25
శ్రావణ మాసం లో ఇందుమతి ని మళ్ళీ తీసుకుని వచ్చి కృష్ణయ్య చౌదరి గారి వైద్యశాల లో చేర్చారు. ఈ నాలుగు నెలలలో ఇందుమతి ఆరోగ్యం మరింత క్షీణించినట్లుంది. ఇప్పుడు ప్రతిరోజూ జ్వరం ఉంటున్నది. దగ్గు ఎక్కువగా వస్తున్నది. పై పెచ్చు కొత్త వ్యాధి ఏదో పట్టుకున్న ట్లున్నది. మెడ మీద ఎడమ పక్క నల్లగా వాచి దేహం లోని చెడు నెత్తురంతా అక్కడ చేరి గడ్డ కట్టిన ట్టుంది. రాజశేఖర మూర్తి చూచి హడిలి పోయాడు. అతని ఊహ స్వప్నాలన్నీ అడ్డు తిరిగాయి. ఇందుమతి అతని పాదాల మీద పడి ఏడ్చింది.
"నావంటి దౌర్భాగ్యురాలి నెందుకు కట్టుకున్నాడు? మీకు సుఖమన్నది లేకుండా చేశాను. ఈ జబ్బు బాగుపడేది లేదు. ఇంకా డబ్బెందుకు ఖర్చు పెడతారు? మీ చదువెందుకు పాడు చేసుకుంటారు? ఇంక ఆసుపత్రి లో ఉండలేను. బ్రతికి నన్నాళ్ళు మీ పాదాల దగ్గిర బ్రతక నివ్వండి."
ఆమెను రెండు చేతుల తోనూ లేవదీసి హృదయానికి హత్తుకుని రాజశేఖర మూర్తి తనకు లేని ధైర్యం భార్యకు చెప్ప ప్రయత్నించాడు.
"ఇందూ, నువ్వు దిగులు పడకు. ఇలాంటి జబ్బులకు మనసు స్తైర్యం ముఖ్యం. చౌదరీ గారి హస్త వాసి మంచిది. ఆయనకి చేతనయినదంతా అయన చేస్తారు. ఎండలు తగ్గాయి. కాస్త మందు ఒంట పడితే అదే నెమ్మదిస్తుంది. డబ్బు కేముంది? దైవం దయతలిచి నువ్వు కులాసాగా ఉంటె తరవాత సంపాదించు కోలేక పోము. నా చదువు కోసం నువ్వు బాధపడకు. నా దీక్ష ఎరుగుదువు గా? దీని కిదే, దాని కదే."
కృష్ణయ్య చౌదరి గారు మళ్ళీ వైద్యం ప్రారంభించారు. కొన్నాళ్ళు కొంత సుగుణం కనిపించేది. మళ్ళీ తిరగ బెట్టేది. రానురాను శరీరం కృశించ జోచ్చింది. దగ్గు విపరీతమయింది. అప్పుడప్పుడు నెత్తురు కూడా పడుతున్నది. జ్వరం శరీరాన్ని వదలటమే లేదు. మెడ మీద శాస్త్ర చికిత్స చేసి చెడు నెత్తురు తీసి వేశారు. నెల రోజులలో మళ్ళీ కూడుకున్నది. రెండేసి నెలల కొకమారు ఎక్స్ రే తీసి చూస్తున్నారు. నానాటికి తీసికట్టు గానే ఉన్నది కాని బాగుపడే సూచన లేదు.
ఆవిధంగా ఆరు నెలలు గడిచి పోయాయి. కృష్ణయ్య చౌదరి గారు ఒకనాడు వేంకటాచలపతి గారిని, రాజశేఖర మూర్తి ని పిలిచి ఇక తన వల్ల కాదని చెప్పేశారు.
"పోనీ, మదనపల్లి గాని, రాజమహేంద్ర వరం గాని తీసుకు వెళ్లి, శానిటోరియమ్ లో చేర్చమంటారా?" అన్నాడు రాజశేఖర మూర్తి.
"అనవసర ప్రయాస. ఎలోపతీ వైద్యం లో ఇంత వరకు మాకు తెలిసిన మందులన్నీ వాడాను. ఈ స్థితిలో వాళ్ళేనా ఎక్కువ చేసేదేమీ లేదని నా అభిప్రాయం."
'అయితే ఏం చెయ్యమంటారు?"
"మీ ఇష్టం. ఇక్కడే ఈ విధంగానే సాగానిద్దమంటే , అలాగే కానివ్వండి. కాని, మీరేదైనా ఇతర ప్రయత్నాలు చేస్తామంటే , నా కభ్యంతరం లేదు."
వెంకటా చలపతి గారికి గుండె చెదిరిపోయింది. అయన కాళ్ళకు వణుకు పట్టుకున్నది. రాజశేఖర మూర్తి గుండె రాయి చేసుకుని ఆయనను ఎలాగో బండి ఎక్కించి ఇంటి కి చేరవేశాడు. అనంత కృష్ణ శర్మ గారికి, దివాకరరావు గారికి వెంటనే రమ్మని ఉత్తరాలు వ్రాశాడు రాజశేఖర మూర్తి. మూడో నాటికి అనంత కృష్ణ శర్మ గారు దారిలో నారాయణరావు గారిని కూడా తీసుకు వచ్చారు. దివాకరరావు గారూ వచ్చారు. వెంకటరత్నం గారికి కబురు పంపారు. దివాకరరావు గారు స్వయంగా వెళ్లి చౌదరి గారితో చర్చించారు. వారిద్దరూ కలిసి'విధి అనుకూలంగా లేదు కాబోలు' అన్న నిర్ణయానికి వచ్చారు.
"విజయవాడ లో ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు. ఆయనకు చూపిస్తేనో?' అన్నారు నారాయణరావు గారు. ఆ వైద్యుడింతకు ముందు మద్రాసు లో వైద్యం చేస్తుండేవాడట. యుద్ద భయంతో, మద్రాసు ఖాళీ చేసి వచ్చిన అనేక మంది ఆంధ్రులలో అయన ఒకడు.
"ఆధునికమైన ఎలోపతీ వైద్యానికే సాధ్యం కానిది ఆయుర్వేదానికి సాధ్యం అవుతుందా?" అన్నారు వెంకట రత్నం గారు.
"ఏ పుట్టలో ఏ పాముందో ఏమి చెప్పగలం? ఈ ఆశ ఎట్లాగూ లేదు కనక అది ప్రయత్నిస్తే తప్పేమిటి? ఏమంటారు , బావగారూ?" అన్నారు నారాయణరావు గారు దివాకరరావు గారిని ఉద్దేశించి.
"ఎలోపతి వైద్యుడు గా నాకు ఆయుర్వేదం లో అంత నమ్మకం లేదు. అయినా ఏ పుట్టలో ఏ పాముందో! అలాగే కానివ్వండి" అన్నారు దివాకరరావు గారు.
అనంత కృష్ణ శర్మ , వెంకటా చలపతి గారల మనస్సులు శూన్యంగా ఉన్నాయి. రాజశేఖర మూర్తి దైవ లిఖితం ఎలా ఉందొ అలాగే అవుతుంది లెమ్మని సరే నన్నాడు.
పంచాంగం చూసి ఒక శుభ సమయం లో అనంతకృష్ణ శర్మ గారు, నారాయణరావు గారు, దివాకరరావు గారు ఇందుమతి ని విజయవాడ తీసుకు వెళ్ళారు. బయలుదేరేటప్పుడు రాజశేఖర మూర్తిని చూసి ఇందుమతి, "ఇక నేను మీకు కనిపించను" అన్నది. విరశా మూర్తి లా నిలిచి ఉన్న రాజశేఖర మూర్తి నోట ఏమనడానికి మాట రాలేదు. రెండు కన్నుల నుండి రెండు ఎర్రని జల బిందువులు మాత్రం రాలాయి.
రాజశేఖర మూర్తి కి ఎమ్.ఎ. పరీక్ష లింక రెండు నెలలే. వికల మనస్కుడైన అతనికి పుస్తకం పట్టుకుంటే ఇందుమతి కనిపిస్తున్నది. మార్కండేయ శర్మ, యజ్జేశ్వర శాస్త్రి అతన్ని కూర్చోబెట్టి చదివించారు. ఒక్కొక్క సమస్య తెచ్చి అతని ముందు పెట్టేవారు, అతడేలాగో మనస్సు కేంద్రీకరించి ఆ సమస్య పరిష్కరించే వాడు. వారేదో వ్రాసి అది రైటో తప్పో చూడమనేవారు. అతడది పరీక్షించి తప్పులు దిద్దేవాడు. ప్రవేశ పత్రాల కోసం కళాశాల కు పోయినప్పుడు సరస్వతి కనిపించింది.
"ఎలా చదువుతున్నారు, మూర్తి గారూ?"
"ఏమి చదువు? వీరిద్దరూ కలిసి ఏదో నూరి పోస్తున్నారు." అన్నాడు మిత్రులైన మర్కేండేయ శర్మనూ, యజ్జేశ్వర శాస్త్రిని ఉద్దేశించి.
"మీరు మా అందరికీ నూరి పోయ్యావలసిన వారు. మీరు అలా చిన్న పిల్లాడిలా మారం పెడితే ఎలా? చూడండి. మూర్తి గారు మీ మనస్సులో బాధ నాకు తెలుసు. ఇందుమతి పరిస్థితి తలుచుకుంటే మీకే కాదు ఏ సంబంధం లేని నాకు కూడా బాధగానే ఉంటుంది. ఈ వారం రోజులూ ఇందుమతి ని మరిచిపొండి. లేకపోతె ఈ రెండు సంవత్సరాలు మీరు పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. మీ కష్టం ఫలిస్తే ఆమె మనస్సు కూ కొంత ఆనందంగా, శాంతిగా ఉంటుంది." అన్నది సరస్వతి.

"అలాగే, సరస్వతీ దేవి. ప్రయత్నిస్తాను. మీ సానుభూతి కి కృతజ్ఞుణ్ణి.
పరీక్షలు వారం రోజులూ ఏదో దీక్షలో ఉన్నట్టున్నాడు రాజశేఖర మూర్తి. మనస్సు ఎలాగో కేంద్రీకరించి వెనక్కి తిరిగి చూడకుండా వ్రాశాడు. పరీక్షలయ్యాయి. మరునాడు ఉదయాన పది గంటల వేళ తంతి వచ్చింది. ఇంకేమున్నది? ఇందుమతి లేదు! అతని హృదయం ఎంత పాషాణమై పోయిందో, కళ్ళలో ఒక్క నీటి బిందువు కూడా రాలలేదు. వెంకటాచలపతి గారు నెత్తి బాదుకొని ఏడ్చారు. మాణిక్యమ్మ గారు తల గోడకు కొట్టుకున్నది.
"తండ్రికి పట్టిన దుస్థితే కొడుక్కీ పట్టాలా?' అని ఏడ్చింది మాణిక్యమ్మ గారు.
"నా కడుపున ఎందుకు పుట్టావురా, నాయనా!' అని ఏడ్చారు వెంకటాచలపతి గారు.
వెంటనే బయలుదేరి తండ్రీ కొడుకు విజయవాడ వెళ్ళారు. ఇంట్లో అడుగు పెట్టటమే ఆలస్యంగా రేవతి రాజశేఖర మూర్తి కాళ్ళు చుట్టుకుని, "బావా, ఇక చిన్నక్క లేదు" అని ఏడ్చింది.
"వీరన్న పేట వారి సంబంధాలు మనకు కలిసి రావు స్వామీ , అని ఏనాడో మొర పెట్టుకున్నాను, విన్నారా?" అని గోల పెట్టింది అన్నపూర్ణమ్మ గారు.
నాటి సాయంకాలానికి ఇందుమతి ప్రకృతి లో కలిసి పోయింది.
26
కర్మకాండ గుంటూరు లో ఒక ధర్మ సత్రం లో జరిగింది. ఇందుమతి సీతమ్మ గారు, శ్రీదేవి , రాజేశ్వరి దేవి మొదలయిన పూర్వీకుల సమక్షంలో పితృ లోకంలో చేరిపోయింది.
పదమూడో నాడు భోజనాలైన తరవాత అనంత కృష్ణ శర్మ గారు వెంకటాచలపతి గారిని పక్కకు పిలిచి, రెండు చేతులు పట్టుకొని, "బావగారూ, గడిచిందొక పీడకల. రాజశేఖర మూర్తి చిన్నవాడు. అతనికీ వయస్సులో ఈ దుస్థికి రావటం శోచనీయం. ఇందులో మా బాధ్యత కూడా లేకపోలేదు. నాలుగు సంవత్సరాలుగా మా ఇంటికి వస్తూ పోతూ రాజశేఖర మూర్తి మా కుటుంబంలో ఒకడుగా మెలిగాడు. దౌర్భాగ్య జాతకురాలు. తాననుభావించ లేకపోగా అతనికి కూడా చెడ్డ పేరు తెచ్చి పెట్టి పోయింది. మన సంబంధం తెగ తెంపులు కావటం నా కిష్టం లేదు. అల్లుడికి ఇష్టమైతే రేవతి నిచ్చి మళ్ళీ కన్యాదానం చేసి నా పాపం కడుక్కుంటాను. మీరు కాదనకండి.'అన్నారు.
వెంకటాచలపతి గారు కొడుకుతో సంప్రదించారు. రాజశేఖర మూర్తి స్వయంగా మామగారి దగ్గిరికి వెళ్లి అయన పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు:
"మీరన్నది నాన్నగారు చెప్పారు. రేవతి చిన్న పిల్ల. నేను దానిని ఎత్తుకు ముద్దాడిన రోజులు ఉన్నాయి. రేవతిని తలుచుకుంటే "బావా , ఇక చిన్నక్క లే'దని నా కాళ్ళను చుట్టుకుని విలపించిన ఆ అమాయిక రూపమే నాకెప్పుడూ మనస్సుకు తట్టుతుంటుంది. నేను దానిని భార్యగా చేపట్టలేను.మామగారు దానిని నా హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. మంచి సంబంధం చూసిచేయ్యండి."
