Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 25


    కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయాడు. "నిన్నరాత్రి ఆ ఎటాక్ తట్టుకో గలిగారంటే నిజంగా ఆశ్చర్యకరమయినదే! నా ఉద్దేశం ఆవిడ తప్పకుండా కోలుకుంటారనే. ఆ తరవాత భగవంతుడి దయ. మనం చెయ్యగలిగిందంతా చేస్తున్నాం. మీ రిలా అధైర్యపడకండి."
    "మీకు అర్ధంకాదు నా బాధ, నాకు నా అని చెప్పుకోతగ్గ బంధువు మా అమ్మ ఒక్కర్తే. నేనిప్పుడు ఆమెను పోగొట్టుకునేందుకు సిద్ధంగాలేను. మోహన్ గారూ! నేను ఒంటరిగా జీవించలేను."
    "ఛ. ఏమిటిది, చిన్నపిల్లలాగా" అన్నాడు చనువుగా రుమాలుతో కన్నీళ్ళు తుడుస్తూ. "తల్లిని, తండ్రిని పోగొట్టుకునేందుకు ఎవ్వరూ సిద్ధంకాలేరు. చిన్నప్పుడైనా, పెరిగాకైనాసరే! అది అనుభవంలోకి వచ్చాక బాధపడి సద్దుకోవడంతప్ప. పిల్లలు బ్రతికినన్నాళ్ళు తల్లితండ్రులు బ్రతకరు కదా! అని మార్చలేని నిజాలు. మనం మనసును రాయి చేసుకుని ధైర్యంతో మసలాలి."
    అతని ఓదార్పుతో ఆమె దుఃఖం మరింత అయింది. అంతవరకు ఎప్పుడు అవసరామయినా ధైర్యం చెప్పే అనూరాధ, తనే అధైర్యంగా ఉండటం, వారి కుటుంబానికే సమస్య రావడంతో లలిత ఈసారి పూర్తిగా ఒంటరిదై పోయింది. అధైర్యంతో వలవలా ఏడుస్తున్న లలితను చూస్తూంటే మనస్సంతా అదోలా అయింది మోహన్ కు. ఇంక ఉపేక్షించలేకపోయాడు. చనువుగా బుజాలు పట్టుకుని తనవైపుకు తిప్పుకుని, "లలితా, ఏమిటిది? ..... నా మాటమీద అంత నమ్మకం లేదా! మీ అమ్మగారీ తప్పకుండా నయమవుతుంది. ఇటు చూడు ... నేను ఉండగా ఒంటరిదానవు ఎప్పుడూ అవవు ..... నీకు ఆప్తబంధువులు లేకుండా ఎప్పుడూ ఉండవు. ఏమిటిది? .... ఏడవకు" అన్నాడు గుండె లకు దగ్గిరగా చేర్చుకుంటూ. ఒక్కక్షణం కళ్ళెత్తి ఆశగా అతని ముఖంలోకి చూచింది. చిరునవ్వుతో ధైర్యంగా కనుపిస్తున్న ముఖం మరింత దగ్గిరగా కనుపించింది. కొద్దిక్షణాలు అతని గుండెలమీద తల వాల్చుకుని అలాగే ఉండిపోయింది. ఆ స్పర్శలో, ఆ వెచ్చదనంలో అంతవరకు లేని ధైర్యం కలిగింది. ఆ క్షణంలో పరాయిపురుషుడి చేతిలో ఉన్నానన్న విషయంకూడా స్ఫురించలేదు లలితకు. కొద్దిక్షణాలు గడవగానే చటుక్కున దూరంగా జరిగి, అతని ముఖం లోకి చూచి తల దించుకుంది.
    "ఏమిటంత ఉలిక్కిపడ్డావు? లే! వెళ్ళి మొహం కడుక్కురా! టిఫిన్ తిందువుగాని."
    అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా ఎటో దృష్టిసారించి నిర్లిప్తంగా ఉండిపోయింది.
    ఆమెవంక చూస్తూ "నువ్వు టిఫిన్ తీసుకోకపోతే అదంతా అలాగే ఉండిపోతుంది. నాకు ఆకలేస్తూంది మరి."
    అతనివంక తలఎత్తి చూచి మౌనంగా లోపలికి వెళ్ళింది. మొహం కడుక్కువచ్చి, ప్లేటులో టిఫిన్ సర్ది అతనికి అందించి, తనొకటి తీసుకుని కుర్చీలో కూర్చుంది దూరంగా.
    "అనూరాధ ఎలా ఉంది?"
    "ప్చ్. 'ఇలా ఉంది' అని చెప్పేందుకు వీలులేకుండా ఉంది. చాలా నిరుత్సాహపడింది. ఏమిటో అంత ఓ గాథ" అన్నాడు దీర్ఘంగా  నిట్టూరుస్తూ.
    "శ్రీనివాస్ ఎక్కడున్నారో తెలిసిందా?"
    "ఇంకా లేదు."
    "అనూరాధను అతను తిరిగి కలుసుకోలేరా?"
    "ఏమో? అదే తెలియదు. దానంతట అది చెప్పలేదు. అడిగి బాధపెట్టటం ఎందుకని ఊరుకున్నాం. ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే అక్కడికి వచ్చేయకూడదూ? మా రాధకు కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మాతోనే కలిసి ఉండవచ్చు."
    "ఇప్పుడా? నా మనస్సు అసలే బాగాలేదు. నేను అనూరాధకు ఇచ్చే కంపెనీ మాత్రం ఏముంటుంది? రేపు కలవడానికి వస్తాను."
    "ఇంక నేను వెళ్ళాలి. ఊరికే ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు. మీ అమ్మగారి విషయం ఎప్పటికప్పుడు తెలిసేందుకు ఏర్పాటు చేస్తాను. సరేనా?" అన్నాడు ఆప్యాయంగా.
    కృతజ్ఞత నిండిన కళ్ళతో అతనివైపు చూచింది.
    మరునాడు లలిత అనూరాధను చూచేందుకు వెళ్ళింది. లలితను చూడగానే చివాలున కుర్చీలోంచి లేచి ఎదురువచ్చింది రాధ. లలిత రెండుచేతులు పట్టుకుంటూ "మీ అమ్మగారి కెలా ఉంది లలితా?" అని అడిగింది.
    "ప్రస్తుతం కొంచెం నయంగానే ఉంది. ఇంకా కొన్నాళ్ళు హాస్పిటల్ లో ఉండాలి."
    సుదీర్ఘమయిన నిట్టూర్పు విడిచింది లలిత. కొంతసేపు ఇద్దరిలోనూ ఎవరికి మాట్లాడేందుకు తోచలేదు. నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ మ్లానవదనంతో, కంపిత కంఠంతో, "మా ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, లలితా!" జలజలా నీళ్ళు రాలాయి కళ్ళవెంబడి రాధకు.
    "ఏమిటది? మనమధ్య కృతజ్ఞతలకు, క్షమాపణలకు తావులేదు. అలా జరగవలసి ఉంది. జరిగింది. నువ్వింక ఆ విషయాన్ని మరిచిపో. ఏది ఎలా జరిగినా ఫలితం చెడలేదు కదా! అదీ ముఖ్యం ఇప్పుడు." నిశ్శబ్దంగా నిట్టూర్చింది లలిత.
    "అనూ, ఈ గొడవ అంతా జరిగాక శ్రీనివాస్ నీకు కనిపించారా?" మౌనంగా తల ఊగించింది రాధ.
    తనంతట తనే చెబుతుందేమోనని వేచిఉంది. చివరికి నిశ్శబ్ధాన్ని భరించలేక "ఏమన్నారు, అనూ నిన్నేమీ అనలేదు కదా!" అని అడిగింది ఆందోళనగా.
    "ఎందుకనరు, లలితా? అనవలసినవన్నీ అవే వెళ్ళారు. ఇక మా ఇద్దరికీ ఎటువంటి సంబంధము ఉండబోదని ఆరోజు ఆవేశంలో అన్నారో, నిజంగానే అన్నారో నాకు తెలియదు. దీనికంతటికి కారణం నేను. నేనాయన్ని అడిగి ఉండక పోతే ఈరోజు తనింత మనః క్షోభకు గురికావలసిన అవసరమే ఉండేదికాదు. ఒంటరిగా ఎక్కడ ఉన్నారో, ఎంత బాధ అనుభవిస్తున్నారో!"
    "నిన్ను నువ్వు నిందించుకోకు, రాధా! నీతోపాటు మరోవ్యక్తికి కూడా భాగం ఉంది. అయినా ఇప్పుడేదో మించిపోయిందని ఎందుకనుకుంటావు? అతను మృదుహృదయుడు. ఆవేశం, ఆవేదన చల్లారగానే ఆయనే కోలుకుని నీదగ్గిరికి వస్తారేమో! ఎప్పుడూ శుభాన్నే కోరాలి, అనూ!" అంది ఆపేక్షగా.
    "లేదు, లలితా, నీకు తెలియదు. హృదయం ఎంత సున్నితమయినా, కఠినం కావడానికి ఎంతోకాలం పట్టదు. ఎంతో మెత్తటి ఒంటికే తగిలిన చోటే దెబ్బ తగులుతూ ఉంటే గట్టిపడిపోతుంది. ఇక హృదయమనగా ఎంత?"    
    "అలా మాట్లాడకు, అనూ. నాకు గట్టి నమ్మకం ఉంది. శ్రీనివాస్ లో ఎంతగా ద్వేషం నిండినా నిన్ను అతను అమితంగా ప్రేమించారు. ప్రేమిస్తారు. నీనుంచి దూరం అవడం అంత తేలికఅయిన పని అనుకోను."

                                                          31

    అనూరాధా శ్రీనివాస్ ల మధ్య ఏమయినా జరిగిందేమోనన్న విషయం బాధించసాగింది శేఖరంగారిని. తనకు తానై ఏమీ చెప్పని రాధను కదల్చాలను కోవడమే గాని, ఆమె కళ్ళలో నీళ్ళు కనిపించేటప్పటికి ఎక్కడి ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి. శ్రీలక్ష్మి అనూరాధలో మార్పు గమనించగలిగింది. ఈ సందర్భంలో ఏమనుకోవాలో ఆమెకే అర్ధం కాలేదు. తల్లిగా చనువుతో ప్రశ్నించ బోయినా మౌనమే ఎదురయింది.
    సాయంత్రం ఏమీ తోచక దొడ్లో మొక్కలమధ్య తిరుగుతూంది. అప్పుడే స్నానంచేసి, చొక్కా చేతులు మడుచుకుంటూ వరండాలో తిరుగుతున్న మోహనుకు కింద చెట్లమధ్య రాధ కనుపించింది, అశోకవృక్షం కింద సీతాదేవిలా! కిందికి వెళ్ళాడు. పెరట్లోకి వెళ్ళి అనూరాధను చూస్తూ ఉంటే అతనికి ఏదో సంచలనం కలిగింది. ఇల్లంతా సందడితో నింపే రాధ ఇప్పుడు తన ఉనికే తెలియకుండా తిరుగుతూంది. చిలిపితనం, చురకుదనం చిందులు వేసే కళ్ళల్లో నిర్లిప్తత, నిరాశ నివాసం ఏర్పరుచుకున్నాయి. ఆమెను వెనకనుంచి చూస్తూంటే ఆమె శరీరాకృతిలో ఏదో మార్పు వచ్చినట్లనిపించింది అతనికి. ఒక్కక్షణం కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. కాని అంతలో అదోవిధమయిన బాధతో నిట్టూర్పు విడిచాడు.
    "రాధా, ఏం చేస్తున్నావిక్కడ ఒంటరిగా?"
    త్రుళ్ళిపడి చటుక్కున వెనక్కి, తిరిగి "నువ్వా?" అంది. "ఏముంది చెయ్యడానికి. ఏం లేదు." నిర్లిప్తంగా సమాధానం చెప్పింది.
    "కొంచెం గాలిగా ఉంది. లోపలికి వెడదాం, పద."
    "......................"
    "సినిమాకు వెడదాం, వస్తావా? ఇంట్లో ఉంటే బొత్తిగా ఏమీ తోచకుండా ఉంది. అటు ఎటైనా కాస్సేపు తిరిగివద్దాం."
    "ప్చ్. ఇప్పుడెక్కడికీ రావాలని లేదన్నయ్యా."
    "రాధా, ఏమిటీ మౌనం? నాకు చెప్పకూడదా! పోనీ, ఇది చెప్పు. ఆ రాత్రి ఆ గొడవంతా జరిగాక ఇంటికి తిరిగి వచ్చాడు కదూ?"
    తల ఊగించింది.
    "ఏం జరిగింది?" ఆత్రంగా అడిగాడు.
    "ఏముంది జరగటానికి? మేమింక శాశ్వతంగా విడిపోవలసి వస్తుందని చెప్పి వెళ్ళారు."
    "రాధా!" ఉలిక్కిపడ్డాడు. "ఏమిటా మాటలు? అలా ఎప్పటికీ జరగనివ్వను. జరగకుండా చూసే బాధ్యత నాది."    
    జరిగేదేదో జరుగుతుందన్నట్లు, తను చెయ్యగలిగేదేదీ లేదన్నట్లు నిస్పృహగా నిట్టూర్చి కుర్చీలో జారగిలపడింది.
    "రాధా, నీ ఆరోగ్యం సరిగా లేదా?"
    "లేకేం? బాగానే ఉందే!"
    "అదికాదు నేనడిగేది. నువ్విక్కడికి వచ్చినరోజే గ్రహించాను. ఈ మనఃక్లేశం మూలంగాకాక ముందే చిక్కిపోయావు. అందుకు ఏదైనా కారణం ఉండవచ్చు కదా!"
    "ఉన్న కారణం లేదని ఎలా అనను? ఈ శుభవార్త ఇంట్లో అందరికి ఎంతో మంచి సమయంలో చెప్పి సంతోషపరచాలనుకున్నాను. సంతోషం సంగతి ఎలా ఉన్నా సరదాకూడా పోయింది!"    
    "అదేంమాట? ఈ వార్త మా కెప్పుడు సంతోషకరమయినదే! నాకు మరీ సంతోషంగా ఉంది. ఈ వార్త వింటే శ్రీనివాస్ తప్పక తిరిగి వస్తాడు" అన్నాడు ఆనందంగా.
    "అదే నా కిష్టం లేదు" అంది దృఢంగా. "ఒకవేళ నువ్వాయనను చూడటం సంభవిస్తే, నువ్విది చెప్పడంమాత్రం నాకు ఇష్టంలేదు. తిరిగి మేమిద్దరము కలిసి జీవించాలంటే ఆయన నామీద ఇష్టంతో, నాకోసం తిరిగి రావాలి. అంతేగాని ఒకరికోసం తను త్యాగం చేస్తూ, బాధపడుతూ కలిసిఉండటం మాత్రం నేను సహించలేను. ఆయన కెక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉండటమే నాకు కావలసినది." విషయం విస్పష్టం చేసింది.
    ఏమి చెప్పాలో తెలియని కృష్ణమోహన్ చెల్లెలి ఆత్మాభిమానం, అంతఃకరణ తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
    వారం, పదిరోజులు దాటినా శ్రీనివాస్ విషయం తెలియకపోవడంతో రాజశేఖరంగారు ఆందోళన చెందారు. ఇక ఏదో చేద్దామనుకుంటూంటే కృష్ణ మోహన్ కు కొన్ని విషయాలు తెలిశాయి. శ్రీనివాస్ ఆ ఊళ్లోనే ఉన్నట్లు అతని స్నేహితుడు రామకృష్ణద్వారా తెలిసింది. అతనున్న హోటల్ ఎడ్రసు తీసుకుని ఉత్తరం రాసింది అనూరాధ.
    "డియర్ శ్రీనివాస్,
    ఇన్ని రోజులవరకు మీ జాడకూడా తెలియకుండా చేశారు. ఆ అర్ధరాత్రి ఆవేశంలో మీ రన్నవన్ని మీ ఉద్దేశపూర్వకంగా అన్నవని నేననుకోవడం లేదు. దయచేసి మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీలో నిలిచిపోయిన అపార్ధాలను తొలగించేందుకు, సావకాశంగా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. రేపు బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటలకు మనింట్లో ఎదురు చూస్తూ ఉంటాను.
                                                                                                     మీ
                                                                                                    అనూరాధ"
    బుధవారం అనూరాధ వాళ్ళింటికి వెళ్ళి నిరీక్షించసాగింది, అతను వస్తాడో, రాడో అన్న అపనమ్మకపుడోలికలో ఊగుతూ. ఎందుకో వస్తాడన్న వైపు మనస్సు ఎక్కువ మొగ్గుతూంటే, మధ్యమధ్య రాడన్న అనుమానం నిరాశ కలిగిస్తూంది. ఎదురు చూడడమనేది మొదలుపెడితే అసలు కాలానికి చలనం ఉందా అనిపిస్తుంది. ఇంటి స్టడీ రూమ్ లో ఎన్నిసార్లు చూచినా నాలుగు ముల్లు దూరంగానే ఉందనిపిస్తూంది. ఒకసారి ఆ ఇంటి నలుపక్కలా చూస్తుంటే మధురమయిన అనుభూతులు కలగసాగాయి. తమ వైవాహికజీవితం మొదలు పెట్టిన ఆ ఇల్లంటే ఒక ప్రత్యేక అభిమానం కలిగింది. ఇద్దరిమధ్య చిలిపి పోట్లాటలు, వాదనలు, మధురక్షణాలు - వాటి పోకడలు ఆలోచించడం మొదలుపెడితే రకరకాలుగా మెదలసాగాయి. 'తన సర్వస్వం అంకితంచేసుకున్న శ్రీనివాస్ కి ఈనాడు తనంటే ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది? దానిని తను తొలగించగలదా? తిరిగి తను, శ్రీనివాస్ పూర్వంలాగా జీవించగలరా?' అన్న అనుమానం వచ్చేటప్పటికి గుండె జల్లుమంది.
    తలుపు దగ్గిర చప్పుడయ్యేసరికి తిరిగి చూసింది. అందమయిన బట్టలతో, చెదరని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండే శ్రీనివాస్ మారిపోయాడు. నలిగిన బట్టలతో, అలిసిన ముఖంతో, ఎరుపెక్కిన కళ్ళతో, చిరునవ్వుచిందే పెదిమలలో చిరాకు తొణుకుతూంది. విశాలమైన నుదురు విసుగుతో ముడతలు పడింది. చురుకుగా కనిపించే చిన్న కళ్ళలో ఆనాటి తీక్షణత తగ్గి, ఒక విధమయిన నిర్లక్ష్యం, కోపం, మొండితనం కనబడుతున్నాయి. కొద్దిగా నీరసించిన అతని ముఖం చూడగానే కళ్ళల్లో నీరు తిరిగింది రాధకు. అతని కళ్ళల్లోకి తను చూడలేననుకుంది చివాలున కళ్ళు దించుకుంది.
    మొట్టమొదటిసారిగా పదిహేనురజుల ఎడబాటులో పాలిపోయిన అనూరాధ ముఖం చూడగానే ఒక్కసారి చేరువకు తీసుకుని హృదయానికి హత్తుకోవాలనిపించింది శ్రీనివాస్ కు. వెంటనే రకరకాల ఆలోచనలు తరుముకు రాగా, కందిన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు.
    "కలుసుకోవాలనుకున్నావు. కారణం?"
    ఆ ఒక్క ప్రశ్న చాలు ఆమె ఆశల్ని కూలదోయడానికి. ఓ సంబోధన లేదు. ఆప్యాయత అంతకన్నా లేదు. మృదుత్వం మరుగునపడి మొండిగా వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనూరాధకు.
    "నన్ను కలుసుకునేందుకు కారణం, అవసరం మీకు లేదా?"
    "ఆ విషయం ఇంతకుముందే నీకు తెలుసు."
    "ఆవేశంలో అన్న మాటలు నేను పట్టించుకోలేదు. మీరు అది వదుల్చుకుని, శాంతంగా ఆలోచించిఉంటారనే..."
    "శాంతంగా ఆలోచించడం, నిర్ణయానికి రావడం అన్ని జరిగాయి."
    "మీరు చేస్తున్నది భావ్యంగా లేదు. అపోహలతో అపార్ధం చేసుకుంటున్నారు."
    "అపోహ...నాది అపోహే అయితే అత్యాశాపరులను నేనంతకంటే అర్ధం చేసుకోలేను. నన్ను నన్నుగా స్వీకరించలేనివారికి నా అవసరం అంతకన్నా లేదు."
    "మీ అవసరమే నాకు లేకపోతే ఈనాడు నాఅంతట నేను వచ్చి ప్రాధేయ పడేదాన్నే కాదు. కేవలం మీ అభివృద్దికి పాటుపడాలనుకున్న నా పొరపాటుతో ఇంత కఠినంగా మారడం న్యాయంకాదు."
    "నువ్వు చేసింది పొరపాటని ఎంత తేలికగా అనేస్తున్నావు! ఈనాడు నాలో అనుభవిస్తున్న ఈ మనఃక్షోభకు కారణం నువ్వు. నాలో లేని కోర్కెను రగిలించాలన్న ఆశేగాని, నా కోరిక ననుసరించేవారు, అర్ధంచేసుకునేవారు లేరు. నా తండ్రి, తల్లి-ఆఖరికి భార్య మూలంగా కూడా బాధే అనుభవించవలసి వచ్చింది. నన్ను ప్రేమించినవారికంటే, నాచేత ప్రయోజనం సాధించాలనుకున్నవాళ్ళు ఎక్కువ. ఒకరి కోరికల గొడుగులో బ్రతకవలసిన అవసరం నాకు లేదు. ఒకరి ప్రభావంతో నా జీవితం నడవాలనుకుంటే అది నేను సహించలేను. నీకు కావలిసింది నేను డాక్టరవడం. అందుకే వివాహం చేసుకున్నావు. ఆఖరికి నా ప్రశ్నకు నువ్వు చెప్పిన షరతు గుర్తుంచుకో."
    "ఆ రోజు ఏదో యథాలాపంగా మీచేత వప్పించడానికి నేనన్న మాటలు మీరు తీవ్రంగా తీసుకుంటున్నారు. ఇదంతా నిజం కాదని మీరే తెలుసుకుంటారు. దీనంతటికి నాది తప్పెలా అవుతుంది? మీతో స్నేహం మొదలైనప్పుడు, మీరు డాక్టరు అన్న విషయంకూడా నాకు తెలియదు. నాకు మెడిసిన్ అంటే ఎంతో అభిమానం ఉండి ఉంటే నేనే చదివిఉండేదాన్ని. కనీసం ఒక డాక్టర్ని వివాహం చేసుకుని ఉండేదాన్ని నేను ప్రేమించింది మిమ్మల్ని. పెళ్ళిచేసుకున్నది మిమ్మల్ని. నేను కోరిన వ్యక్తికి కల సమస్యలలో భాగం పంచుకుందామనితప్ప నా కింకో ఉద్దేశం లేదు."
    "ఇంక ఇన్ని మాటలు అనవసరం. సున్నితంగా ఉండవలసిన అనుబంధం మోటుతేరిపోయింది. నా మనసులో స్థిరపడ్డ నిర్ణయాలు ఒకరికోసం మార్చుకో దలుచుకోలేదు. ఈ పని ఇంతకు పూర్వమే చెయ్యనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు చేస్తున్న పనిని ఆమోదించి, చివరకు నిన్ను నిందించవలసి వచ్చినందుకు క్షమాపణకూడా కోరుకుంటున్నాను. విడిపోవాలనుకుంటున్న మనమధ్య ఇలా మాటలు పొడిగించుకోవడంవల్ల వచ్చే ప్రయోజనం ఎలాగూ లేదు. మన విడాకులకు అవసరమయిన చర్య త్వరలో తీసుకోబోతున్నాను."
    "విడాకులా?" అంది అదిరిపడి. ఆమెలో ఓర్పు, సహనం అన్ని దిగజారి పోయాయి. అసలే నీరసంగా ఉన్న అనూరాధకు అభిమానం, రోషం అశ్రురూపంలో బయటపడిపోయాయి. "విడాకులు....ఏ ఆధారంతో?" అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవాలని మునిపంటితో కింది పెదవి కొరుకుతూ.
    "నువ్వు లాయర్ వి. నీకు చెప్పవలసిన పని లేదనుకుంటాను."
    ఇంక అక్కడ ఉండటంలో ప్రయోజనం కనుపించలేదు. చివాలున లేచి గది బయటికి వచ్చేసింది. తెల్లని బుగ్గలమీద ముత్యాలు లా రాలుతున్న కన్నీటిని చూస్తూంటే, శ్రీనివాస్ హృదయం చలించిపోయింది. ప్రియాతి ప్రియములయిన తన అనూ కళ్ళమ్మట నీళ్ళు మొదటిసారిగా చూచిన శ్రీనివాస్ గుండెల్లో ఎవరో పిసికినట్లు బాధపడ్డాడు. అతని బాధ, నిరాశ కరుడుకట్టిన కోపంగా మారాయి. ఏదో నిర్ణయించుకుని బయటపడ్డాడు.

                                      *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS