"వెళ్ళు పాపం, అన్నం చారు చల్లారిపోతుందేమో."
మీర ఒక్కడుగు ముందుకు వేసింది. బీరమ్మ నోటిలో వున్న తమలపాకుల రసం, ఉమ్మివేస్తూ.
"అన్న మెక్కడిది తల్లీ. ఓ సంకటిముద్దా, నంజుకోటాని కింత కారం, అంతే" అంది.
మీర బీరమ్మ బుగ్గవేపు చూసి "ఎప్పుడూ తమలపాకులు నములుతూ ఉంటావు, ఎందుకూ? అనడిగింది.
ఆకు, వక్క యేసుకుంటే ఆకలి తెల్ధం డమ్మగోరూ. ఆకలేసినపుడల్లా, ఏటి తింటాం? అందుకే ఆకు, వక్క నముల్తాం."
మీర తన చీర జరీ బార్డరు, నేలకు తగిలి, మురికవుతుందేమోనని, కాస్త పైకి ఎత్తి పట్టుకొని, బీరమ్మ వేపు చూసింది. మీర స్నేహితురాలు రాజేశ్వరి, ఫాషన్ కోసం, వొళ్ళు కనిపించే చోళీ వేసుకుంటే, బీరమ్మ పేదరికం వలన చిరిగిన ముతక రవిక తొడుక్కుంది. మీర తన చీర కుచ్చెళ్లు నెలకు తగలకుండా ఎత్తి పట్టుకొని ముందుకు నడిచింది. బీరమ్మ తన చిరుగుల కొంగును, మరింత దగ్గరగా లాగి కప్పుకుంటూ పొలంవేపు వెళ్ళింది.
మీర, బీరమ్మ పేదరికాన్ని గమనించింది. చింపిరి గుడ్డలు, ఆకలి తీరని భోజనం, శ్రమ ..... ఆ జీవులకు, జీవితంలో ఏమైనా సుఖమంటూ ఉందా?
బీరమ్మ మొహం విపరీతమయిన పనిపాటల వల్ల నల్లబడి కళాకాంతులు లేక చెమటతో తడిసి పోతూంటే, మీర మొహం అస్తమానం ఇంట్లోనే కూర్చొని, సూర్యకిరణాలనుండి దూరమై స్నో, నవుడర్ల లేపనంతో చెమట పట్టేది.
ఒక్క నిమిషం తీరిక దొరికితే చాలు, విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నవారికి తాను చదువు పేరుతో మరింత శ్రమ కలిగించటం న్యాయమా?
మీర తనలో తనే తర్కించుకుంది.
ఆమె బడి విషయాలను గురించి వేళాకోళం పట్టించసాగాడు, శాము.
"నేను ముందే చెప్పాను గదండీ టీచర్ గారూ, ఇక నాకూ, మన రామలక్ష్మణులకూ పాఠం చెప్పండి" అన్నాడు, గిత్తల్ని నిమురుతూ.
"రారా లక్ష్మణా, మేడం దగ్గర పాఠం చెప్పుకుందాం." అన్నాడు లక్ష్మణుని కొమ్మ పట్టుకొని లాగుతూ.
మీర తన కోపాన్ని దిగమ్రింగుకొంటూ, శాము మాటలు తనకు వినిపించనట్టు, పంటితో జొన్న గడ్డిని కొరుకుతూ కూర్చుంది.
"రేపే పాఠం ప్రారంభిస్తారట. మనమంతా సిద్ధంగా ఉండాలి. లేకపోతే, మేడంగారికి కోపం వస్తుంది."
మేతకు వెళ్ళిన కపిల, కాళి, తుంగ, గోపి మొదలగు ఆవులు, తమ దూడలను తలచుకుంటూ, వేగంగా లోపలికొచ్చాయి. మీరా కంగారుపడి, చేతిలోని కడ్డీ విసరివేసి, లేచి నుంచుంది. శాము వాటి నంతా కట్టేసి వచ్చి.
"టీచరుకు భయపడే శిష్యులున్నారు గాని, శిష్యులకు భయపడే టీచరును చూడటం, ఇదే మొదలు...." అన్నాడు.
మీర పక్కనున్న గడ్డిమోపును, శాము మీదికి విసరి, లోపలికి వెళ్ళిపోయింది. గడ్డిమోపు విరిగి శాము శరీరమంతా, గడ్డితో నిండిపోయింది. నవ్వుతూ గడ్డి దులుపుకున్నాడు.
మీర ఓ పుస్తకం చేతిలో పట్టుకుని కూర్చుంది. శాము గదిలోకి వచ్చినా, తలెత్తి చూడలేదు. పలుకరించలేదు. శాము, ఆమె చేతిలోని పుస్తకం లాక్కొని,
"కోపమా?" అన్నాడు.
"........"
"నామీద కోపం తెచ్చుకోకు, మీరా, నువ్వే పాఠాలు నాకు చెప్పు. కాని, నాకు అక్షరాభ్యాసం అక్కర్లేదు. ప్రేమాభ్యాసం చాలు."
"నేను మీకేం నేర్పను. నాతో మాట్లాడకండసలు."
"హతోస్మి. ఇహ నా గతీ.....ఇదిగో లెంప లేసుకుంటున్నా. ఇకమీదట నిన్నెప్పుడూ వేళాకోళం చేయను. ఓ చిరునవ్వును అనుగ్రహించు..."
ఇకమీదట తనబడిని గురించి పల్లెత్తుమాట అననని, ఒట్టు వేసుకున్నాక కాని, భర్తతో రాజీపడలేదు, మీర.
మబ్బు పట్టిన ఆకాశంలా ఉంది, మీర జీవితం. రోజులు గడవటమే దుస్తరంగా ఉంది. నూలు వడుకుదామని తెప్పించుకున్న రాట్నం రెండు రోజులలోనే అటకెక్కింది. అస్తమానం ఆలోచిస్తూ కూర్చోవటమే పని అయింది. పల్లెటూరి జీవితానికి, తాను అలవడలేక పోవటమే కాక, తన మనసుకూ, భర్త మనసుకూ అజగజాంతర మున్న దన్న సంగతీ, మీర గమనించింది. ఇద్దరి మనసూలూ వ్యతిరేక మార్గాల్లో పయనిస్తున్నాయ్. శాము ఆలోచనలు, అభిరుచులూ, ఆశ, ఆకాంక్షలూ మీర భావాలకు పూర్తిగా, విరుద్దంగా ఉండేది. పుడమి తల్లీ, పశుసంపదా, ఇవే అతని జీవిత సర్వస్వాలు. అతని జీవితానికి ఆధార స్తంభాలయిన వస్తువులు, మీరకు అర్ధంలేని వనిపించేవి. ఆవు మెడ నిమురుతూనో, దూడలతో ఆడుకుంటూనొ, మైమరచేవాడు, శాము. పచ్చటి పొలాల మధ్యన చేతులు కట్టుక నుంచుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ, పక్కనున్న మీరను కూడ మరచిపోయేవాడు, రైతుబిడ్డ శాము. మీరకు సమస్యగా పరిణమించినట్టుగానే పట్టణ వాసపు పిల్లమీర, శాముకు పెద్ద సమస్యగా పరిణమించింది.
మీర సంఘజీవి. తనచుట్టూ స్నేహితులుండాలనే కోరుకునేది. శాము ఏకాంతప్రియుడు. జీవంలేని పుస్తకాలతో కాలక్షేపం చేసే మీరను చూసి, ఆశ్చర్యపోయేవా డతను. ఏదైనా చదవటానికి తీసుకుంటే కూర్చున్న చోటనే నిదురవచ్చే దతనికి, చేతిలో పుస్తక ముండగా, నిద్ర ఎలా వస్తుందబ్బా! అని ఆశ్చర్యపోయేది మీర.
స్త్రీ భర్తనుండి ఆశించేవాటినంతా తను మీరకు ఇస్తున్నానని భావించాడు, శాము. ఆమె అడిగిన పుస్తకాలు, నగలు, గుడ్డలు, వెంటనే తెప్పించి పెట్టేవాడు. భర్త అభిరుచికి అనుగుణంగా నడుచుకొనటాన్ని అలవరచుకోవటమే, స్త్రీ కర్తవ్యమని, అతని దృఢనమ్మకం. తాను అన్నివిధాల సౌకర్యాలను కలిగించినా ఆమె మనసుకు, శాంతి సమాధానాలు లేవన్న సంగతి అతనికి తెలుసు. కాని, దానికి కారణం తెలుసుకోవాలని ఆత్రుత చెందలేదతను. పట్టణవాసపు పిల్ల. పల్లెజీవితానికి కింకా అలవాటు పడలేదు. నెమ్మదిగా అన్ని సరిపోతాయి లెమ్మనుకున్నాడు. ఎప్పుడూ కలలుకనే భావజీవి. మీర నుండి దూరంగా ఉండిపోయాడు శాము.
మీరకు తన ఆశ నెరవేరటం అసంభవం అని పించినా, దాన్ని గురించిన తపన మట్టుకు తప్ప లేదు. ఎడారి ప్రయాణీకునికి నీరు దొరికే ఆశ లేనప్పటికీ, నీటికోసం తపనచెందేలాగానే ఆమె మనసు సంసార బంధాన్నుండి, ఆశా ప్రపంచంలోకి ఎగిరిపోవాలని సూచించేది. యాంత్రికమైన జీవితం వల్ల ఆమెకు పిచ్చిపట్టినట్టయింది. రోజూ ఒకే రకమైన పనులు, రసవిహీనమైన బ్రతుకు, ఆమెకు జీవితంలో నిరుత్సాహం కలిగించసాగాయి. నలుగురు మగపిల్లల మధ్యన మగపిల్లాడిలా స్వేచ్చగా పెరిగి, తన చురుకైన బుద్దివల్ల, ఆటపాటల్లో అభినయంలో ముందంజవేసి అందరి మెప్పుదలా పొందిన మీర జీవితం, ఇప్పుడు మొహానికి గంతలు కట్టించుకొని అటూ ఇటూ చూడకుండా తిన్నగా త్రోవవేపే చూస్తూ పరిగెత్తే గుర్రంలా సాగిపోతోంది. పల్లెటూరి నీరస వాతావరణం ఆమె లోని ఉల్లాసాన్ని హరించివేసింది.
ఆరోజు క్రొత్తగా తెప్పించుకున్న నవల చదువుతూ కూర్చుంది. మీర. సాయంత్రం అయిదు గంట లవుతూంది. కిటికీలోనుండి పడుతూన్న సూర్యకిరణాల వెలుగులో చదువుతూ కూర్చుంది. శాము ఇంకా ఇంటికి రాలేదు. కాని, మీరకు అటు వేపు ధ్యాసే లేదు. నవల చదవటంలో లీనమయిన మీరకు టైమెంతయిందో కూడా తెలియలేదు. క్రమంగా చీకటి పడసాగింది. ఇక అక్షరాలు కన్పించవన్నంత వరకు చడివి తల పైకెత్తింది. మీర. పుస్తకం కింద పెట్టి వళ్ళు విరుచుకుంటూ.
"ఇంకా రాలేదేం ఈయన" అనుకుంటూ గడియారంవేపు చూసింది.
"అబ్బ, ఆరున్నర ఇంకా బోరడు రాలేదేం?" అనుకుంది. అతడు వచ్చి దీపం వెలిగించివుంటే ఇంకాస్సేపు చదువుకోవచ్చుగా అనుకుంటూ లేచింది.
బోరడి సోమరితనానికి కోపం వచ్చిందామెకు. కాస్సేపు బోరడికోసం చూసి, తరువాత తనే లేచి వేలాడగట్టిన లాంతరుతీసి వెలిగించింది, లాంతరు ఒక్క నిమిషం వెలిగి, ఆరిపోయింది.
