శంకరం పంపిన అయిదు వందలు చూడగానే పెద్ద బరువు తీరినట్లు నిట్టూర్చింది చారుమతి. పూర్వం పరీక్షలకోసం, ముసలావిడ మందుల కోసము, చారుమతి పెళ్ళికి చేసిన అప్పులు ఇంకా కొన్ని మిగిలిపోయాయి. ఆ అప్పుల మీద వడ్డీ పెరుగుతూంది. ఎలా తీర్చడమా? ఇంట్లో ఏ వస్తువులు అమ్మడమా!' అని బెంగ పెట్టుకుంది చారుమతి.
తల్లితో చెప్పి శంకరం పంపిన డబ్బంతా తీసుకుని మూడిళ్ళ అవతల ఉన్న సూరమ్మ గారింటికి వెళ్ళింది. ఆవిడ వడ్డీకి డబ్బు ఇస్తుంది. బాకీ తీర్చగా చారుమతి చేతిలో మిగిలినవి ముఫ్ఫయి రూపాయలు. ఎంతో కష్టమనిపించింది. ఆ డబ్బు తీసుకువెళ్ళి తల్లి చేతిలో పోసి, "ఇదేనమ్మా మిగిలింది" అంది. డబ్బు చూసి నిట్టూర్చింది శాంతమ్మ.
శంకరం పంపిన డబ్బుతో ఎన్నో కొనవచ్చుననుకుంది శాంతమ్మ. అందరి కూతుళ్ళకి తలో చీర, రవిక అయినా అమరుతాయనుకుంది. ఇప్పుడు చూస్తే మూడు పదిరూపాయల నోట్లు మిగిలాయి. భగవతికి బట్టల పిచ్చి ఎక్కువ. తక్కినవాళ్ళెవరూ బట్టలకోసం అంత వాచిపోరు.
శాంతమ్మ తిరిగి చారుమతి చేతికి డబ్బు ఇస్తూ, "భగవతికి బట్టలు కొను" అంది.
మాలతి కూడా చిన్నదే. ఇద్దరికీ కొంటే బాగుండు ననుకుంది చారుమతి. భగవతి చీర కొనుక్కోగా మిగిలిన డబ్బుతో కొనవచ్చు ననుకుంది.
ఆ రోజు సాయంత్రమే భగవతిని తీసుకుని బట్టల కొట్లకి వెళ్ళింది చారుమతి.
"నాకు నల్ల జార్జెట్ చీర కొనుక్కోవాలని ఎన్నాళ్ళ నించో ఉందక్కా. ఇవాళ కొనుక్కుంటాను" అంది భగవతి దారిలో. 'సరే' అంది చారుమతి.
బజార్లో నాలుగైదు కొట్లు తిరిగాక నల్ల జార్జెట్ చీర దొరికింది. దానిమీదికి నల్ల లాన్ గుడ్డ జాకెట్టుకు తీసుకుంది భగవతి. రెండూ కలిపి ఇరవై ఎనిమిది రూపాయలు అయ్యాయి. 'ఇంకమాలతికి ఏమికొనను?' అనుకుంది చారుమతి. కాని చీర చూసుకుని తెగ ఆనంద పడిపోతున్న చిన్నచెల్లెలి ముఖం చూశాక మాలతికి చీర కొనలేదన్న విచారం తగ్గిపోయింది.
"ఆదివారం పిక్ నిక్ ప్రోగ్రాం ఉంది కదక్కా. ఆ రోజు కట్టుకుంటాను" అంది భగవతి హుషారుగా.
చారుమతికి, రామారావుగారికి వేసంగి సెలవులు ఇచ్చేశారు. ఆదివారం ఎక్కడికేనా పిక్ నిక్ కి వెళదామని గోపాల్ సూచన చేశాడు. అతని సూచన అందరికి నచ్చింది. ముఖ్యంగా రామారావుగారు, భగవతి చాలా మద్దతు ఇచ్చి ఉత్సాహం చూపించారు. ఎక్కడికి వెళ్లదా మని ఆలోచించారు.
"సర్ప వరం వెళదాం. అక్కడ మల్లెతోటలు, మామిడితోటలు చాలా బాగుంటాయి" అంది చారుమతి. "అవును, అక్కడ భావనారాయణస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చును" అంది శాంతమ్మ.
అందరూ ఆమోదించారు. ప్రొద్దున్నే తినడానికి ఏమైనా తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. తమతోపాటు శాంతమ్మ, గోపాల్ తల్లి శారదమ్మకూడా రావాలని చిన్నవాళ్ళంతా పట్టుపట్టారు. "మీ అందరితో మే మెందుకు?" అంటూ వెనకతీసినా, చివరకి చిన్నవాళ్ళ బలవంతానికి లొంగక తప్పిందికాదు పెద్ద వాళ్ళకి.
ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చేశారు శారదమ్మ, గోపాలూను. పెద్ద కారియర్ నిండా జంతికలు, చేగోడీలు చేసి తెచ్చింది శారదమ్మ. పులిహోర, దద్ధోజనం చేసింది శాంతమ్మ.
"అయ్యో, తీపి ఏమి లేదు" అన్నాడు బయలుదేరుతూ ఉండగా గోపాల్.
"కోటయ్య కొట్లో రెండు రూపాయలు పెట్టి కాజాలు కొనుక్కురావయ్యా" అన్నారు రామారావు గారు.
ఇంటికి తాళం వేసుకుని, కారియర్ లతో బయలు దేరుతున్న ఈ కుటుంబాన్ని వింతగా చూశారు ఇరుగు పొరుగు. మసీదు దగ్గిర సిటీ బస్సుకోసం అందరు నిలుచున్నారు. గోపాల్ దగ్గిరలోనే ఉన్న కోటయ్య మిఠాయి దుకాణానికి వెళ్ళి కాజాలు తెచ్చాడు. శంకరం పంపిన అయిదు వందలలో మిగిలిన రెండు రూపాయలు పెట్టి కొబ్బరికాయ, పళ్ళు, పువ్వులు, కర్పూరం, అగరవత్తులు కొంది చారుమతి.
సర్పవరం కాకినాడ దగ్గిరలోనే ఉంది. కాకినాడ నించి సిటీ బస్సులు వెళతాయి. బస్సులో ఎక్కి అరగంటలో సర్పవరంలో దిగారు అంతా. ఊరికి కొంత దూరంగా ఆగింది బస్సు.
మామిడితోటలు చూడగానే ఆనందమయింది అందరికి. మామిడి చెట్లన్నిటికి బరువుగా కాయలు వేళ్ళాడుతున్నాయి.
"ఈసారి మామిడికాపు బాగుంది" అన్నారు రామారావుగారు, కనుచూపుమేరంతా పచ్చని తోటలతో నిండిన ఆ ఊరు చూస్తూ. మామిడితోటలమధ్య ఇసుక బాటలో నడిచారు అందరూ. గుడికి చేరువవుతున్నకొద్ది పూలతోటలు ఎక్కువ అయ్యాయి. ఎక్కడ చూసినా మల్లె తోటలు, గులాబి తోటలు, పూలతోటల మధ్య కాయగూరల మడులూను.
"ఈ పూలు, కాయలు చూస్తూ ఎన్ని రోజులైనా గడిపేయవచ్చును" అంది చారుమతి.
గుడి చేరారు. అది చాలా పురాతనమైనది. శిథిలా వస్థలో ఉంది. గుడికి ఎదురుగా చెరువు ఉంది. చెరువు నిండా తెల్లని, ఎర్రని తామర పువ్వులు.
"దీన్ని వారదగుండం అంటారు" అంది శాంతమ్మ.
"బావా, నాకా ఎర్రతామరపువ్వులు తెచ్చి పెట్టవూ?" అంది భగవతి, గోపాల్ ని చూస్తూ. తనకి బావ వరస అవుతాడని తెలిశాక, "బావా" అనే పిలుస్తూంది అతన్ని భగవతి. శారదమ్మ కొడుకుని "బాబూ" అని పిలవడం వల్ల తక్కిన అందరూ "బాబూ" అనే పిలుస్తున్నారు గోపాల్ ని. మాలతిమాత్రం ఏమనీ పిలవదు. మాలతి కంటే గోపాల్ రెండేళ్ళు పెద్దవాడు.
గోపాల్ పాంటు కాళ్ళదగ్గిర పైకి మడిచి చెరువు ఒడ్డుకు వెళ్ళి కొన్ని ఎర్ర, తెల్ల తామరలు తెచ్చి భగవతికి ఇచ్చాడు. తెల్లటి భగవతి. నల్లటి జార్జెట్ చీరతో, చేతిలో తామర పువ్వులతో ఎంతో ముద్దుగా, అందంగా ఉంది.
చెరువులో కాళ్ళు కడుక్కుని గుడి లోపలికి వెళ్ళారు. గుడి అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే పూజారి వచ్చి దేముడి విగ్రహాలకి దీపం వెలిగిస్తున్నాడు.
"పూజ చేయిస్తారేమిటి?" అన్నాడు అతను వీళ్ళని చూస్తూనే.
"అష్టోత్తరం చేయండి" అంది శాంతమ్మ, పళ్ళు, పూలు ఆయనకి ఇస్తూ.
పూజారి మంత్రాలతో పూజచేసి, హారతి వెలిగించి, "ఈ స్వామిని భావనారాయణస్వామి అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమే" అన్నాడు.
అందరూ భక్తితో నమస్కరించి బయటికి వచ్చారు.
కాసేపు చెరువు పక్కనే ఉన్న గడ్డివాము దగ్గిర కూర్చుని, పన్నెండు గంటలకి తెచ్చుకున్న పులిహోర, దద్ధోజనం తిని తోటలు చూడటానికి బయలుదేరారు.
మల్లె తోటలలో మల్లెమొగ్గలు లెక్కలేనన్ని నక్షత్రాలలా ఉన్నాయి. ఒక తోటలో మాలికి డబ్బులు ఇచ్చి పైట చెంగు నిండా మల్లెలు పోయించుకుంది భగవతి.
మామిడితోటలలో మాత్రం కాయ ముట్టుకోనివ్వమన్నారు తోటమాలులు. రామారావుగారు ఒక తోట మాలిని అడిగారు, "ఇక్కడ నీడగా ఉంది. చెట్ల క్రింద కాసేపు కూర్చుని వెళ్ళిపోతాం" అని అతను ఒప్పు కున్నాడు.
