Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 26

                                

                                    32

    అనూరాధ తో మాట్లాడి బయటపడ్డ శ్రీనివాస్ మనస్సు వికలమయిపోయింది, ఏదీ నిర్ణయించుకోలేక, మనస్సంతా చికాకుతో చిర్రుబుర్రులాడుతూ రామకృష్ణ గదిలోకి వెళ్ళి అతనిమీద విరుచుకు పడ్డాడు, "అసలు నా ఎడ్రసు ఎవరిమ్మనమన్నారు? నే నిక్కడున్నది ఎందుకు తెలియపర్చావు?" అని.
    శ్రీనివాస్ అంటే చనువు, గౌరవం రెండు ఉన్నాయి రామకృష్ణకు. "కావలసినవాళ్ళకు నీ ఉనికి సంగతి తెలియపరచవలసిన అవసరం లేకపోయినా, మీ కుటుంబం శుభంకోరే నాక. కొంత అవసరం ఉంది."
    "నీకున్నది అవసరం కాదు, అనవసరం. నా స్వంతవిషయాలలో జోక్యం కలిగించుకునే బాధ్యతమాత్రం నీకు లేదు."
    "కలిగించుకున్నందుకు, కలిగించుకోబోతున్నందుకు బాధపడుతున్నాను. ఎలాగూ వేలు పెట్టాను. నా మనసులో ఉన్నవన్ని అడిగేస్తాను. అనూరాధ అక్కడ ఎంత క్షోభ అనుభవిస్తూందో అన్న ఆలోచన నీకుందా? ఒక్కసారైనా కలుసుకున్నావా?"
    "ఆఁ!"
    "ఎక్కడ? హోటల్ లోనేనా?"
    "కాదు. మా ఇంట్లో."
    "అనూరాధకు ఎడ్రసు ఇచ్చానని ఎగిరిపడుతున్నావు! నీ మనస్సులో ఉన్న మమతను ఎందుకు మభ్యపెట్టాలని చూస్తావు? నువ్వన్నచోటకు ఆవిడ కబురు పంపినంతమాత్రాన నువ్వు వెళ్ళి కలవవలసిన అవసరం లేదే నీకిష్టం లేకపోతే! ఆవిణ్ణి చూడాలన్న తహతహ నీలో లేదూ? ఎందుకిలా నిన్ను నువ్వు మభ్య పరుచుకుంటావు?"
    "......."
    "శ్రీనివాస్! నీ మనస్సొక మైనపుముద్ధ! ఎవరు ఎటువైపు నుండి ప్రోత్సాహం, ఒత్తిడి తెస్తే అటువైపు కరిగి పారుతుంది. అదే నీకున్న దౌర్భల్యం. నీ మనస్సును గట్టిపరుచుకునే శక్తి నీలో తెచ్చుకోలేనంతకాలం ఇలాటి ఎదురు దెబ్బలు నీకు తప్పవు. కళ్ళు తెరుచుకుని నడుస్తుంటేనే గుచ్చుకునే ముళ్ళకు, కలిగే దెబ్బలకు అంతులేవు. కళ్ళు మూసుకుని, ఒకరిచేతి ఆధారంతో నడవాలనుకుంటే వాటికి అంతెలా ఉంటుంది? శ్రీనూ, నీది దుర్భలత్వం కాదు. పిరికితనం అంతకంటే కాదు. అదొక రకమయిన స్వభావం. సున్నితం అనడానికి వీలులేని మృదుహృదయం. వేడికి ఎంత త్వరగా కరుగుతుందో మైనం, చల్లదనానికి అంత త్వరగా గట్టిపడుతుంది. చిన్నప్పుడు మీ నాన్నగారి కోరిక కాదనలేక మెడిసిన్ లో చేరావు. అమ్మ కోరిక కాదనలేక ప్రాక్టీసు మొదలుపెట్టావు, అనూరాధ కోరిక తీర్చడానికి వద్దనుకున్నదానిలో తిరిగి ప్రవేశించావు. ప్రతివాళ్ళ కోరిక తీర్చడానికి నువ్వారాధ్యదైవానివి కాదు. ఈ రోజు నీలో ఉన్న కఠినత్వం, నువ్వు చెప్పగలిగిన జవాబు ఆ రోజు మీ నాన్నగారికి చెప్పగలిగి ఉంటే, ఈ రోజు నువ్విలా విచారించవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు. అర్ధం లేకుండా అనూరాధను నిందించకు."
