Previous Page Next Page 
అపరాజిత పేజి 25

 

                                    17

    రాధకు మొత్తం హైదరాబాదంతా గాలించినా అనువైన యిల్లు దొరకలేదు. తను సంపాదించబోయే రెండు వందల రూపాయల్నీ తన గర్భంలో పెరుగుతున్న ప్రాణినీ దృష్టిలో ఉంచుకుని ఎక్కువ అద్దెలు కోరే ఇళ్ళవైపు చూడడానికైనా సాహసించ లేకపోయింది. ముందూ వెనకా కాస్త మెల్లా ఉన్న మధ్యరకం యజమానులు ఇళ్ళకున్న ప్రాముఖ్యం బాగా గుర్తించారు. తామంతకుముందు కోళ్ళను పెంచడానికో, గేదెలను కట్టేసుకోడానికో వేసుకున్న రేకుల షెడ్లనే ముందు వరసలో దర్వాజాలూ కిటికీలూ బిగించి, మనుషులు నివసించే స్థలాలుగా మార్చి పారేశారు. అవే ఒక్కొక్క వాటా యాభై రూపాయల పైనే పలికేవి. యజమానికి ఏ మాత్రమూ కష్టంలేని నికరమైన రాబడి అది. సత్యవతమ్మ గారున్న వీధిలోనే వో చిన్న యిల్లు ఖాళీ అయ్యేదాకా రాధ వాళ్ళ యింట్లోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సన్నిహిత ప్రవర్తనవల్ల సత్యవతమ్మగారికి రాధ చదివిన పుస్తకంలా క్షుణ్ణంగా అర్ధమై పోయింది. జీవితం పట్ల రాధకున్న అభిప్రాయం ఆవిణ్ణి ముగ్ధురాల్ని చేసింది. ఎన్ని కష్టాల నెదుర్కోవలసి వచ్చినా, ఎంత సంఘ ప్రతికూలత ఉన్నా ఈ అమ్మాయి చలించదు. తాను నమ్మి కోరుకున్న దారిన వెళ్ళిపోవడానికి ఈ విడకు ఎటువంటి భయసంకోచాలూ లేవు. పదిమంది ఎదురు నిల్చి యుద్ధానికి సిద్ధమైనా భయపడే రకం కాదు రాధ. వాళ్ళను చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తుంది. ఆఖరు క్షణం దాకా విజయ కాంక్షను జారిపోనీయ కుండా కొత్త శక్తిని పుంజుకుంటూ దెబ్బకొడ్తూనే ఉండగలదు. ఈ పిల్ల నిజంగా 'అపరాజిత' అనుకున్నదామె.
    రాధ టీచరుగా తన జీవితాన్ని దిగ్విజయంగా నడపగలిగింది. పిల్లలకు ఉత్సాహాన్నీ ధైర్యాన్నీ అందిస్తూ, వాళ్ళ దగ్గర నుండి అభిమానాన్నీ గౌరవాన్నీ అందుకోగలిగింది. క్లాసుకు వెళ్ళిన మొదటిసారి సన్నని చలిలాంటిది జివ్వున నరాల్లో ఎగబ్రాకినట్లయింది. క్లాసు రూము నిండా దాదాపు నలభై మంది విద్యార్ధినులు. వాళ్ళల్లో పిల్లల తల్లులున్నారు. అందరి ముఖాల మీదా దిగులు తెర దించినట్లుగా ఉండడం రాధ గురించింది. ఏం చెయ్యాలి? వీళ్ళకోసం తనేం చెయ్యగలదు? మనస్సంతా కలవరం నిండి కొన్ని క్షణాల పాటు మూగగా ఉండిపోయింది.
    'మాకు లెక్కల్లో టైమ్ అండ్ వర్క్ దాకా పోర్షనయిందండీ!' అన్నదో అమ్మాయి టెక్స్ ట్ బుక్ అందిస్తూ.
    రాధ అందుకుంది. ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్ళుండవచ్చు. అందమైనదే. కళ్ళల్లో సోగతనంతో పాటు గడుసుదనం కూడా ఉంది.
    'నీ పేరేమిటి?' అడిగింది రాధ.
    'రాజరాజేశ్వరండీ.'
    రాధ అందరి పేర్లూ అడిగి రిజిష్టర్ లో అటెండెన్స్ వేసింది. వీళ్ళ చరిత్ర లేమిటో? ఎందుకు వీళ్ళంతా ఉన్న ఊరునూ కన్నతల్లినీ వదిలిపెట్టుకుని యిలా శరణాలయాల పాలయ్యారో! ఒక్కొక్క వ్యక్తికి గతంలో ఒక చిత్రమైన కథ ఉంటుంది కాబోలు. సంఘంలో తోటి మనుషుల అభిమానాన్ని కాకుండా అభిశాసాన్ని అందుకునే కథ! ఇప్పుడీ జీవితాలకు శరణాలయ నివాసమొక మలుపు. ఇక తర్వాత ఆ జీవితాల్లో ఎన్ని సుఖాంతాలో, మరిన్ని విషాదాంతాలో! రాధలోని రచయిత్రి ఇటువంటి ఆలోచన లతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది.

                                    


    తన్ను తాను సమాళించుకుని, ...... మొదలుబెట్టింది. పిల్లల్లో చాలామంది చురుగ్గానే ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద వాళ్ళు కల్పించే ఎటువంటి భరోసాలూ అందని యీ అభాగినులకు తను ముందు జీవితం మీద స్థిరదృష్టి ఏర్పడక తప్పదు. చదువుకోవాలనీ, ఏదో ఒక వృత్తిని ఆధారంగా చేసుకుని నలుగుర్లో మళ్ళీ తల యెత్తుకుని గౌరవంగా బ్రతకాలనీ, దృఢమైన అభిప్రాయం వాళ్ళ నరాల్లో జాగరితంగా ఉంది. ఈ చైతన్యం రాధను బాగా కదిల్చింది. మరీ జడ ప్రాయంగా చావుకూ బ్రతుకుకూ మధ్య తేడాలు తెలీని నికృష్టపు దశలో మగ్గిపోకుండా, వీళ్ళనీ విధంగా ఉద్దరించ గలుగుతున్న శరణాలయాన్ని మనసారా అభినందించింది. ఈ చైతన్యం కొడిగట్టి ఆరిపోకుండా ఎగసన త్రోసి వెలిగించే పుల్లలాగా తాను ఉపయోగపడగలిగినందుకు చాలా సంతోషించింది.    
    ఇంతలో హాస్టలు ఆయా వచ్చి, 'అమ్మ గారూ, కాస్త రాజేశ్వరమ్మను పంపించండి. అవతల పిల్ల గుక్కపట్టి, ఏడుస్తాఉంది. ప్రాణం కడంటి పొద్దేమో' అన్నది వినయంగా. ఆ మాట రాధ కింకా సరిగా అర్ధం కాకముందే తన సీట్లోనుంచి స్ప్రింగులా లేచి నిలబడింది రాజేశ్వరి. 'వెళ్ళొస్తాను టీచర్' అని రాధ సమాధానానికి ఎదురు చూడకుండానే రెండంగలో క్లాసురూము దాటి కనుమరుగైపోయింది. విస్మయంగా చూస్తున్న రాధను సమాధానపరుస్తున్నట్లు గా, ఆయా-
    'ఆయమ్మ నీళ్ళాడి యింకా మూడు నెల్లేనా కాలేదండమ్మా. చెంపకు చేరడేసి కళ్ళు తెరుచుకుని దీపంలా ఉంటుంది పిల్ల. ముదనష్ట పోడు, వాళ్ళ ఊర్లో...'
    'సరేలే - ఇప్పుడవన్నీ ఎందుకు' అని మధ్యలోనే తుంచేసింది రాధ.
    తర తరాలుగా ఎప్పుడూ స్త్రీలకు సంబంధించిన జాలి గాధ లిలానే కదా ఉండేది! లోకానికి వాళ్ళ మీద జాలికంటే, వాళ్ళ దురదృష్ట గాధల్ని వినాలనీ చెప్పాలనీ ఎక్కువ కోరిక.
    టైమయిపోయింది. గంట గణ గణ లాడాక, రాధ క్లాసు రూమునుండి ఇవతలికి వస్తుంటే రాజేశ్వరి చక చకా నడుస్తూ ఎదురుపడ్డది. ఎదుటి మనిషికి ఏనుగంత బలన్నిచ్చే చిరునవ్వును ఆ పిల్ల మీదికి విసిరి రాధ ఎదురుగా ఉన్న సత్యవతమ్మ గారి ఆఫీసులో అడుగుపెట్టింది.
    'రామ్మా! క్లాసయిందా!' అని ప్రశ్నించారావిడ.
    'అయిందండీ!'
    'ఎలా ఉంది నీ ఉద్యోగం? నీకు నచ్చిందా?'
    'ఒక విధంగా మనస్సుకు చాలా తృప్తిగా ఉంది. లోకం దృష్టిలో నేనూ వీళ్ళ జాబితాలోకి చేరవలసిందాన్నే అయినా, నాకున్న ధైర్యం వల్ల ననండి, లభించిన అవకాశంవల్ల ననండి, వీళ్ళకు చేతనైన సేవ చేయ కలుగుతున్నానని గర్వంగా కూడా ఉంది.
    'సంతోషం రాధా! ఇక్కడున్న దాదాపు నూరుమంది స్త్రీల జీవితాల్లోనూ, శాపంలాంటి ఒకేఒక సంఘటన నూరు విధాలుగా వేషం కట్టి కనిపిస్తుంది. సన్నివేశాలు సంఘటనలూ ఎటువంటివైనా పర్యవసానం ఒకటే. కాని యీ అభాగినుల మనసులూ మమకారాలూ ఎంత చిత్రంగా ఉంటాయనుకున్నావు రాధా!'
    "చూస్తున్నానండీ! ఇందాక క్లాసులో పాఠం జరుగుతుండగానే, పిల్లేడుస్తున్న దన్న కబురు విని చెంగున వెళ్ళిపోయిందొకావిడ!'
    'ఎవరు, రాజేశ్వరేనా!' అడిగారావిడ!
    'అవును అమ్మాయి పేరు రాజేశ్వరే!'
    'అమ్మాయి అయిదుగురు సంతానంలో పెద్దపిల్ల. తండ్రి చెడతాగి ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకుని కళ్ళుమూస్తే, తల్లే అష్టకష్టాలూ పడి వీళ్ళను పాకింది. వయసొచ్చిన యీ పిల్లనో ఉద్యోగస్తుడి ఇంట్లో పనికి పెట్టిందట. అతగాడు నలుగురు బిడ్డల తండ్రి. బీరపువ్వులా ఒంటినిండా నగలు దిగేసుకుని తిరిగే పెళ్ళానికి భయపడే ప్రాణి. కాని ఆవిడ కన్నుగప్పి యీ పిల్లను లొంగ దీసుకున్నాడు. జరగవలసిందేదో జరిగాక దొంగకు తేలుకుట్టిన రకంగా గప్ చిప్ గా ఊరుకున్నాడు. తల్లేం చేస్తుంది? పిల్లని చేతనైనంత హింసించి, ఆపైన మందో మాకో తెచ్చివ్వబోయింది. వాళ్ళ యింటి పక్కనుండే గ్రామసేవిక ఈ సంగతి కనిపెట్టి, శరణాలయానికి పంపించే ఏర్పాటు చేసింది. రాజేశ్వరి వచ్చిన కొత్తలో మొండిగా ప్రవర్తించేది. తనలోపల పెరుగుతున్నజీవి తన గర్భ శత్రువా అన్నట్లుండేది. 'ఆ ముదనష్టపు మొహం నేను చూడను సుమండీ! నాకు చూపించకుండా ఎవరికిస్తారో ఇచ్చేయండి' అనేది. కటిక ఉపవాసాలు చేసి, తినరాని వన్నీతినీ, గర్భం పోగొట్టుకోవాలని నానారకాలుగా తాపత్రయపడేది. ఆ పిల్లను పట్టుకోవడం మరీ కష్టమైపోయేది మాకు. హాస్టల్ పిల్లల్లో ఎవరో ఒకరు ఇరవై నాలుగ్గంటలూ ఆవిణ్ణి కనిపెట్టుకుని ఉండేవాళ్ళు.'
    రాధ విస్మయంగా వినసాగింది. పిల్ల అక్కర్లేదన్న మనిషేనా, దాని ఏడు పైనా సహించలేక చెంగున లేడిపిల్లలా దూకి పరుగులు తీసింది!
    'పిల్ల పుట్టాక మంత్రసాని చూపించబోతే మొహం అవతలకు తిప్పుకుంది. కాని తర్వాత ఎట్లా వచ్చిందో ఆ ప్రేమ. అది క్షణం కళ్ళముందు లేకపోతే విలవిల లాడే స్థితికి వచ్చింది. ఈ మధ్య ఎవరో పెంపకానికో ఆడపిల్ల కావాలని వచ్చి అడిగారు- పిల్లనిచ్చేద్దామన్నాను. భవిష్యత్తును గురించి వివరంగా చెప్పాను. 'పిల్లతోసహా నిన్ను ఆ ఉద్యోగస్థుడు స్వీకరించే అవకాశాలు లేవు. నీకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తాను. నీ జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతుందని చిలక్కు చెప్పినట్లు చెప్పి చూచాను. అప్పుడు రాజేశ్వరి ఏమందో తెలుసా! రాధా 'ఇంక నాకు పెళ్ళక్కరలేదండీ!- నా రక్తం పంచుకు పుట్టిన ఈ నలుసు కోసం నేనేమయినా చేస్తాను. ఎన్ని కష్టాలయినా పడతాను. దీన్ని పెద్దదాన్ని చెయ్యడమే నా ధర్మం. అందుకు అన్ని అర్హతలూ కలిగేట్లు నన్ను తీర్చిదిద్దండి చాలు.' అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది- ఇప్పుడీ చదువులో ఆ పిల్లదే ఫస్టు మార్కులని వింటున్నాను. తన జీవిత గమ్యాన్ని ఎటువంటి పరచయమూ లేకుండా చేరుకుంటుందనే నా విశ్వాసం-'
    రాధ మనస్సులో సుళ్ళు తిరుగుతున్న తలపులతోపాటు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.
    'జీవితంలో ఇంకా పూర్తిగా అడుగైనా పెట్టకముందే సంఘంచేత చావుదెబ్బలు తింటున్న స్త్రీలందరూ ఇట్లా ధైర్యంగా తను భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నిస్తే, ఇక అంతకంటే కావలసిందే ముంటుందండీ! ఒక్క స్త్రీ జీవితం కూడా సమయానికి సహాయం అందించే చెయ్యి దొరకక నిరాశతో అంతం కాకూడదు. తాను తెలిసీ తెలియని దశలో వేసిన తప్పటడుగువల్ల తన నూరేళ్ళ జీవితమూ వ్యర్ధమే నన్న నిస్పృహ ఏ స్త్రీకి కలగకూడదు. ఇటువంటి మహా కార్యనిర్వహణంలో చాలా పెద్ద పాత్ర వహిస్తున్న మిమ్మల్నీ మీ శరణాలయాన్నీ మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను' అన్నది రాధ ఆవేశంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS