11
'నేను నేను కాదు. యిది నాది కాదు అనే ఆలోచన నామీద నాకే వున్న అభిమానాన్ని తగ్గించి యెదుటి వాళ్ళ మీద అభిమానాన్ని వృద్ది చేసింది. నాలో క్రొవ్వు వత్తి అప్పటికే తయారవుతున్న ఆ అజ్ఞాత వ్యక్తీ వెలిగించాడు. ఆ వెలిగించిన వాడే దేవుడు. దేవుని స్పర్శ అతని ఆకారం తో ఊహించు కోగలుగుతూన్నాను. నా జీవితంలో పెనుగాలులు వీచాయి-- వస్తున్నాయ్. ఆ గాలులకు ఆ దీపం అరుతోంది. అతని స్పర్శ తలపులను సృష్టించి మళ్లీ వత్తిని వెలిగిస్తున్నాయ్.'
శ్రీనివాస్ యింత చెప్పి ఆయాసం వలన కామోసు ఆగిపోయాడు. ఇప్పటికి యితను చెప్పిన వృత్తాంతం సూర్యం లో యేన్నేన్నో విచిత్రాను భూతులను సృష్టించింది. అతనికి కొద్దిగా కాఫీ అందిచ్చాడు. అది త్రాగేసరికి పిలుపు వచ్చింది. ఎక్స్ రే తీసాక మళ్లీ చక్రాల కుర్చీ మీద తిరగి వచ్చాడు.
వార్డుకు తిరిగి వచ్చి మంచం మీద పడ్డాడు. మనిషి నీరసంగా వున్నా సాహసిస్తున్నాడు. ముఖంలో బాధను చిరినగవు తెరతో కప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా అతని దగ్గర నించి వినవలసింది సూర్యం కు యెంతో వుంది. శ్రీనివాస్ నిద్దర పోతున్నా కాస్సేపు అక్కడ కూర్చున్నాడు. తరవాత తన పరుపు మీదకు వచ్చేసాడు. ప్రక్క నున్న ఖాళీ మంచం మీదకు పరుపు వచ్చింది. ఆ పరుపు పై తెల్లటి దుప్పటి పరుస్తున్నారు. తన మనసు స్వచ్చమైన తెలుపు లానే వుంది. ఆ తెల్లని తేరపై తన గురించి విమర్శన ప్రోజక్టరు ద్వారా ఫిల్ము వేసుకుని చూస్తున్నాడు.
సూర్యం యెదుటి వాళ్ళ దగ్గర నించి యేన్నేన్నో కాంక్షించాడు. వాళ్ళ ప్రేమ, అభిమానం, కీర్తి, గౌరవం -- తను యెంతో త్యాగం చేసినట్లు, యెంతో మంచి సాధించి నట్లు- ఈ త్యాగాన్ని, మంచినీ యెదుటి వారు శ్లాఘించాలని వుబలాటపడ్డాడు. ఎన్నెన్నో పొందాలని కోరుకున్నాడు. తన సంతోషం కోసం యెదుటి వారి ప్రేమ, హృదయం, అందం, ఆవేశం, స్పర్శ యింకా యేన్నేన్నో కాంక్షించాడు. అతను తన చేతులూ, అందం, మెదడు తనవి అనుకున్నవి అన్నీ ప్రేమించాడు. ఇవన్నీ లోభం ముద్ద కాకపొతే యింకేమిటి? ఈ లోభాన్ని కొవ్వు వత్తిగా మార్చే అవకాశం శ్రీనివాస్ యిచ్చినట్లుంది. దానిని వెలిగించే వాడు యెవడో?
అది విశాల కాకూడదా అన్న ఆలోచన మనసులో నించి పూర్తిగా తుడిచి పెట్టలేదు. సాయంత్రం నాలుగైంది. ఆమె గురించి ఎందుకు తలచు కోవాలను కున్నాడు. ఇప్పుడు ఆమె పరాధీన. మళ్లీ ఆమెను తలచు కోడానికి అధికారం తన ఒక్కడికే వుందనుకున్నాడు. ఆమె తోలి వలపులో దైవత్వం వుంది. అది యెవడి అధీనం అవుతుందో ఆమె మీద సర్వాధికారాలు వాడివే! ఆమె తొలి కన్నీరు శ్రావణ మేఘాలు రాల్చిన తోలి వర్షపు చినుకులంత నిర్మలంగా ఉంటాయ్. అవి ముట్టుకో గలిగే అదృష్టం యెవరికి పడ్తుందో వాళ్ళకే ఆమె పై అన్ని అధికారాలు సంక్రమిస్తాయ్. ఆమె పడుతున్న బాధలను వాటి నివారణోపాయాలను వూహించుకునే హక్కు తనకు వుంది.
