Previous Page Next Page 
ఇందుమతి పేజి 26


    నారాయణరావు గారు కూడా రాజశేఖర మూర్తి ని బ్రతిమాలి అనేక విధాల చెప్పి చూశారు. "వద్దు, బావగారూ, నన్ను అపార్ధం చేసుకోకండి. ఇందుమతి లేని అనంత వరం లో అడుగు పెట్టటం నా వల్ల కాదు. క్షమించండి" అన్నాడు రాజశేఖర మూర్తి.
    ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. మనో వీధిని వెనక్కి తిరిగి చూసుకున్నాడు రాజశేఖర మూర్తి. ఇందుమతి రాజశేఖరుల దాంపత్యం ఒక  చాంద్రమాసం వలె తోచింది. మొదటి రెండు సంవత్సరాలు శుక్ల పక్షం , తరవాతి రెండు సంవత్సరాలు కృష్ణ పక్షం.
    మద్రాసు నుంచి రవి వచ్చాడు. బావకు జరిగిన అన్యాయాన్ని గురించి విలపించాడు. ఏమి బాల్య వివాహాలో , ఏమో? బావ తన వయస్సు వాడు. తన కింకా వివాహమైన కాలేదు. బావకు వివాహము, వివాహ భంగము కూడా అయిపోయాయి. బావ ఎన్నో ఏళ్ళు వృద్దుడై పోయినట్టు తోచింది. తెలివితేటలు కలవాడు బావ. అంత చిన్నతనం లొ వివాహాని కెలా ఒప్పుకున్నాడో! ముసలమ్మ లు బలవంత పెట్టడం సహజం . కాని, తెలివి తేటలు గల యువకులే అటువంటి బలవంతాలు నిరోధించక పోతే సంఘం ఎలా బాగు పడుతుంది?
    ఎమ్.ఎ. పరీక్షా ఫలితాలు తెలిశాయి. మొదటి తరగతి లో ప్రప్రధముడుగా కృతార్ధుడైనాడు రాజశేఖర మూర్తి. సరస్వతి కి రెండవ స్థానం వచ్చింది. విశ్వవిద్యాలయం వారు రాజశేఖర మూర్తి కి బంగారు పతకం ఇచ్చారు. "ఎవరు సంతోషించడానికి ఈ పతకాలు? ఎవరిని ఉద్దరించడానికి ఈ ప్రధమ స్థానం?' అనుకున్నాడు రాజశేఖర మూర్తి. అది ఏమి చిత్రమో కాని విధి అతన్ని పూర్తిగా నయినా ఏడవ నియ్యదు, సంపూర్ణంగా సంతోషించనియ్యదు కూడా. శుభా శుభాలలాగే ఎప్పుడు మిశ్రమం గా కలుగుతున్నాయి.
    మార్కేండేయ శర్మ, యజ్జేశ్వర శాస్త్రి, విశ్వేశ్వరరావు రెండవ తరగతి లో పసైనారు. శర్మకూ, శాస్త్రికి సంతోషంగా ఉన్నది.
    సాయంకాలం వారిద్దరూ వచ్చి రాజశేఖర మూర్తిని బయటికి తీసుకు వెళ్ళారు. ఇందుమతి పోయింది మొదలు అతణ్ణి మూకత్వం ఆవరించింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహితులతో కూడా ముభావంగానే మాట్లాడతాడు. అతని మనస్సులో ఉల్లాసం కలిగించాలని వారి ఉద్దేశం. పార్కుకు తీసుకుని వెళ్ళారు. అక్కడికి సరస్వతి కూడా వచ్చింది. ఇందుమతి పోయిన తరవాత ఆమె రాజశేఖర మూర్తిని ఇదే చూడటం. అతని ముఖంలో ఇంతకూ ముందు లాగ ఉల్లాసం లేదు. కృశించి సగం అయినట్లున్నాడు. సరస్వతి మూర్తికీ, తదితర మిత్రులకూ నమస్కరించింది. వారు ప్రతి నమస్కారం చేశారు. నలుగురూ ఒక చోట గడ్డిలో చతికిల పడ్డారు. ఆమెకు అతన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. ఉద్విగ్న మనస్క అయిన ఆమె కళ్ళలో నీరు ప్రవహించసాగింది. ఆమె కన్నీరు చూసిన మూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి.
    "అదేమిటి, సరస్వతీ దేవీ, మూర్తి ని ఒదార్చ బోయి మీరే కంట తడి పెడుతున్నారు!' అన్నాడు మార్కేండేయ శర్మ.
    'అబ్బెబ్బే, అదేమీటండి, చదువు కున్నవారు మీరు కూడా సాధారణ స్త్రీల లాగా బయట పడిపోతారు" అన్నాడు యజ్జేశ్వర శాస్త్రి.
    నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు గడిచి పోయాయి. పార్కులో రేడియో మాత్రం ఏదో గోల చేస్తున్నది.
    "చీకటి పడుతున్నది , ఇక లేస్తారా?" అని లేచింది సరస్వతి. మిత్రులు ముగ్గురూ లేచి సరస్వతి తో కూడా బయలుదేరి , కొంత దూరం నడిచి , ఆమెను ఆమె ఇంటి దగ్గిర దిగవిడిచి వెనుదిరిగారు.
    "మనస్సు కుదుట పడ్డ తరవాత మా ఇంటికి ఒక సారి రండి, మూర్తి గారూ" అన్నది సరస్వతి.
    "అలాగే" అని నమస్కరించి వచ్చేశాడు రాజశేఖర మూర్తి.
    సుబ్బారావు గారు ఒకనాడు ఒక అపరిచిత వ్యక్తిని వెంట బెట్టుకుని గుంటూరు వచ్చారు. మాటల సందర్భం లో రాజశేఖర మూర్తి కి తెలిసింది. ఇదేదో పెళ్లి సంబంధమని. అతనికి పట్టలేనంత కోపం వచ్చింది. సుబ్బారావు గారిని పక్కకు పిలిచి, "పెదనాన్నా, నా కిక పెళ్ళీ గిళ్ళీ తల పెట్టకండి. ఈ అయింది చాలు" అని గట్టిగా చెప్పాడు.
    "అదేమిట్రా! ఇరవై రెండేళ్ళ యినా లేవు! ఇక ఇలాగే ఉండి పోతావా?"
    "భవిష్యత్తు ను గురించి నేనేమీ చెప్పలేను కాని, ప్రస్తుతానికి నా మీద దయతలిచి ఈ ప్రతిపాదనలు చాలించండి."
    వెంకటాచలపతి గారూ, మాణిక్యమ్మ గారూ గుడ్ల నీరు కుక్కుకున్నారు. సుబ్బారావు గారు వెళ్ళిపోయారు.
    యూనివర్శిటీ వారు రాజశేఖర మూర్తి ని నెలకు డెబ్బై అయిదు రూపాయల మీద ట్యూటర్ గా నియమిస్తూ ఇష్టమైతే వెంటనే వచ్చి చేరమని ఉత్తరువు పంపారు. రాజశేఖర మూర్తి ఇంతవరకు ఉద్యోగం సంగతి తల పెట్టనే లేదు. అయాచితంగా వచ్చిన ఉద్యోగం అతని కాశ్చర్యమే కలిగించింది. అతని మనస్సులో గుంటూరు, విజయవాడ, ఏలూరు, బందరు, గుడివాడ -- ఈ ప్రాంతాలన్నిటి మీద ఏదో కసిగా ఉంది. ఏది చూసినా, ఏది తలిచినా ఇందుమతే జ్ఞాపకం వస్తున్నది. ఈ ప్రదేశాన్నే విడిచి ఎక్కడి కైనా పోగాలిగితే బాగుండునని ఉంది. గుంటూరు లో ఈ ఉద్యోగానికి కట్టుబడి కూర్చుంటే ఇక నివృత్తి లేదు. కాని ఉద్యోగం చెయ్యక చేసేదేమిటి? తన తండ్రి అష్టకష్టాలు పడి తనను పై చదువులు చదివించారు. ఇంకా ఎంత కాలమని అయన మీద ఈ భారం ఉంచగలడు? మార్కేండేయ శర్మ గారు, యజ్జేశ్వర శాస్త్రి వచ్చి రాజశేఖర మూర్తికి అభినందనలు తెలిపారు. యూనివర్శీటీ ఉద్యోగం అందరికీ రాదు. డెబ్బై అయిదు రూపాయలు మాత్రమే అయినా, యూనివర్శీటీ ఉద్యోగం లో గొప్ప తనం ఉన్నది. ఇంతకన్న పెద్ద ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? అయాచితంగా చేతికి వచ్చిన ఈ ఉద్యోగం గ్రహించి తీరాలని బలవంత పెట్టారు శర్మ గారూ, శాస్త్రీ.
    ఉత్తరువు తీసుకుని పోయి వెంకటరత్నం గారికి చూపించాడు రాజశేఖర మూర్తి. అయన వెంటనే పోయి చేరమన్నారు. అయన మాట అంటే రాజశేఖర మూర్తి కి గురి. వెంటనే పోయి ఉద్యోగం లో చేరాడు. ఆనాటి సాయంకాలమే పోయి సరస్వతి ని దర్శించాడు. ఆమె ఎంతో సంతోషించింది.    
    "మీరేం చెయ్య బోతున్నారు?" అని అడిగాడు రాజశేఖర మూర్తి.
    "నాన్నగారి ఉద్దేశాలు మీకు తెలుసుగా? ఇక వివాహం తప్పేటట్టు లేదు."
    "ఇంత చదువు చదివి, చక్కగా మొదటి తరగతి తెచ్చుకొని విద్య వ్యర్ధం చేసుకుంటారా?"
    "నాకేమో ఏ మహిళా కళాశాల లోనో అధ్యాపకురాలుగా చేరాలని ఉన్నది. వివాహం అయితే కాని ఉద్యోగం సంగతి ఎత్త వద్దంటారు నాన్నగారు. భర్త ఒప్పుకుంటే తరవాత ఉద్యోగంలో చేరవచ్చు నంటారు."
    "పోనీ, అలాగే కానివ్వండి. లక్షణం గా మీరు ఉద్యోగంలో చేరి విద్యావ్యాప్తి కి పాటు పడతా నంటే ఏ భర్త ఒప్పుకోడు?"
    "అందరూ మీలాంటి సహృదయులే ఉంటారా, మూర్తి గారూ?"
    "మీకు తగిన సహృదయుడ్నీ వరించండి."
    "వరించిన వారు  అంగీకరించవద్దు?"
    "మీలాంటి దేవత వరిస్తే అంగీకరించని అధముడేవడు ఉంటాడు?"
    సరస్వతి అతని కన్నులలో కన్ను లుంచి అరక్షణం చూసింది. అతని మనస్సులో సరస్వతి ఎడల మున్నెన్నడూ కలగని భావం ఏదో కలిగినట్లైంది. అతడు తటాలున కన్నులు మూసుకున్నాడు.
    "క్షమించండి, సరస్వతీ దేవి. నా మనస్సేమీ బాగాలేదు. వస్తాను.' అని లేచి వెళ్ళిపోయాడు.
    రాజశేఖరమూర్తి ప్రతి రోజూ కళాశాల కు పోయి ఆనర్సు లో కొత్తగా చేరిన విద్యార్ధులకు సంజ్ఞా గణితము, రేఖా గణితము చెప్పేవాడు. ఇప్పుడతనికి గుంటూరు లో స్నేహితులెవ్వరూ లేరు. ఒక్క సరస్వతి తప్ప. మార్కేండేయ శర్మ, యజ్జేశ్వర శాస్త్రి ఉద్యోగ ప్రయత్నాలలో ఎక్కడెక్కడి కో వెళ్ళారు. రవి రాజమహేంద్ర వరం లో జూనియర్ ఇంజనీరు గా నియమితుడై నాడు. చిన్ననాటి స్నేహితుడు హనుమంతరావు నరసారావు పేట బదిలీ అయింది. మానోహర రావు సినిమా వ్యాపారంలో ప్రవేశించి మద్రాసు చేరాడు.
    హిందూ పత్రిక చూస్తుంటే రాజశేఖర మూర్తికి ఒక ప్రకటన కనిపించింది. కేంద్ర ప్రభుత్వం వారి ఒకానొక శాఖ లో గణిత శాస్త్రం లో ఎమ్.ఎ. డిగ్రీ పుచ్చుకున్న సహాయకులు కావాలట. ప్రారంభం లో నూట ఏభై రూపాయలు జీతం. ఉద్యోగ స్థానం సిమ్లా. రాజశేఖర మూర్తి మనస్సు కు గుంటూరు లో శాంతి చిక్కలేదు. ఈ ప్రాంతాన్ని విడిచి ఎక్కడి కైనా దూరంగా పోవాలని అనుకుంటున్నదే. ఈ ఉద్యోగానికి ఎందుచేత దరఖాస్తు చెయ్యకూడదు? ఆ హిమాలయాలలో నైనా శాంతి చిక్కుతుందేమో?' ఆలోచన తట్టిందే ఆలస్యంగా దరఖాస్తు వ్రాసి పోస్టు చేశాడు. రెండు నెలలో ఉత్తరవు వచ్చింది ఉద్యోగంలో వచ్చి చేరమని.
    కేంద్ర ప్రభుత్వం లో ఉద్యోగం మంచిదే. పోయి చేరమన్నారు కొందరు. "నూట యాభై రూపాయల కోసం అంత దూరం ఎందుకు? ఇక్కడ డెబ్బై అయిదు రూపాయలు అంతకన్న మెరుగు కదా?" అన్నారు కొందరు. "కేంద్ర ప్రభుత్వం లో పైకి పోవటానికి అవకాశాలు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం లో ఈ మాత్రపు ఉద్యోగం బ్రాహ్మణుల కిచ్చే వారెవరు? తప్పక పోయి చేరు" అన్నారు మరికొందరు. రాజశేఖర మూర్తి మనస్సులో మాత్రం ఒక్కటే ఆలోచన. ఈ ప్రదేశాన్ని విడిచి పోవాలి. వెంకటా చలపతి గారు వెనకడారు. కాని, మాణిక్యమ్మ గారు మాత్రం, "నీ ఇష్టం, నాయనా. నీకెలా బాగుంటే అలా చెయ్యి," అన్నది. సుబ్బారావు గారు, "పెళ్లి చేసుకుని భార్యను కూడా తీసుకుని పొతే మంచిది కదా?" అన్నారు. అది మాత్రం ఇప్పుడు తలపెట్ట వద్దన్నాడు రాజశేఖర మూర్తి.
    యూనివర్శీటీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి , దసరా పండుగులయిన తరవాత సిమ్లా బయలుదేరాడు. బయలుదేరే ముందు సరస్వతి కి చెప్పి వచ్చాడు. చెమ్మగిల్లిన కళ్ళతో ఆమె శుభం అన్నది.
    విజయవాడ లో నారాయణరావు గారు స్టేషను కు వచ్చి "మీరిలా దేశాంతరం వెళ్లి పోవటం మాకేమీ బాగులేదు, బావగారు నా మాట విన్నారు కాదు" అన్నారు.
    "దేశాంతరం ఏమిటండీ? సిమ్లా భారత దేశం లోనిది కాదూ? మనలాంటి వాళ్ళంతా వెళ్లి చేరకపోతే కేంద్ర ప్రభుత్వం అంతా హిందూస్తానీ వాళ్ళు కట్టుకు పోరూ? అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా రేవతికి నా శుభాశీస్సులు" అన్నాడు రాజశేఖర మూర్తి.
    "ఎప్పటికైనా మన సంబంధం మళ్ళీ కలవాలి బావగారూ. ఇలా విడిపోవటానికి వీల్లేదు" అన్నారు నారాయణరావు గారు.    
    రైలు కదిలింది. ఆంధ్ర దేశపు సీమలు దాటి వెళ్ళిపోయాడు రాజశేఖర మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS