'ఎప్పుడు ? మీకు ఒత్తి వెలిగించుకోగల స్తోమత వచ్చేటప్పుడు, కొవ్వు కొవ్వులా వుండేటప్పుడు కాదు, లోభం కి ఒక్కసారిగా దూరమైనా కష్టమే. రాను రాను కొవ్వు యెలా కరుగుతుందో లోభం రానురాను తగ్గాలి గానీ ఒక్కసారి లోభం పొతే మనిషే లేడు.'
సంభాషణలు యింతటితో డాక్టరు రావటం వలన ఆగిపోయినా సూర్యం మనసులో తర్జన భర్జనలు చెసుకుంటున్నాడు. ఇద్దరి అభిప్రాయాలు యీ విషయం లో వేరు వేరుగా వున్నాయ్. లోభానికి ఒక్కసారి దూరమైతే గానీ మోక్షానికి వీల్లేదని తను అనుకుంటే లోభంతో జీవిస్తూ మోక్ష మార్గం గుండా పోవాలని శ్రీనివాస్ వాదన. అతను లోభానికి ఒక శక్తిని ప్రసాదించి మిత్రునిగా చూస్తె, దానిని ఒక బరువుగా చూసి శత్రువుగా సూర్యం చూస్తున్నాడు. మనసులో యీ కొద్ది నిముషాల వాదనలు ఆలోచనల పుట్టలను సృష్టించాయి.
శ్రీనివాస్ ఎక్సరే డిపార్టుమెంటుకు వెళ్లాలని అతని డాక్టరు చెప్పాడు. నీరసంగా వుండటం వలన చక్రాల కుర్చీ మీద తీసుక వెళ్ళమన్నాడు. పది గంటలకు వార్డు బోయ్ తీసుకు వెళ్తుంటే --
'మీకు తోడుగా వచ్చేదా?' అన్నాడు సూర్యం.
'మీ డాక్టరు రాడూ?'
'రేపటి నుంచే నాకు టెస్టులు మొదలు పెట్తారు . వస్తాను.'
'మీ యిష్టం.'
ఇద్దరు ఎక్స్ రే డిపార్టుమెంటుకు వెళ్లే సరికి అక్కడ అప్పుడే మనుషులు నిండి పోయి వున్నారు. చాలా ఆలస్యం అవుతుంది. సూర్యం యిలా ఆలస్యం అవుతుందని వూహించే ఫ్లాస్కు లో కాఫీ తీసుకు వచ్చాడు. ఇద్దరూ కొంత దూరంలో ఒక బెంచీ మీద కూర్చున్నారు. శ్రీనివాస్ కొద్దిగా కాఫీ త్రాగాక--
'దేముడు యెంత దొడ్డ వాడండి?'
"ఏం?'
'అన్నీ తమాషా పనులు చేస్తాడు. సంతోషానికి యెన్నెన్ని సృష్టిస్తాడు. విషమే తీసుకోండి. అది చంపుతుంది -- ప్రాణం నిలుపుతుంది. ఈ కాఫీ కొందరికీ విషం నా కడుపులో పడగానే మాటలెలా వస్తున్నాయో?'
'మీరు దేముడి పేరు ఎత్తుతున్నారు. దేముడున్నాడని నమ్ముతారా?'
'ఏం అలా అడిగారు?'
'దేముడు లేడని -- మనిషే అన్నిటికీ ముఖ్యుడని నమ్మితే గాని ధైర్యం రాదనీ కొందరంటారు.'
'ఏదో నమ్మకం వుంటే గానీ ధైర్యం రాదనీ ఒప్పుకున్నారు కదా! ఒకడికి సోషలిజం మీద నమ్మకం ధైర్యన్నిస్తే నాకు దేవుని మీద నమ్మకం తెస్తుంది.'
సూర్యం మళ్లీ ఆలోచనలో పడ్డాడు. గోవిందరావు చివరి ఘడియలు జ్ఞాపకానికి వచ్చాయ్. ఏంటో యీ అజ్ఞాత శక్తి దేవుడు -- వద్దన్నా వెంటనుండే నీడలా హృదయంలో పాన్పు మీద పవ్వలిస్తుంటాడు. అతన్ని మేల్కొలి పితేనే కామోసు అతని ముఖం పై చిరునగవు వెలుగుతుంది. అ నగవే మనిషికి ధైర్యం తెస్తుంది. ఉదయం నించి యిద్దరూ వేదాంతం లోనే దిగారు. శ్రీనివాస్ జీవితాన్ని నవ్వుతూ కులాసాగా గడిపే మనిషే అని తొలిరోజు పరిచయం తో అనుకున్నాడు. కానీ మరుసటి రోజు అతనితో మాట్లాడగానే వచ్చిన అభిప్రాయాలు జీవితంలో అనుభవం వలన వచ్చినవిగా అనిపించినాయ్. అతని జీవితం అడిగితె గాని చెప్పడని కాస్సేపటికి మౌనాన్ని వదలి --
'నిన్న మిమ్మల్ని చూడడానికి యెవరూ రాలేదు?'
'నాకెవరున్నారని?'
"మీ భార్య -- పిల్లలు.'
'మా ఆవిడ చాలా నీరసంగా వుంది. నిన్న బహుశః జ్వరం వచ్చి వుంటుంది. నీరసంగా వుండటం వలన రాలేదేమో? పిల్లలా? ఇంకా లేరు.'
'పెళ్ళయి ఎన్నేళ్ళయింది?'
'నాలుగేళ్ళు దాటింది.'
సూర్యం మరి కొద్దిగా కాఫీ యిచ్చాడు. శ్రీనివాస్ కాఫీ త్రాగాక చిన్న నవ్వుతో --
"మీకు నా గురించి తెలుసుకోవాలని వుండటం సహజం. నా జీవితం చెప్తాను. మీ దగ్గర నించి కనికరం సంపాదించటానికి మాత్రం కాదు.'
'మీకు నీరసంగా లేకపోతె చెప్పండి.'
'నీరసం అదే పోతుంది. నాకెవరూ లేరన్నాను. నిజంగా దగ్గర వాళ్ళెవరూ లేరు. ఇప్పుడు నేనేమైనా అయిపోతే నా భార్యను చూసేవాళ్ళు కూడా యెవరూ లేరు.'
'మీరెందుకలా అనుకోవాలి?'
'అయిపోతానని కాదు. మాట వరసకు అలా అన్నాను. మా అమ్మను ఫోటోలో చూసి యిలా వుండేది అనుకోవటమే గానీ నాకు తెలీదు. నా చిన్ననాటే పోయింది. నాన్నకు దైవ భక్తీ హెచ్చు. ఎప్పుడూ యాత్రలు చేసుకునేవాడు. నేనొక్కడినే బిడ్డను. నేను ఐదో ఫారం చదువుతుండగా తానొక్కడే యాత్రలకు వెళ్ళాడు. నేనూ వెళ్ళే వాడినే, పరీక్షలు ముందుకున్నాయని వెళ్ళలేదు. ఇల్లంతా అప్పచెప్పి వెళ్ళాడు. ఎన్నెన్నో బుద్దులు మళ్లీ యెప్పుడూ తిరిగి రానివాడిలా చెప్తుంటే నాకే విసుగు వేసింది. అలానే మా నాన్న మరి తిరిగి రాలేదు. గోదావరి లో బోటు మీద భద్రాచలం వెళ్తుంటే గాలి వానలో చిక్కుకున్న బోటు తిరగబడి పోయింది. దానితో పాటు మా నాన్న మాయమై పోయాడు. ఆ వార్త నాకు తెలియగానే ఒక్కసారి బేజారెత్తి పోయాను. ఇరుగుపొరుగు వాళ్ళు ఓదార్చారు. దూరపు బంధువులు నేను యెక్కడ దగ్గరై బరువై పోతానో నని దూర దూరంగానే వున్నారు. ఏకాకిని నేను. మా నాన్న పోయాడన్న వార్త నిన్న మూడు రోజుల వరకూ ఏదో సమయాన యేడుస్తూనే వున్నాను. మా నాన్న నన్ను తప్ప యింకేమీ మిగల్చ లేదు. ఈ బ్రతుకెందుకని ఒక రోజు రాత్రి సముద్రంలో పడిపోదామని వెళ్లాను. ఆ యిసుక లో మసక వెన్నెల్లో యెవడో పడి ఉన్నాడు. చచ్చిన వాడిలా వున్నాడు. వాడ్ని చూడగానే నా చావు మరచి పోయాను. వాడి పై కనికారం తో నిండి పోయాను. పాపం! ఏ తల్లి కన్నదో -- తండ్రెవరో? అడుక్కుని బ్రతికే యీ అనాధునికి భూమాతే తల్లి-- యీ గాలి తండ్రి -- ఈయన దేహం చాలిస్తే దహన క్రియలు చేసే వాళ్ళేనా వుండరే? వీడి కంటే నేను నయం కాదా అన్న ఆలోచన కలిగింది. నయమని నిర్ధారించు కున్నాక -- యిలాంటి వీడే యింత సముద్రాన్ని ఎదురగా పెట్టుకుని ఆత్మహత్య చేసుకో పొతే తనెందుకు యింత దూరం యీ పనికి రావాలని నా మీద నాకే జాలి వేసింది. మెల్లగా దగ్గరగా వెళ్లాను. పెరిగిన గెడ్డం జుత్తుతో నున్న ఆ ఎముకల గూడు కొద్దిగా కంపు వేస్తోంది. ఇంకా ప్రాణం వున్నట్టు చిన్న మూలుగు చెప్తోంది.
'ఏయ్.'
'హు' అని మూలిగాడు. ఆ బాధ వాడి చివరి గడియాలని చెప్తోంది.
'నీకెవరూ లేరా?'
'లేకేం? నివ్వున్నావుగా.'
'నేనా?' అన్నానే గానీ చప్పున ఆ మాటలు మా నాన్న అన్నట్టే అనిపించాయ్.
'దేముడు నిన్ను పంపించాడు.'
'నాన్నా?'
'అవును. నా అంత్యక్రియలు నివ్వు జరిపిస్తావని.'
ఒక్కసారి ఒళ్ళంతా జలదరించింది. అతను మెల్లగా కదిలి 'అందుకు కాకపొతే యీ రాత్రిలో యిక్కడికి కెందుకు వచ్చావు నాయనా?'
'చచ్చి పోడానికి.' అన్నాను.
'అయ్యో తండ్రి చచ్చి ఏం సాధిస్తాం.' చేతకాని వాడె బలవంతంగా ప్రాణం తీసుకుంటాడు. అలాంటి ప్రాణి నించి ఆత్మ కూడా ముందుగానే యెగిరి పోతుంది. ఛీ ఛీ ....అధైర్యం తో ఆ ప్రయోజకుడై పోతావా?'
కోన వూపిరితో ఆ సాధువు యిలా ఆనగానే నాపై నాకే అసహ్యం వేసింది. ఎలాగైనా బ్రతికి తీరాలని భీష్మించు కున్నాను. అతను మరి నాతొ చాలాసేపటి వరకూ మాట్లాడలేదు. వెన్నెల్లో మంచులో అతని దగ్గరగా కూర్చున్నాను. చాలా ఆయాస పడ్తున్నాడు. దగ్గుతున్నాడు. చివరకు అతని పరిస్థితి చూసి ముట్టుకోకుండా వుండలేక పోయాను. అతనిని ముట్టుకోగానే నా ఒళ్ళంతా ఒక్కసారి జరజర లాడింది. ఏదో కరంటు లాంటి శక్తి ప్రవేశించినట్లయింది. అతనిని వదలి వెళ్ళలేక పోయాను. రాను రాను నాలో ధైర్యం చొచ్చుకుంది. అతను వేకువ ఝామున మాట్లాడాడు.
'నింద లేకపోయే బొందె పోదు. సంతోషంగా చచ్చిపోతున్నాను.'
'చావు సంతోషమా?'
'ఈ బ్రతుకంతా నటనే బాబూ! నీ ప్రేమ, అభిమానం, కోపం, తాపం -- అంతా నటించటం వలన వస్తుంది. ఇది అసలు ప్రేమ కాదు. నివ్వు ఒక్కరినే ప్రేమించ గలవు. అతనిని నివ్వు చూడలేవు కానీ అతను నీచుట్టు పట్ల నీలోనూ ఉన్నట్లే ఆ కనిపించని స్పర్శ నమ్మకాన్ని కలిగిస్తుంది. నీ యిష్టం -- ఆ స్పర్శ కు నీకు నచ్చిన రూపాయలను యిచ్చి ప్రేమించుకో-- చావు కూడా ఒక నటనే అని నీకు తెలుస్తుంది.'
అంటూ అతను తన చివరి అంకం నటించేసాడు. తెల్లవారింది. ఆ శవం వేపు చూసి నేను ఏడవ లేదు. అతను చచ్చిపోయాడని నా మనసు లోను తట్టలేదు. నా హృదయం లో అతను యీనాటికీ బ్రతికే వున్నాడు. నా తండ్రి చివరి ఋణం తీర్చుకోలేక పోయినా నా తండ్రి యిన్నాళ్లు నాకు ఇవ్వలేని ధైర్యాన్ని యిచ్చిన యీ సాధువు క్రింద చేసే అదృష్టం నాకు కలిగింది. నాకు తెలుసు యీ శవాన్ని చూడటాని కై యెవరూ రారనీ, పరుగెత్తి ప్రేమ సమాజానికి వెళ్లాను. త్రోవలో యింటి దగ్గర ఆగి నా దగ్గర వున్న డబ్బంతా జేబులో పెట్టాను. వాళ్ళతో పాటు నేనూ ఒక కొమ్ము పట్టాను. వాళ్ళు పారేడ్డామంటే కర్రలకు డబ్బు నేనే యిచ్చాను. నేనే తలకు నిప్పంటించాను. అప్పటికి గాని నా కళ్ళలో నీళ్ళు తిరగలేదు. ఇతను యెవరు? పేరేమిటి? అతనికీ నాకు సంబంధ మేమిటి? దేవుడు నా చేత యివన్నీ యెందుకు కరిపిస్తున్నాడు? అలా నాలో యేన్నేన్నో ప్రశ్నలు వుదయించాయి. సమాధానాలు తట్టి మనస్సును ప్రకాశింపచేసాయి.
