12
ఆవేళ సాయంత్రం విశాల వేగిరం గానే వచ్చి ఆలస్యంగా వెళ్ళింది. సూర్యం ఆమెలో ఏదో మార్పు వచ్చినట్లు భావించాడు. అంతసేపు ఆమె మూగ పిల్లలా మాట్లాడలేదు. మాట్లాడింది శ్రీనివాస్. ఆ మరుసటి రోజు శ్రీనివాస్ ఎక్స్ రే రిపోర్టు వస్తుంది. అదేదో తెలుసుకున్నాక డాక్టరు ను కలుసు కుందామనుకున్నాడు.
విశాల వెళ్ళిపోయాక వెలుగు కదలినట్లు అయిపొయింది. చీకటి కూడా పడింది. ఆమె నవ్వకపోయినా మాట్లాడక పోయినా ఆమెలో యింకా ఆకర్షణ పోలేదు. అదో అయస్కాంతం లా సూర్యాన్ని లాగుతున్నా యెంతో కష్టం మీద మనసును మళ్ళించు కున్నాడు. తనకు సంక్రమించిన బాధ్యతను మననం చేసుకుని మనసును అదుపులో వుంచు కున్నాడు. తన స్వంత వస్తువును ఎన్నాళ్ళకు ఒకరి అధీనం లో వుండగా చూసినట్లు చూసి నాదీ అని తీసుకునే ధైర్యం లేనట్లు బాధపడ్డాడు. మళ్లీ తను ఆనాడు తిరస్కరించి జన్మ జన్మాలకు పొందలేని వస్తువును యింకొకరి కి బలవంతాన అప్పచెప్పాడు. తన బలహీనతకు విసుక్కుంటూ పడుకుని మళ్లీ ఆత్మ పరంగా ఆలోచించసాగాడు.
'శ్రీనివాస్ యేమైనా అయిపోతే?'
ఈ ప్రశ్న మనసులో వుదయించిన వెంటనే వద్దు వద్దు అతను బ్రతికి తీరాలని మనస్సులు గట్టిగా కోరుకున్నాడు. అలాంటి పరిస్థితి వూహించరానిదిగా తోచింది. కాసేపయ్యాక
'ఈ బ్రతుకంతా నటన అన్న ఆ యోగి పుంగవుని వాక్కు నమ్మితే -- తను చెయ్యవలసిందేమిటి? అమ్మా, నాన్న యెంచిన ఒక పిల్లకు తాళి కట్టి తనది అనుకోవాలి. అప్పటికి గాని తను నటించలేడు. చెట్టు వసంతం లో చిగురిస్తుంది. గ్రీష్మం లో చిగురించలేదు. వసంతం లో చేగురించని చెట్టుగా తను వుండిపోతే గీష్మం లో మొరుడైపోతాడు. తను యే ఋతువులో సింగారం ఆ ఋతువు లో చేసుకుని ఒక పండోకటి రాలిస్తే గానీ తన సంగతి మాయమై పోతుంది. తనకు ఊరూ పేరూ వుండదు.
ఇలా నిద్దర పోకుండా ఆలోచనలతో పరుపు మీద నున్న తన దగ్గరకు అంతరాత్రి మీద యెవరో రావటం గుర్తించాడు. అతను శ్రీనివాస్ కాదు. అతను జ్వరం తో లేచే పరిస్థితి లో లేడు. శెట్టి గారయ్యుండాలి. అతనే దిగ్గరగా వచ్చి తొంగి చూసాడు.
'ఇంకా పడుకోలేదా సూర్యం గారూ?'
'లేదండి' అంటూ లేచి,
'మీరింకా పడుకోలేదెం?'
'నిద్దర పట్టలేదు బాబూ?'
'నొప్పి గాని రాలేదు కదా?'
'కొద్దిగా వుంది. యే టైము లో యెలాగ వుంటుందో చెప్పలేం కదా? గతం తల్చుకుంటే గుండె చెరువై పోతోంది.'
'పదండి. నేనే వస్తాను' అంటూ సూర్యం అతను ఏం చెప్తాడనో కుతూహలంగా వెంట పడ్డాడు. శెట్టి గారు పరుపెక్కారు. తల దగ్గర స్టూలు మీద సూర్యం కూర్చున్నాడు. వచ్చి తిరిగి వెళ్లేసరికి శెట్టి అలసి పోయాడు. కాస్సేపయ్యాక మెల్లగా "మీరు చాలా మంచివారు. ఆడి తప్పాన వారు. మీలాంటి వారిని యిక్కడ కలుసుకుంటా ననే ఆశతోనే వచ్చాను. కలుసుకున్నాను. దేవుడు దొడ్డవాడు.'

'నా అవసరం యేముందో చెప్పండి?'
'మీకో బాధ్యత అప్ప చెప్తున్నాను . కాదనకండి.'
'చెప్పండి.'
శెట్టి యిటూ అటూ చూసాడు.'
'ఇదిగో యీ రామం ని-- నేనేం అయిపోయినా చేరదీసి ప్రయోజకుడ్ని చేసే బాధ్యత మీది.'
సూర్యం యితనికి వీడి పై యెందుకు యింత మమకారమో బోధపడలేదు.
'తల్లి లేని పిల్లడు.'
'తండ్రో.'
'రెండు మూడు రోజుల్లో తండ్రి వుండడే,మో.'
అంటే?'
'అదంతా ఒక గాధ బాబూ-- నాకు తప్పించి యింకేవ్వారి కి తెలీని గాధ.'
'నేను వినకూడదా?'
'చెప్తాను. మీ దగ్గర దాచవలసినది నా దగ్గర ఏదీ లేదు' అంటూ మెల్లగా కదలి పరుపు క్రింద దాచిన ఒక పెద్ద కవరు తీసాడు. ఆ కవరు సూర్యం చేతికి అందిస్తూ 'ఇందులో నా వీలునామా-- పది వేల రూపాయల నగదు వుంది. వాడికి చదివించి పెద్ద చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. ఈ భారం మీ మీద వేసినందుకు క్షమించండి.'
ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగా వుంది. వార్డులో దీపాలన్నీ ఆర్పే వున్నాయ్. వీళ్ళిద్దరి గుసగుసలే వినిపిస్తున్నాయ్. వరండా లో దీపపు వెలుగు కొద్దిగా పడుతోంది. సూర్యం కవరు అందుకున్నాడు.
'సరే చెప్పండి' అన్నాడు.
'హామీ యివ్వండి' అంటూ చెయ్యి చాపాడు. సూర్యం అతని చేతిలో చెయ్యి వేసి 'మీరీ డబ్బు యీయక పోయినా ఆ కుర్రవాడ్ని దగ్గర వుంచి వాడి బాగోగులు చూసే వాడ్ని. అభిమానం తో నిండిన కుర్రాడు. ఇంత డబ్బు యిచ్చి మరీ చూడమన్నారు. మీరే డబ్బు హామీ యిచ్చినప్పుడు, ఇక నా హామీ యేముంది?'
'నా తృప్తి మీ నోట మాట విననీయండి.'
'తప్పకుండా మీ రామం ను ప్రయోజకుడ్ని చేస్తాను.'
'హమ్మయ్య' ఓక పెద్ద నిట్టుర్పు విడిచాడు శెట్టి.
కస్సేపయ్యాక 'మంచివాళ్ల మాట వేదవాక్కు అంటారు పెద్దలు. మీ మాట ప్రకారం వాడు ప్రయోజకుడవుతాడు. ఇన్నాళ్ళూ యీ బాధతో పాటు ఆ బరువు నన్ను పిరికివాడ్ని చేసేసింది. నా సగం పిరికి యీ రాత్రిలో పోయింది. రేపు కాక ఎల్లుండైన ఆపరేషను చేసేస్తారు. ఇక యీ బాధ పడలేను. చావో రేవో తెల్చేసు కుంటాను.'
'చావు గురించి ఆలోచించకండి. ఇలాంటప్పుడు యింతవరకు బ్రతికి సంతోషించిన ఘడియలు తల్చుకోండి.'
'ఆ రోజుల్లో సంతోషం యిచ్చినవి యిప్పుడు తల్చుకుంటే సంతోషం యియ్యవు-- దుఃఖాన్ని కలిగిస్తాయ్. ఎన్నెన్నో కోరుకున్నాను. ఆ కోరికలు కోన సాగించుకోడానికి యెన్నెన్నో చెయ్యరాని పనులు చేసాను. ఈ నాలిక , మనిషి మాంసం రుచి మరిగిన పులి లాంటిది. ఈ కడుపుకు యెంత నింపినా పరగడుపే. ఈ ఒంటికి యెంత సుఖ పెట్టిన మరుపే! భౌతికమైన సుఖాలేలాంటి వంటే -- ఒక తొట్టెను నీటితో నింపుతుంటే అడుగున నున్న కన్నాల నించి నీరు కారిపోతుంది.తొట్టె నింపుతాం అనుకుంటాం గాని జీవిత కాలంలో నింపలెం. కడుపు చూసుకున్నానే గానీ గుండె గురించి తల్చుకోలేదు. గడించాను. ఇంకా గడించాను, మరింత గడించాను. కానీ ఆశ పెరిగింది గాని తరగలేదు. అంతా నాకోసం. నా కుటుంబ సుఖం కోసం తాపత్రయ పడ్డాను, ఖర్చు పెట్టాను, కూడ బెట్టాను. నా అన్న మాట తప్పించి, నా అన్నభావం తప్పించి, నేను అన్న ఆహాం తప్పించి ఇంకేం నా దగ్గర నిలవలేదు. నేను నేనుగా యెల్లప్పుడూ వుండి పోనన్న ఆలోచన తట్టలేదు. నేను యెదుటి వాళ్ల కోసం చేసిన మంచి మిగిలి పోతుందని అభిమానస్తుడైన యీ రామం వలన తెలుసుకున్నాను. చూడు బాబు జీవితం యెంత విచిత్రమైనదో? భార్య, పిల్లలు బంధువులు -- ఒకరేమిటి ఎందరెందరు? నా గురించి సతమత మయ్యేవారు. ఎభయ్యో వడిలో పడ్డాను-- యెందుకో సంసారం మీద ఏవగింపు కలిగింది. నా చుట్టూ వున్న నా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా, నా డబ్బును ప్రేమిస్తున్నారా అన్న అనుమానం కలిగింది. నా పెళ్ళాం కు నాతొ సంబంధం కాదు నా ఆస్తితో -- ఆమె వెంట నూరు తులాల బంగారం వుంటే యింకా చాలదని పోట్లాట. కొడుకులు దొంగ లాభాలు చెయ్యటానికి ఒప్పుకోలేదని విసుగు-- కూతురు నాకేం యిచ్చావ్ అంటే నాకేం యిచ్చావ్-- బంధువులు మా సంగతి ఏం చెప్తావ్ అనీ-- వీళ్ళంతా వ్యక్తిగా నాకేం గౌరవం యివ్వలేదు. నా డబ్బు కోసమే బ్రతికున్నారు. ఇంట్లో మెల్లగా తగదా రాజుకుంది. దానికి కారణం నాకు ఒళ్లు మండి యెవ్వరికి నా తాదనంతరం వరకు చిల్లి గవ్వ ముట్టచెప్పనని చెప్పాను. కొత్తగా వచ్చిన పెద్ద కోడలు, అత్తగారు ఏకమయ్యారు. నా పెళ్ళామే నాకు యెదురు తిరగటం తో నాకు జీవితం మీద రోత పుట్టింది. ఛీ! యింత కష్టపడి యీ డబ్బు యిందుకా గడించాను అని ఏడ్పు కున్నాను. నాకంటే ఆడుకున్న వాడు హాయిగా వున్నాడని పించింది. ఆరోజు రాత్రి -- యింకా పది గంటలు కొట్టలేదు. యే రైలు క్రిందో తల పెట్టేద్దామని ఆవేశంతో బయలుదేరి పోయాను. ఆ వేళ సాయంత్రం నించి యింటికి వెళ్ళలేదు. ఇక్కడ అక్కడ తిరిగాను. తెల్లటి బట్టలు, మీద అన్నీ వున్నాయ్. అగ్రహారం వీధి ప్రక్కనే వున్న రైలు రోడ్డు మీద తల వంచి నడుస్తున్నాను. ఇక రైలు వస్తోంది. ఆవీధి ప్రక్కనే వున్న గుడిసె లో నించి కామోసు పరుగెత్తుకుని వచ్చిది ఒక ఆడది.
'రైలోచ్చేస్తోంది -- బాబూ' అంటూ చెయ్యి పట్టుకు లాగింది. ఆమె వేపు చూడకుండానే 'నన్ను చావనీ' అన్నాను.
'సచ్చి ఏం సాధిస్తారు బాబూ? మీకంత కష్టమైతే నా పాకలో వుండండి బాబూ.'
ప్రక్కకు తిరిగి చూసాను. ముఖంలో పౌడరు వాసన వేసింది. ఆమె చెయ్యి పట్టుకుని వదల్లేదు. బయటకు లాగేసింది. దగ్గరలోనే వున్న తన పాక లోనికి తీసుకు వెళ్ళింది. చిన్న బెడ్ లాంతరు వత్తి పైకెత్తింది. ఓసారి తలెత్తి చూసాను. నీలిరంగు వాయిలు చీర కట్టింది. ముఖం లో పెద్ద బొట్టు, చెవులకి దుద్దులు, ముక్కు సరీగ్గా వుంది. మూతికి రంగు రాసింది. ఆమె నా పెద్ద కుతూరి కంటే రెండేళ్ళు పెద్దదిలా వుంది. మనిషి యౌవ్వనం తో బలసి వుంది. తెల్లని పల్చని జాకెట్ లోపలి బాడీ కనిపిస్తోంది. తలనిండా శోభనపు పెళ్లి కూతురిలా పూలను ముడిచింది. ఆమె వేపు పరీక్షగా చూసాను. నా జీవితంలో యెన్నడూ పొందని శాంతి యీ పాకలో నాకు దొరికింది. నేనేదో యింద్ర లోకం లో ఒక వూర్వశి ని కలుసుకున్నట్లు మనసు వుప్పొంగి పోయింది.
'బాగా కలిగిన బాబులా వున్నారు. ఏం లేని మాలాంటోలమే బతుకు మీద ఆశతో నీతి లేకుండా బతుకుతుంటే -- తమరు యిలాగ సేయ్యటం నాయమేనా?' అంది. జవాబు చెప్పడానికి నాకు మాటలు రాక క్రొత్తగా యౌవ్వనం వచ్చిన మనిషిలా ఆమె దగ్గరగా చేరాను. ఆమె కాస్త జరుగుతూ 'బాబూ! తమరు కలిగిన బాబులు, తల్చుకుంటే ఏ రంభ రాదు. నాలాంటి బజారు మనిషితో ఏంటి బాబూ?' అన్నది.
'నివ్వు బజారు మనిషివి కావు. దేవతవి. రంభవి. నాకు తొలిసారి వలపును ప్రసాదించావు. నిన్ను వదల్లెను. జీవిత కాలం నిన్ను వదల్లెను. ఈ పాకలో కాదు. ఒక భవనం లో వుంచుతాను. సమస్త సుఖాలో నీతో అనుభవిస్తాను.' అంటూ ఆమెను గట్టిగా కౌగలించు కున్నాను. ఆమె నాకు పూల తీగలా చుట్టుకుంది. వాడి పోయిన చెట్టు యీ తీగ సంపర్కంతో చిగురించింది. చెట్టూ, లతలా యిద్దరం అల్లుకున్నాం. ఆ వేళ నించి ఆమె నన్నే నమ్ముకుంది. ఆమె భవనాలు, డబ్బు కాంక్షించలేదు. నన్నే కోరింది. అపాక వదల్లేదు. నేనూ ఆ పాక మార్చాలన్న వూహను మార్చుకున్నాను. ఆ పాక , ఆ లేత వెలుగు , ఆ నులక మంచం -- రాత్రుళ్ళు స్వప్నం లో కామినీ దేవతను కలుసుకున్నట్లు ఆమె చెంత చేరేవాడ్ని. చలిలో, వర్షం లో చీకటిలో ఒక్కటైనా మా యిద్దరి కలయిక యీ పండోకటి రాల్చింది. రామం బాబు మూడేళ్ళప్పుడు నా దేవత నన్ను వదలి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ బిడ్డడ్నియింకో పేద సంసారుల యింట్లో అప్పచెప్పి గుప్తంగా పెద్ద చేసాను. పదేళ్ళ వయసు రాగానే రోజంతా చూడాలన్న మమకారం తో యింట్లో తెచ్చి పెట్టాను. వాడికి వ్యాపారం నేర్పాలని తెస్తే మావాళ్ళు యింట్లో చాకిరీ చేయిస్తున్నారు. ఆడా మగా మనసు లు కలిసి యెందరో వుదయిస్తారు. ఆత్మలు కలసి పుట్టిన బిడ్డడు వీడు. వీడు తప్పక వృద్ది లోనికి వస్తాడు. వీడిని మీలాంటి వుత్తముని చేతిలో పెట్టినందుకు నాకు హాయిగా వుంది.'
శెట్టి గారు హృదయం విప్పి చెప్పినదంతా విని సూర్యం ఆ సంఘటనలే యింకా తలలో తిరుగుచుండటం వలన మాట్లాడలేక పోయాడు. ఇదంతా చెప్పటానికి ఓపిక పడ్డ మనిషి చెప్పాక నిస్త్రాణగా వుండిపోయాడు. సూర్యం చేయి మెల్లగా లాగుకొని ఒక ముద్దు పెట్టాడు.
'చచ్చిపోతే -- నీ కడుపు లో పుట్తాను బాబూ -- మంచి పుట్టుక పుట్తాను లే' అన్నాడు.
