Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 25

 

    హోటలు నిండా జనం అందరూ ఆవురావురు మంటూ అన్నం తింటున్నారు. జనం ఎక్కువగా ఉండటం వల్ల సర్వర్ భోజనాలు తెచ్చేసరికి పదిహేను నిమిషాలు పదిహేను యుగాలుగా గడుపుతూ అన్నం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కళ్యాణి, కాంతారావు.
    తీరా భోజనం పళ్ళెం తో ముందు పెట్టుకొని తినబోయేసరికి పాప చెడ్డీ కాస్తా పాడు చేసుకుంది. 'అమ్మా.....జీ....' అంటూ  కళ్యాణి పై ప్రాణాలు పైనే పోయినాయ్. అక్కడున్న వాళ్ళంగా బాగా నాగరికంగా ఫాషనబుల్ గా ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఆ సమయంలో భోజనం చేస్తున్నారు. ఇలాటప్పుడే ఉన్నట్టుండి మరేక్కడా చోటు దొరకనట్టు ఈ పిల్ల యీ పని చెయ్యాలా?
    పాప ఏడ్చుకుంటూ బాత్ రూములోకి తీసుకు వెళ్ళి దానిని, చెడ్డీ ని కడిగి, లోలోపల పళ్ళు నూరుకుంటూ వచ్చింది పది నిమిషాల తరువాత కళ్యాణి.
    ఆ హడావుడి లో ఆమెకు ఆకలి కూడా చచ్చిపోయింది. పాప ఏదో చేయరాని మహాపరాధం చేసినట్లు ఎంతగానో ఆగ్రహం తెచ్చుకుంది కళ్యాణి. ఆ సమయంలో పాప పసిపిల్ల అని, దాని కలాటి ఉచితానుచితాలు సమయాసమయాలు తెలియవని ఆమెకు తోచనే లేదు. ఎంతసేపూ అది చేసిన పనిని చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా చూసేరేమో, చూసి తమని అసహ్యిచుకుంటున్నారేమో -- అదే ఆమె బాధ!
    ఇక బాబిగాడు కూడా తిన్నంత అన్నం తిని తరువాత గాజు గ్లాసులతో , ప్లేట్లతో బల్లను కొడుతూ ఆ ధ్వనికి పరవశించి పోతున్నాడు. ఇంకా ఆ హోటల్లో ఉన్న కొలది తమ పరువు పోతుందన్న విషయం గ్రహించి గబగబ నాలుగు మెతుకులు కతికి బయటపడ్డారు.
    బయటకు రాగానే అటో రిక్షా పిలిచి, సరాసరి తాము బస చేసిన హోటలు కే పోయేరు. గదిలోకి వెళ్తూనే ఇంక కళ్యాణి తిట్లు మొదలెట్టింది. ఛీ ఛీ! ఏం పిల్లలు వీళ్ళు! ఇంత ఇండీసెంటు పిల్లల్ని నేను ప్రపంచంలో చూడలేదు' అంది.
    'పిల్లలంటే నే 'యిండీసేన్సీ' కి మారు పేరు కళ్యాణి! ప్రత్యేకించి పిల్లలనే అనుకోవట మెందుకు?' అన్నాడు బట్టలు మార్చుకుంటూ కాంతారావు.
    'అయ్యో రాత! అంత పెద్ద హోటల్లో అందరి ముందు 'అలాటి' పని ఏ పిల్లలైనా చేస్తారా అసలు?' భర్తని నిలదీసి అడిగింది కళ్యాణి.
    'నా పాతికేళ్ళ జీవితంలోనూ, ఆఫ్ కోర్స్, యిలాటి సంఘటన నెప్పుడూ నే నేడుర్కోలేదనుకో. ఐనా అవకాశం వస్తే కాని ఏదీ అనుభవం లోకి రాదు కదా!' అంటూ పక్క మీద వాలెడు.
    కళ్యాణి కూడా కోపంలో ఉండటం వల్ల పిల్లలతో పాటు తాను కూడా పడుకుంది యిక సాయంత్రం వరకు ఎక్కడకూ వెళ్ళ కూడదని.
    సాయంత్రం నిద్ర లేచి ఫలహారాలు ముగించేక ఎక్కడకు వెళ్ళాలన్న ప్రశ్న వచ్చింది.
    'బీచ్ కి వెళ్దాం" అంది కళ్యాణి.
    'సినిమా చూసి చాలా రోజులయిందోయ్! ఇవ్వాళ్టికో యింగ్లీషు పిక్చర్ చూద్దాం. రేపు సాయంత్రం బీచ్ కి పోదాం లే! రేపు కూడా యిక్కడే ఉండదల్చుకున్నాం కదా!' అన్నాడు కాంతారావు.
    కళ్యాణి కి కూడా ఆ సూచన నచ్చటం వల్ల వాగ్వివాదాలేమీ జరగకుండానే సినిమా హాలుకు వెళ్ళేరు.
    అది ఇంగ్లీషు పిక్చరవటం వల్ల అక్కడకు వచ్చిన వాళ్ళంతా చాలామంది అల్ట్రా మోడ్రన్ వేషధారణ లో ఉన్నారు. బాబ్ డ్ హైర్లు, పెదవులకు లిప్ స్టిక్కు లు, శరీరంలో సగభాగాన్ని చూసే బట్టలు అన్నీ చూసేక వాళ్ళందరి ముందూ తానెంతో అనాగరికంగా ఉన్నట్టు ఫీలయ్యి, కించ పడింది కళ్యాణి.
    'ఛ, ఛ! ఈ పిల్లల మూలంగా నేను మరీ రోజురోజుకీ అమ్మమ్మలా తయారవుతున్నాను. కాస్త బయట ప్రపంచం లోకి వచ్చినప్పుడన్నా 'ట్రిమ్' గా ఉండటం అలవాటు చేసుకోవాలి.' అనుకుంది.
    అక్కడకు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉన్నట్టు కనపడుతున్నారు. ఆ ఆడవాళ్ళ లో ఒంటరిగా వచ్చిన పడుచు పిల్లలు, జంటగా వచ్చిన - యువతులు మాత్రమే కాక మగతోడు లేకుండా వచ్చిన ప్రౌడలు కూడా తక్కువ మందేమీ లేరు.
    "వీళ్ళందరి కీ పెళ్ళిళ్ళు కాలేదా? తమలా వీళ్ళ కు పిల్లలు పుట్టారా? పుడితే వాళ్ళను వదిలేసి యిలా స్వేచ్చగా సినిమాలకు ఎలా రాగాలుగుతున్నారు? కొందరు పెళ్ళయి, జీవితాన్ని అనుభవించిన వాళ్ళలా కనపడుతున్నా, భర్తలు వెంట లేకుండానే ఒంటరిగా ఎలా వస్తున్నారు?' మొదలైన ప్రశ్నలన్నీ కల్యాణి బుర్రలో దూరి వేదించ సాగినాయ్.
    ఐతే తనను వేధించే ప్రతి సమస్యనూ అది ఎంత చిన్నదైనా సరే - భర్తకు కూడా చెప్పి వేధించటం ఆమెకు అలవాటు. అందువల్ల తన మనసులో అనుకుంటున్నదంతా అడిగేసింది భర్తని హాల్లోకి వెళ్ళి కూర్చున్నాక.
    వాటన్నిటి కీ వోపికగా యిలా సమాధానం చెప్పేడు కాంతారావు. 'వాళ్ళు నీలాగా చీరా, జాకేట్టూ, తొడుక్కుని, నుదుట కుంకుం బొట్టు పెట్టుకోక పోయినా, యింటి దగ్గర వాళ్ళూ ఆడవాళ్ళ లానే ఉంటారు. వాళ్ళూ నీలాగానే పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కంటారు. కాని 'యిందాక హోటల్లో పాప చేసిన 'ఇండిసేంట్ పని' ని చూసి నువ్వు కోపం తెచ్చుకున్నావు చూసేవ్? అలాటి ఇండీసెంటు పనులను వాళ్ళ పిల్లలు కూడా అంతకంటే ఎక్కువగానే చేస్తారు. అందుకే వాళ్ళను బయటకు తీసుకు రారు తల్లిదండ్రులు. తాము మాత్రం 'దీసెంటు ' గా అలంకరించుకుని బయటకు వస్తారు. ఇకపోతే పెళ్ళయి కూడా భర్త లేకుండా ఒంటరిగా సినిమాలకు వచ్చే స్త్రీలకూ గురించంటావా , అది యీనాటి ఫ్యాషన్! ఇరవై, ముప్పై సంవత్సరాల క్రితం భర్త పక్కనే నడుస్తూ 'అతనితో కలిసి సినిమాలకు, షికార్ల కు వెళ్ళటమే నాగరికత అనీ, స్వేచ్చ అనీ బావించేది భారత స్త్రీ. కాని యిప్పుడు భారత స్త్రీ కి భర్తతో పాటు కలిసి సినిమాలకు, హోటళ్ళ కు వెళ్ళటం నామోషి గా అనిపించి, అన్నిటికీ ఒంటరిగానే వెళ్ళటం మొదలేడ్తోంది భర్త ఆఫీసు నుండి సరాసరి ఏ క్లబ్బు కో, బార్ కో పొతే భార్యామణి  సాయంత్రపు చల్ల గాలిలో షాపింగు కు, సినిమాలకు బయల్దేరుతుంది. మళ్ళీ యిద్దరు యించుమించు ఒక గంట అటూ యిటుగా ఏ అర్ధరాత్రికో యింటికి చేరుకుంటారు. నాగరికత పెరుగుతున్నది"అదీ వివాహవ్యవస్థ ఒక '' కోఆపరేటివ్ సంస్థ లా మారిపోతోందే తప్ప హృదయగతమైన అనుబంధాలకు, సున్నితమైన సహజీవనానికి యే మాత్రం చోటు లేకుండా పోతోంది.' అన్నాడు.
    ఆ మాటలు వింటుంటే కళ్యాణి కి ఆ క్షణం లో ' తాను చాలామంది స్త్రీల కంటే ఎంతో అదృష్ట వంతురాలి ననిపించింది. ఎన్ని అవమానాలు, పరువు తక్కువ పనులు చేసినా, యీ పిల్లలను వదిలి తాను స్వేచ్చగా తిరిగి, ఆనందించగలదా? భర్త వెంటలేకుండా ఒక సినిమాని కాని, పార్కు లోని ప్రశాంతతను కాని షికారు లోని హాయిని గాని పొందగలదా? వద్దు వద్దు. తానిలాగే ఉండాలి. తానూ, భర్త, తన పిల్లలూ , అనురాగాలతలలో బంధింపబడి ఎల్లప్పుడూ, ఒకేచోట ఉండాలి. సుఖమో, దుఖమో అందరూ కలిసే అనుభవించాలి. పిల్లలను, భర్తను మానసికంగా తనకి దూరం చేసే స్వేచ్చ తనకి అవసరం లేదు.' అనుకుంది కళ్యాణి దృడంగా.
    ఆ సమయంలో తన పక్కన, తన ముందూ, వెనుకా ఒంటరిగా గాజు బొమ్మల్లా రంగు రంగుల దుస్తులు ధరించి కూర్చున్న ఆ ఆడవాళ్ళందరినీ చూస్తె వెగటనిపించింది ఆమెకు. అంతే కాక యిద్దరు పసిపిల్లలను వెంట పెట్టుకుని యింగ్లీషు సినిమా చూట్టానికి వచ్చిన యీ అనాగరికులు ఎవరా? అన్నట్లు ఆశ్చర్యం, నిరసన కూడిన దృష్టులను తమపై వోరగా ప్రసరించుతున్న కొందరు స్త్రీలను కూడా ఆమె చూడకపోలేదు.వాళ్ళు అలా తనని చూస్తె కళ్యాణి కి అవమానం కలగలేదు. సరికదా పైగా తనలో తానే నవ్వుకుంది.
    అసలు సినిమా మొదలయ్యే ముందు ముప్పావు గంట సేపు రాబోయే సినిమాల లోని కొన్ని సీన్సు చకచక చూపిస్తుంటే పిల్లలిద్దరూ ఆ వేగాన్ని , రంగులను నోళ్ళు తెరచుకుని చూస్తూ కూర్చున్నారు అంతసేపునూ. కాని తీరా సినిమా ప్రారంభమయ్యే సరికి వాళ్ళకు నడుం నొప్పి పుట్టి 'ఇక యింటికి పోదాం!' అన్న అర్ధం వచ్చేలా మారం చెయ్యటం మొదలెట్టేరు. కాంతారావు బయటకు వెళ్ళి ఒక బిస్కెట్ పాకెట్టు కొనుక్కుని వచ్చేడు. అంతవరకూ కళ్యాణి పిల్లలిద్దరితోనూ కుస్తీ పడుతూ తనముందు కూర్చున్న వాళ్ళ ఉరుమురిమి వెనక్కి చూస్తుంటే తను కూడా వాళ్ళ వంక తీక్షణంగా చూడసాగింది.
    బిస్కెట్లు తినటం లో మునిగి పోయిన పిల్లలు పది హీను నిమిషాల పాటు ప్రశాంతంగా ఉన్నారు. అవి తినటం పూర్తయినాక మంచి నీళ్ళు కావలసి వచ్చి "బా,బా! అంటూ వాళ్ళ 'కోడ్' భాష లో అరవసాగేరు. ఇక గత్యంతరం లేక కాంతారావు పిల్లలిద్దరినీ బయటకు తీసుకు వెళ్ళి మంచి నీళ్ళిప్పించి తీసుకు వచ్చేడు. వాళ్ళు కాస్త కుదురుగా కూర్చునేసరికి ఇంటర్వెల్ అయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన చిప్సు కుర్రావాడిని చూస్తూనే వాడి వైపు  చూపి, కొనమని తండ్రి నడిగేడు బాబిగాడు.
    వాళ్ళకు, తమకీ అందరికీ కలిపి నాలుగు ప్యాకెట్లు కొన్నాడు కాంతారావు. ఇంతలోనే లైట్లారి పోయినాయ్. పిల్లలు చిప్సు తింటూ , ఎదురుగా తెరపై ఆడుతున్న బొమ్మలను చూస్తూ, ఆ ఆనందం లో పరవశించి పోయి తల్లిదండ్రుల వొళ్ళో విలాసంగా చేరగిలబడి కాళ్ళను ముందు సీట్ల మీద నిగడ దన్ని కూర్చున్నారు. దాంతో ముందు కూర్చున్న వాళ్ళు అదిరిపడి వెనక్కి చూసి యింగ్లీషు లో 'కీచు కీచు' మంటూ అరచేసరికి ఆ అరుపులకు సినిమాలో లీనమై పోయిన కళ్యాణి కాంతారావు లు కూడా అదిరిపడి యీ లోకంలోకి వచ్చి ఆ విచిత్ర ధ్వనులు చేసింది ఎవరా అన్నట్టు చూసేరు. కొద్ది క్షణాలలోనే పరిస్థితులను అర్ధం చేసుకుని, వాళ్లకు క్షమాపణలు చెప్పుకుని, పిల్లల కాళ్ళను బలవంతాన యివతలకు లాగేరు ఆ దంపతులు.
    తల్లిదండ్రులు తమ స్వేచ్చకు సంకెళ్ళు వేసినందుకు తీవ్రంగా నిరసిస్తూ పిల్లలిద్దరూ పెద్ద పెట్టున ఏడవసాగేరు. దాంతో యిక లాభం లేదనుకుని కాంతారావు కళ్యాణి పిల్లలిద్దరినీ ఎత్తుకుని బయటకు వచ్చేరు. కాసేపు వాళ్ళను చల్లగాలిలో తిప్పేసరికి నిద్ర పోయేరు. వాళ్ళు తిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్న ఐదు నిమిషాల్లోనే సినిమా కూడా పూర్తయింది. అయితే పిల్లల గొడవ లో పడిపోయిన కళ్యాణి, కాంతారావు లకు అసలు సినిమా కదేమిటో అంతే పట్టలేదు. ఎంతసేపు పిస్టళ్లు 'డాం డాం" అంటూ ప్రేలటం, అమ్మాయిలు అబ్బాయిలు గాడాలింగనం లో ఉండి ముద్దులు పెట్టుకోవటం మాత్రం చూసేరు తప్ప అవన్నీ ఎందుకు జరుగుతున్నదీ అర్ధమే కాలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS