Previous Page Next Page 
అపరాజిత పేజి 26


    కించిత్తుగా స్పందించే ఆవిడ పెదవులూ, ఎర్రబడ్డ బుగ్గలూ, ఆవిడ పలుకుల్లో ధ్వనించే నిశ్చితత్వమూ, మెల్లమెల్లగా ఆకళింపుకుంటూ, ఆవిడ ఆంతర్యాన్ని అంచనా వేస్తూ ముగ్ధంగా ఉండిపోయారు సత్యవతమ్మగారు.

                               *    *    *

    శకుంతలకు రెండో ఏడు. అప్పుడే తండ్రి దగ్గరకు వచ్చి సంవత్సరం దాటింది. ఇల్లంతా కాంతినింపే ఆ పాప కళ్ళల్లో రాజారావుకు చిత్రంగా మాధవే కనిపించేది. 'శకుంతలను తీసుకుని ప్రయాణ మౌదామనుకుంటున్నాను' అని మాధవి ఉత్తరం రాశాక మళ్ళీ ఆమె రాజారావును చూడలేదు. మనవరాలిమీద మనసు పుట్టినప్పుడల్లా, పరమేశ్వరీ, శివశాస్త్రీ వచ్చి వెళ్తుండేవాళ్ళు. మధు ఎక్కడికో వెళ్ళి పోయాడనీ, మాధవి అతని ప్రసక్తి వస్తేనే మండిపడు తున్నదనీ, పెళ్ళి మాటలు తెచ్చినా కోపం తెచ్చుకుంటున్నదనీ అత్తగారు చెప్పినప్పుడు రాజారావు అర్ధం కానట్టుగా ఉండిపోయాడు. మాధవికీ మధుకూ మధ్య పెద్ద అఘాతం ఏర్పడ్డ తర్వాతనే మాధవి తన ఆశ్రయాన్ని కోరిందా? అనవసరమైన వేళలో దాన్ని అందించలేక తానే ఆమె అభిమానాన్ని గాయపరిచాడా? రెంటికీ చెడ్డ రేవడి విధంగా మనశ్శాంతి లేక అల్లాడుతున్న మాధవికి, ఆ స్థితి కావడానికి తనకూ భాగమున్నదనిపించింది. ఏ మొహం పెట్టుకుని మాధవిని చూడడం! ఎలా ఆమె మనస్సును శాంతింప జెయ్యడం? తన హృదయ కవాటం మాధవికోసం ఎప్పుడూ తెరిచే ఉంది. ఆ మూర్తి రాత్రీ పగలూ ఎప్పుడూ మరుపు రాకుండా తన మనస్సు లోపలి పొరల్లో భద్రంగా ముద్రింపబడే ఉంది. తాను శ్యామలను చేసుకున్నాడన్న మాటే గానీ ఆవిడను లాలించిన మధురక్షణాలలో నైనా ఆవిడలో మాధవి రూపాన్ని వెతుకుతూనే ఉండిపోయాడు. ఇప్పటికి కూడా రాజహంసలా రెక్కలు విప్పుతున్న శకుంతల ప్రతి కదలికలోనూ, మాధవిని పోల్చుకోడానికి అప్రయత్నంగా అతని గుండె ఉరకలు వేస్తోంది. తనంతట తను వస్తా నన్నప్పుడు పెద్ద త్యాగమూర్తిలా అడ్డ గించి, మళ్ళీ రమ్మంటే మాత్రం ఎలా వస్తుంది! పీఠం విడిచి వెళ్ళిపోయినదేవతను తిరిగి ఆ వాహన చేయడం అంతతేలిక కాదు కదా!
    ఒక్కొక్కక్షణాన రాజారావుకు పిచ్చెత్తి నట్లయ్యేది. తనకు బోలెడు సంపద ఉంది, నిమ్మకు నీరెత్తినట్లుగా జీవితం గడిచి పోతుందనే నమ్మకం ఉంది. కాని సుఖం లేదు. నడివయస్సులో ఉన్న తనకు పిల్ల నివ్వడానికి కన్యాదాతలు పోటీలు పడుతూనే ఉన్నారు. ఎవరిని చేసుకున్నా సుఖపెట్టలేడు. తాను సుఖపడలేడు. జీవితమంతా ఇట్లా భగ్న ప్రేమికుడిలా గడపాల్సి వస్తుందన్న ఊహ అతని నర నరాల్లో నిస్సత్తువను వూరించేది. కాని ఏం చేయగలడు తను? ఏం చేయడానికీ తన చేతుల్లో ఏమీ లేదని తనకు బాగా తెలుసు.
