రంగారావు మొహం ఒక్క క్షణం ఎర్రబడి వెంటనే నల్లబడింది. తీక్షణంగా కాఫీకప్పువంక చూశాడు కొన్ని క్షణాలు. తరువాత విరుసుగా లేచాడు- "వంటయితే నేను స్నానంచేసి వచ్చి భోంచేస్తారు పనుంది. మళ్ళీ వెళ్ళాలి" అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు.
స్నానంచేసి, భోంచేసి ఆదరాబాదరా యింట్లోంచి ఎవరో తరిమినట్లు వెళ్ళిపోయిన రంగారావుని చూసి విస్తుపోయింది సుజాత. ఆయన ఉద్దేశం ఏమిటో అర్ధంగాలేదు. రంగారావు కావాలని మళ్ళీ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు! ఆనంద్ ని తప్పించుకోవడం కోసమా? ఆనంద్ వచ్చాడని తెలిసీ ఎందుకు వెళ్ళాడు? ఆయనకి తన భార్య-ఆనంద్ ల మధ్య సంబంధం తెలుసా! తెలిసే ప్రోత్సహిస్తున్నాడా లేక, ఇష్టం లేకే ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? భర్త అయివుండీ భార్య చేస్తున్న పని తెలిసే ఎలా వూరుకుంటున్నాడు? ఆమెని కట్టడిలో పెట్టే శక్తిలేక వూరుకున్నాడా? లేకపోతే వాళ్ళిద్దరి అనుబంధం ఈయనకి తెలియదేమో!-తెలియకపోతే యింటికి బంధువులు వస్తే అతన్నెందుకు తప్పించుకు వెళ్ళిపోవడం! కళ్యాణి ఆనంద్ ల సంబంధంవల్లే భార్యా భర్తల మధ్య కలతలు రేగాయా? ఒకవేళ అదే కారణం అయితే ఒకే యింట్లో ఉంటూ ఒకరి నొకరు ద్వేషించుకుంటూ కాపురం ఎందుకు చేస్తున్నారు? విడిపోవచ్చుగదా! ఈయన ఇలా డబ్బు తగలేస్తూ, తాగి తందనాలు ఆడుతున్నా అన్నింటికి ఆమే డబ్బు యిస్తూ ఆమె ఎందుకిదంతా సహిస్తూంది. ఆలోచనలతో, ప్రశ్నలతో సుజాత బుర్ర వేడెక్కి పోయిందిగానీ ఒక్కదానికీ సమాధానం తెలియలేదు సుజాతకి. మొత్తానికి యీ భార్యాభర్తలిద్దరూ- యీ సంసారం అంతా వింతగా వుంది అని మరోసారి అనుకుంది.
15
ఆనంద్ వున్న మూడురోజులూ కల్యాణి ఆస్పత్రికి వెళ్ళలేదు. పేషంట్సు యింటికివచ్చినా మరీ సీరియస్ కేసయితే చూసేది, లేనివాళ్ళని వెళ్ళిపొమ్మని చెప్పేది సుజాతతో. ఆ మూడు రోజులూ రాత్రింబగళ్ళు ఆనంద్ తప్ప మరోలోకం లేనట్లు గడిపింది కల్యాణి.
ఆ రోజు ఆనంద్ వెళ్ళే రోజు.
"బావా, నీవు వెళ్ళిపోతావు. ఈ మూడురోజులు కలలోమాదిరి గడిచిపోయాయి. ఇంక మళ్ళీ నాకేముంది? నా ఆస్పత్రి, రోగాలు, మందులు డబ్బు సంపాదించడం, భోజనం, నిద్ర యిదేగా నా జీవితం! ప్చ్. బావా, నీవు వెళ్ళేటప్పుడు నీతోపాటు న ఉత్సాహాన్ని, నా మనసుని అన్నింటిని తీసికెళ్ళిపోతావు. ఇక్కడ మిగిలేది జీవచ్చవం బావా! మళ్ళీ నీ వెప్పుడు వస్తావా అని ఎదురుచూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటూ ఎదురు చూడాలి.....!" ఆనంద్ గుండెల్లో మొహం దాచుకు బాధగా వీడ్కోలు యిస్తూ అంది కల్యాణి.
"అలా మాట్లాడితే నాకూ బాధ అన్పిస్తుంది కల్యాణీ, నీవలా కన్నీళ్ళుపెట్టుకుంటే నే వెళ్ళలేను కల్యాణీ. అలా బాధపడకు. మళ్ళీ వీలయినంత త్వరగా వస్తాగా" కల్యాణి జుత్తు ప్రేమగా సవరిస్తూ కళ్ళనీళ్ళు తుడిచాడు.
"లేదులే బావా, ఏడవను. నీకు టైమవుతున్నట్టుంది. పద, వెడదాం, నీ వన్నట్టు ఎంత ఏడ్చినా యీ కధ యిక మారదు. పద" కల్యాణి ఆఖరిసారిగా ఆనందుని ముద్దుపెట్టుకుని, కళ్ళు తుడుచుకుంది.
ఆనందుని ఎయిర్ పోర్టులో దిగవిడిచి రావడానికి బయలుదేరింది. ప్లేను బయలుదేరడానికి సిద్దంగా వుంది!.... "మళ్ళీ వీలయినంత త్వరగా రా బావా! నా ప్రాణం నీ వైపే వుంటుంది" ఆర్ద్రంగా అంది కల్యాణి ఆనందు చేయిపట్టుకుని నొక్కుతూ.
"అలాగే కల్యాణీ, కానీ యింతలో మళ్ళీ లీవు దొరకక పోవచ్చు.....బోర్డర్సులో పరిస్థితి ఏమీ బాగాలేదు చూస్తున్నావుగా......మళ్ళీ కయ్యానికీ కాలు దువ్వుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఏదన్నా గొడవ ఆరంభిస్తే ఎలా మారుతుందో పరిస్థితి...."
కల్యాణి కలవరంగా.... "యుద్దాలన్నీ నీ కోసమే వస్తున్నాయి గాబోలు. క్రితం సారి యుద్ధం.....అబ్బ! ఆ రోజులు ఇంకా మరిచి పోలేదు నేను మళ్ళీయుద్ధం ఏం ఉద్యోగం బావా! వెళ్ళివెళ్ళి ఎలాంటి ఉద్యోగంలో చేరావు! అనుక్షణం మృత్యుద్వారం దగ్గిరవున్నట్టే.....నీ ఉద్యోగం గురించి తలచుకున్నప్పుడల్లా ఎంత భయం వేస్తుందో తెలుసా! ఎప్పుడే కబురు వినాల్సి వస్తుందోనని హడలిపోతూంటాను..... ....." ఆందోళనగా అంది కల్యాణి.
"భయమెందుకు కల్యాణి. ఎవరి కోసమైతే ఈ పదవులు, హోదా సంపాయించుకొన్నానో వాళ్ళెలాగూ నాకు దక్కలేదు. యింక యిప్పుడు నేనేమయితే ఎవరికి బాధ! నాకోసం ఏడ్చే వాళ్ళెవరున్నారు? మహా అయితే పదిరోజులు నీ వేడుస్తావు. ఆవిధంగానైనా నన్ను మరిచి పోతావు. అప్పుడయినా సుఖంగా బ్రతక గలుగుతావు." ఆనందు నవ్వి అన్నాడు.
కల్యాణి దెబ్బ తిన్నదానిలా చూసింది. 'అవునులే, నేనేం నీ భార్యనా! నీకేదయినా అయితే నేనెందుకు బాధ పడతాను. నీకు నేనేం కానుగా...." నిష్టూరంగా అంది కల్యాణి.
ఆనందు నవ్వి ఆప్యాయంగా కల్యాణి. భుజం తట్టాడు. 'ఊరికే సరదాగా అన్నాను కల్యాణి. నన్నింత ప్రేమించే నీ వుండగా నాకేం భయం! నా కోసం కన్నీళ్ళుకార్చే నీవుండగా ఇంకెవరోలేరన్నబాధ నాకెందుకు? నీ కంటే ఆప్తులు నా కెవరుండాలి! నీ ప్రేమ నాకు శ్రీరామ రక్ష అయి కాపాడుతుంది. నాకేం ఫరవాలేదు. బెంగపడకు. ఉత్తరాలు రాస్తూండు..... ..... వస్తాను! ఏం...." కల్యాణి చెయ్యి నొక్కి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెయ్యి ఊపి బయలుదేరాడు ఆనందు.
ప్లేను కనుమరుగయ్యేవరకు అలాచూస్తూ నిల్చుండి పోయింది కల్యాణి. విమానంతోపాటు ఆమె ఉత్సాహం, సంతోషం అన్నీ ఆ క్షణంలోనే గాలిలో కలిసిపోయినట్లనిపించింది. ఎప్పటి కల్యాణిల దిగులుగా, నిర్లిప్తంగా ఇల్లు చేరింది.
