    వీళ్ళ సందడికి ఉడుతలు బెదిరిపోయాయి-ఉన్న కొన్ని పిట్టలూ చెదిరిపోయాయ్!
    మూర్తీ భాస్కరం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు - శైలజా సురేఖా పద్మావతీ వస్తున్నారా? లేదా? అని-
    "థాంక్ గాడ్! శైలజ వచ్చింది" మూర్తికి మహానందంగా ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS