Previous Page
ఇందుమతి పేజి 27


                                    27
    వరంగల్లు, వార్ధా, నాగపూరు, భోపాలు, గ్వాలియరు, ఆగ్రా, మధుర దాటి డిల్లీ చేరింది గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్. డిల్లీ లో బండిమారి, అంబాలా మీదుగా కాల్కా చేరాడు రాజశేఖర మూర్తి. కాల్కా హిమాలయ పర్వతాలకు పీఠం వంటిది. అక్కడి నుండి సిమ్లా కు అరవై మైళ్ళు కొండలలో ప్రయాణం. అదేదో కొత్త లోకంలో పవేశించినట్లుంది. ఒక పక్క ఎత్తైన కొండలు, వేరొక పక్క లోతైన లోయలు , నిడుపైన దేవదారు వృక్షాలతో నిండిన పచ్చని వనాలు , చల్లని గాలి, సుదూరం లో తెల్లగా నిగనిగలాడే మంచు శిఖరాలు. సిమ్లా పట్టణం సముద్ర మట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున విశాలమైన ఒక పర్వత శ్రేణి మీద ఉంది. అక్కడ సంవత్సరానికి మూడు నెలలు ఎండలు, మూడు నెలలు వానలు, ఆరు నెలలు చలి. కొండల మూపున రహదారు, బజారులు, కార్యాలయాలు కొండల వాలులో నివాస గృహాలు , కొండ లోయలలో మొక్క జొన్న చేలు. పట్టణం లో ఎక్కడ చూసినా రంగు రంగుల పూల చెట్లు. ఇరవై రెండేళ్ళు మండు టండల్లో గడిపిన రాజశేఖర మూర్తి కి సిమ్లా ప్రశాంత వాతావరణం లో అతని తప్త హృదయానికి కొంచెం ఉపశమనం కలిగింది.
    కొత్త ఊరు, కొత్త ప్రజ, కొత్త భాష, కొత్త స్నేహితులు . గతాన్ని కొంత మరిచి పోవటానికి సహకారులయ్యాయి. కాని, మరిచి పోవటం సాధ్యమా? రాజశేఖర మూర్తి రోజంతా ఆఫీసు లోనూ, స్నేహితులతోనూ గడిపేవాడు. రాత్రి మాత్రం ఒంటరితనం . గత స్మృతులు మనస్సును కలిచి వేసేవి. ఉద్వేగం విషాద గీతికల రూపంలో అప్పుడప్పుడు బయట పడుతుండేది. వాటితో అతడు తన డైరీ నింపేవాడు.
    "అది యేదో యొక మాయగా హృదయ మం
        దావిర్బవించున్ భవ
    త్పద మంజీర విని స్వనోచ్చాలిత బా
        ధా వీచికా లేశః మ
    య్యది యేనా డోగతించిపోయిన త్వదీ
        యామాన సౌందర్య సం
    పద కన్గట్టిన రీతి విస్మృతి గతిన్    
        భగ్నాశలందే చేడిన్!"
    మరి ఒక చోట ---
    "ఓపి తటిల్లతా , త్వదుద
    యోద్గత కాంచన కమ్ర దీధితుల్
    కాసుల పేరులై హృదినో
    కానొక వర్తన మాచరించే; త
    ద్రాస రసానుభూతి ఇక
        రానని న నన్నేడబాసి పోయెనే,
    'కాసుల మ్రోతలే యెడద
        గాచిన వెన్నెల పూవులై చనెన్!'
    ఈ విధంగా సాగిపోయేవి.
    వారానికి ఒకసారి గుంటూరు నుంచి ఉత్తరం వచ్చేది. ఒకమారు తండ్రి, ఒకమారు ముత్తవ తల్లి వారి వారి మనస్సులో ఆవేదన చెప్పుకునే వారు. వారికి ఒక్కటే కోరిక. అది రాజశేఖర మూర్తి పునర్వివాహం. తన తండ్రికి పట్టిన దుస్థితే తనకూ పట్టినదంటారే, తన తండ్రి ద్వితీయ వివాహం చేసుకుని ఏమి సుఖించాడు? తనను అంతకన్న ఎక్కువ అదృష్టం వరిస్తుందని నమ్మక మేమిటి? రాజశేఖర మూర్తి రెండు సంవత్సరాలు వారి ప్రార్ధనలు పెడచెవిని పెట్టాడు కాని , ఎంతకాలం ఈ పోరు! ఎంత కాలం వారి మాట తోసి వెయ్యగలడు! ఈ ఆవేదనతో తన తండ్రి కేమో మనస్సు స్తైర్యం పోతున్నది. మాణిక్యమ్మ గారి ఆరోగ్యం చెడిపోతున్నది. వారిని ఎంత కాలం గుంటూరు లో ఉంచగలడు? ఇన్ని సంవత్సరాలు వారు అష్టకష్టాలు పడి తనను పెంచి పెద్దవాణ్ణి చేశారు. వారికీ ఇంక కొంత విశ్రాంతి కూర్చటం తన బాధ్యత. తను మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే కాని వారు అక్కడి నుంచి కదలరు.
    ఈ స్థితిలో ఒకనాడు హిందూ పత్రిక చూస్తుంటే ఒక ప్రకటన కనిపించింది. ఒక చక్కని బ్రాహ్మణ బాల వితంతువు కు వరుడు కావాలి. ఆమె వయస్సు పదహారేళ్ళు. మెట్రిక్ చదువుకున్నది. రాజశేఖర మూర్తి కి ఒక ఆలోచన తట్టింది. తాను వివాహమే చేసుకోవలసి వస్తే ఒక బాల వితంతువు నెందుకు చేసుకోరాదు? తన కరుకు చేతులతో పడి ఒక మొగ్గ నలిగిపోయింది. మరి ఒక మొగ్గను స్పృశించడానికి తన కేమిటి హక్కు? తను వివాహామే చేసుకుంటే దాని వల్ల సంఘాని కైనా ఒక మంచి జరగనీ. దేశంలో బాల వితంతువు లెందరో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించటానికి తన వంటి వారే వెనకాడితే ముందంజ వేసేవారెవరు?
    వెంటనే పత్రికకు ఉత్తరం వ్రాశాడు రాజశేఖర మూర్తి . వారం రోజులలో జవాబు వచ్చింది. ఆ ప్రకటన చేసిన వారిది కాకినాడ. ఆ బాలికకు పదేళ్ళ ప్రాయం లో వివాహం చేశారట. ఆమెకు పన్నెండేళ్ళు నిండ కుండానే అకస్మాత్తుగా భర్త మరణించాడట. అప్పటి నుండి ఆమెను ప్రైవేటు గా చదివిస్తూవచ్చారు. ఇప్పుడామె మెట్రిక్ పరీక్ష పాసయింది. ఆదర్శ వంతుడైన యువకుడి కి ఎవరికైన ఇచ్చి పునర్వివాహం చెయ్యాలని - ఆమె తండ్రి ఆరాటం. రాజశేఖర మూర్తి ఈ వివరాలు వెంకట రత్నం గారికి వ్రాశాడు. అయన స్వయంగా కాకినాడ వెళ్లి వారి సంగతి సందర్భాలు కనుక్కుని వచ్చారు. ఆ అమ్మాయి పేరు ప్రియం వద. సౌందర్య వతి. ఆమె తండ్రి న్యాయవాది. మచ్చలేని కుటుంబం. వెంకట రత్నం గారు వేంకటాచలపతి తోనూ, మాణిక్యమ్మ గారితోనూ చర్చించారు. మాణిక్యమ్మ గారు వెనకాడింది. వెంకటా చలపతి గారికి ఒక దృడ భిప్రాయం లేదు సుబ్బారావు గారితో కూడా చర్చించా లన్నారు. సుబ్బారావు గారిని పిలిపించారు.   అయన మండి పడి కాదు, కూడదన్నారు . ఈ వివాహమే జరిగితే ఈ రెండు కుటుంబాలకు ఒక బంధవ్యం తెగిపోయినట్లే అన్నారు. వెంకటా చలపతి గారికీ అటు అన్నగారు, ఇటు కుమారుడు. ఎవరిని వదులు కోగలరు? అయన కుమారుడికే దీనంగా ఒక ఉత్తరం వ్రాశారు. ఈ పరిస్థితులలో ఈ ప్రతిపాదన వదులుకోమని బతిమాలారు.
    రాజశేఖర మూర్తి కేమీ తోచలేదు. ఇంతకూ ముందు రవికి ఇటువంటి సమస్యే వచ్చినప్పుడు తానేమని చెప్పాడు? కని పెంచిన తలిదండ్రులను వ్యతిరేకించవద్దన్నాడు. అది అతని పరిస్థితిలో మంచికే దారి తీసింది. తాను మాత్రం ఎలా వ్యతిరేకించగలడు? ఎవరి మనశ్శాంతి కోసం తాను ద్వితీయ వివాహానికి ఒప్పుకున్నాడో, వారికే ఇష్టం లేనప్పుడు, తానిక వారిని ఎదిరించి ఏమి సాధిస్తాడు?
    సరే, ఇక తన ఇష్టా నిష్టాల తో పని లేదు. తన తండ్రికి పెద తండ్రికి ఇష్టమైన సంబంధం వారినే కుదర్చమని వ్రాశాడు. ఇక అడ్డే ముంది? మూడు నెలలో రాజశేఖర మూర్తి కి రెండవ వివాహం నిశ్చయ మయింది. వదువు నిర్మల. నెల్లూరు లో ఇంటర్ మీడియట్ చదువు తున్నది. ఆమె తండ్రి ఒక ప్రభుత్యోద్యోగి . వధువును చూడనైనా చూడకుండా ఫోటో చూసి ఒప్పుకున్నాడు రాజశేఖర మూర్తి. నిర్మల తండ్రి సిమ్లా పోయి రాజశేఖర మూర్తిని చూసి వచ్చాడు. అతని చాయా చిత్రం చూసి సమ్మతి తెలిపింది నిర్మల. మాఘ మాసం లో పెళ్లి. పెళ్లి పీటల మీదే మొదటి సారిగా వారు ఒకరి నొకరు చూసుకున్నారు.
    చైత్ర మాసం లో ఇంటరు పరీక్ష వ్రాసింది నిర్మల. ఆ తరవాత వెంకటాచలపతి గారు, మాణిక్యమ్మ గారు నిర్మలను తీసుకుని రాజశేఖర మూర్తి ఉద్యోగ స్థానమైన సిమ్లాకు ప్రస్థాన మైనారు.

                                  28
    రాజశేఖర మూర్తి అ రాత్రంతా నిద్ర లేదు. ఇరవై సంవత్సరాల తరవాత మళ్ళీ నారాయణరావు గారు తన ఇంటికి రావటం, ముమ్మూర్తుల ఇందుమతిని పోలిన తన కుమార్తె చంద్ర ప్రభ ను రాజశేఖర మూర్తి కుమారుడైన ప్రభాకరుడి కి ఇయ్య చూపటం , ఇరవై అయిదు సంవత్సరాల నాడు జరిగిన ఇందుమతీ పాణి గ్రహణం , తదనుబద్దమైన విషాద గాధ అంతా జ్ఞప్తికి వచ్చి అతని కడుపులో చెయ్యి పెట్టి దేవినట్లయింది. గత ఇరవై సంవత్సరాలుగా తన ప్రణయ స్వరూపిణి ఇందుమతి ని మరిచి పోవటానికి ప్రయాత్నించాడు రాజశేఖర మూర్తి. నిర్మల ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి ఆమెనే ఇందుమతి గా చూసుకున్నాడు. తన ప్రేమ అంతా ఇందుమతి మీదనే నిలిపి ఒక కొత్త జీవితాన్నే ప్రారంభించాడు. నిర్మల హృదయం ఆమె పేరుకు తగినట్లు అతి నిర్మలమైనది. దానిలో అసూయ కు, సంకీర్ణ భావాలకు తావు లేదు. ఎంత చదువు కున్నదో, అంత వినయ సంపద కలది. ఎంతటి సౌందర్యం కలదో అంతటి విశాల హృదయ. ఇందుమతి అంటే ఆమెకు భక్తీ భావం. రాజశేఖర మూర్తి ఎడల ఆమెకు ప్రేమే కాక జాలి కూడా కలిగింది. తన హృదయ కవాటం విశాలంగా తెరిచి దానిలో రాజశేఖర మూర్తి కి ఒక పూల పానుపే అమర్చింది. ప్రేమ స్వరూపిణి అయి అతని హృదయం అంతా ఆక్రమించు కున్నది.
    రాజశేఖర మూర్తి నిర్మలతో సంప్రదించ కుండా ఏపనీ చెయ్యడు. ఉదయాన్నే లేచి కాఫీ తాగే వేళ నిర్మలను పిలిచి, '"నిర్మలా, ఈ ఫోటో చూడు. నారాయణరావు బావగారి కూతురు చంద్ర ప్రభ" అని ఆ చాయాచిత్రం ఆమె చేతికి అందించాడు.
    ఆమె నివ్వెర పోయింది. ఇందుమతి ని ఎరుగడు గాని, ఆమె చాయా చిత్రాన్ని రోజూ చూస్తూనే ఉన్నది.
    "ముమ్మూర్తులా మేనత్త పోలిక."
    "మన ప్రభాకర్ కి చేసుకో మంటారు బావగారు."
    "అంతకంటే మనకు కావలసిందేముంది! అక్కయ్యని ఇన్నాళ్ళూ ఫోటో లోనే చూసుకుంటున్నాం. ఇప్పుడామె ప్రతిరూపం చంద్ర ప్రభ లో చూసుకుంటాం. మీరేమీ అడ్డు చెప్పకండి."'    
    "బాగున్నది. అన్నా చెల్లెలు ఒక్కటైతే ఇక నా దేముంది?"
    నిర్మల ప్రభాకరుణ్ణి పిలిచింది.
    "ఏమిటమ్మా" అని పరిగెత్తుకు వచ్చాడు ప్రభాకర్.
    "ఈ అమ్మాయిని చూడు, మామయ్యా గారి కూతురు, చంద్ర ప్రభ" అని ఫోటో అందించింది నిర్మల.
    ప్రభాకర్ కళ్ళలో ఏదో మెరుపు కనిపించింది. పెదవుల పై చిరునవ్వు వెలిసింది. అతని మనస్సు చెప్పకుండానే తెలిసిపోయింది.
    "సంతోషం, బావగారూ , మీరూ నిర్మలా పిల్లలూ వీలు చూసుకుని ఒకసారి విజయవాడ వచ్చి వెళ్లాలని మా ప్రార్ధన. నిర్మలను చూస్తె ఇందుని చూసినట్లే ఉంది. మీకు మా ఇంట్లో అప్పుడూ ఇప్పుడూ, ఎప్పుడూ స్వాగతమే" అన్నారు నారాయణరావు గారు.
    'అలాగే, బావగారూ. కాని, నాది ఒకటే కోరిక. బాల్య వివాహం లో ఉన్న కష్ట నష్టాలు స్వయంగా చూశాం , అనుభవించాం. పెద్దేనిమిదేళ్ళకి పెళ్లి చేసుకుని, ఇరవై రెండేళ్ళ కే చెడ్డ పేరు తెచ్చుకుని కూర్చున్న నేను మళ్ళీ అటువంటి తప్పు పనే చెయ్యలేను బావగారు. ప్రభాకర్ ఇంకా చిన్నవాడు. పద్దెనిమిదేళ్ళయినా లేవు. చదువుకుంటున్నాడు. మరో నాలుగేళ్ల యినా చదివితే గాని ఒక మెట్టుకు రాడు. చంద్ర ప్రభ కూడా చిన్నదే. పద్నాలుగేళ్ళు ఏమో ! ఇప్పుడు వీళ్ళకి వివాహం చెయ్యవలిసిన తొందరే ముంది? కాలం మారుతుంది. కాలం తో పాటు మనమూ మారాలి. బాల్య వివాహాలు వ్యక్తిగతం గానే కాకుండా సాంఘికంగా , ఆర్ధికంగా కూడా మంచివి కావు. మధ్యతరగతి కుటుంబాలు జీవన వ్యయం పెరగటంతో అనేక కష్టాలకు గురి అవుతున్నాయి. ఆడవాళ్ళు కూడా చదువుకుని ఉద్యోగాలు చెయ్యటం తప్పనిసరి. అవుతుంది రానురాను. అందుచేత చంద్ర ప్రభని కూడా పైకి చదివించండి. మీకెంత ఇష్టమో, నాకూ అంతే ఇష్టం. నాలుగు సంవత్సరాల తరవాత నేనే మీ ఇంటికి వచ్చి ముహూర్తం పెట్టించుకు వెళతాను" అన్నాడు రాజశేఖర మూర్తి.
    "తధాస్తు" అన్నారు నారాయణ రావు గారు.

                                   (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS