18
ఆ వేళ సాయంత్రంకూడా సరిగ్గా ఏడాది కిందట మాధవీ రాజారావూ పార్కులో కలుసుకున్న సాయంత్రంలాగే వాన జల్లుగా కురుస్తోంది. చితచితలాడే ఆ నానుడు వర్షంలోనే వాళ్ళిద్దరూ పార్కులోకి చేరుకున్నారు. వెళ్ళేటప్పుడు, 'నేనూ బావా, అలా పార్కుకేసి వెళ్తున్నాం పెద్దమ్మా' అని కేకేసి బయలుదేరింది మాధవి. చిటపట వర్షం కురుస్తున్నవేళ ఈ విహారమేమిటో అర్ధంకాక అలాగే చూస్తూ ఉండిపోయింది పరమేశ్వరి.
మంచుదువ్వలా, నుసినుసిలా రాలుతున్న, నీటి తుంపరల్ని లెక్కచెయ్యకుండా ఇద్దరూ మాలతీలత కిందుగా అమర్చిన బెంచీమీదికి చేరుకున్నారు. మాధవి మనస్సు అన్యాసక్తంగా ఉంది. సరిగ్గా సంవత్సరం కిందట ఇలా బావతో పార్కుకి వెళ్ళి జోరున కురిసే వర్షంలో ఇంటికి తిరిగి వచ్చాకనే మధు తనమీద కోపగించుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుండి యింతవరకూ మళ్ళీ ఆ దుర్భల ప్రేమికున్ని చూడనే లేదు తను. ఈ మధ్యలో ఎన్నెన్ని జరిగాయి! తమ జీవితాలు ఎన్ని చిక్కుముడుల్లో బిగుసుకు పోయి గిలగిల్లాడుతూ ఎక్కడి వక్కడే ఆగిపోయాయి! ఇక మధును చూచే అర్హత తన కెక్కడుంది? ఆ కృతఘ్నున్ని చూడను, చూడనని పదేపదే అనుకుంటూ నిరాసక్తంగా, ఎట్టఎదుట బహు నాజూకుగా జారుతున్న చినుకుదారాలను చూడసాగింది మాధవి.
'మాధవీ! మధును గురించే ఆలోచిస్తున్నావనుకుంటాను. అలా అంతదీనంగా ప్రకృతిలో లీనమైపోతున్నట్లు చూడకు మరి! నీవు మనుషుల్లోకి దిగిరావాలి. నీవూ ఒక యింటి దానవై పిల్లా పాపతో సుఖంగా ఉండగా చూడాలని నీబావ హృదయం ఆరాటపడుతోంది. మధు ఎక్కడున్నా వెతికి తీసుకువచ్చే బాధ్యత నేను వహిస్తాను. సరా!' అన్నాడు రాజారావు.
'నిష్ఫలం బావా! మధుకూ మాధవికీ ఇకమీద ఎటువంటి సంబంధమూ ఉండబోదని నీకు స్పష్టంగా చెప్తున్నాను.'
'ఏమీ! అతకడానికి వీలులేనంతగా భగ్నమైపోయిందా మీ ప్రేమ?'
'ప్రేమ! - ఆ పదానికి ఈ క్షణం వరకూ సరైన అర్ధాన్ని ఇచ్చుకోలేక పోతున్నాను. మధును నిజంగా నేను ప్రేమించానా? అతనిపట్ల నాకున్న భావానికే ప్రేమ అని పేరా? అయితే ఒకప్పుడు అతన్నీ, అతనిమీద పెంచుకున్న ప్రేమనీ పూర్తిగా విస్మరించి నీ దగ్గరికి వచ్చే యాలని ఎందుకనుకున్నాను? అది ఇతరుల దృష్టిలో మానసికంగా వ్యభిచరించినట్లే కదా! ఆ క్షణాన నువ్వే నన్ను స్వీకరించి ఉంటే నిన్ను అన్యాయం చేసే చపలత్వం నాలో ఉండేదా? ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలు'
ఈ మాటలతో రాజారావు బాగా కదిలి పోయాడు. జీవితంలో తాను ఎప్పుడూ వినే అవకాశంలేని మాటల్ని, వింటున్న అనుభూతి అతన్ని నిలవనీయలేదు.
'ఎంతపని జరిగిపోయింది మాధవీ! నిండు మనస్సుతోనే నువ్వు నా ఆశ్రయం కోరావా! నేనే యింటి ముంగిట నిలచిన స్వర్గ సుఖాన్ని కాలదన్నుకుని నిర్భాగ్యున్నై రోదిస్తున్నానా? ఆ సంగతి నేనిప్పుడే గ్రహిస్తున్నాను. నాకు మరొక అవకాశం ఇవ్వు మాధవీ! ఒక అవకాశం! నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. నీ ఉనికివల్ల నూరేళ్ళ నా జీవితాన్నీ ఆనందపు పంటగా మలుస్తాను. నీవు 'ఊ' అను'- అంటూ ఉద్రేకంగా మాధవి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోబోయాడు.
మాధవి చప్పున తన చేతుల్ని లాక్కుంది. 'నీకు జ్ఞాపకముందా బావా! వెనక మనం పార్కుకు వచ్చినప్పుడు ఇలాగే నా చేతుల్ని పాతుకుని 'విదిలించి వెయ్యకు మాధవీ! ఇలాగే ఉండనీ!' అని అర్ధించావు. ఆవేళ నీ చేతుల్లో నా చేతుల్ని ఉంచడానికి కొంత సంకోచం ఉన్నా, విముఖంగా లేను. కానీ కొన్నాళ్ళ తర్వాత నిజంగానే నా చేతుల్ని నీ చేతుల్లో ఉంచడానికి నా మనస్సు స్థిరంగా నిర్ణయించుకున్నప్పుడు విదిలించబడ్డది నేనే బావా! అది నేను జీవితంలో మర్చిపోలెను. మళ్ళీ ఈ చేతుల్ని నీ చేతుల్లో ఉంచలేను.'
రాజారావు తనువు సన్నగా ఒణుకు తోంది. లోపల కదలాడే భావసంఘర్షణని సంయమనం చేసుకోలేక సతమత మౌతున్నట్లు అతని ముఖ రేఖలు సూచిస్తున్నాయ్. స్వరం బాగా వ్యగ్రమైంది.
'నామీద కోపమా మాధవీ! నిజంగా నేను మూర్కున్ని'అని మాత్రమే అన గలిగాడు.
'కాదు బావా! ఉత్తముడివి- నీ స్వార్ధాన్ని అవతలకునెట్టి ఎదుటివాళ్ళ దృష్టిలో పరిస్థితుల్ని బేరీజు వెయ్యగల వివేకవంతుడివి. అప్పుడే నువ్వు నన్ను స్వీకరించడానికి ఒప్పుకుని ఉంటే ఈనాడు నీమీద నా మనస్సులో పెరిగిన ఈ అంతులేని గౌరవానికి ఆధారం ఉండేది కాదు. నువ్వూ నేనూ అతి సామాన్యంగా అందరు దంపతులూ గడిపేటట్లు సంసారం గడిపి ఉండేవాళ్ళమేమోకానీ, నాకీ గౌరవమూ, నీకీ ఆరాధనా, తీరని కోరికయొక్క రాపిడీ మిగిలేవి కావు.'
రాజారావుకు తెలుసు. కథ తిరిగి తిరిగీ మళ్ళీ మొదటికి వస్తుంది. తమ రెండు జీవితాలూ ఒకేప్రవాహంలో సమాంతరంగా కొట్టుకుపోతున్న రెండు శుష్కకాండాలు. అవి రసభరితాలై ఎప్పుడూ స్పందించవు. ఎప్పుడూ కలుసుకోవు. అంతులేని విరక్తితో అతని హృదయం రోదించింది.
'నాకు తెలుసు బావా! ఈ క్షణాన నా పట్ల జాలితో నీ గుండె నిండి పోయింది. కాని నేనేం చెయ్యగలను? సంపూర్ణహృదయంతో నన్ను నేను, నీకు అర్పించుకోగలవా? ఈ హృదయంలో ఒకప్పుడు సుస్థిరంగా నిలిచిపోయిన మధు ఛాయలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని చెప్పగలవా? అతని స్మృతి అనేది నా అణువణువునా రక్తంలో కలిసి జీర్ణించుకుని పోయింది. అది తుడిచి వేయడం అసాధ్యం బావా!- నీవు నన్ను నిరాకరించి ఈ సత్యాన్ని గుర్తించేటట్లు చేశావు. అందు కెంతయినా నీకు కృతజ్ఞురాలిని.'
'మరి, కావాలని అతణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నావు మాధవీ? ఇద్దరూ అభిమానాలకు పోతే ఇటువంటి సమస్యలు పరిష్కారం కావు'.
అసలు కథ వినడానికేకదా నిన్నిక్కడికి రమ్మన్నాను. అంతా విని నీ తీర్పు చెప్పు. నేనూ, రాధా, మధూ ముగ్గురమూ పాత్రలమైన ఈ త్రిభుజాకార కథనంలో ఏవో రెండు పాత్రలకే విడరాని బంధం ఉండడానికి వీలుంది. అందులో చివరకు దూరంగా నిలిచిపోయేది నేనే. అందుకు కారణం రాధ మధు ప్రతిరూపాన్ని తన గర్భంలో పెంచుతూండడం.'
'మాధవీ' ఏమిటి నువ్వనేది?-' పెద్దగా అరవలేదన్న మాటే కాని ఆశ్చర్యాన్నీ, బాధనూ, మేళవించిన స్వరం నాగుబాము బుసలా రాజారావు గొంతు నుండి బయటకు వచ్చింది. మాధవి జరిగిన కథంతా చెప్పింది.
'నువ్వు మా సంగతి పట్టించుకోక తటస్థంగా ఉండిపోయిన ఈ సంవత్సరం వ్యవధిలో ఇంత జరిగింది బావా! ఇంత వరకూ ఈ సంగతి నీకు తెలియనీయ నందుకు నన్ను క్షమించు. నీకే కాదు పెద్దమ్మకూ, పెదనాన్నకూ ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం రాధ పండంటి పిల్లవాన్ని కని ఆస్పత్రిలో ఉంది.'
'ఎలా జరిగింది మాధవీ? రాధ ఎలా ఈ వలయంలో చిక్కుకుంది? ఒక ఆడపిల్ల నన్యాయం చేసి పిరికివాడిలా పారిపోయాడా మధు?'
'రాధ అమాయకురాలు కాదు బావా! పైపెచ్చు స్వార్ధపరురాలు. తాను కోరుకున్నదేదో, దాన్ని పొందడంలో సంఘాన్నీ ఇతర మానవత్వపు మమతల్నీ నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చిన కార్యసాధకురాలు. నేను ప్రేమించినట్లే అదికూడా మధునే ప్రేమించింది. వాంఛిత వస్తువును చేజిక్కించుకునే పరుగు పందెంలో అది గమ్యానికి దగ్గరవుతూ వచ్చింది. నేను మొదటి అడుగులోనే అడ్డంకుల్ని అధిగమించలేక అలసి కూలబడి పోయాను. ఇప్పుడు చెప్పు బావా! నా మార్గం ఏమిటో? నాకూ మధుకూ ఉండవలసిన సంబంధం ఏమిటి?'-మాధవి ఆవేశాన్ని అతి ప్రయత్నంమీద అణచుకుంటూ రొప్పుతోంది. రాజారావు మాధవి నాస్థితిలో చూడగానే ఒక్కసత్యం స్పష్టంగా గోచరించింది. ఈవిడ మధును హృదయ పూర్వకంగా ప్రేమిస్తోంది. పైకెన్ని కబుర్లు చెప్పినా, ఆవిడ అంత రంగంలో వెలిగే మధుయొక్క స్మృతి ఎన్నటికీ ఆరిపోనిది. అది ఆవిడ జీవిత సుఖాన్నీ, శాంతినీ, ఆవిడ సర్వస్వాన్నీ తైలంగా ఉపయోగించుకుని అఖండంగా అలా మండుతూనే ఉంటుంది. ఆ ఎరుక వల్ల రాజారావు హృదయం మాధవి పట్ల ఆర్ద్రమై పోయింది.
'నీకు భగవంతుడే ఏదో ఒక దారి చూపించాలి - ఇంత జరిగాక మధు ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోడనికి ప్రయత్నించలేదా? అతగాడు రాధను స్వీకరిస్తాడా? నిన్ను మర్చిపోగలిగాడా మాధవీ?-'
'నాకేం తెలియదు బావా! ఆమాట కొస్తే రాధకూ తెలియదేమో! కాని ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. సహనం లేనివాడూ, వెంటనే నిర్భయం తీసుకోలేని చపలచిత్తుడూ అవునేమో కాని, ఆత్మద్రోహి కాలేడు. ఒక స్త్రీని వంచించి మరో స్త్రీని వివాహ మాడేంత అల్ప సంస్కారి కాడు. ఏనాటి కైనా రాధను భార్యగా స్వీకరించకపోతే అతని మనస్సుకు శాంతి ఉండదు. నిర్లిప్తంగానైనా అతడీ లోకంలో బ్రతకడానికి రాధ అతని భార్య కాక తప్పదు. హైదరాబాదులో అది మధు భార్యగానే వ్యవహరింపబడుతోంది. తెలియని దూరాలకు వెళ్ళిపోయిన మధు రాకను నిరీక్షిస్తూ బ్రతుకుతోంది. ఇంచుమించు ప్రతి రెండు రోజులకూ రాధ నాకో ఉత్తరం వ్రాస్తుంటుంది'-
రాజారావు మరేమీ మాట్లాడలేదు. జరుగుతున్న ఈ కధ చాలా చిత్రంగా ఉంది. ఇందులో తను, మాధవి, రాధ, మధు, అందరూ విధుర ప్రేమికులే. అందరూ ఈ విశ్వనాటక రంగంలో వియోగ శృంగారానికి ఆలంబనాలై తమ తమ విషాదభరిత పాత్రల్ని పోషిస్తున్నారు. కద ఎలా ముగుస్తుందో, తెర ఎప్పుడు పడుతుందో, ఊహకందని విధంగా ఉంది- ఇంతవరకూ తానొక్కడే భగ్నప్రేమికుడనుకున్న అభిప్రాయం చెదిరిపోయింది. ఇక్కడ ఎవరు ఎవర్ని వోదార్చాలి ఎవరికీ ఎవరు చేయూత నిచ్చి లేవనెత్తాలి? అటు వంటి పరిస్థితుల్ని దాటి విషాదోన్ముఖంగా సాగిపోతున్న జీవితాలు తమవి. ఈ బ్రతుకులు ఎవరికి వారే బ్రతకవలసినవి. ఒక తోడూ, ఒక నీడా అనే భాగ్యానికి నోచుకోనటువంటివి-