    'పోస్ట్' అన్న కేకతో తన ఊహల ప్రపంచంలోనుండి బయటికి వచ్చి ఉత్తరం అందుకున్నాడు రాజారావు. దాని మీది వ్రాత చూడగానే ఒక్కసారి వరాల్లోని రక్తమంతా ముఖానికి ఎగదట్టి హృదయ కంపనం హెచ్చినట్లయింది. అది మాధవి చేతి వ్రాత. ప్రేయసి చేతి వ్రాత, నోటి మాట, కొనగోటి తాకిడి అన్నీ హృదయస్పందనాన్ని ఎక్కువ చేయగలవే అని ఎవరో వ్రాసిన విషయం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు అవును. తను మాధవిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఫలించేదారి లేకపోయినా దానికి క్షతి లేదన్న విషయం తనకు తెలుసు. ఉత్తరం ఆత్రంగా విప్పి చదివాడు. శివశాస్త్రికి పక్షవాతం వచ్చిందనీ తనకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదనీ వ్రాసింది మాధవి. వెంటనే రెండు జతల బట్టలు సంచిలో కుక్కుకుని పిల్లనూ ఇంటినీ ముసలమ్మ కప్పజెప్పి బయలుదేరాడు రాజారావు.
    బండి దిగి యిల్లు చేరుకునేసరికి వల్లంతా ఆలగోడు బాలగోడుగా ఉంది. శివశాస్త్రి ఎడమభాగానికి పక్షవాతం వచ్చింది. ఆ భాగమంతా ఈచుకపోయి ఇట్లయి ముఖం వంకర తిరిగి చూడడానికి వికృతంగా ఉంది. నోట మాటలేదు. గాజువారిన కళ్ళతో అతను చూచే చూపుల్లో ప్రపంచంలోని బాధామయ గాథలన్నీ రెక్కలు విప్పుకుని చిందులు తొక్కుతున్నట్లున్నయ్. ఆ దృశ్యాన్ని చూచి రాజారావు చలించిపోయాడు. అనాయాస మరణం ఎటువంటి అదృష్టవంతులకో?
    మాధవి బావ గారిని పలకరించి కాళ్ళకు నీళ్ళు తెచ్చిచ్చింది. ఆ పలకరింపులో మమతల్ని వెతికే సమయం అది కాక పోయినా రాజారావు హృదయం వాటిని అన్వేషించకుండా ఉండలేక పోయింది. మాధవి కొంత చిక్కింది. కళ్ళచుట్టూ ఏర్పడ్డ తేలికైన నల్లచారలు ఆవిడ సౌందర్యాన్ని హరించ లేకపోయినా ఆవిడ పడుతున్న అలసటను చాటుతున్నయ్. మానసికంగా, శారీరకంగా మాధవికి విశ్రాంతి లేదు. పెదనాన్న అసమర్ధుడుగా, పిల్లల సంపాదనమీద ఆధారపడిన స్వార్ధ పరుడుగా, పనికిమాలిన సోమరిపోతుగా అన్నాళ్ళూ ఆవిడ మనస్సులో మంచి స్థానాన్ని  సంపాదించుకోలేకపోయాడు. ఇక యిప్పుడు, మృత్యు ముఖంలో ఉండి కాళ్ళూ చేతులూ స్వాదీనం తప్పి దెబ్బతిన్న లేడిపిల్లలా చూపులు సారించే ఈ పెదనాన్నను మాధవి అసహ్యించుకోలేక పోయింది. ఉత్త పసి పాపను తల్లి లాలించినట్లు, వీలైనంత వరకూ తానే రోగిని కనిపెట్టుకుని ఉండేది. విశ్రాంతి తీసుకోమ్మా అని పరమేశ్వరి వారించినా మాధవి వినలేదు. శివశాస్త్రి ఏమాలోచిస్తుండేవాడో చెప్పుకోలేడు. అన్ని వేళలా గాజువారిన చూపులే సారించే అతని కళ్ళు భావప్రకటన చెయ్యలేవు. మాధవి తన దగ్గర చేరి తనకు మందు పడ్తున్నప్పుడు, ఆహారం ఇస్తున్నప్పుడు, పక్క మారుస్తున్నప్పుడు అతని చెంపల వెంట అవిరళంగా కన్నీరు జారేది. అది అతను పడ్తున్న బాధలవల్ల కాదు. ఈ సేవామూర్తికి తాను చేసిన అన్యాయం అతనిలో పశ్చాత్తాపాన్ని నింపి అలా బహిర్గతమౌతున్నదని మాధవికి తెలియదు.
    నిరాసక్తంగా యంత్రవతుగా పని చేసుకుపోయె మాధవి రాజారావు హృదయాన్ని కదిల్చివేసింది. శీతాధిక్యం వల్ల గడ్డకట్టుకుపోయిన మనిషిలో చేష్టలుడిగి పోయినట్లు మాధవిలో చైతన్యం స్పందించడం లేదు. రాతిబొమ్మలా ఉన్న ఈ పడతి తిరిగి ఎప్పుడు మనుషుల్లో పడుతుంది? నూరేళ్ళ జీవితాన్ని యిలా శిలలా ఈవిడ గడపడానికి వీల్లేదు. అని పదే పదే అనుకున్నాడు రాజారావు. ఆ వేళ మధ్యాహ్నం పరిసరాలు సద్దుమణిగాక, వంటింట్లో పెదనాన్నకోసం బత్తాయిరసం తీస్తున్న మాధవిని నిశ్చలమైన మనస్సుతో సమీపించాడు.
    'రాధ రాలేదేం మాధవీ?' - వెనక పాటుగా వచ్చిన ప్రశ్నకు చిన్నగా ఉలిక్కిపడి అటు తిరిగింది మాధవి. రాజారావు కళ్ళు తన కళ్ళల్లోకి చూస్తున్నాయి ఆ కళ్ళల్లో ఉన్న ఆరాధనా భావానికి ఏ మార్పూలేదు. వెనకటి బావ మారనేలేదు. బేలతనంతో తొందరపడి తన్ను తాను బావ కర్పించుకుందామనుకున్నా తన మనస్సు రాపిడిని ఊహించి గొప్ప త్యాగం చేశాడు అతని అణువణువూ తన్ను కోరుతున్నా, ఏ మాత్రమూ స్వార్ధాన్ని పెచ్చురేగనీయలేదు. ఆ ఊహతో మాధవి కళ్ళల్లో బావ మీది గౌరవం పూర్తిగా నిండి మనస్సు ఆర్ద్రత వహించింది. ఈ బావ దగ్గర తనకు అరమరికలు లేవు. ఆప్తుడై , రెండు చేతులూ చాచి సమన్వయించి ఆదిరించే ఉదారమూర్తిగా తన మనస్సులో మెలుగుతున్నాడు. ఇతనికంటే తనకు దగ్గరి వారెవరు?
    'లేదు బావా! రాధ ఉద్యోగస్థురాలైందన్న సంగతి నీకు తెలుసుగా? ఎవరికీ ఆఖరికి పెద్దమ్మకు కూడా తెలీని రాధ విషయాలు కొన్ని నీకు చెప్పాలి. మెల్లిగా తర్వాత చెప్తాను. అప్పుడు కాని, రాధ ఎందుకిక్కడికి రాలేదో నీకు తెలియదు. ప్రస్తుతానికి అది స్కూలు పిల్లలతో ఎక్స్ కర్షన్ కు వెళ్ళినందువల్ల పెదనాన్న ఆరోగ్య విషయం అందకరాలేదని మాత్రమే పెద్దమ్మకు తెలుసు. ఆవిడ నింతకంటే నొక్కించి అడగకు.'
    'మధు విషయమే మన్నా తెలిసిందా?'
    'లేదు తెలియనక్కర్లేదు కూడా అవతల పెదనాన్నకు రసం వేళై పోతుంది. నన్ను పోనీ!'
    'ఒక్కక్షణం ఆగు. నన్నలా తప్పించుకు తిరక్కు మధూ! అది నేను భరించలేను. నీ మనస్సు విప్పి చెప్పుకోడానిక్కూడా నీకు ఆప్తులెవరూ లేరని నాకు తెలుసు. మనిషి మనసులో పడే రంపపుకోతను పంచుకో డానికి మరెవరన్నా ఉండాలి. అప్పుడే గాయాలు నెత్తురు లెగజిమ్ముతున్నాప్రాణాలు పోకుండా నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. నిజం చెప్పు మాధవీ! నువ్వు మధుతో సంధి ప్రయత్నాలు చెయ్యనే లేదా?'
    ఈ మాటలతో మాధవి చలించి పోయింది. కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని, తడిసి బరువైన రెప్పలెత్తి, అయోమయంగా రాజారావు వంక చూచింది. తనకు జీవితంతోనే సంధి కుదరలేదు. ఎప్పుడు ఏవైపు చూచినా ఎదురు దెబ్బలు లభించడమే అలవాటై పోయింది. ఈ విషయం బావకు ఎలా చెప్పడం? జీవితంలో ఘోరపరాజయాన్ని పొంది తను అలసిపోయింది - ఆ తలపు మాధవిలో ఇన్నాళ్ళుగా పేరుకున్న దుఃఖాన్ని గోప్యంగా ఉండనివ్వలేదు. వోదార్చేవారిని చూస్తే ఉరకలూ పరుగులూ తీస్తూ దుఃఖం వెలికిరావడమూ సహజమే కదా!
    తన ప్రశ్నకు సమాధానం లేకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధవి నెలా ఊరడించాలో రాజారావుకు తెలియలేదు. తమ ఇద్దరి స్థితీ యించుమించు ఒకటే. కాని యిద్దరూ కాలప్రవాహంలో ఒకరు కొకరు దూరదూరంగా విసిరివేయ బడుతున్నారే తప్ప ఒకటి కాలేకపోతున్నారు.
    'ఊరుకో మధూ! నీ మనస్సులో దుఃఖాన్ని చేత్తో తీసేయగలిగితే ఎంత బాగుండును? నీ జీవితానికి నేనేమీ చెయ్యలేకపోయను. పైపెచ్చు తెలిసో తెలియకో నీవీస్థితిలో ఉండడానికి నేనూ కొంత కారణమన్నది నామనస్సు నెప్పుడూ మండిస్తూంటుంది. ప్రేమించిన వారి కోసం లోకం త్యాగాలు చెయ్యడం విధిగా నేర్చుకుంటుంది. కాని ప్రేమించినవ్యక్తి జీవితం పాషాణంగా మారిపోవడానికి నేను కారణమయ్యాను. నన్ను క్షమించగలవా మాధవీ!'
    మాధవి ఆ మాట వింటూనే చప్పున తేరుకుంది. 'అంతమాటనకు బావా! ఇందులో నీవు చేసిందేమీ లేదు. ఒక చపల చిత్తుడికీ సహనం లేని వాడికీ నా మనస్సునీ ప్రాణాన్నీ మీదు కట్టుకున్న తొందరపాటుతనం నన్నిలా శిక్షిస్తోంది. మధు చదువుకున్న వాడూ సంస్కారమున్నవాడూ అవునుగాని, గుండె బలం లేనివాడు పరిస్థితులు విషసర్పాల్లా బుసలు కొడ్తూ మీదికి ఎగబాకుతున్నపుడు వాటికందకుండా పారిపోగలిగాడే కాని, వాటిని ఒడుపుగా అదుపులోకి తెచ్చుకునే వివేకం చూపించలేకపోయాడు. ఈ వివేక రాహిత్యం నన్నూ రాధనూ ఇద్దరినీ మాడ్చి మసి చేస్తోంది.'
    'రాధనా?' అన్నాడు రాజారావు.    
    "అవును బావా, రాధనే! నాకంటే ఎక్కువ అన్యాయమే జరిగింది రాధకు. కాని అది నిబ్బరమైనపిల్ల. ఒకసారి నువ్వు వ్రాశావు జ్ఞాపకముందా? 'జీవితంలో ఎటువంటి ఒడుదుడుకులైనా ఎదుర్కొనే స్థైర్యం కలది రాధ' అని- అది అక్షరాలా నిజం అటువంటి వాళ్ళు మొదట మొదట ఎన్ని కష్టాలు పడ్డా చివరికి తాము కోరుకున్నది. పొందుతారు. అలా పొందే ప్రయత్నంలోనే తమ శక్తి యుక్తుల్ని ఉపయోగిస్తారు. అందుకు తన మన అనే మొహమాటం కాని నిస్వార్ధ చింతన కానీ అడ్డురావు.
    "ఏం జరిగింది మాధవి? రాధ కేమయింది? ఇందాక నువ్వేదో చెప్పాలన్న దానికిది ఉపోద్ఘాతమేనా?'
    'అవును వివరంగా చెప్పడానికిది అదునూకాదు, స్థలమూ కాదు సాయంత్రం మనం పార్కులో కలుసుకుందాం బావా నీ దగ్గర నేను దాచ దల్చుకున్నది ఏమీ లేదు, నీకంటే ఆప్తుడు నాకెవరూ లేరు' దృఢంగా అని గ్లాసులో బత్తాయిరసం పోసుకుని, చకచకా శివశాస్త్రి గదివైపు కదిలిపోతుండగా, అలాగే చూస్తూ ఉండిపోయాడు రాజారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS