'ఎందుకండి ఆ కంట తడి -?'
'మా అమ్మ -'
'బాగానే ఉన్నారు గదా? ఈసమయంలో అలా ఉంటె -'
'నీకు చెప్పాలి పావనీ - నాకోసం బ్రతికింది. పడరాని పాట్లు పడింది. ఈ ఋణం తీర్చుకోవాలి నేను. అందుకు నీసహాయం కావాలి. దేవత అమ్మ . నీకు తెలియదు. అందరి లాంటి అమ్మ కాదు. అమాయకురాలు.'
భర్త చెంపల వెంట కారుతున్న నీరు తుడుస్తూ 'ఎంత అమాయకులండి' అంటూ నిట్టూర్చింది పావని.
'కాదు పావనీ, అమ్మను ఎలా చూసుకోవాలి మనం? ఏ కొడుకూ ఏ తల్లిని ప్రేమించనంత ఇదిగా, ఏ కోడలూ ఏ అత్తకూ చేయనంత ఇదిగా, ఆమె ఉంటె చాలు. రా - ఆమెను నమస్కరిద్దాం.'
చేయి పట్టుకుని పావనీని గోడ దగ్గరకు తీసుకు వెళ్ళాడు స్వామి. అది అంతకు ముందు స్వామి అద్దె కున్న గది. గోడ మీద రెండు ఫోటో లున్నాయి. ఒకటి తల్లి సీతమ్మ గారిది. రెండవది ఏసు ప్రభువుది.
'మీ అమ్మగారంటే మీకంత యిష్టమాండి?'
'ప్రాణం.'
'మరి నేను?'
'అమ్మ తర్వాత నువ్వే నాకు ఈ ప్రపంచంలో మిగిలింది. నీకు మాత్రం తెలియదా?'
'పోనీలెండి అమ్మ గారి తర్వాత నువ్వు - అన్నారు సంతోషం కాని మా నాన్నగారి తర్వాత మీరు- అని నేననలేను మరి. పడుకుందాం నిద్రొస్తుంది!'
'అటు జరిగింది.'
'ఆ దిక్కుమాలిన' అండి మిమ్మల్ని వదిలిపెట్టడా ఏమిటండి?'
'ఈ రాత్రినాకు నిద్ర రాదు పావనీ.'
'ఏం చేద్దామంటారు?'
'ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు.'
'జరిగింది గదా?'
'భార్య అంటే అర్ధం నీకు తెలుసా?'
'ఊ'
'ఏం తెలుసు చెప్పు?'
'మాష్టారు మీరు. పాఠాలు చెప్పడం నీకలవాటు'- జారింది నీ!
'అది బళ్ళో . ప్రయివేటు లో నువ్వు నాకు చెప్పింది ఎక్కువ. ధర్మపత్ని కి నిర్వచనం కాళిదాసు ఏం చెప్పాడో తెలుసా?'
'తెలియ చెప్పండి స్వామి అజ్ఞానురాలీని.'
'పావనీ -'
'ఆగండి కామమ్మ అత్తయ్య కళ్ళను కుంటా మెరుస్తున్నాయి. అటక సందు నుంచి.'
దీపం తగ్గించింది పావని.
చీకట్లో మెరిసాయి పావని కళ్ళు.
కలలలూ జీవితానికీ తేడా వుందనిపించలేదు వాళ్ళిద్దరికీ ఆనాడు.
* * * *
కాని - కలలు వేరు జీవితం వేరు.
మనిషి జీవితంలో వివాహమనేది అతి విచిత్రమైన మలుపు. ఎక్కడో పుట్టిన ప్రాణి- మరెక్కడో పుట్టిన మరొక్క ప్రాణి - వివాహబంధంలో ఒక్కటిగా కలసి - రెండు జీవితాలనూ కలబోసుకుని భవిష్యత్తులను పంచుకుని- ఒకరి కౌగిటిలో ఒకరు చలికాగి - ఒకరి సన్నిధిలో ఒకరు స్వర్గ నరకాలను అనుభవించి - ఆ బాంధవ్యానికి చిహ్నంగా -- పుడమి తల్లికి బిడ్డల పేరుతొ తమ వారసత్వాన్ని అప్పగించి పోవడం చిత్రంగానే కనిపిస్తుంది.
అందుకనే -
'జీవితంలో ఇది అతి విచిత్రమైన మలుపు' అని వ్యాఖ్యానించడం అతిశయోక్తి కాదని పోస్తుంది. ఆ మాటలో అత్యుక్తి లేదని పిస్తుంది.
రెండు జీవితాల పై ననూ అవల్చమైన ప్రభావం ప్రసరిస్తుంది వివాహం. స్త్రీ జీవితం మరి మారిపోతుంది సాధారణంగా.
కాని -
స్వామి విషయంలో అలా జరుగలేదు.
వేరొక యింట్లో కాపురం పెట్టటానికి రఘుపతి గారు అంగీకరించలేదు. 'ఎక్కువకాలం బ్రతకను బాబూ! బ్రతికి నంతకాలం నాకళ్ళ ముందుండండి. కనీసం ఈ వూళ్ళో వున్నాన్నాళ్ళూ' అంటూ దీనంగా అర్ధించాడు మామగారు. తన భార్యతో వేరే కాపురం పెట్టి తన బ్రతుకు తాను బ్రతకడం మంచిదని పించింది కాని రఘుపతి గారి పట్టుదల వలన తన నిర్ణయం మార్చుకోక తప్పింది కాదు.
'మనుషులు మంచివాళ్ళే అనుకో, అయినా అయినవాళ్ళకు కొంచెం దూరంగా వుండటం మంచిదిరా స్వాములు' అంది చూడటానికి వచ్చిన తల్లి సేతమ్మ గారు. ఏమైనా అప్పటికి వేరే కాపురం పెట్టలేక పోయాడు స్వామి.
'నువ్వూ నాతొ ఉండి పొమ్మా' అని ఎన్ని విధాల బలవంత పెట్టి చూశాడు. 'కొన్నాళ్ళు పోనీరా నీ దగ్గర ఉండక ఎక్కడుంటాను? అవధాని గారమ్మాయికి పెళ్ళి అంటున్నారా, ఆవిడా పెద్దదై పోయింది. యింతకాలం ఉండీ అవసరానికి తప్పుకుంటే ఏం బావుంటుంది గనుక బోలెడు పెళ్లి పనులాయే'అంటూ సమాధానం అప్పటికి చెప్పింది సీతమ్మగారు.
తాను అత్తవారింట్లో కలిసి ఉండటం తల్లికి యిష్టం లేదని గ్రహించాడు స్వామి.
* * * *
స్వామి ఆనాడు స్కూలుకు వెళ్ళే సరికి స్టాఫ్ రూములో పరాంకుశం గంబీరపన్యాసం కొనసాగిస్తున్నాడు. స్వామి వచ్చిన సంగతి తను గమనించినట్లు గుర్తుగా పెదవులు రవ్వంత ఎడమ ప్రక్కకు మాత్రం సాగదీసి -- నవ్వులాంటి - భావం పలికించి, తన ధోరణిని కొనసాగిస్తున్న ధోరణిలో 'ఏమంటారు మాష్టారూ? అన్నారు తెలుగు పండితుల వారిని ఉద్దేశించి.
'అంతేమరి' అన్నారు తెలుగు పండితులు అజాత శత్రువుగా బ్రతకడం మరీ వంటబట్టి.
అసలు ప్రపంచంలో ఏ విషయం గురించి గానీ, వ్యక్తిని గురించి గాని, తెలుగు పండితులవారికీ ఒక అభిప్రాయమంటూ వున్నట్టు కనిపించదు. తెలుగు వ్యాకరణం గాక మరొక విషయం గురించి- జీవితంలో ఎన్నడూ ఎటువంటి వ్యాఖ్యానామూ చేయగూడదనే నిబంధన పెట్టుకున్న మనిషిలా కనిపిస్తారాయన. ఎవరేం చెప్పినా , ఎన్ని గంటలయినా శ్రద్దగా వింటున్నట్లు కనిపించగల వోపిక ఆయనకు పుష్కలంగా ఉందనే మాట మాత్రం ఎవ్వరూ కాదనరు. పరాంకుశంగారి తత్వంవేరు. ఆయనకు సర్వ ప్రపంచంలో తెలియని విషయమంటూ వున్నట్లు కనిపించదు. అంతకు మించి తాను మహామేధావుల కోవలోకి చెందినవాడనని త్రికరణ శుద్దిగా నమ్మిన జీవితం అతనిది పాపం.
అందుకనే అటంబాంబు దగ్గర నుంచి అల్లం పచ్చడిదాకానూ, పరిణామసిద్దాంతర దగ్గరి నుంచి పెసరట్ల దాకానూ- తిరుగులేని అధికారంతో ఆయనగారు తక్కిన అజ్ఞానులకు సవ్యాఖ్యానంగా వివరించి చెప్పడం పరాంకుశం గారికి అలవాటై పోయింది.
స్వామి తలవంచుకుని కుర్చీలో చతికిలబడ్డాడు. బరువుగా. పరాంకుశం గారి చూపు స్వామి మీద పడింది.
'ఇంత వయస్సు వచ్చినా నేను ఎందుకు పెళ్ళి చేసుకోలేదో తెలుసా?' సూటిగా అడిగాడు పరాంకుశం గారు ఈసారి స్వామిని.
తల నేరుస్తున్నా -- యింతకాలంగా వివాహం చేసుకుంటానికి పరాంకుశం గారు ఎందుకు తటపటాయిస్తున్నారో స్వామికి బొత్తిగా తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా లేదు.
'నా వయస్సు ఎంతంటావ్?'
బోనులో ముద్దాయిని నిలబెట్టి సవాలు చేస్తున్న ప్లీడరు లా అడిగాడు పరాంకుశం.
'నాకు తెలీయదండి.; అన్నాడు స్వామి.
'ఆహా! ఉజ్జాయింపుగా చెప్పు పోనీ' చెప్పలేక పోయాడు స్వామి.
పరాంకుశం జాలిప్డుతున్నట్లు నవ్వి 'నలభై నాలుగు. చేసుకోమని చాలామంది ప్రాణాలు తీశారు. వేలకు వేలు కట్నాలు ఆశ పెట్టారు. కాని నా నిర్ణయం మారలేదు. కారణం నాకు తెలుసు. పెళ్ళి అనేది ఒక బందిఖానా. ఒక అగ్గిపెట్టె లాంటి బందిఖానా లో యిల్లాలి పేరుతొ ఒక గుదిబండను తగిలించి వదిలి పెడతారు మహాసముద్ర మధ్యంలో- మా కవి కూర అన్నట్లు . పారిపోయి బ్రతకడానికి వీలు లేకుండా సవాలక్ష కట్టు దిట్టాలు. కొత్త బట్టలు కట్టి ముస్తాబు చేసి, బాజా భజంత్రీలతో అకారాగారం లోకి తోస్తారు. పదిమంది కలిసి. భార్యభార్తలు - ఒకరి నొకరు కొనుక్కుతింటానికి ప్రయత్నం ఆకలి మండుతున్న మనిషి - గడ్డి తింటాడు. ఆ తర్వాత? మాత్ర మీదున్న పంచదార పోర కరిగిపోతుంది.ఒకరి కొకరు కొరుకుడు పడరు. ఒకరిమాట ఒకరికి అర్ధం కాదు. ఇద్దరూ మాట్లాడుతుంటారు గొంతులు చించుకుని. సప్త సముద్రాలు దాటి వినపడతాయి కేకలు తక్కిన లోకానికి, ఒకల్లకొకరు కొరుకుడు పడక - పడుతున్న జీవులవేదన - అరిచి అరిచి అ జైలు నుంచి బయటపడే మార్గం లేదని తెలుసుకుంటారు. తెలుసుకునేసరికి రెక్కలు విరిగి , తలుపులు తెరిచినా బయటకు పోగల వోపిక ఏ ప్రాణీకి వుండదు. ద్వారాలు లేని ఏడు ప్రహరీ గోడల్లాంటి పిల్లలు పుట్టుకొచ్చి పారా కాస్తారు. దగాపడిన తమ్ముడు- ఆ యింటికి ఒక పెద్ద పాలేరు.' అంటూ అనర్గళంగా కొనసాగించి 'చిటికెడు నశ్యం ఇటు రానివ్వండి మాష్టారు.' అంటూ చెయ్యి చాపాడు.
'లోకంలో అంతా వెర్రివాళ్లయ్యే చేసుకుంటున్నారంటారా పెళ్ళిళ్ళు" అన్నారు కేవలం సందేహ నివృత్తి కోసం అన్నట్లు తెలుగు పండితులు.
'అదొక లోతు తెలియని ఊభి మాష్టారూ! గట్టిగా మాట్లాడితే సాలె గూడంటాను. తెలియక దిగి, ఊపిరాడక కొట్టు మిట్టాడుతున్న వాళ్ళు - బయట నున్న వాళ్ళని రకరకాల మోసాలతో అందులోకి లాగుతారు జబ్బ పుచ్చుకుని , ఆ ఊబిలో అమృత ముందని - ఏడుపు ముఖాలకు నవ్వు పులుముకుని వర్ణిస్తారు... ఈ విషాదం - ఈ దౌర్భాగ్యం - నే జయించాను.తన కూతుర్ని నాకు అంటగట్టటానికి ఆ రఘుపతి ఎంత ప్రయత్నించాడో మీ కందరకూ తెలుసు -'
ఆచివరి వాక్యం శూలం తగిలినట్లు తగిలింది స్వామికి. 'ఆ రఘుపతిగారి గొడవెందుకండి మీకు. ఒకసారి గొడవ యింది గదా?' అంటూ మందలించాడు తోటి టీచర్ ముకుందం స్వామి అక్కడున్నట్లు సైగ చేస్తూ.
పరాంకుశం గారి మాటల్లో ఎంత నిజం వుందో స్వామికి తెలియదు. ఆ తర్వాత 'తమ్ముడూ! నువ్వు అక్కడే వున్న విషయం మరిచిపోయి నోరు జారింది. ఏం అనుకోకు అనేశాడు తేలికగా.
ఆ రోజంతా ఎంత మరిచి పోవాలన్నా పరాంకుశం గారి ఉపన్యాసమే గుర్తుకు వచ్చింది స్వామికి. 'పెళ్ళి - సాలెగూడు - ఊబి' ఈ మాటలు మాత్రం మరిచిపోలేక పోయాడు.
ఇంటికి నడుస్తున్నంత సేపూ ఆ క్రితం రాత్రి పావనితో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది స్వామికి.
ఆ రాత్రి -
భోజనమయ్యాక తాంబూలం వద్దంటున్నా బలవంతంగా నోట్లో కుక్కింది పావని. కాదనలేక నమిలాడు. తన మాట - ఏదో పెద్ద మాట - నెగ్గినట్లు నిండుగా గర్వంగా నవ్వుతూ 'పెదిమలు మరీ ఎర్రబడ్డాయి మీవి' అంది పావని. నాలికకు చూడగల శక్తి వున్నట్లు - బడుద్దాయిల పరిక్ష పేపరు మీద సున్నా చుట్టినట్లు -- పెదమల మీద నాలికతో వో బండి సున్నా చుట్టాడు.
'శనివారం నా పుట్టినరోజు ' - అంది పావని.
స్వామి గుండె గతుక్కుమంది. చీర కొనమంటుందేమో అనే భయం మెదిలింది మనస్సులో.
'సంతోషం' అన్నాడు.
'మీ సంతోషం సరే. నన్నెలా సంతోష పెడతారో చూస్తా.'
'ఎప్పుడు సంతోష పెట్టటంలా నిన్ను'
'అలా కాదు.'
'మరెలా'
'ఏం ప్రజెంటేస్తారో చూస్తా.'
'ఏం ప్రేజెంటు కావాలి'
'కరణం గారమ్మయికి బెంగుళూరు చీరిచ్చాట్ట మొగుడు.'
'అలాగా'
'మూడొందలట.'
'అబ్బో'
'మున్సుబు గారి కూతురు పుట్టింరోజుకు పెద్ద హడావుడి చేశారు. బండెడు బహుమతులు లొచ్చాయి.'
'ఔను మరి.'
నాకూ గ్రాండు గా పార్టీ చేయాలని వుంది.'
మాట్లాడలేక పోయాడు స్వామి.
'ఆ భూతద్దాలనూ -- బారతమ్మ నూ అందరిని పిలవాలని.'
'నిద్రపోయినట్టు'- పడుకున్నాడు స్వామి.