'మా ఆవిడ వస్తోంది.' అన్నాడు దగ్గరగా కూర్చున్న శ్రీనివాస్. ఆమె వార్డు లో కాలు పెట్టి ముందుకు వెళ్లిపోతుంటే 'యిక్కడ' అన్నాడు ఆమె యిటు తిరగ్గానే.

'విశాల!' సూర్యం సర్వేంద్రియాల్లోనూ ప్రతిధ్వనించింది. ఊపిరి ఆగిపోయినంత పని అయిపొయింది. ఆమె అలా కొయ్య బొమ్మలా నిల్చుండి పోయింది.
'ఇలాంటి స్నేహితుడు కావాలని జీవిత కాలం తపస్సు చేస్తే చివరికి యీ ఆసుపత్రి లో ప్రసాదించాడు. ఆ స్నేహితుడు - ఇతనే సూర్యం -- మా అవిడండీ-- శ్రీమతి విశాలక్ష్మీ-- విశాలా అని పిలిస్తే ఆమెకు కోపం' శ్రీనివాస్ లెక్చర్లు యిద్దరికీ వినపడలేదు.
'ఒకప్పుడు యెలా వుండేదంటారు. జగన్మోహిని. ఇప్పుడు చిక్కి పోయింది. సాధారణంగా యెవరి పెళ్ళాం గురించి వాళ్లు గొప్పగా చెప్పుకుంటారు. అలా అనుకోకండి. చాలా మంచి పిల్ల.' ఇప్పటికీ యెవరూ మాట్లాడక పోవటం తో 'ఏమండీ! నిద్దర పోతున్నారా?' శ్రీనివాస్ సూర్యాన్ని తట్టాడు.
'ఆతనికేమయ్యింది?' విశాల మెల్లగా అడిగింది.
'తిన్నది సరిగ్గా జీర్ణం కాలేదట. అజీర్ణం ఎందు కొస్తుంది చెప్పు?' నాకేం తెలుసు అన్నట్లు విశాల ముఖం పెట్టింది.
'అనవసరంగా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం వస్తుంది. ఈ రెండు రోజుల్లో చూసాను. ఏదో శాశ్వాతంగా పోగొట్టుకున్న మనిషి అలానే యితను ఆలోచిస్తూ వుంటారు. ఏమో? ఏమో? ఎవర్ని ప్రేమించి పొందలేక పోయారో? ఇతనికి గొప్ప గుట్టు. తన గురించి ఒక్క ముక్క చెప్పాడేమో అడుగు.'
'చెప్పడానికి యేమీ లేదు' అన్నాడు సూర్యం.
'ఇతను గుట్టు మనిషని యీ సమాధానం చెప్పటం లేదూ?'
'మాట్లాడండి. వస్తాను' అంటూ సూర్యం అక్కడ నించి లేచి బయటకు వచ్చేసాడు. గబగబ నడచి రోడ్డు మీద పడ్డాడు. అలా నడుస్తూనే కేంటీన్ చూసాడు. వెళ్లి అక్కడ కూర్చిని కాఫీ అడిగి త్రాగేక చమట పట్టింది. ఆ చెమటతో పాటు కన్నీటి బొట్టు రాలింది. తల పట్టుకుని అక్కడే చాలాసేపు కూర్చుండి పోయాడు. చీకటి పద్దవరకు తిరిగి వార్డు కు వెళ్ళలేదు. తన ప్రవర్తన శ్రీనివాస్ కు అనుమానం కలిగిస్తుందేమో నన్న భయంతో 'పాత స్నేహితుడోకడు కలిసాడు. ఆలస్యమైనందుకు క్షమించండి.'
'మా ఆవిడ వేగంగానే వెళ్ళిపోయింది.'
అతను కాస్త వణుకుతూ అనగానే సూర్యం అతను అనుమానించాడెమో నని భయపడ్డాడు. దగ్గరకు మెల్లగా వెళ్ళగానే మళ్ళీ నిన్నటి వేళకే శ్రీనివాస్ కు జ్వరం ముంచుకుని వచ్చింది. సిగరెట్ మీద సిగరెట్ కాల్చేస్తున్నాడు.
'డాక్టర్ వద్దన్నాడుగా...'
'వాళ్ళు చెప్పారు. వాళ్ళను మానమనండి.'
'క్షమించండి...' అంటూ చేతిలోనిది తీసుకున్నాడు.
శ్రీనివాస్ యేమీ అనకుండా ముఖం ప్రక్కకు త్రిప్పి వేసాడు. సూర్యం గుండె వడి యింకా తగ్గలేదు.
'కోపం వచ్చిందా?' అన్నాడు.
'నాకా-- కోపమా ? నేను చాలామందికి శ్రమ యిస్తున్నాను. నాకుండవలసి నంత ఓర్పు. మనో నిగ్రహం వుండటం లేదు. ఒకోసారి కోపంతో చెయ్యరాని పనులు చేసేస్తుంటాను. ఏంటో నండి రానురాను శక్తి తగ్గిపోతోంది. ఏంటో గాబరా గాబరాగా వుంటుంది. ఒకోసారి మనసు పట్టు తప్పి పోతోంది.'
'మీరలా భాధపదకండి. మీకు వచ్చిన భయమేమీ లేదు. అన్నిటికీ నేనున్నాను. మీ సోదరుని గా భావించండి.'
'అలా భావిస్తే మీరు నాకు దూరమౌతారు. మంచి మిత్రుడు ఒక్కడుంటే చాలు. ఆ ఒక్కడ్ని యింత కాలానికి పొందాను. మీకు చాలా శ్రమ పెట్తున్నాను....ఇంకా పెట్ట బోతున్నాను.'
'మీరు అలా అనుకుంటే మీ విషయం లో నాకు యేది చెయ్యడానికి అవకాశం యివ్వరు.'
'ఇస్తాను. అంతా మీకే యిస్తాను. నాకింకేవరూ లేరు.' శ్రీనివాస్ కళ్ళల్లో నీరు తిరిగాయ్.
'మీ ధైర్యం అంతా యేమైంది?'
శ్రీనివాస్ పెద్దగా నిట్టూర్చాడు.
కాస్సేపయ్యాక 'దైర్యం లేక కన్నీరు కార్చలేదు. నేను చచ్చిపోతానన్న అధైర్యం నాకెప్పుడూ లేదు. ఇంతకాలానికి నా ఆత్మ యింకో ఆత్మతో బాసలాడుకోగలిగినందు వలన వచ్చిన ఆనంద బాష్పాలివి. మనసు అనురాగంతో జల్లిన పన్నీరిది -- సూర్యం గారూ -- దేవుడు దొడ్డవాడు.'
'అయితే....'
'ఆపేసారు..అడగండి.'
'ఇంతకాలం మీ ఆత్మలో యింకో ఆత్మ కలవలేదా?'
'లేదు"
'అనురాగంతో యెవరూ పన్నీరు జల్లలేదా?'
శ్రీనివాస్ ముఖం ప్రక్కకు త్రిప్పేసాడు. సూర్యం పెద్దగా నిట్టూర్చాడు. కళ్ళు మూసుకుని చీకటిని చూసాడు. కానీ అందులోనూ వెలుగురేఖ కదులుతోంది.
* * * *
రాత్రి పదకొండు దాటినా సూర్యనైకి నిద్దర పట్టలేదు. ప్రకృతి అంతా మూగపోయినట్టు నిశ్శబ్దంగా వుంది. నిశీధి నివ్వెర పోయి దైన్యంగా తలవంచుకుని కదిలి పోతోంది. ఆకాశం లోని మేఘాలు చీకటి తలపై ముసుగు కప్పి చీకటి తో పాటు ప్రయాణం చేస్తున్నాయ్. వస్త్రాపహారణం చేసే దుశ్శాశనునిలా పడమటి కొండలు మేఘాలను లాక్కుంటూన్నాయ్. ఆపదలో చిక్కుకున్న అందాలభరిణ రోదిస్తున్నట్లు ప్రకృతి ఘీంకారం వినిపిస్తోంది. ఆమె కన్నీటి బొట్లు లా వర్షపు జల్లు వచ్చి పడింది.
విశాలను యీరోజు మళ్లీ చూసేవరకు అతని మనః ఫలకం మీద తోలి రూపం తోనే విహరించింది. సానపట్టిన మన్మధ బాణం లా ఆమె అనేక రూప లావణ్యాలతో వెలిగి, వివిధ నాట్య భంగిమలతో నృత్యం చేసి, కమ్మని రాగాలను ఆలాపించి , సువాసనలను వెదజల్లే పుష్పాల పరిమళాలతో గుభాళించింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని , మనస్సంతా ఆమె పై లగ్నం చేసి ఆమె మృదువుగా పలికిన పలుకులు, పలుకుల్లో వోలికించిన అమృతం ఆస్వాదిస్తూ , ఆవీణా కంఠన్ని మళ్లీ మళ్లీ మీటిస్తూ , ఆ చూపుల్లో కులుకుతున్న ప్రణయానికి ముగ్దుడౌతూ మౌనంగా గడిపేవాడు. ఊహతోనే ఆ విగ్రహాన్ని సృష్టించుకుని కళ్ళ వేడుకగా ఆ జగన్మోహినిని చూస్తూ మురిసి పోతుండిన సూర్యం యీనాడు చూసిన స్త్రీ ఆనాటి విశాల కంటే తన కళ్ళనే నమ్మలేక పోయాడు.
విశాలను అతను శరత్కాలం లోనే చూసాడు. శరత్కాలపు పున్నమి నాటి చందమామ లానే అతని మనసులో ఆమె నిల్చి పోయింది. ఆమె యిప్పుడు వర్ష ఋతువులో మేఘాల చాటున పాలిపోయిన చందమామలా వుంది. ఆమె ఒళ్ళంతా గెంతి యున్న యౌవ్వనం యిప్పుడు రోగంతో నీరశించి నిద్రపోతున్నట్లుంది. ఈ కొద్ది కాలం లో యెంత మార్పు? గౌరీ కి తనకు రక్త సంబంధం వుంది. విశాల కు తనకు జన్మ జన్మాల సంబంధం. అది లేకపోతె ఆమె అతనిని తొలిసారి కౌగలించుకుని కన్నీటి తో నిష్టూరాలాడదు. ఇంకో వ్యక్తికీ తనపై అధికారం అంకురించినా దాన్ని మౌనంగా ధిక్కరించలేదు. తొలిసారి వుబికిన వలపుల వసంతం లో విలాసంగా తనతో విహరించి మళ్లీ వసంతలో యింకోకరిని చేపట్టలేదు. మనసు అంతర్గత మైనది మనిషి అగుపించే వాడు. మనిషి చేసేవి అగుపిస్తాయ్. మనసు లోనిది కనపడదు. ఆ యోగి పుంగవుడన్నట్టు మనిషి బ్రతుకంతా నటనే -- విశాల లోకం కోసం నటించాలి. ఆమె చేసిన చేష్టలు సంఘానికి నచ్చాలి. ఆమెదే కాదు . తన చేష్టలు నచ్చాలి. తన చేష్టలు నచ్చాలంటే తనూ నటించాలి. విశాలకూ తనకూ బాహ్యంగా యేమీ సంబంధం లేదు. ఆమె భర్తకూ, ఆమెకే ఆ సంబంధం. ఆ సంబంధం ఫలించడానికి తను సహాయ పడాలి. అది రెండు విధాలుగా చెయ్యాలి. తొలిది అమెపసుపు కుంకుమ నిల్వటానికి తను గట్టి ప్రయత్నం చెయ్యాలి. గౌరీ విషయం లో ఆర్ధికంగా తను పొందిన అసహాయత యీనాటికీ తనను తానె నిష్టూరాలను ఆడుకొనేటట్లు చేస్తుంది. ఈనాడు విశాల విషయం లో బాధ్యత తీసుకోడానికి ఆర్ధికంగా తను అంత చిక్కుల్లో లేడు. డబ్బు సహాయం పొందే పరపతి యిప్పుడు తనకున్నది. ఈ పరపతిని బాగా వినియోగించి శ్రీనివాస్ వేగంగా కోలుకునేటట్లు చూడాలి. దానికి అతనిని చూస్తున్న డాక్టర్ ను కలుసుకోవాలి. రెండోది అతను కోలుకున్నాక ఆమె అతని పై పన్నీరు జల్లే అవకాశం కల్పించాలి. ఆ పన్నీటి జల్లు వలన అతను సుఖ పడ్తాడు. సుఖం వలన కోరికలు పుట్టాయ్. కోరికల వలన సంతతి కలుగుతుంది. అడ్డాలలో బిడ్డడు పాత అభిమానాలను త్రెంచి క్రొత్త ప్రేమలను చిగురింప చేస్తాడు. రక్త సంబంధంతో ఒక విధమైన వంతెనను యిద్దరి మధ్యా వేస్తాడు. అప్పుడు ఈ సంసారం లో వరదలు వచ్చినా యేరు దాటవచ్చు. ఆ వంతెనను నిర్మించే అవకాశం యిచ్చి తను విశాలకు మళ్ళీ కనపడకుండా యెక్కడికో వెళ్లిపోవాలి. ఇది వరకు సినీమా లో ప్రేమ కధలు చూసి యిలా యెక్కడ జరుగుతాయని అనుకునే వాడు. ఇప్పుడు తన కధ సినిమా కధలా తయారయింది.