    "నీకు తెలియదు, రామం. ఇవాళ నాలో నేను అనుభవిస్తున్న బాధ నీకు అర్ధంకాదు. నేను మొదటిసారిగా రాధను పెళ్ళిచేసుకోమని అడుగుతే, ఇచ్చిన జవాబు నేను మరిచిపోలేను. 'నన్ను పెళ్ళిచేసుకుంటావా?' అని అడిగితే, 'మీరు తిరిగి మెడిసిన్ లోకి వెడతారా?' అని అడిగింది. ఆమెకు కావలసింది నేనుకాదు" అన్నాడు బలంగా శ్వాస వదులుతూ. వేళ్ళు జుట్టులోకి పోనిచ్చుకున్నాడు.
    "మానవులలో తెలియని శక్తులు మరుగునపడిపోవడం అసహజం కాదు. అవి పెల్లగించి బయటికి తియ్యాలని ఆరాటపడటం అత్యాశ కాదు. తను అతిగా ప్రేమించిన వ్యక్తి ఉన్నతికి కారణం అవుతున్నాననుకుంటే - అదొక్కటే అనూరాధ చేసిన పొరపాటు. దారినిపోయే దానయ్యకు నీలోనించి నీ ప్రతిభను బయటికి తియ్యాలని కోరిక కలగదు. నీకు ప్రోత్సాహం ఇచ్చే మనిషి వెనక ఉద్దేశం అర్ధంచేసుకో."
    "ఏమిటా ఉద్దేశం? నాకు అక్కరలేనివి అంటగట్టాలనుకోవడమేనా? ఇక ఒకరి ఆలోచనలు, సలహాలు నా కనవసరం. నా మనసుకు తోచినది నే చేయబోతున్నాను."
    "ఈ క్షణం నన్నీ ముక్క మాత్రం చెప్పనీ. నువ్వు అనూరాధకు దూరమవ్వాలనుకుంటున్నావు. అది నీకు చేతనైనది దైహికంగానే! మానసికంగా మాత్రం కాదు. నీకు లభిస్తుందనుకున్న మనశ్శాంతి. అంతకంతకు అందకుండా పోతుంది. నీ చేతకానితనంతో ఒక ఆడపిల్లను ఏడిపించడంతో నీకు లభించేది అశాంతే! అదిమాత్రం గుర్తుంచుకో! ఏమాత్రం బాధ్యురాలుకాని ఆమెను నిందించడం నీకు తగని పని."    
    శ్రీనివాస్ మనసు కల్లోలమయిపోయింది రోజురోజుకు. అతనికి కావలసిన దేదో తెలుసుకోలేని స్థితికి వచ్చాడు. అనూరాధకు ఎంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నాడో, ఆమె ఆలోచనల అంతకంతకు ఎక్కువగా చుట్టముట్టసాగాయి. వాటినుండి పారిపోవడం అతనికి చేతకాలేదు. వెలుగువెనక నీడల్లా, తల్లివెనక తిరిగే బిడ్డల్లా అనూరాధ ఆలోచనలు, ఊహలు అతని చుట్టు పరిభ్రమించాయి.
    
                                    33

    దరిదాపు రెండు నెలలలో అనూరాధ, శ్రీనివాసులలో ఎటువంటి మార్పు రాలేదు. అల్లుడితో స్వయంగా మాట్లాడమని కోరింది శ్రీలక్ష్మి. అది రాజశేఖరం గారికి స్వతహాగా ఎక్కువ ఇష్టంలేదు. తమ అమ్మాయిది తప్పని ద్వేషిస్తున్న అతనిదగ్గరికి వెళ్ళి, అమ్మాయి తరఫున మాట్లాడడంవల్ల అతని భావాలు, ఉద్దేశాలు బలపడటమేగాని సడలవేమోనని భయపడ్డారు. కాని ఆ ప్రయత్నం చెయ్యకుండా ఉండలేకపోయారు. ఆయనకున్నదొక్కటే ఆశ. అనూరాధపట్ల శ్రీనివాస్ ధోరణి మారకపోతే కృష్ణమూర్తిగారి రహస్యం వెల్లడిచెయ్యడమే! నిజానికి శ్రీనివాస్ మెడిసిన్ లోకి పునః ప్రవేశానికి కృష్ణమూర్తిగారి బాధ్యతే ఎక్కువ.
    ఇంట్లో చికాకులతోపాటు ఆఫీసుపనులతో చికాకుపడుతూ అనూరాధ గదిలోకి అడుగుపెట్టారు శేఖరంగారు. లోపల కుర్చీలో అలసటగా పడుకుని ఉంది రాధ. బుగ్గలపై కన్నీటిచారికలు స్పష్టంగా కనుపిస్తున్నాయి. కళ్ళకింద నల్లటి చారలు ఏర్పడుతున్నాయి. అల్లారుముద్దుగా, వెన్నముద్దలా పెరిగిన రాధను ఆ స్థితిలో చూస్తూ ఉంటే ఆయన మనసు విలవిలలాడిపోయింది. 'ఆ స్థితిలో, ఆ మనోవేదనతో కోలుకుంటుందా?' అనుకున్నారు. కళ్ళు చెమరుస్తూ ఉంటే, "అమ్మాయీ!" అంటూ పిలిచారు. టేబుల్ మీద ఎగురుతున్న కాగితం కనిపించింది. మరేదీ ఆలోచించకుండా తీసి చూచారు. కోసం అవధులు దాటింది. ఉగ్రులయిపోయారు.
    "అనూరాధా!
    తెలిసి చేసినా, తెలియక చేయాలనుకున్నా నా జీవితాన్ని ఒకరు పాలించడం మాత్రం సహించలేను. నేను ప్రేమించిన ప్రతి ఒక్కరు నన్ను పరిపాలించ చూచారు. ఏ ఒకరికి నేను నేనుగా అవసరంలేకపోయాను.
    ఇక మనం కలిసిఉండవలసిన అవసరం కనుపించలేదు, నీ కోరిక తీర్చలేక పోయాక. ప్రతిచోట ఓడిపోయిన నేను ఇంటినుండి దూరమయినంత తేలికగా నీనుండి దూరమవడం సాధ్యంకాదు. కనీసం సంఘంకోసం.
    కొద్దిరోజులలో నా లాయరు నిన్ను కలవబోతున్నాడు, మన విడాకుల విషయం మాట్లాడేందుకు. నీకు కావలసినది అతనిద్వారా తెలియపరుచు.
                                                                                                    -శ్రీనివాస్."
    ఆయనలోని క్రోధం, ఆవేశం ఆయన్ని ఆలోచనారహితుల్ని చేశాయి. "విడాకులు ఎలా జరుగుతాయో చూస్తాను!" అంటూ విసురుగా బయటికి వచ్చారు. గరాజ్ లో కారు చర్రున బయటికి లాగి జోరుగా పోనిచ్చి కృష్ణమూర్తి గారి ఇంటిముందు ఆపారు. అనుకోకుండా వచ్చిన రాజశేఖరంగారిని చూచి తెల్లబోయారాయన. ఈ రాకకు, అనూరాధకు ఏదో సంబంధం ఉండకపోదనిపించింది.
    "రా....కూర్చో...ఏమిటి, ఇప్పుడు వచ్చావు?"
    "మర్యాదలు తరవాత చేద్దువుగాని. ఇదిగో, నీ కొడుకు చేస్తున్న నిర్వాహకం..." అంటూ ఉత్తరం తీసి ఆయన చేతిలో పెట్టారు దూకుడుగా.
    ఉత్తరాన్ని చదివి బాధగా నిట్టూరుస్తూ, "నన్నేం చెయ్యమంటావు?" అన్నారు.
    "ఇంకేమిటి చేసేది! వెంటనే వెళ్ళి ఈ గొడవంతటకు కారకుడివి నువ్వే అని తెలియజెప్పు." ఆవేశంతో అతను పిచ్చివాడవుతున్నాడు.
    "అతనితో అలా చెబితే, అనూరాధకోసం ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నావనుకుంటాడేమో!"
    "ఎందుకు అనుకోడు? ఈ సమయంలో తప్పకుండా అనుకుంటాడు. ఉన్నదున్నట్లు చెప్పు. మీ ఇద్దరిమధ్య ఉన్న సంబంధం చెప్పు."
    "శేఖరం!"
    "అవును. అంతకన్నా గత్యంతరం లేదు."
    "ఆ సంగతే బయటపడితే అతనికి నామీద ద్వేషం ప్రజ్వరిల్లుతుంది. అది సహించలేను. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు."
    "అది అర్ధం చేసుకోబట్టే ఈ ఆలోచన నా కెన్నాళ్ళబట్టి ఉన్నా ఊరుకున్నాను. చిన్నతనంలో, అజ్ఞానంలో వచ్చినవి వాటంతట అవే సర్దుకు పోతాయని ఆశించాను. ఇంతవరకు వస్తుందనుకోలేదు. ఇంక ఇప్పుడు మరో మార్గం లేదు."
    "ఇన్నేళ్ళుగా లేని కొడుకు ఇప్పుడున్నాడని సంతోషించాను. ప్రేమతో అభిమానంతో దగ్గిర అవలేకపోయినా, స్నేహంతో, ఉద్యోగరీత్యా దగ్గిర కావాలను కున్నాను అదీ సాధ్యపడలేదు. నామీద అతనికి ఉండవలసిన గౌరవం లేకపోయినా, నామీద అతనికి ఉన్న లక్ష్యానికి సంతృప్తి పడ్డాను. ఇప్పుడీ విషయం తెలిపితే జీవితాంతం, శాశ్వతంగా మా బంధుత్వాన్ని తెంపుకోవడమే. మా బాంధవ్యాన్ని సమాధి చెయ్యడమే!" అన్నాడు గాద్గదికంగా.
    "అదే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఆగాను. ఇంతకంటే మార్గం కనిపించలేదు. స్త్రీలోంచి పుట్టి, స్త్రీ నీడలో పెరిగి, సంపూర్ణ స్త్రీత్వం వాంచించే పురుషుడు స్త్రీ ప్రభావం, పరపతి తనమీద పడటం సహించలేడు. పురుషులలో నరనరాలలో జీర్ణించుకుపోయిన ఆధిక్యమే ఇది. దాన్ని అధిగమించటం మనకు చాతకాదు. శ్రీనివాసు కి అంతే!"    
    "క్షమించు, శేఖరం. ఆ పనిమాత్రం చెయ్యలేను శ్రీనివాస్ దగ్గిరికి వెళ్ళి ప్రాధేయపడడమయినా చెయ్యగలనేమోగాని, అతన్ని దూరం చేసుకోలేను. అనూరాధ నీ కెంతో, నాకూ అంతే! నా కళ్ళముందు పెరిగింది. వాళ్ళిద్దరి సుఖం కోరడంకంటే నాకు ఇంకో కోరిక లేదు. అతనంతట అతను నా దగ్గిరికి వస్తాడేమోనని ఎదురుచూస్తున్నాను. మొహం చెల్లలేదేమో! వారిద్దరికోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను."
    "కాని ఫలితం ఉంటుందనుకోను. నా మాట విని, నే చెప్పింది చెయ్యి.  ఆనందంగా, ఆరోగ్యంగా బంతిలాగా ఎగరవలసిన పిల్ల మనస్సులో క్షోభతో కుమిలిపోతూంది." ఆయన కంఠంలో ఆజ్ఞ పోయి అభ్యర్ధన చోటు చేసుకుంది. ఏమీ జవాబివ్వని ఆయన్ని చూస్తూ ఉంటే, శేఖరంగారి మనస్సులో రకరకాల భావాలు సమపాళ్లలో సంఘర్షణ పడసాగాయి. ఆయన మౌనాన్ని భరించలేక "కృష్ణమూర్తీ, ఈ పని నీద్వారా జరగకపోతే శ్రీనివాస్ విడాకుల దాకా పోతే, కోర్టులో లాయరుద్వారా అతనికీ విషయం తెలియచెప్పవలసి వస్తుంది. పదిమందిలో ఆ అవసరాన్నిమాత్రం కలిగించకు" అని బయటికి వెళ్ళాడు.
    నిస్పృహతో కుర్చీలో కూలబడ్డారు కృష్ణమూర్తిగారు. తమ కర్తవ్యం తాము నిర్ణయించుకోలేక దాని పర్యవసానం ఊహించుకోలేక సతమతం కాసాగారు. 'శ్రీనివాస్ తనను క్షమించగలడా?సావిత్రీ, నన్ను క్షమించు. నీకు అపకారం, అశాంతి తప్ప ఏనాడు ఏ విధంగానూ సహాయపడలేకపోయాను. ఆ రోజు తెలియని చిన్నతనంలో చేసిన పనికి నీ అదృష్టమే సహృదయుడయిన భర్తను ప్రసాదించింది. తిరిగి ఈనాడు నా చేతకానితనంతో నీకు దూరం చేస్తున్నకొడుకును ఆ అదృష్టమే నీకు దగ్గిర చెయ్యాలి. ఏనాడు, ఎటువంటి బాధ్యత స్వీకరించని నేను తండ్రినయినా, కాకపోయినా తండ్రినన్న తృప్తి ఉంది. కాని నా తృప్తికోసం నిన్ను అసహ్యించుకునేందుకు కారకుడినిమాత్రం కాబోను. నీకు, నీ కొడుక్కి మధ్య బాంధవ్యం నెలకొల్పడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.
    'లేరు, లేరన్న బిడ్డలు లేకుండాపోతే ఒకటే బాధ లేరని! అయినా ఉన్నారన్న ఆనందాన్ని కలిగించి అందీ, అందకుండా చేసే భగవల్లీలలు ఎంత విచిత్రములో! చేసుకున్న పాపాలు అనుభవించేందుకు ఏ లోకాలకో పోనవసరం లేదు. స్వంతబిడ్డల చేత అసహ్యింపబడితే చాలు!'

                                    34

    మరునాడు శ్రీనివాస్ గదిముందు నుంచున్న కృష్ణమూర్తిగారికి మునుపెన్నడూ లేని భయం ఆవరించింది. తలుపు కొట్టబోతూన్న ఆయన చేతులు వణికాయి.
    మెల్లిగా తలుపులు తెరుచుకున్నాయి. కృష్ణమూర్తిగారిని చూచి ఆశ్చర్యంతో రెండడుగులు వెనక్కి వేశాడు! తల సిగ్గుతో వాలిపోయింది. "లోపలకు రండి!" ఆహ్వానించాడు.
    కొద్ది నిమిషాలు మౌనాన్ని వెంటాడాయి. నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ 'నేనే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. మీకే శ్రమ కలిగించాను" అన్నాడు నొచ్చుకుంటూ.
    "ఎవరు వస్తే ఏముంది?" అన్నారు మెల్లిగా.
    "మిమ్మల్ని చాలా నిరుత్సాహపరిచాను. మీరు ఎంతో ఉత్సాహం చూపారు. నామీద చూపిన ప్రత్యేక శ్రద్ధకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్ధం కావడంలేదు. కనీసం అది నెరవేర్చలేకపోయాను. క్షమించండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS